
బిహార్ మండలిలో రబ్డీ దేవిపై సీఎం నితీశ్ విసుర్లు
పట్నా: బిహార్ శాసన మండలిలో మంగళవారం సీఎం నితీశ్ కుమార్, మాజీ సీఎం రబ్డీదేవి మధ్య వాడీవేడి చర్చ జరిగింది. ఆర్‌జేడీ ఎమ్మెల్సీలు పచ్చ రంగు బ్యాడ్జీలు ధరించి సభలోకి రావడం, ఆ పార్టీ నేత తేజస్వీ యాదవ్‌కు అనుకూలంగా నినాదాలు చేయడంతో సీఎం నితీశ్ కోపంతో ఊగిపోయారు. ఎమ్మెల్సీల బ్యాడ్జీలను మీడియాకు చూపుతూ ఆయన..ఇలాంటివి ఆర్‌జేడీలోనే సాధ్యమంటూ ఎద్దేవా చేశారు.
ఆ పార్టీ నేత, మాజీ సీఎం రబ్డీదేవి జోక్యం చేసుకునేందుకు యత్నించగా నితీశ్ బిహారీ యాసలో..‘నువ్వు కూర్చో..నీకేమీ తెలియదు. ఆర్‌జేడీ నీదికాదు, నీ భర్తది. ఈ విషయంలో నీ జోక్యం వద్దు’అంటూ అడ్డుకున్నారు. అంతటితో ఆగక.. ‘ఈమెకు ఏమీ తెలియదు. కష్టాల్లో చిక్కుకు న్నప్పుడు భర్త(లాలూ)ఈమెను సీఎంను చేశాడు’అని పేర్కొన్నారు. 1997లో సీఎంగా ఉన్న లాలు ప్రసాద్ దాణా కుంభకోణంలో ఇరుక్కుని, సీఎం కుర్చీపై భార్య రబ్డీని కూర్చోబెట్టడం తెల్సిందే.
ఇటీవలి కాలంలో రబ్డీదేవి, నితీశ్ మధ్య తరచూ మాటల యుద్ధం జరుగుతోంది. గంజాయి మత్తులో సభకు వచ్చిన సీఎం నితీశ్, నాతోపాటు మహిళలను సైతం అవమానిస్తూ మాట్లాడారు’అంటూ రబ్డీదేవి ఆరో పించారు. ఓ కార్యక్రమానికి వెళ్లిన నితీశ్ జాతీయ గీతాలాపనను పట్టించుకోకుండా పక్కనున్న వారి తో సరదాగా మాట్లాడుతూ కన్పించడంతో ‘మానసికంగా అనర్హుడు’ అంటూ రబ్డీదేవి వ్యాఖ్యానించడం వివాదాస్పదమైంది.