బిహార్‌ ‘చాణక్యుడు’ ఏకాకి అయినట్లేనా? | Ashutosh Guest Column On Bihar Election Over Nitish Kumar | Sakshi
Sakshi News home page

బిహార్‌ ‘చాణక్యుడు’ ఏకాకి అయినట్లేనా?

Published Tue, Oct 27 2020 1:36 AM | Last Updated on Tue, Oct 27 2020 2:38 AM

Ashutosh Guest Column On Bihar Election Over Nitish Kumar - Sakshi

బిహార్‌ చాణక్యుడిగా పేరొందినవాడు ఇప్పుడు ఏకాకి అయ్యాడు. మిత్రులు, ప్రత్యర్థులు ఇరువురూ తనను ఇప్పుడు వదిలిపెట్టేశారు. ఇప్పుడు బిహార్‌ ప్రజలు మాత్రమే ఆయన ఆశాకిరణం. నితీశ్‌పై, ఆయన రాజకీయాలపై ఈ ఎన్నికలు ఒక రెఫరెండం లాంటివి. 69 ఏళ్ల వయసులో నితీశ్‌ తన రాజకీయ జీవితంలోనే అతి పెద్ద సమరంలో తలపడుతున్నారు. బీజేపీతో కూటమి ఇప్పుడు ఒక ముసుగు మాత్రమే. తగినన్ని స్థానాలు గెల్చుకోకపోతే నితీశ్‌ని బీజేపీ చెత్తబుట్టలోకి తోసేస్తుంది. ‘ఎన్డీఏకి నితీశ్‌ ప్రతిరూపం వంటివాడని, ఎన్నికల తర్వాత ఆయనే ముఖ్యమంత్రి’ అని అమిత్‌ షా అన్న పదాలకు అర్థం నితీశ్‌కి బాగా తెలుసు. అది ఎలాంటి విశ్వాసమూ లేకుండానే పునరుద్ధరించే హామీ వంటిది. నమ్రతకు మారుపేరుగా నిలిచిన నితీశ్‌ మొదటిసారిగా బహిరంగ సభల్లోనే ఉన్నట్లుండి ఆగ్రహ ప్రదర్శన చేస్తున్నారంటే ఆశ్చ ర్యపడాల్సింది లేదు. అది ఆయన ఒంటరితనానికి చక్కని వ్యక్తీకరణగా కూడా చెప్పవచ్చు. 

పరిమితమైన ఆకర్షణా శక్తి, బలహీనమైన రాజకీయ పార్టీ కలిగి ఉన్నప్పటికీ భారతీయ చరిత్రలో మూడు దఫాలు ముఖ్యమంత్రిగా కొనసాగిన ఏకైక రాజకీయ నేత బహుశా నితీశ్‌ మాత్రమే కావచ్చు. తన పార్టీకి 20 శాతం ఓట్ల దన్ను మాత్రమే ఉన్నప్పటికీ బిహార్‌లో ఇప్పటికీ ప్రశ్నించలేని గొప్పనేత ఆయన. 1994లో జార్జి ఫెర్నాండెజ్‌తో కలిసి లాలూయాదవ్‌ నుంచి వేరుపడిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా కూడా పెద్దగా ముద్రవేయని జనతాదళ్‌ (యునైటెడ్‌) పార్టీని ఈయన ముందుండి నడిపించాడు. ఇద్దరు బలమైన శత్రువుల మధ్య చీలికల నుంచి పుట్టుకొచ్చే ఉప ఉత్పత్తి చందాన నితీశ్‌ బిహార్‌ రాజకీయాల్లో అగ్రస్థానంలోకి వచ్చారు. బీజేపీ, ఆర్జేడీలు రెండు భిన్న భావజాలాలతో ఘర్షిస్తూ వచ్చాయి. లాలూయాదవ్‌ ఆర్జేడీ ప్రబోధించిన మండల్‌ రాజకీయాలకు పూర్తి వ్యత్యాసంగా బీజేపీ హిందుత్వ కొనసాగుతూ వచ్చింది. మండల్‌ రాజకీయాలకు చెందిన అసలుసిసలు యోధుడైన నితీశ్‌ ఇంతకాలంగా బీజేపీ శకటంమీదే ప్రయాణిస్తూ వచ్చారు కానీ బీజేపీ ప్రధాన బ్రాండ్‌ అయిన హిందుత్వను నితీశ్‌ స్వీకరించలేదు.

బిహార్‌ చాణక్యుడిలా నితీశ్‌ రాజకీయ చతురతకు, సహజ జ్ఞానానికి మారుపేరులా గుర్తింపు పొందేవారు. పై రెండు భిన్న పార్టీలకు నిత్యం ఒకరిపైకి మరొకరిని ఎగదోలుతూనే గత 15 సంవత్సరాలుగా బిహార్‌లో కీలకనేతగా మనగలుగుతూ వచ్చారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆ రెండు పార్టీలుకూడా నితీశ్‌ జేడీయూ కంటే పెద్దవే కానీ అన్నివేళలా ద్వితీయ స్థానంలో ఉండిపోవడానికి అంగీకరించేవి. లాలూయాదవ్‌ను అధికారానికి దూరం పెట్టాలని బీజేపీ కోరుకుంటే, బీజేపీని దూరం పెట్టాలని లాలూయాదవ్‌ ప్రయత్నించేవారు. ఈ ఇద్దరి వాంఛను నితీశ్‌ బ్రహ్మాం డంగా నెరవేరుస్తూ వచ్చారు. కానీ ఇప్పుడు బీజేపీ ఇక చాలు అనే అభిప్రాయానికి వచ్చేసింది. తనకు ఏమాత్రం కాస్త అధికంగా అసెంబ్లీ స్థానాలు దక్కితే నితీశ్‌ను తోసిపారేసేందుకు కూడా బీజేపీ సిద్ధమైనట్లు కనిపిస్తోంది. ఈసారి నితీశ్‌ ఛాయలో మనుగడ సాధించడం కాకుండా తన సొంత దారిలో తాను పయనించాలని బీజేపీ నిర్ణయించేసుకుంది.

బీజేపీ ఆకాంక్షను రెండు విషయాలు ప్రజ్వరిల్లచేశాయి. ఒకటి, నితీశ్‌ ప్రజాదరణ ఇప్పుడు పూర్తిగా పడిపోయింది. ప్రతి సర్వే ఈ అంశాన్ని చాటి చెబుతోంది. లోక్‌నీతి–సీఎస్‌డీఎస్‌ సర్వేలో, 43 శాతం మంది ఓటర్లు మళ్లీ నితీశ్‌ ప్రభుత్వం రాకూడదని కోరుకుంటున్నట్లు తేలింది. 38 శాతం మంది మాత్రమే ఆయన మళ్లీ అధికారం చేపట్టాలని కోరుకుంటున్నారు. ఇక తన రేటింగులను చూస్తే నితీశ్‌ ప్రజాదరణ మరింతగా పడిపోయింది. 2010లో నితీశ్‌కు 77 శాతం మంది ఓటర్ల ఆమోదం ఉండేది. ఇక 2015 అసెంబ్లీ ఎన్నికల్లో అయితే అది 80 శాతానికి పెరిగింది. కానీ ఆ తర్వాతి నుంచి అది తగ్గుతూ 52 శాతానికి పడిపోయింది. మరీ దారుణంగా 2020 ఎన్నికల నాటికి అది 28 శాతానికి పడిపోవడం గమనార్హం. ఇకపోతే సీ–ఓటర్‌ సర్వే ప్రకారం చూస్తే, నితీశ్‌ ప్రభుత్వ పనితీరు పట్ల 25 శాతంమంది మాత్రమే సంతోషం వ్యక్తం చేస్తుండగా, 46 శాతం మంది అసమ్మతి వ్యక్తం చేశారు. నితీశ్‌ ఇప్పుడు తమకు ఏరకంగానూ విలువైన వ్యక్తి కాదని బీజేపీకి అర్థమైపోయింది.

రెండు, 1990ల నుంచి బిహార్‌ ఎన్నికలను మండల్‌ యోధులే శాసిస్తూ వచ్చారు. తొలి 15 ఏళ్లలో అంటే 2005 సంవత్సరం వరకు రాష్ట్రంలో మండల్‌ ఉద్యమానికి లాలూయాదవ్‌ బలమైన ప్రతినిధిగా ఉండేవారు. అలాంటి లాలూ ఇప్పుడు జైలులో ఉన్నారు. లాలూ కుమారుడు తేజస్వి పార్టీ నాయకత్వాన్ని చేజిక్కించుకున్నారు. లాలూ యాదవ్‌ వారసత్వాన్ని మరుగునపర్చి తన సొంత ప్రతిష్టను పెంచుకోవడం కోసం తేజస్వి ప్రయత్నిస్తున్నారు. అణచివేతకు గురైన వెనుకబడిన కులం చైతన్యాన్ని తన తండ్రి లాలూ మేల్కొల్పడం కాదనలేని వాస్తవమని తేజస్వి గుర్తించాడు. తన తండ్రి కారణంగా ఆర్జేడీ సామాజిక పునాది చెక్కుచెదరలేదని తేజస్వికి తెలుసు కానీ ఎన్నికల్లో గెలవడానికి అది మాత్రమే సరిపోదని గ్రహించాడు. కొత్త సామాజిక పునాదిని తాను సృష్టించుకోవాలని, కొత్త ఆకాంక్షలను వ్యక్తపరుస్తున్న వర్గం విశ్వసనీయతను సాధించుకోవాలని బోధపర్చుకున్నాడు. అందుకే తాను గెలిస్తే 10 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను సృష్టిస్తానని హామీ ఇచ్చాడు. ఇది ఎన్నికల ఫలితాలను సమూలంగా మార్చగలుగుతుందా అనేది ఇకపై తేలాల్సి ఉంది. 

నితీశ్‌ కూడా మండల్‌ యోధుడే. వెనుకబడిన, పీడిత కులాల సామాజిక, రాజకీయ సాధికారతకు లాలూ బాధ్యుడు కాగా, ఈ సామాజిక బృందం ఆకాంక్షలకు నితీశ్‌ సాధనమయ్యారు. తన తొలి దఫా పాలనలో లాలూ అరాచకత్వాన్ని అరికట్టడానికి నితీశ్‌ ప్రయత్నిస్తూనే పీడిత కులాల ప్రాథమిక అవసరాలను తీర్చడానికి కృషి చేశారు. కానీ రెండో దఫా పాలనలో వాటిని పట్టించుకోలేదు.  ఇక మూడోదశ పాలన మొత్తం అనిశ్చితి, అనాసక్తతతో గడిచింది. ఈ అన్నింటి పరిణామాల నేపథ్యంలో బీజేపీని వాడుకునే కళలో నితీశ్‌ రాటుదేలుతూ వచ్చారు. అధికారంలో ఉండటానికి తాను బీజేపీని వాడుకుంటే, మండల్‌ రాజకీయాల ప్రభావాన్ని తటస్థం చేయాడనికి బీజేపీ నితీశ్‌ని వాడుకుంది. అంతకుమించి హిందుత్వ రాజకీయాలను నితీశ్‌ ప్రోత్సహించలేదు. ఇప్పుడు నితీశ్‌ ఈ ఎన్నికల్లో గెలుపు సాధించకపోతే చిరాగ్‌ పాశ్వాన్‌ను దరిచేర్చుకుని నీతీశ్‌ని లక్ష్యంగా చేసుకోవాలని బీజేపీ చూస్తోంది. రాముడికి హనుమాన్‌ లాగా తాను మోదీని సేవించడానికి సిద్ధమని చిరాగ్‌ ప్రకటించేశాడు కాబట్టి బీజేపీ వెనక్కు తిరిగి చూసుకోవలసిన పనిలేదు కూడా. మరి నితీశ్‌ పరిస్థితి ఏమిటి? బిహార్‌ రాజకీయాల్లో ఆయన స్థానం వేగంగా పడిపోతోంది. 
అశుతోష్‌
– వ్యాసకర్త రచయిత, జర్నలిస్టు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement