Reservation Bill
-
Bihar: రిజర్వేషన్ల పెంపు బిల్లుకు అసెంబ్లీ ఆమోదం
పాట్నా: రాష్ట్రంలో విద్యా సంస్థలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ల పెంపు బిల్లుకు బిహార్ అసెంబ్లీలో గురువారం ఆమోదముద్ర పడింది. కులాల వారీగా కోటా పెంచుతూ ఇటీవల ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నేతృత్వంలోని కేబినెట్ ప్రతిపాదించిన ‘రిజర్వేషన్ సవరణ బిల్లు’ను తాజాగా అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది. సీఎం నితీష్ కుమార్ సభలో లేకుండానే అసెంబ్లీ బిల్లు పాస్ అవ్వడం విశేషం. దీంతో రాష్ట్రంలో రిజర్వేషన్ కోటా 65శాతానికి పెరిగింది. అయితే రిజర్వేషన్ల సవరణ బిల్లులో ఈడబ్ల్యూఎస్ కోటాను ప్రస్తావించకపోవడంపై బీజేపీ రాష్ట్ర అసెంబ్లీలో అభ్యంతరం వ్యక్తం చేసింది. బిల్లుపై బీజేపీ అభ్యంతరం తెలపడంతో ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కలగజేసుకొని.. తన మాటలు వినాలనుకుంటేనే మాట్లాడతానని చెప్పారు. లేకపోతే మాట్లాడనని చెప్పారు. తొమ్మిది పార్టీల మద్దతుతో కుల ఆధారిత గణన జరిగిందని, దీని ద్వారా ప్రతి ఒక్కరి ఆర్థిక పరిస్థితిని పరిశీలించామని తెలిపారు. ఈ విషయాన్ని ఇప్పటికే సభలో చెప్పినప్పటికీ ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారని మండిపడ్డారు. తక్షణమే బిల్లును అమలు చేయాలని కోరుతున్నట్లు సీఎం చెప్పారు. చదవండి: అయోధ్యలో కేబినెట్ భేటీ.. ఇదే తొలిసారి రాష్ట్రంలోని షెడ్యూల్డ్ కులాలు(ఎస్సీ), షెడ్యూల్డ్ తెగలు(ఎస్టీ), ఇతర వెనకబడిన వర్గాలు(ఓబీసీ) , అత్యంత వెనకబడిన వర్గాల (ఈబీసీ) వారికి రిజర్వేషన్ల శాతాన్ని పెంచాలని మంగళవారం జేడీఎస్ సర్కార్ ప్రతిపాదించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం 50 శాతం ఉన్న రిజర్వేషన్ కోటాను 65 శాతానికి పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ బిల్లు ఆమోదం లభించడంతో అయితే ఆర్థికంగా బలహీన వర్గాలకు(ఈడబ్ల్యూఎస్) వారికి కేంద్రం 10శాతం రిజర్వేషన్ ఇస్తుండగా.. బిహార్ ప్రభుత్వం అందిస్తున్న కోటాతో రాష్ట్రంలో రిజర్వేషన్లు 75శాతానికి పెరిగాయి తాజాగా ఆమోదం పొందిన బిల్లు ప్రకారం. షెడ్యూల్డ్ కులాల వారికి 20 శాతం రిజర్వేషన్ లభిస్తుంది. ఓబీసీ, ఈబీసీలకు 43 శాతం ఉన్న రిజర్వేషన్ దక్కుతుంది. షెడ్యూల్డ్ తెగలు(ఎస్టీ) వారికి రెండు శాతం రిజర్వేషన్లు అందనున్నాయి. దీంతో రాష్ట్రంలో రిజర్వేషన్లు 65 శాతానికి చేరుకుంటాయి. కాగా ప్రస్తుతం ఓబీసీలకు 12 శాతం, ఈబీసీలకు 18 శాతం రిజర్వేషన్ ఉండగా.. తాజాగా మరో 13 శాతం పెరగనుంది. ఇక ఎస్సీలకు 16 శాతం, ఎస్టీలకు ఒకశాతం రిజర్వేషన్లు ఉన్నాయి. కులగణన ప్రకారం.. రాష్ట్ర 13 కోట్ల జనాభాలో 36 శాతం మంది ఈబీసీలు, 27.1 శాతం మంది వెనకబడిన తరగతులు, 19.7 శాతం మంది ఎస్సీలు, 1.7 శాతం ఎస్టీ జనాభా, జనరల్ కేటగిరీలో 15.5 శాతం ఉన్నారు. దీని ప్రకారం రాష్ట్రంలో 60 శాతానికి పైగా ప్రజలు వెనకబడిన, అత్యంత వెనకబడిన తరగతులకు చెందిన వారే ఉన్నారు. -
ప్రజాస్వామ్యం బలోపేతం
న్యూఢిల్లీ: చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం మరింత పెరగాలన్న సంకల్పంతోనే మహిళా రిజర్వేషన్ బిల్లు ‘నారీశక్తి వందన్ అధినియమ్’ను తీసుకొచ్చినట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం పార్లమెంట్లో ఉద్ఘాటించారు. మహిళా రిజర్వేషన్ బిల్లుతో భారత ప్రజాస్వామ్యం మరింత బలోపేతం అవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. పార్లమెంట్ ఉభయ సభల్లో బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించాలని ఆయన ఈ సందర్భంగా పార్లమెంట్ సభ్యులకు విజ్ఞప్తి చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం పార్లమెంట్ నూతన భవనంలో లోక్‌సభలో మొదటి సెషన్లో తొలిసారిగా ప్రసంగించారు. సమాజం ప్రభావవంతంగా పరివర్తన చెందడం వెనుక రాజకీయాల పాత్రను వివరించారు. ఆధునిక యుగంలో మహిళలు ముందంజ వేస్తున్నారని ప్రశంసించారు. అంతరిక్షం నుంచి క్రీడల దాకా, స్టార్టప్ కంపెనీల నుంచి స్వయం సహాయ సంఘాల దాకా అన్ని రంగాల్లో వారు కీలకపాత్ర పోషిస్తున్నారని చెప్పారు. పార్లమెంట్లో ప్రధాని ఇంకా ఏం మాట్లాడారంటే.. ‘మహిళల సారథ్యంలో అభివృద్ధి’ ‘‘నారీశక్తి వందన్ అభియాన్‌ను ప్రభుత్వం తీసుకొచ్చిన సందర్భంగా మన తల్లులకు, సోదరీమణులకు, బిడ్డలకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నా చట్టంగా మార్చడానికి కట్టుబడి ఉన్నామని మహిళలకు హామీ ఇస్తున్నా. ఈ బిల్లుతో మన ప్రజాస్వామ్యం మరింత బలం పుంజుకుంటుంది. ‘మహిళల సారథ్యంలో అభివృద్ధి’ అనే విధానాన్ని మనం అనుసరిస్తున్నాం. జీ20 శిఖరాగ్ర సదస్సులో ప్రపంచ దేశాలు ఈ విధానాన్ని ప్రశంసించాయి. అన్ని రంగాల్లో మహిళల భాగస్వామ్యం నానాటికీ ఇనుమడిస్తోంది. ప్రభుత్వ విధాన నిర్ణయాల రూపకల్పనలోనూ వారి భాగస్వామ్యం పెరగాలి. తద్వారా దేశ అభివృద్ధిలో వారి పాత్ర, సహకారం పెరుగుతుంది. ఈ చారిత్రక దినాన మహిళామణుల కోసం అవకాశాల ద్వారాలు తెరవాలని ఎంపీలను కోరుతున్నా. శుభప్రదమైన ప్రారంభానికి శ్రీకారం మహిళల సారథ్యంలో ప్రగతి అనే తీర్మానాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తున్నాం. ఇందులో భాగంగా రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెడుతున్నాం. లోక్‌సభ, రాష్ట్రాల శాసనసభల్లో మహిళల భాగస్వామ్యాన్ని విస్తృత పర్చడమే ఈ బిల్లు ముఖ్య ఉద్దేశం. శుభప్రదమైన ప్రారంభానికి శ్రీకారం చుడుతున్నాం. మహిళా రిజర్వేషన్ బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించాలని పార్లమెంట్ సభ్యులందరికీ నా విజ్ఞప్తి. మహిళా రిజర్వేషన్ బిల్లుపై చాలా ఏళ్లపాటు ఎన్నో చర్చలు, సంవాదాలు, సంప్రదింపులు జరిగాయి. బిల్లు చుట్టూ వివాదాలు ఏర్పడ్డాయి. పార్లమెంట్లో బిల్లును ఆమోదించడానికి చాలా ప్రయత్నాలు జరిగాయి. మొట్టమొదటిసారిగా 1996లో ఈ బిల్లును ప్రవేశపెట్టారు. అటల్ బిహారీ వాజ్‌పేయి హయాంలో పలు సందర్భాల్లో బిల్లును ప్రవేశపెట్టినప్పటికీ అంకెలు సహకరించకపోవడంతో ఆమోదం పొందలేదు. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు అనే స్వప్నం నెరవేరలేదు. లక్ష్మణ రేఖ దాటొద్దు పార్లమెంట్లో కొత్త భవనంలో కొలువుదీరాం. ఎంపీలందరూ పాత చేదు అనుభవాలను, జ్ఞాపకాలను మర్చిపోవాలి. నూతన అధ్యయాన్ని ప్రారంభించాలి. కొత్త భవనంలో ఎంపీలు చేసే ఏం చేసినా సరే అది దేశ పౌరులకు స్ఫూర్తిదాయకంగా ఉండాలి. పార్లమెంట్ సమావేశా లను ప్రజలు ప్రత్యక్షంగా తిలకిస్తున్నారు. సభ్యులు అధికార పక్షంలో ఉంటారా? లేక ప్రతిపక్షంలో ఉంటారా? అనేది వారి ప్రవర్తనే నిర్దేశిస్తుంది. పార్లమెంట్ సంప్రదాయాలను సభ్యులంతా పాటించాలి. లక్ష్మణ రేఖ దాటకుండా జాగ్రత్తపడాలి. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా మనమంతా కలిసికట్టుగా పనిచేయాలి. ఈ పార్లమెంట్ ఏర్పాటైంది కేవలం దేశ ప్రగతి కోసమే తప్ప ఏదో ఒక రాజకీయ పార్టీ ప్రయోజనం కోసం కాదు. దేశానికి సేవలందించే విషయంలో పార్లమెంట్ స్థానం అత్యున్నతం. పార్లమెంట్ కొత్త భవనం 140 కోట్ల మంది భారతీయుల ఆకాంక్షలకు ప్రతిబింబం. ఇంజనీర్ల, శ్రామికుల శ్రమతోనే ఈ భవనం రూపుదిద్దుకుంది. 30 వేల మందికిపైగా కారి్మకులు స్వేదం చిందించారు. వారి వివరాలతో డిజిటల్ బుక్ తీసుకొచ్చాం. పవిత్ర ‘సెంగోల్’ను పార్లమెంట్ నూతన భవనంలో ప్రతిష్టించుకున్నాం. భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ఈ సెంగోల్‌ను స్వీకరించారు. ఎన్నో ఘట్టాలు సెంగోల్‌తో ముడిపడి ఉన్నాయి’’ అని ప్రధానమంత్రి మోదీ వివరించారు. చరిత్రలో నిలిచిపోతుంది మహిళలకు హక్కులు కల్పించడం, వాటిని కాపాడడం, వారి శక్తిసామర్థ్యాలను ఉపయోగించుకోవడం వంటి గొప్ప పనుల కోసం భగవంతుడు నన్ను ఎన్నుకున్నాడేమో! అందుకే ఆ దిశగా మన ప్రభుత్వం అడుగు ముందుకేసింది. మహిళా రిజర్వేషన్ బిల్లుకు మంత్రివర్గం నిన్న(సోమవారం) ఆమోదముద్ర వేసింది. ఈ రోజు(సెప్టెంబర్ 19) చరిత్రలో నిలిచిపోతుంది. ఏ దేశ అభివృద్ధి ప్రయాణంలోనైనా చరిత్రను సృష్టించే సమయం వస్తుంది. అలాంటి సమయం ఇప్పుడు భారత్‌కు వచ్చింది. -
మహిళా రిజర్వేషన్ బిల్లు చరిత్రాత్మకం
సాక్షి, హైదరాబాద్: చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్‌కు సంబంధించిన బిల్లు ఆమోదం విషయంలో కేంద్ర ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. సోమవారం రాత్రి తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ మహిళా రిజర్వేషన్ బిల్లుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలపడాన్ని స్వాగతించారు. బిల్లులో పేర్కొన్న అంశాలపై స్పష్టత ఇవ్వాలని, ఆమోదంలో ఎలాంటి అడ్డంకులు తలెత్తకుండా చూడాలన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించాల్సిందిగా ప్రధాని మోదీకి ముఖ్యమంత్రి కేసీఆర్ మూడు రోజుల క్రితం లేఖ రాసిన విషయాన్ని కవిత గుర్తు చేశారు. ఇదే తరహాలో చట్టసభల్లో ఓబీసీలకు రిజర్వేషన్ బిల్లును కూడా ప్రవేశ పెడితే తాము మద్దతు ఇస్తామని కవిత ప్రకటించారు. కాగా మహిళా రిజర్వేషన్ బిల్లును కేంద్ర కేబినెట్ ఆమోదించిన నేపథ్యంలో సోమ, మంగళవారాల్లో హైదరాబాద్‌లోని ఎమ్మెల్సీ కవిత నివా సం వద్ద సంబురాలు జరి గాయి. మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతు పలకాల్సిందిగా కోరు తూ ఇటీవల 40కి పైగా రాజకీయ పార్టీల నేతలకు ఎమ్మెల్సీ కవిత లేఖలు రాసిన విషయా న్ని ప్రస్తావిస్తూ మిఠాయిలు పంచారు. -
సుప్రీంలో తేలాకే ఎస్టీ రిజర్వేషన్ బిల్లు పాస్ చేస్తాం: కేంద్రం
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో 10% బీసీ, ఎస్టీ రిజర్వేషన్ల పెంపు బిల్లుకు ఆమోదం తెలిపారా అని టీఆర్ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డి లోక్‌సభలో కేంద్రాన్ని ప్రశ్నించారు. దీనిపై స్పందించిన కేంద్ర గిరిజన శాఖ మంత్రి అర్జున్ ముండా లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. ‘తెలంగాణాలో గిరిజన రిజర్వేషన్ల పెంపు బిల్లు కేంద్ర ప్రభుత్వానికి అందింది. తెలంగాణ బీసీ, ఎస్టీ, ఎస్సీ రిజర్వేషన్ల బిల్లు 2017లో హోంశాఖకు చేరింది. కానీ ప్రస్తుతం సుప్రీం కోర్టులో ఈ రిజర్వేషన్ల కేసు పెండింగ్‌లో ఉంది. అందువల్ల అత్యున్నత న్యాయస్థానంలో ఈ కేసు ఏ విషయమనేది తేలాక.. ముందుకు వెళ్తుందని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, తెలంగాణ ప్రభుత్వం సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలో గిరిజన రిజర్వేషన్లను ఆరు నుంచి పది శాతానికి పెంచుతూ జీవో నెం.33ను ఆఘా మేఘాలపై జారీ చేసిన సంగతి తెలిసిందే. ఐతే గత పార్లమెంటు వర్షాకాల సమావేశాల సందర్భంగా.. తెలంగాణ జారీ చేసిన రిజర్వేషన్ల పెంపు బిల్లు విషయమై వివాదం తలెత్తిన సంగతి తెలిసిందే. (చదవండి: ఈడీ ఎదుట విచారణకు హజరైన మంత్రి తలసాని పీఏ అశోక్) -
ఎన్నికలు.. ఆందోళనలు
2019 రాజకీయంగా, సామాజికంగా జరిగిన మార్పులు మామూలువి కావు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా పేరున్న భారతదేశంలో ఈ ఏడాది ఏప్రిల్, మే నెలల్లో సార్వత్రిక ఎన్నికల క్రతువు ముగిసింది. 543 లోక్‌సభ స్థానాలతో పాటు కొన్ని అసెంబ్లీలకు కూడా ఎన్నికలు జరగ్గా భారతీయ జనతా పార్టీ 303 లోక్‌సభ స్థానాలతో కేంద్రంలో అధికారాన్ని కైవసం చేసుకుంది. ఒక రాజకీయ పార్టీ సొంతంగా పూర్తిస్థాయి మెజారిటీ సాధించడం 30 ఏళ్ల తరువాత ఇదే తొలిసారి కూడా. ఆర్థికంగా వెనుకబడ్డ వారికి రిజర్వేషన్లు.. విద్యా, ఉపాధి రంగాల్లో ఆర్థికంగా వెనుకబడ్డ అగ్రవర్ణాల వారికి పదిశాతం రిజర్వేషన్లు కల్పిస్తూ నరేంద్రమోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం రాజ్యాంగాన్ని 124వ సారి మార్చారు కూడా. ఏడాదికి రూ.8 లక్షల కంటే తక్కువ ఆదాయం కలిగి ఉండి... ప్రభుత్వమిచ్చే ఇతర రిజర్వేషన్లు (ఎక్స్ సర్వీస్ మెన్, వికలాంగులు తదితరాలు) ఉపయోగించుకోని అగ్రవర్ణాల వారికి ఈడబ్ల్యూఎస్ కోటా వర్తిస్తుంది. ఏడాది మొదట్లో, లోక్‌సభ ఎన్నికలకు కొన్ని నెలల ముందు ఈ నిర్ణయం తీసుకోవడం ఎన్డీయేపై కొన్ని విమర్శలు వచ్చేందుకూ కారణమైంది. పౌరసత్వ చట్ట సవరణ.... దేశాద్యంతం ఆందోళనలకు, హింసాత్మక ఘటనలకు తావిచ్చిన చట్ట సవరణ ఇది. 1955 నాటి చట్టం ప్రకారం భారతీయ పౌరులయ్యేందుకు ఉన్న ఐదు అవకాశాల్లో కొన్ని సవరణలు చేయడం మొత్తం వివాదానికి కారణమైంది. పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్లకు చెందిన హిందు, సిక్కు, పార్శీ, క్రైస్తవ, జైన, బౌద్ధ మతాల వారు ఆయా దేశాల్లో మతపరమైన హింస ఎదుర్కొంటే వారికి భారతీయ పౌరసత్వం కల్పించేందుకు ఈ సవరణ వెసులుబాటు కల్పించింది. ఈ జాబితాలో ముస్లింల ప్రస్తావన లేకపోవడం, ఇతర ప్రాంతాలు, దేశాల నుంచి వచ్చే ముస్లిమేతరుల పరిస్థితీ అగమ్యగోచరంగా మారడంతో పెద్ద ఎత్తున ఆందోళనలు రేగాయి. ఈ ఆందోళనపూరిత వాతావరణం కొనసాగుతుండగానే కేంద్రం జాతీయ జనాభా పట్టిక తయారీకి ఏర్పాట్లు చేయడంతో పరిస్థితి ఇంకా సద్దుమణగలేదు. కాంగ్రెస్‌లో నేతల కరవు సార్వత్రిక ఎన్నికల తరువాత రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి నుంచి తప్పుకోవడంతో ఆ పార్టీలో కొంత గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. గాంధీ కుటుంబానికి చెందని వారినెవరినైనా పార్టీ అధ్యక్షుడిగా నియమించుకోవాలని రాహుల్ స్వయంగా విజ్ఞప్తి చేసినప్పటికీ కొన్ని నెలల పాటు అధ్యక్ష ఎన్నికపై తర్జనభర్జనలు కొనసాగాయి. చివరకు సోనియాగాంధీ మరోసారి అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టాల్సి వచ్చింది. రాహుల్ గాంధీ అధ్యక్షుడిగా కొనసాగుతున్న సమయంలోనే ఉత్తరప్రదేశ్‌లోని ఒక ప్రాంతానికి ఇన్చార్జ్గా ప్రియాంక గాంధీ నియమితులవడం, అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీగానూ ఆమెకు పదవి దక్కడం ఆ పార్టీలో జరిగిన ముఖ్యపరిణామాల్లో ఒకటిగా చెప్పుకోవచ్చు. కేంద్రపాలిత ప్రాంతాలుగా జమ్మూ కశ్మీర్, లద్దాఖ్... జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దుతోపాటు జమ్మూ కశ్మీర్ నుంచి లద్దాఖ్‌ను వేరు చేసి కేంద్ర పాలిత ప్రాంతాలుగా ప్రకటించడం ఈ ఏడాది జరిగిన అత్యంత కీలకమైన రాజకీయ ఘట్టాల్లో ఒకటి. దశాబ్దాలుగా దేశంలో ఒకరకమైన అసంతృప్తికి కారణమైన ఆర్టికల్ 370ని ఈ ఏడాది ఆగస్టు 5న రద్దు చేశారు. ఆ తరువాత అక్కడ పెద్ద ఎత్తున ఆంక్షలు విధించడం, 145 రోజుల వరకూ ఇంటర్నెట్పై నిషేధం విధించటం వంటి అంశాలు ప్రపంచదేశాలు దృష్టి పెట్టేలా చేశాయి. పుల్వామా దాడులు... పాకిస్తాన్ ప్రేరిపిత ఉగ్రవాద చర్యలకు తాజా తార్కాణంగా చెప్పుకునే పుల్వామా దాడులు ఈ ఏడాది దాయాది దేశాలు మరోసారి కత్తులు నూరేందుకు కారణమయ్యాయి. ఫిబ్రవరి 14న జమ్మూ కశ్మీర్లో ఓ మిలటరీ కాన్వాయ్‌పై ఉగ్రవాదులు దాడి చేయగా అందులో సుమారు 40 మంది భారతీయ సైనికులు మరణించారు. ఈ ఘటనకు ప్రతీకారంగా అదే నెల 26న భారత సైన్యం పాకిస్తాన్ లోపలికి చొరబడి బాలాకోట్ వద్ద ఉగ్రవాద స్థావరాలపై బాంబులు వేసింది. ఈ క్రమంలో భారతీయ యుద్ధ విమాన పైలెట్ అభినందన్ వర్ధమాన్ పాకిస్తాన్ చేతికి చిక్కాడు. అంతర్జాతీయ ఒత్తిడికి తలొగ్గిన పాకిస్తాన్ కొన్ని రోజుల వ్యవధిలోనే అభినందన్‌ను సగౌరవంగా భారత్‌కు అప్పగించింది. -
రిజర్వేషన్ల బిల్లుకు పార్లమెంటు ఆమోదం
న్యూఢిల్లీ: లోక్‌సభ, అసెంబ్లీల్లో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లను పొడిగించే బిల్లు పార్లమెంటు ఆమోదం పొందింది. ఎస్సీ, ఎస్టీలకు చట్టసభల్లో రిజర్వేషన్లను మరో పదేళ్లు పొడిగించేందుకు ఉద్దేశించిన రాజ్యాంగ 126వ సవరణ బిల్లు గురువారం రాజ్యసభలో ఏకగ్రీవంగా ఆమోదం పొందింది. ఎస్సీ, ఎస్టీలు ఇంకా వెనకబడే ఉన్నందున, వారిలో క్రీమీలేయర్‌ను వర్తింపజేయాల్సిన అవసరం లేదని తాము భావిస్తున్నామన్నారు. ఈ సవరణ ద్వారా 2030, జనవరి 25 వరకు రిజర్వేషన్లను పొడిగిస్తారు. ఈ బిల్లును 10వ తేదీన లోక్‌సభ ఆమోదించింది. చర్చ సందర్భంగా రవిశంకర్ ప్రసాద్‌కు, విపక్ష నేత గులాంనబీ ఆజాద్‌కు మధ్య వాగ్యుద్ధం చోటు చేసుకుంది. అనంతరం కాంగ్రెస్ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. అనంతరం, చైర్మన్ వెంకయ్యనాయుడు విజ్ఞప్తి మేరకు వారు సభకు తిరిగివచ్చారు. -
లోక్‌సభలో జమ్మూకశ్మీర్ రిజర్వేషన్ల సవరణ బిల్లు
-
‘కశ్మీర్ రిజర్వేషన్’ బిల్లును ప్రవేశపెట్టిన కిషన్‌రెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ : జమ్మూకశ్మీర్ రిజర్వేషన్ల సవరణ బిల్లును కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి లోక్‌సభ ముందుకు తీసుకొచ్చారు. హోంమంత్రి అమిత్ షా ఈ బిల్లు ప్రవేశపెడతారని వార్తలు రాగా.. చివరినిమిషంలో కిషన్ రెడ్డి బిల్లును సభ ముందుకు తెచ్చారు. జమ్మూలో అంతర్జాతీయ సరిహద్దుకు 10కిలోమీటర్లు, కశ్మీర్లో నియంత్రణరేఖకు 10 కిలోమీటర్ల దూరంలో నివసించే యువతకు విద్యా సంస్థలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ కల్పించేందుకు ఈ బిల్లును తీసుకొచ్చారు. దేశంలోని ఇతర రాష్ట్రాల్లో ఆర్థికంగా వెనుకబడినవర్గాలకు 10శాతం రిజర్వేషన్ సౌకర్యం కల్పించే బిల్లును ఫిబ్రవరి 18న కేంద్ర కేబినెట్ ఆమోదించగా.. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నుంచి కూడా ఆమోదముద్ర లభించింది. జమ్మూకశ్మీర్‌లో ఈబీసీ రిజర్వేషన్ల అమలుకోసం రాష్ట్ర రిజర్వేషన్ల చట్టం 2004కు కేంద్రం సవరణలు ప్రతిపాదించింది. ఈ బిల్లునే కిషన్‌రెడ్డి లోక్‌సభలో ప్రవేశపెట్టారు. -
అగ్రవర్ణ కోటాపై ఇప్పుడే ఆదేశాలివ్వం: సుప్రీం
న్యూఢిల్లీ: అగ్రవర్ణాల్లోని పేదలకు పది శాతం రిజర్వేషన్ల కేసుపై ప్రస్తుత తరుణంలో తాము ఏ ఆదేశాలూ ఇవ్వదలచుకోవడం లేదని సుప్రీంకోర్టు సోమవారం స్పష్టం చేసింది. ఈ నెల 28న ఈ కేసుకు సంబంధించిన వాదనలను తాము వింటామనీ, రాజ్యాంగ ధర్మాసనానికి దీనిని బదిలీ చేయాలా, వద్దా అన్న విషయాన్ని కూడా అప్పుడే పరిశీలిస్తామని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం వెల్లడించింది. అగ్ర కులాల్లోని పేదలకు విద్య, ఉద్యోగాల్లో పది శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్రం తీసుకొచ్చిన చట్టం రాజ్యాంగ విరుద్ధమంటూ ఇప్పటికే పలువురు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అయితే వారందరి కేసుల్లోనూ ఈ విషయాన్ని తాము తర్వాత పరిశీలిస్తామంటూ అన్ని పిటిషన్లనూ సుప్రీంకోర్టు వాయిదా వేస్తుండటం తెలిసిందే. ఈ పిటిషన్లపై స్పందన తెలపాల్సిందిగా కేంద్రానికి సుప్రీంకోర్టు గతంలోనే నోటీసులు పంపింది. ట్రిపుల్ తలాక్ ఆర్డినెన్స్‌పై పిటిషన్లు కొట్టివేత ట్రిపుల్ తలాక్‌ను శిక్షార్హం చేస్తూ జారీ చేసిన ఆర్డినెన్స్‌ను కేంద్రం పొడిగించటాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను విచారించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ముస్లిం మహిళల (వివాహ హక్కుల రక్షణ) ఆర్డినెన్స్‌ను గత ఏడాది సెప్టెంబర్ 19న ప్రభుత్వం జారీ చేసింది. దీని ప్రకారం.. ముస్లిం పురుషుడు తన భార్యకు మూడుసార్లు తలాక్ అని చెప్పి విడాకులివ్వడం శిక్షార్హం అవుతుంది. ఈ బిల్లు లోక్‌సభలో ఆమోదం పొందినా రాజ్యసభ వద్ద పెండింగ్‌లో ఉంది. -
గుజ్జర్ల రిజర్వేషన్ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం
జైపూర్: ప్రభుత్వ ఉద్యోగ, విద్యా రంగాల్లో రిజర్వేషన్ల కోసం రాజస్థాన్‌లో గుజ్జర్లు చేస్తోన్న ఆందోళన ఫలించింది. రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వం గుజ్జర్లతో పాటుగా మరో నాలుగు కులాలకు ప్రభుత్వ ఉద్యోగాల్లోనూ, విద్యాసంస్థల్లోనూ ఐదు శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ బుధవారం శాసనసభలో ప్రవేశపెట్టిన బిల్లును అసెంబ్లీ ఆమోదించింది. ఈ బిల్లులో గుజ్జర్లతో పాటుగా బంజారాలు, గడియా లోహార్లు, రైకాస్, గడారియా కులాలకు కూడా రిజర్వేషన్లను కల్పించింది. ఈ తాజా బిల్లుతో వెనుకబడిన తరగతుల (బీసీ) రిజర్వేషన్లు 21% నుంచి 26%కు పెరిగాయి. తమకు రిజర్వేషన్లను కల్పించాలంటూ గత శుక్రవారం నుంచి గుజ్జర్ల నేత కిరోరీ సింగ్ భైన్సాలా నేతృత్వంలోని వివిధ కులాలు సవాయి మాధోపూర్ జిల్లాలోని ఢిల్లీ–ముంబై రైల్వే ట్రాక్‌పై ఆందోళన చేస్తున్నారు. వీరి ఆందోళనలతో రాజస్థాన్‌లోని కాంగ్రెస్ ప్రభుత్వం దిగివచ్చి వీరికి రిజర్వేషన్లను కల్పించింది. -
పేదల కోటాకు ‘పెద్దల’ ఆమోదం
న్యూఢిల్లీ: అగ్రవర్ణ పేదలకు 10% రిజర్వేషన్లు కల్పిం చే బిల్లు చట్టరూపం దాల్చేందుకు మరింత చేరువైంది. 124వ రాజ్యంగ సవరణ పేరిట తెచ్చిన ఈ బిల్లుకు బుధవారం రాజ్యసభ ఆమోదం తెలిపింది. బిల్లుపై జరిగిన ఓటింగ్‌లో 165 మంది సభ్యులు అనుకూలంగా, ఏడుగురు వ్యతిరేకంగా ఓటేశారు. మంగళవారం లోక్‌సభలో ఈ బిల్లు 323–3 తేడాతో నెగ్గిన సంగతి తెలిసిందే. రెండు రోజుల వ్యవధిలో రెండు సభల్లో ఆమోదం పొందిన ఈ బిల్లు తదుపరి దశలో రాష్ట్రపతి సంతకంతో చట్టంగా మారుతుంది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ, సున్నితమైన రిజర్వేషన్ల అంశంలో ప్రతిపక్షాలు సహకరించడంతో ఈ బిల్లు పార్లమెంట్ అడ్డంకిని అధిగమించింది. లోక్‌సభలో మాదిరిగానే రాజ్యసభలోనూ బిల్లుపై అభ్యంతరాలు వ్యక్తం చేసిన విపక్షాలు అంతిమంగా అనుకూలంగానే ఓటేశాయి. ప్రతిపక్షాలు సూచించిన పలు సవరణలు వీగిపోయాయి. బిల్లు రాజ్యాంగబద్ధతపై సందేహాలు వ్యక్తం చేసిన విపక్షాలు..ఈ చట్టం అమలులో సంక్లిష్టతలు తప్పవని ప్రభుత్వాన్ని హెచ్చరించాయి. జనసంఖ్యకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని సేకరించకుండానే కేంద్రం హడావుడిగా ఈ తతంగాన్ని ముగించిందని ఎండగట్టాయి. బిల్లుపై ఓటింగ్ మొదలయ్యాక సభ నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్), సీపీఐలు వాకౌట్ చేశాయి. సెలక్ట్ కమిటీ పంపాలని విపక్షం డిమాండ్ సామాజిక న్యాయ మంత్రి థావర్‌చంద్ గహ్లోత్ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టగా,రాత్రి 11 గంటల వరకు సుదీర్ఘ చర్చ జరిగింది. అంతకుముందు, ఈ బిల్లును సెలక్ట్ కమిటీకి పంపాలని విపక్షాలు పట్టుపట్టడంతో కొంతసేపు రభస చోటుచేసుకుంది. కాంగ్రెస్, డీఎంకే, ఆర్జేడీ, ఆమ్ ఆద్మీ పార్టీ సభ్యులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ వెల్‌లోకి వెళ్లారు. బిల్లు ఆమోదం పొందకుండా కాంగ్రెస్ అడ్డంకులు సృష్టిస్తోందని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి విజయ్ గోయల్ ఆరోపించారు. బిల్లుకు కాంగ్రెస్ అనుకూలంగానే ఉందని, కానీ దాన్ని ప్రవేశపెట్టిన విధానంలోనే అభ్యంతరాలున్నాయని కాంగ్రెస్ నాయకుడు ఆనంద్ శర్మ అన్నారు. బిల్లును హడావుడిగా తీసుకురావాల్సిన అవసరం ఏముందని కాంగ్రెస్ మరో సభ్యుడు ముధుసూదన్ మిస్త్రీ ప్రశ్నించారు. బిల్లు ఉద్దేశాల్ని అందులో పేర్కొనలేదని, నిబంధన ఉల్లంఘన జరిగిందని ఆరోపించారు. బిల్లును సెలక్ట్ కమిటీకి పం పాలని, తాను ప్రతిపాదించిన సవరణల్ని పరిశీలించాలని డీఎంకే ఎంపీ కనిమొళి డిప్యూటీ చైర్మన్ హరివంశ్‌ను కోరారు. కాంగ్రెస్ ఎంపీలతో పాటు సీపీఐ సభ్యుడు రాజా ఆమెకు మద్దతుగా నిలిచారు. ‘నోట్లరద్దు’ మాదిరే అవుతుంది: సిబల్ సభ తిరిగి ప్రారంభమయ్యాక మొదలైన చర్చలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కపిల్ సిబల్ మాట్లాడుతూ.. అగ్రవర్ణాల కోటా బిల్లును కేంద్రం శ్రద్ధ పెట్టకుండా తీసుకొచ్చిందని, న్యాయపర అడ్డంకులు తప్పవని అన్నారు. ఈ బిల్లు పార్లమెంట్ ఆమోదం పొంది చట్టరూపం దాల్చిన తరువాత కూడా నోట్లరద్దు మాదిరిగా అమలులో ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. అగ్రవర్ణ పేదలకు సంబంధించిన కచ్చితమైన సమాచారం ప్రభుత్వం వద్ద లేకపోవడమే ఇందుకు కారణమని చెప్పారు. ‘బిల్లును ఉన్న పళంగా హడావుడిగా తీసుకురావాల్సిన అవసరం ఏముంది? అన్ని ఒక్కరోజులోనే చేయాలనుకోవడం సబబేనా? ఎలాంటి సమాచారం లేకుండానే బిల్లును తీసుకొచ్చారు. కోటా పారామితుల్ని నిర్ధారించే ముందు ఏదైనా నివేదిక రూపొందించారో? లేదో? చెప్పండి. బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టేముందు సెలక్ట్ కమిటీకి పంపి సభ్యుల సూచనలు, అభిప్రాయాలు తీసుకోవాల్సింది’ అని సిబల్ అన్నారు. బిల్లును రూపొందించే ముందు వేర్వేరు కులాలు, వర్గాలకు చెందిన జనసంఖ్య సమాచారాన్ని కేంద్రం సేకరించిందా? అని ప్రశ్నించారు. ఆర్థికంగా వెనకబడిన వర్గాలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న మండల్ కమిషన్ సిఫార్సును సుప్రీంకోర్టు కొట్టేసిన సంగతిని ప్రస్తావించారు. తాజా బిల్లులో రాజ్యాంగ సంబంధ సంక్లిష్ట విషయాలున్నాయని, శ్రద్ధపెట్టకుండా రూపొందించి, సెలక్ట్ కమిటీకి పంపకుండా నేరుగా పార్లమెంట్ ముందుకు తెచ్చారని ఆరోపించారు. చిరస్మరణీయ రోజు: గహ్లోత్ జనరల్ కేటగిరిలో పేదలందరికీ సమాన అవకాశాలు కల్పించే దిశగా తాజా బిల్లు గొప్ప ముందడుగు అని కేంద్ర సామాజిక న్యాయ శాఖ మంత్రి థావర్‌చంద్ గహ్లోత్ అన్నారు. హడావుడిగా ఈ బిల్లును తీసుకురాలేదని, కోటా ప్రయోజనాలు అందకుండా దూరంగా ఉన్న పేద ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని తాము రూపొందించామని చెప్పారు. కోట్లాది మంది పేదలకు లబ్ధి చేకూర్చే ఈ బిల్లు ఆమోదం పొందిన రోజు చిరస్మరణీయంగా నిలిచిపోతుందని ఆయన అన్నారు. ఇది సామాజిక న్యాయ విజయం: మోదీ కోటా బిల్లును పార్లమెంటు ఆమోదించడం సామాజిక న్యాయ విజయమని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బుధవారం అభివర్ణించారు. దేశం మార్పువైపు పయనిస్తున్న తరుణంలో ఈ బిల్లు వల్ల యువత ఆ మార్పులో భాగమై అభివృద్ధికి దోహదపడగలరని అన్నారు. ఈ బిల్లుకు ఇంతటి మద్దతు లభించడం తనకు ఆనందం కలిగించిందని ట్విట్టర్లో చెప్పారు. ఈ బిల్లును ఆమోదించడం ద్వారా రాజ్యాంగ నిర్మాతలకు, స్వాతంత్య్ర సమరయోధులకు పార్లమెంటు నివాళి అర్పించిందన్నారు. దేశం మార్పువైపు పయనిస్తున్న తరుణంలో ఈ బిల్లు వల్ల యువత అందులో భాగమై అభివృద్ధికి దోహదపడగలదు. ఈ బిల్లుకు ఇంతటి మద్దతు లభించడం నాకు ఆనందం కలిగించింది. బిల్లును ఆమోదించడం ద్వారా రాజ్యాంగ నిర్మాతలకు, స్వాతంత్య్ర సమరయోధులకు పార్లమెంటు నివాళి అర్పించింది – ట్విట్టర్లో ప్రధాని మోదీ అగ్రవర్ణాలకు 10 శాతం రిజర్వేషన్ బిల్లును కేంద్రం శ్రద్ధ పెట్టకుండా తీసుకొచ్చింది. బిల్లుకు న్యాయపరమైన అడ్డంకులు తప్పవు. ఇది పార్లమెంటు ఆమోదం పొంది చట్టరూపం దాల్చిన తరువాత కూడా నోట్ల రద్దు మాదిరిగా అమల్లో ఇబ్బందులు తప్పవు. అగ్రవర్ణ పేదలకు సంబంధించిన కచ్చితమైన సమాచారం ప్రభుత్వం వద్ద లేకపోవడమే ఇందుకు కారణం – కపిల్ సిబల్ ఈ కోటా ముందున్న సవాళ్లు ఏంటి? ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణాల పేదలకు(ఈబీసీ) పది శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లు రాష్ట్రపతి ఆమోదం పొంది చట్టమయ్యాక న్యాయ సమీక్షకు నిలవడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కోటా అమలును అడ్డుకునేందుకు ఈ రాజ్యాంగ సవరణ చట్టాన్ని సుప్రీంకోర్టులో సవాలు చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. రిజర్వేషన్లపై గతంలో విధించిన 50% పరిమితిని తొలగించేందుకు సుప్రీంకోర్టు అంగీకరిస్తే అన్ని రాష్ట్రాలూ తమ పరిధిలోని రిజర్వేషన్లను, తమ రాజకీయ ప్రయోజనాల కోసం భారీగా పెంచుకోవడానికి సిద్ధమవుతాయి. ఒకవేళ కోటాల గరిష్ట పరిమితి 50 శాతం మించడాన్ని సుప్రీం తిరస్కరిస్తే అగ్రవర్ణ పేదల కోటాను అమలు చేయడానికి ఎస్సీ, ఎస్టీ, బీసీల కోటాను తగ్గించాల్సిన పరిస్థితి ఉంటుంది. అప్పుడు ఈ 10% ఈబీసీ కోటాను ప్రస్తుతమున్న 50 శాతంలోనే చేర్చాల్సి ఉంటుంది. దాన్ని దాదాపు అన్ని రాజకీయ పార్టీలు వ్యతిరేకిస్తాయి. అగ్రకులాలన్నింటికీ మేలు జరిగేనా? పది శాతం కోటాను అగ్రవర్ణాలకు చెందిన వారు సమర్థిస్తారు. ఈ కొత్త కోటా అగ్ర కులాల ప్రజలను కాషాయ పక్షం వైపు మళ్లేలా చేయవచ్చు. అయితే, దీని వల్ల బీజేపీకి ఏ స్థాయిలో రాజకీయ ప్రయోజనం చేకూరుతుందో చెప్పలేం. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ప్రస్తుతమున్న 50 శాతానికి అదనంగానే ఈబీసీ పది శాతం కోటా ఉంటుందని కేంద్రం చెబుతున్నా.. కోటా గరిష్ట పరిమితిని పెంచడానికి సుప్రీం నిరాకరిస్తే తమ కోటా వాటా తగ్గిపోతుందని వారు ఆందోళన చెందే అవకాశం ఉంటుంది. ఆర్థిక ప్రాతిపదికను రాజ్యాంగం ఆమోదిస్తుందా? ఎంతో కాలంగా సాంఘికంగా, విద్యాపరంగా, ఆర్థికంగా (ఈ మూడు విధాలా) అన్యాయానికి గురైన వర్గాలకు మాత్రమే రిజర్వేషన్లు ఇవ్వాలని రాజ్యాంగం, న్యాయస్థానాలు చెబుతున్నాయి. పేదరికం అనేది సామాజిక, వ్యవస్థాపరమైన అణచివేత కిందకు రాదని కూడా రాజ్యాంగం ప్రకటిస్తోంది. కొన్ని వర్గాల ప్రజలకు కోటా అమలుకు రాజ్యాంగంలో మార్పులు చేయడానికి ప్రభుత్వానికి అధికారం ఉంది. కాని చట్ట సవరణ ద్వారా రాజ్యాంగ మౌలిక స్వరూపం మార్చడానికి అధికారం లేదు. రాజ్యాంగంలో సమానత్వ సూత్రం అమలుకు రిజర్వ్డ్ సీట్లు, ఓపెన్ కేటగిరీ సీట్లు చెరి సగం ఉండేలా కోటా పరిమితిని 50 శాతంగా సుప్రీంకోర్టు నిర్ణయించింది. ఈ సమానత్వం కాపాడే ఏర్పాటును రాజ్యాంగంలోని మౌలిక సూత్రంగా పరిగణిస్తున్నారు. 50 శాతానికి పైన అదనంగా పది శాతం కోటా ఇవ్వడం అంటే సమానత్వ సూత్రాన్ని ఉల్లంఘించడంగా పలువురు భావిస్తున్నారు. ఈ కారణంగా ఈబీసీ కోటా చట్ట రూపంలోకి వచ్చి అమలు జరిగితే దానిపై కోర్టుల్లో వివాదాలు తలెత్తే అవకాశాలున్నాయి. ఈబీసీ కోటా రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో జనరల్ కేటగిరీలోని పేద వర్గాలను ఎంత వరకు ప్రభావితం చేస్తుందో వేచిచూడాలి. 50 శాతం దాటకూడదని రాజ్యాంగంలో లేదు: ప్రసాద్ వెనుకపడిన వర్గాల(బీసీ) రిజర్వేషన్లు 50 శాతానికి మించరాదని సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాలపై తాజాగా రాజ్యసభలో ప్రవేశపెట్టిన ఈబీసీ బిల్లు ఎలాంటి ప్రభావం చూపదని కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. 124వ రాజ్యాంగ సవరణ ప్రకారం తీసుకొస్తున్న ఈ చట్టం కేంద్రం, రాష్ట్రాలకు వర్తిస్తుందని స్పష్టం చేశారు. రాజ్యసభలో బిల్లుపై చర్చ సందర్భంగా మాట్లాడుతూ..‘రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదని భారత రాజ్యాంగంలో ఎక్కడా లేదు. దీన్ని సుప్రీంకోర్టు మాత్రమే చెప్పింది. తాజాగా ఈబీసీ బిల్లులో భాగంగా మేం ప్రాథమిక హక్కుల్లోని రెండు ఆర్టికల్స్‌ను సవరిస్తున్నాం. రాజ్యాంగంలోని 15వ ఆర్టికల్‌కు ఆర్థికంగా వెనుకపడిన వర్గాలను నిర్వచించేలా ఓ క్లాజ్‌ను జతచేస్తున్నాం. అలాగే ఆర్టికల్ 16లో ఎస్సీ,ఎస్టీలతో పాటు వీరికి రిజర్వేషన్ కల్పించేలా ఆరో క్లాజును చేరుస్తున్నాం. తద్వారా ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లు, కళాశాలల్లో ఈబీసీలకు అవకాశం లభిస్తుంది. ఈబీసీ రిజర్వేషన్ బిల్లు ప్రత్యేకత ఏంటంటే ఎస్సీ,ఎస్టీ, బీసీలకు అమలవుతున్న రిజర్వేషన్‌పై దీని ప్రభావం ఏమాత్రం ఉండదు’ అని ప్రసాద్ వెల్లడించారు. రాష్ట్రాలకు ముందుగా తెలియజేయకుండా ఈ బిల్లును లోక్‌సభలో ఎందుకు ప్రవేశపెట్టారన్న డీఎంకే ఎంపీ కనిమొళి ప్రశ్నకు స్పందిస్తూ.. ఆర్టికల్ 368 కింద రాజ్యాంగాన్ని సవరించేటప్పుడు బిల్లు రాష్ట్ర విధానసభకు వెళ్లాల్సిన అవసరం లేదని తేల్చిచెప్పారు. బుధవారం రాజ్యసభలో ఆందోళన చేస్తున్న విపక్ష పార్టీల సభ్యులు -
ఈబీసీ బిల్లుకు రాజ్యసభ ఆమోదం
సాక్షి, న్యూఢిల్లీ : అగ్రవర్ణ పేదలకు 10 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ ప్రవేశపెట్టిన బిల్లు బుధవారం రాజ్యసభలో ఆమోదం పొందింది. బిల్లుకు అనుకూలంగా 149 ఓట్లు వచ్చాయి. బిల్లుకు వ్యతిరేకంగా 7 ఓట్లు పడ్డాయి. ఓటింగ్ సమయంలో రాజ్యసభలో 156 మంది సభ్యులున్నారు. బిల్లుకు దాదాపు అన్ని పార్టీలూ మద్దతు తెలిపాయి. విద్య, ఉద్యోగాల్లో అగ్రవర్ణాల పేదలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించే ఈ బిల్లుకు మంగళవారం లోక్‌సభ ఆమోదం తెలిపిన సంగతి తెల్సిందే. నేడు రాజ్యసభలో కూడా ఆమోదం పొందడంతో బిల్లును రాష్ట్రపతి సంతకం కోసం పంపించనున్నారు. రాష్ట్రపతి సంతకం తర్వాత బిల్లు అమల్లోకి వస్తుంది. -
కోటా బిల్లుపై పెద్దల సభలో వాడివేడి చర్చ
సాక్షి, న్యూఢిల్లీ : అగ్ర వర్ణాల పేదలకు పదిశాతం రిజర్వేషన్ కల్పించే బిల్లుపై బుధవారం రాజ్యసభలో వాడివేడి చర్చ జరిగింది. ఈ బిల్లును లోతుగా పరిశీలించేందుకు సెలెక్ట్ కమిటీకి పంపాలని కాంగ్రెస్ సహా విపక్షాలు డిమాండ్ చేశాయి. బిల్లుపై జరిగిన చర్చలో కాంగ్రెస్ సభ్యుడు ఆనంద్ శర్మ మాట్లాడుతూ కేంద్రం కోటా రాజకీయాలకు పాల్పడుతోందని, రిజర్వేషన్ల మూల సిద్ధాంతాన్ని పరిశీలించాలని పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ చెబుతున్న అచ్ఛేదిన్ కోసం దేశం వేచిచూస్తోందని చెప్పారు. అగ్రవర్ణాలపై బీజేపీకి ఎలాంటి ప్రేమ లేదని, కేవలం కోటా అంశాన్ని రాజకీయం చేస్తోందన్నారు. విపక్షాల అభ్యంతరం అగ్రవర్ణాల పేదలకు పది శాతం రిజర్వేషన్ కల్పించే రాజ్యాంగ సవరణ బిల్లును తొలుత సెలెక్ట్ కమిటీకి పంపాలని డీఎంకే ఎంపీ కనిమొళి తీర్మానం ప్రవేశపెట్టగా పలు విపక్ష పార్టీలు మద్దతు పలికాయి. రాజ్యసభలో సంఖ్యా బలం కలిగిన కాంగ్రెస్, ఆర్జేడీ సహా పలు ప్రాంతాయ పార్టీలు కోటా బిల్లుపై అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు ఉద్దేశించిన రిజర్వేషన్ల వ్యవస్థకు ఈ బిల్లుతో విఘాతం కలుగుతుందని ఆర్జేడీ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. న్యాయస్ధానంలో బిల్లు నిలబడదని విపక్షాలు సందేహం వ్యక్తం చేశాయి. మరోవైపు లోక్‌సభలో బిల్లును ఆమోదించిన విపక్షాలు రాజ్యసభలో మోకాలడ్డుతూ ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నాయని బీజేపీ మండిపడింది. 95 శాతం మందికి ప్రయోజనం : బీజేపీ ప్రతి రాజకీయ పార్టీ జనరల్ కేటగిరిలోకి పేదలకు రిజర్వేషన్లు కల్పిస్తామని మేనిఫెస్టోల్లో చెబుతుంటే కేవలం నరేంద్ర మోదీ సర్కార్ మాత్రమే దీన్ని నెరవేర్చిందని బీజేపీ సభ్యుడు ప్రభాత్ ఝా పేర్కొన్నారు. మండల్ కమిషన్ నివేదికతో పాటు అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు సైతం జనరల్ కేటగిరిలోని పేదలకు రిజర్వేషన్లు వర్తింపచేయాలని కోరుకున్నారన్నారు. ఈ బిల్లు ద్వారా 95 శాతం మందికి ప్రయోజనం చేకూరుతుందన్నారు. -
కోటా బిల్లులో ఏముంది?
న్యూఢిల్లీ: ఈ 10 శాతం రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందితే 124వ రాజ్యాంగ సవరణ చట్టంగా పేర్కొంటారు. అధికరణ–15లోని నిబంధన(5) తరువాత నిబంధన (6)ను చేర్చుతారు. నిబంధన (6) ప్రకారం ఈ అధికరణలోని ఏ నిబంధన గానీ, అధికరణ–19లోని నిబంధన (1)లోని ఉప నిబంధన(జి) గానీ, అధికరణ–29లోని నిబంధన(2) గానీ రాజ్యం(ప్రభుత్వం) ఎ)ఆర్థికంగా వెనకబడిన వర్గాల(నిబంధన–4, నిబంధన–5లో ప్రస్తావించినవి కాకుండా) పురోగతికి ఏదైనా ప్రత్యేక నిబంధన రూపొందించడంలో గానీ ; బి) ఏదైనా ఆర్థిక వెనకబాటు వర్గాల(నిబంధన–4, నిబంధన–5లో ప్రస్తావించినవి కాకుండా) పురోగతికి వీలుగా ప్రయివేటు, ఎయిడెడ్, అన్ఎయిడెడ్ సహా విద్యా సంస్థల్లో.. ప్రస్తుత రిజర్వేషన్లకు అదనంగా గరిష్టంగా 10 శాతం రిజర్వేషన్ కల్పించేందుకు ఏదేనీ ప్రత్యేక నిబంధన రూపొందించడంలో గానీ నిరోధించజాలదు. అధికరణ–16లోని నిబంధన (5) తరువాత నిబంధన (6) చేర్చుతారు. నిబంధన (6) ఇలా ‘ప్రస్తుతం ఉనికిలో ఉన్న రిజర్వేషన్లకు అదనంగా.. ఆర్థికంగా బలహీనంగా ఉన్న వర్గాలకు ఉద్యోగ నియామకాల్లో గరిష్టంగా పది శాతం రిజర్వేషన్ కల్పించేందుకు వీలుగా రాజ్యం(ప్రభుత్వం) ఏదైనా ప్రత్యేక నిబంధన రూపొందించడాన్ని ఈ అధికరణలోని ఏ భాగమూ నిరోధించజాలదు..’ బిల్లు ఉద్దేశాలు; కారణాలు ప్రస్తుతం ఆర్థికంగా వెనకబడిన వర్గాల పౌరుల్లో అధిక భాగం ఉన్నత విద్య, ప్రభుత్వ ఉద్యోగాలకు దూరంగా మిగిలిపోయారు. ఆర్థిక వెనకబాటుతనం కారణంగా ఆర్థికంగా పుష్టి కలిగిన వారితో పోటీపడలేకపోతుం డటమే ఇందుకు కారణం. భారత రాజ్యాంగ అధికరణ 15లోని నిబంధన (4), నిబంధన (5), అధికరణ 16లోని నిబంధన (4) ద్వారా ప్రస్తుతం ఉనికిలో ఉన్న రిజర్వేషన్ ప్రయోజనాలు.. సామాజిక వెనుకబాటు, విద్యాపరమైన వెనుకబాటు తదితర నిర్ధిష్ట ప్రాతిపదిక గల వారికి తప్పితే ఈ ఆర్థికంగా వెనకబడిన వర్గాలకు అందుబాటులో లేవు. బలహీన వర్గాలు, నిర్ధిష్టంగా చెప్పాలంటే.. ఎస్సీ, ఎస్టీ ప్రజల విద్యా, ఆర్థిక ప్రయోజనాలు కాపాడేందుకు, సామాజికంగా అన్యాయానికి, ఏరకమైన దోపిడీకి వీరు గురికాకుండా రక్షించేందుకు వీలుగా ప్రత్యేక శ్రద్ధ చూపేందుకుగాను ప్రభుత్వానికి రాజ్యాంగంలోని 46వ అధికరణలోని ఆదేశిక సూత్రాలు అధికారాన్ని కల్పించాయి. అధికరణ –15లో 93వ రాజ్యాంగ సవరణ చట్టం–2005 ద్వారా నిబంధన (5)ను చేర్చారు. దీని ద్వారా సంక్రమించిన అధికారంతో ప్రభుత్వం సామాజికంగా, విద్యాపరంగా వెనకబడిన వర్గాల పౌరులకు, ఎస్సీ, ఎస్టీ ప్రజలకు, ఉన్నత విద్యలో ప్రవేశాలకు సంబంధించి వారికి చేయూత ఇచ్చేందుకు ప్రత్యేక నిబంధన రూపొందించేందుకు వీలు కలిగింది. అదే తీరుగా అధికరణ–16లో నిబంధన (4)ను చేర్చింది. దీని ద్వారా సంక్రమించించిన అధికారంతో ప్రభుత్వం ఏదేని వెనకబడిన తరగతులకు ఉద్యోగ రంగంలో తగిన ప్రాతినిథ్యం లేదని ప్రభుత్వం అభిప్రాయపడినప్పుడు, వారికి ఉద్యోగ నియామకాల్లో రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రత్యేక నిబంధన ఏర్పాటు చేయవచ్చు. అయినా, ఆర్థికంగా వెనకబడిన వర్గాల ప్రజలకు రిజర్వేషన్ ప్రయోజనాలు అందుకునేందుకు అర్హత లేదు. 46వ అధికరణలోని ఆదేశాలను పూర్తి చేయడానికి, ఆర్థికంగా వెనకబాటుకు గురైన వర్గాలకు ఉన్నత విద్యలో, ప్రభుత్వ ఉద్యోగాల్లో న్యాయమైన వాటా పొందేందుకు వీలుగా రాజ్యాంగ సవరణ చేయాలని నిర్ణయించడమైంది. ఆర్థికంగా వెనకబాటుకు గురైన వర్గాలకు ఉన్నత విద్యాసంస్థల (ప్రైవేటు విద్యా సంస్థలు, ఎయిడెడ్/అన్ ఎయిడెడ్ సహా, అధికరణ–30లో ప్రస్తావించినట్టుగా మైనారిటీ విద్యా సంస్థలు మినహాయించి)లో కోటా కల్పించేందుకు, ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించేందుకు రాజ్యాంగ (124వ సవరణ) బిల్లు–2019 ఉపయోపడుతుంది. ఈ ప్రయోజనాలన్నీ సాధించేందుకే ఈ బిల్లు. -
తర్జనభర్జన
మోర్తాడ్ (బాల్కొండ): స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల కేటాయింపుపై సర్కారు ఇంకా తేల్చడం లేదు. సామాజిక వర్గాల వారీగా లెక్కలు తేలిన రిజర్వేషన్లకు సంబంధించిన మార్గదర్శకాలు జారీ చేయలేదు. దీంతో ఆశావహుల్లో మాత్రం తీవ్ర ఉత్కంఠ నెలకొంది. పంచాయతీ ఎన్నికల్లో సామాజిక వర్గాల వారీగా కేటాయించే రిజర్వేషన్ల శాతాన్ని తేల్చినప్పటికీ, రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి చేయడానికి అవసరమైన మార్గదర్శకాల జారీలో సర్కారు జాప్యం చేస్తోంది. రిజర్వేషన్లపై స్పష్టత కరువైంది. దీంతో త్వరలో జరుగబోయే పంచాయతీ ఎన్నికల్లో ఏ పంచాయతీ ఏ సామాజిక వర్గానికి కేటాయిస్తారు, రిజర్వేషన్లను ఏ విధంగా ప్రకటిస్తారు అనే దానిపై ఆశావహులు తర్జనభర్జన పడుతున్నారు. కొత్త రిజర్వేషన్లే! గిరిజన తండాలను, ఆమ్లెట్ గ్రామాలను కొత్తగా పంచాయతీలుగా గుర్తించడంతో పంచాయతీల సంఖ్య పెరిగింది. నిజామాబాద్ జిల్లాలో 530 పంచాయతీలు, 4,932 వార్డులు ఉండగా, 6,69, 834 మంది ఓటర్లు ఉన్నారు. కామారెడ్డి జిల్లాలో 526 పంచాయతీలు, 4,642 వార్డుల్లో మొత్తం 5,13,204 మంది ఓటర్లు ఉన్నారు. అయితే, కొత్త పంచాయతీల ఏర్పాటు నేపథ్యంలో పంచాయతీ ఎన్నికలకు సంబంధించి గతంలోని రిజర్వేషన్లను పరిగణనలోకి తీసుకోకుండా కొత్తగా రిజర్వేషన్లను ప్రకటించాల్సి ఉంది. అయితే, పంచాయతీల్లో రిజర్వేషన్ల శాతం 50 శాతానికి మించకూడదని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. హైకోర్టు ఆదేశాలను పరిగణనలోకి తీసుకుని రిజర్వేషన్లు 50 శాతం ఉండేలా ప్రభుత్వం లెక్క తేల్చింది. బీసీలకు 23.81 శాతం, ఎస్సీలకు 20.46 శాతం, ఎస్టీలకు 5.73 శాతం రిజర్వేషన్లను కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే, ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలు మాత్రం జారీ చేయలేదు. అంతా గందరగోళం.. గిరిజన తండాలను ప్రభుత్వం పంచాయతీలుగా ఏర్పాటు చేసింది. అయితే, ప్రభుత్వం గతంలో జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం గిరిజన పంచాయతీలను పూర్తిగా ఆ సామాజిక వర్గానికే రిజర్వు చేయాల్సి ఉంది. ప్రభుత్వం గతంలో జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం రిజర్వేషన్లను ప్రకటిస్తే రిజర్వేషన్ల శాతం 50కి మించి పోతుంది. అయితే, హైకోర్టు మాత్రం రిజర్వేషన్ల శాతం 50కి మించకూడదని ఆదేశించింది. ఈ నేపథ్యంలో గిరిజన పంచాయతీల విషయంలో ప్రభుత్వం గతంలో తీసుకున్న నిర్ణయాన్ని పునరాలోచన చేయాల్సి ఉంటుందని రాజకీయ నిపుణులు చెబుతునఆరు. పంచాయతీల్లో సామాజిక వర్గాల వారీగా రిజర్వేషన్ల శాతాన్ని ప్రకటించినా గిరిజన పంచాయతీలకు శాశ్వత ప్రాతిపదికన రిజర్వేషన్లను ప్రకటించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల రిజర్వేషన్ల శాతం గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. పంచాయతీల రిజర్వేషన్ల విషయంలో గందరగోళం నెలకొనడంతోనే ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేయలేదని ప్రచారం జరుగుతోంది. స్పష్టత కరువు. అయితే, గిరిజన పంచాయతీలను మినహాయించి ఇతర పంచాయతీలలో రిజర్వేషన్లు ఏ మేరకు ఉండాలో నిర్ణయం తీసుకుని ప్రభుత్వం స్పష్టత ఇస్తేనే ఒక కొలిక్కి వచ్చే అవకాశముందని అభిప్రాయం వ్యక్తమవుతోంది. రాష్ట్ర స్థాయిలో ఖరారైన రిజర్వేషన్ల శాతం ప్రకారం ఏ జిల్లాకు ఎన్ని పంచాయతీలను ఏ సామాజిక వర్గానికి కేటాయించాలి అనే విషయంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. రిజర్వు చేసిన పంచాయతీల సంఖ్య ఏ జిల్లాకు ఎంత మేరకు కేటాయిస్తారో తేల్చిన తరువాత జిల్లాల్లో మండలాల వారీగా రిజర్వు పంచాయతీల సంఖ్యను నిర్ణయిస్తారు. ఆ తరువాత ఏ పంచాయతీ, ఏ సామాజిక వర్గానికి రిజర్వు చేస్తారు అనే విషయంపై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మొదట వంద శాతం గిరిజనేతర పంచాయతీలను మినహాయించి ఎస్సీ, ఎస్టీలకు పంచాయతీలను రిజర్వు చేసిన తరువాతనే బీసీ, జనరల్ స్థానాలను గుర్తించాలని ప్రభుత్వం సూచించింది. అయితే, ప్రభుత్వం మౌఖికంగానే సూచనలు చేస్తుండగా, వీటికి సంబంధించి ప్రత్యేక మార్గదర్శకాలను జారీ చేయట్లేలేదు. స్పష్టమైన మార్గదర్శకాలు చేస్తేనే రిజర్వేషన్ల ఆంశం కొలిక్కి రానుంది. చకచక ఏర్పాట్లు.. రిజర్వేషన్ల ఆంశం కొలిక్కి రాకపోయినప్పటికి, క్షేత్ర స్థాయిలో ఎన్నికల ఏర్పాట్లు వేగంగా సాగుతున్నాయి. ఇప్పటికే బ్యాలెట్ పత్రాల ముద్రణ పూర్తి కాగా, పోలింగ్ బూత్‌ల గుర్తింపు, పోలింగ్ అధికారులకు శిక్షణ తదితర కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఎన్నికల షెడ్యూల్ ఎప్పుడు ప్రకటించినా తాము మాత్రం ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. -
పార్లమెంట్లో మహిళా బిల్లు ప్రవేశపెట్టాలి
సాక్షి, హైదరాబాద్: మహిళా సాధికారతే తమ ధ్యేయమంటూ ఉపన్యాసాలిస్తున్న ప్రధాని నరేంద్రమోదీ మహిళల పట్ల మాత్రం చిన్నచూపు చూస్తున్నారని ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి ఆరోపించారు. మహిళలకు 33శాతం రిజర్వేషన్‌ను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఐద్వా ఆధ్వర్యంలో నగరంలోని నారాయణగూడ ఫ్లైఓవర్ కింద ఆందోళన చేపట్టారు. రోడ్డుపై బైఠాయించి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో కి.మీ మేర ట్రాఫిక్ స్తంభించిపోయింది. రంగంలోకి దిగిన అబిడ్స్ ఏసీపీ భిక్షంరెడ్డి, నారాయణగూడ ఇన్స్పెక్టర్ బండారి రవీందర్‌యాదవ్‌లు మహిళా సిబ్బందితో సభ్యులను తరలించే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంలో పోలీసులకు ఐద్వా సభ్యులకు మధ్య తోపులాట జరిగింది. బలవంతంగా వారిని వ్యాన్ ఎక్కించి అరెస్ట్ చేశారు. అనంతరం మల్లు లక్ష్మి మాట్లాడుతూ.. పార్లమెంట్లో మెజార్టీ ఉన్న బీజేపీ మహిళా బిల్లును ప్రవేశపెట్టడంలో చిత్తశుద్ధి చూపించడం లేదన్నారు. ఆందోళనలో ఐద్వా సభ్యురాలు జ్యోతి, ఉపాధ్యక్షురాలు కె.ఎన్.ఆశాలత, ఉపాధ్యక్షురాలు లక్ష్మమ్మ, రాష్ట్ర కమిటీ సభ్యురాలు స్వర్ణ, అరుణజ్యోతి, వినోద, నాగలక్ష్మి, శశికళ, లీలావతి, సృజన తదితరులు పాల్గొన్నారు. -
రిజర్వేషన్ల పెంపు బిల్లుకు అసెంబ్లీ ఆమోదం
-
ఇలాగైతే సాధికారత ఎలా?
మహిళా ప్రజాప్రతినిధుల సదస్సులో రాష్ట్రపతి న్యూఢిల్లీ: చట్టసభల్లో సరైన ప్రాతినిధ్యం లేకుండా మహిళా సాధికారత ఎలా సాధ్యమని రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ ప్రశ్నించారు. రెండు రోజులపాటు జరిగే మహిళా ప్రజాప్రతినిధుల మొట్టమొదటి జాతీయ సదస్సును శనివారం ఢిల్లీలో ప్రణబ్ ప్రారంభించారు. పార్లమెంట్, రాష్ట్రాల అసెంబ్లీల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌కు రాజ్యాంగ సవరణ బిల్లును ఆమోదించాల్సిన అవసరాన్ని ఆయన ప్రస్తావించారు. ప్రధాని మోదీ, దాదాపు 300 మంది మహిళా ఎంపీలు, ఎమ్మెల్యేలు, కేంద్రమంత్రులు, సీఎంలతో పాటు బంగ్లాదేశ్ స్పీకర్ శిరిన్ శర్మిన్ చౌదురీ ఇందులో పాల్గొన్నారు. పార్లమెంట్ సభ్యుల్లో మహిళా ప్రతినిధుల శాతం 12 శాతానికి మించడం లేదని అన్సారీ ఆవేదన వ్యక్తం చేశారు. యూపీఏ హయాంలో ఒకసభలో బిల్లు ఆమోదం పొందినా... మరొక దాంట్లో ఆమోదానికి నోచుకోలేదని చెప్పారు. రిజర్వేషన్ కల్పించకుండా రాజకీయ పార్టీలు మూడోవంతు సీట్లు మహిళలకు ఇస్తాయనుకోవడం అత్యాశే అవుతుందన్నారు. లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ ఆధ్వర్యంలో ‘జాతి నిర్మాణంలో మహిళా ప్రజాప్రతినిధుల పాత్ర’ ప్రధాన అంశంగా ఈ సదస్సు నిర్వహిస్తున్నారు. సాంఘిక, ఆర్థిక అభివృద్ధిలో భాగస్వామ్యంతో పాటు సుపరిపాలన, చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యంపై ఈ సమావేశంలో చర్చిస్తారు. స్వచ్ఛందంగా సీట్లు కేటాయించాలి: అన్సారీ సదస్సులో ఉపరాష్ట్రపతి అన్సారీ మాట్లాడుతూ.. రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందేవరకూ పార్టీలు స్వచ్ఛందంగా మహిళలకు కోటా పెంచాలని కోరారు. 2014 ఎన్నికల్లో జాతీయపార్టీలు కేవలం 146 మంది మహిళలకు టికెట్లిచ్చాయని, మొత్తం సీట్లలో 9.17 శాతం మాత్రమే కేటాయించారన్నారు. ఆర్థిక, అంచనాలు, రక్షణ, హోం శాఖ వ్యవహారాలపై ఏర్పాటైన కమిటీల్లో 124 మంది సభ్యులుండగా కేవలం ఆరుగురే మహిళలు ఉండడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అనారోగ్య కారణాలతో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఈ సదస్సుకు హాజరుకాలేదు.