పాట్నా: రాష్ట్రంలో విద్యా సంస్థలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ల పెంపు బిల్లుకు బిహార్ అసెంబ్లీలో గురువారం ఆమోదముద్ర పడింది. కులాల వారీగా కోటా పెంచుతూ ఇటీవల ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నేతృత్వంలోని కేబినెట్ ప్రతిపాదించిన ‘రిజర్వేషన్ సవరణ బిల్లు’ను తాజాగా అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది. సీఎం నితీష్ కుమార్ సభలో లేకుండానే అసెంబ్లీ బిల్లు పాస్ అవ్వడం విశేషం. దీంతో రాష్ట్రంలో రిజర్వేషన్ కోటా 65శాతానికి పెరిగింది.
అయితే రిజర్వేషన్ల సవరణ బిల్లులో ఈడబ్ల్యూఎస్ కోటాను ప్రస్తావించకపోవడంపై బీజేపీ రాష్ట్ర అసెంబ్లీలో అభ్యంతరం వ్యక్తం చేసింది. బిల్లుపై బీజేపీ అభ్యంతరం తెలపడంతో ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కలగజేసుకొని.. తన మాటలు వినాలనుకుంటేనే మాట్లాడతానని చెప్పారు. లేకపోతే మాట్లాడనని చెప్పారు. తొమ్మిది పార్టీల మద్దతుతో కుల ఆధారిత గణన జరిగిందని, దీని ద్వారా ప్రతి ఒక్కరి ఆర్థిక పరిస్థితిని పరిశీలించామని తెలిపారు. ఈ విషయాన్ని ఇప్పటికే సభలో చెప్పినప్పటికీ ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారని మండిపడ్డారు. తక్షణమే బిల్లును అమలు చేయాలని కోరుతున్నట్లు సీఎం చెప్పారు.
చదవండి: అయోధ్యలో కేబినెట్ భేటీ.. ఇదే తొలిసారి
రాష్ట్రంలోని షెడ్యూల్డ్ కులాలు(ఎస్సీ), షెడ్యూల్డ్ తెగలు(ఎస్టీ), ఇతర వెనకబడిన వర్గాలు(ఓబీసీ) , అత్యంత వెనకబడిన వర్గాల (ఈబీసీ) వారికి రిజర్వేషన్ల శాతాన్ని పెంచాలని మంగళవారం జేడీఎస్ సర్కార్ ప్రతిపాదించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం 50 శాతం ఉన్న రిజర్వేషన్ కోటాను 65 శాతానికి పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ బిల్లు ఆమోదం లభించడంతో అయితే ఆర్థికంగా బలహీన వర్గాలకు(ఈడబ్ల్యూఎస్) వారికి కేంద్రం 10శాతం రిజర్వేషన్ ఇస్తుండగా.. బిహార్ ప్రభుత్వం అందిస్తున్న కోటాతో రాష్ట్రంలో రిజర్వేషన్లు 75శాతానికి పెరిగాయి
తాజాగా ఆమోదం పొందిన బిల్లు ప్రకారం. షెడ్యూల్డ్ కులాల వారికి 20 శాతం రిజర్వేషన్ లభిస్తుంది. ఓబీసీ, ఈబీసీలకు 43 శాతం ఉన్న రిజర్వేషన్ దక్కుతుంది. షెడ్యూల్డ్ తెగలు(ఎస్టీ) వారికి రెండు శాతం రిజర్వేషన్లు అందనున్నాయి. దీంతో రాష్ట్రంలో రిజర్వేషన్లు 65 శాతానికి చేరుకుంటాయి. కాగా ప్రస్తుతం ఓబీసీలకు 12 శాతం, ఈబీసీలకు 18 శాతం రిజర్వేషన్ ఉండగా.. తాజాగా మరో 13 శాతం పెరగనుంది. ఇక ఎస్సీలకు 16 శాతం, ఎస్టీలకు ఒకశాతం రిజర్వేషన్‌లు ఉన్నాయి.
కులగణన ప్రకారం.. రాష్ట్ర 13 కోట్ల జనాభాలో 36 శాతం మంది ఈబీసీలు, 27.1 శాతం మంది వెనకబడిన తరగతులు, 19.7 శాతం మంది ఎస్సీలు, 1.7 శాతం ఎస్టీ జనాభా, జనరల్ కేటగిరీలో 15.5 శాతం ఉన్నారు. దీని ప్రకారం రాష్ట్రంలో 60 శాతానికి పైగా ప్రజలు వెనకబడిన, అత్యంత వెనకబడిన తరగతులకు చెందిన వారే ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment