న్యూఢిల్లీ: చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం మరింత పెరగాలన్న సంకల్పంతోనే మహిళా రిజర్వేషన్ బిల్లు ‘నారీశక్తి వందన్ అధినియమ్’ను తీసుకొచ్చినట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం పార్లమెంట్‌లో ఉద్ఘాటించారు. మహిళా రిజర్వేషన్ బిల్లుతో భారత ప్రజాస్వామ్యం మరింత బలోపేతం అవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
పార్లమెంట్ ఉభయ సభల్లో బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించాలని ఆయన ఈ సందర్భంగా పార్లమెంట్ సభ్యులకు విజ్ఞప్తి చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం పార్లమెంట్ నూతన భవనంలో లోక్‌సభలో మొదటి సెషన్‌లో తొలిసారిగా ప్రసంగించారు. సమాజం ప్రభావవంతంగా పరివర్తన చెందడం వెనుక రాజకీయాల పాత్రను వివరించారు. ఆధునిక యుగంలో మహిళలు ముందంజ వేస్తున్నారని ప్రశంసించారు. అంతరిక్షం నుంచి క్రీడల దాకా, స్టార్టప్ కంపెనీల నుంచి స్వయం సహాయ సంఘాల దాకా అన్ని రంగాల్లో వారు కీలకపాత్ర పోషిస్తున్నారని చెప్పారు. పార్లమెంట్‌లో ప్రధాని ఇంకా ఏం మాట్లాడారంటే..
‘మహిళల సారథ్యంలో అభివృద్ధి’
‘‘నారీశక్తి వందన్ అభియాన్‌ను ప్రభుత్వం తీసుకొచ్చిన సందర్భంగా మన తల్లులకు, సోదరీమణులకు, బిడ్డలకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నా చట్టంగా మార్చడానికి కట్టుబడి ఉన్నామని మహిళలకు హామీ ఇస్తున్నా. ఈ బిల్లుతో మన ప్రజాస్వామ్యం మరింత బలం పుంజుకుంటుంది. ‘మహిళల సారథ్యంలో అభివృద్ధి’ అనే విధానాన్ని మనం అనుసరిస్తున్నాం.
జీ20 శిఖరాగ్ర సదస్సులో ప్రపంచ దేశాలు ఈ విధానాన్ని ప్రశంసించాయి. అన్ని రంగాల్లో మహిళల భాగస్వామ్యం నానాటికీ ఇనుమడిస్తోంది. ప్రభుత్వ విధాన నిర్ణయాల రూపకల్పనలోనూ వారి భాగస్వామ్యం పెరగాలి. తద్వారా దేశ అభివృద్ధిలో వారి పాత్ర, సహకారం పెరుగుతుంది. ఈ చారిత్రక దినాన మహిళామణుల కోసం అవకాశాల ద్వారాలు తెరవాలని ఎంపీలను కోరుతున్నా.
శుభప్రదమైన ప్రారంభానికి శ్రీకారం
మహిళల సారథ్యంలో ప్రగతి అనే తీర్మానాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తున్నాం. ఇందులో భాగంగా రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెడుతున్నాం. లోక్‌సభ, రాష్ట్రాల శాసనసభల్లో మహిళల భాగస్వామ్యాన్ని విస్తృత పర్చడమే ఈ బిల్లు ముఖ్య ఉద్దేశం. శుభప్రదమైన ప్రారంభానికి శ్రీకారం చుడుతున్నాం. మహిళా రిజర్వేషన్ బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించాలని పార్లమెంట్ సభ్యులందరికీ నా విజ్ఞప్తి.
మహిళా రిజర్వేషన్ బిల్లుపై చాలా ఏళ్లపాటు ఎన్నో చర్చలు, సంవాదాలు, సంప్రదింపులు జరిగాయి. బిల్లు చుట్టూ వివాదాలు ఏర్పడ్డాయి. పార్లమెంట్‌లో బిల్లును ఆమోదించడానికి చాలా ప్రయత్నాలు జరిగాయి. మొట్టమొదటిసారిగా 1996లో ఈ బిల్లును ప్రవేశపెట్టారు. అటల్ బిహారీ వాజ్‌పేయి హయాంలో పలు సందర్భాల్లో బిల్లును ప్రవేశపెట్టినప్పటికీ అంకెలు సహకరించకపోవడంతో ఆమోదం పొందలేదు. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు అనే స్వప్నం నెరవేరలేదు.
లక్ష్మణ రేఖ దాటొద్దు
పార్లమెంట్‌లో కొత్త భవనంలో కొలువుదీరాం. ఎంపీలందరూ పాత చేదు అనుభవాలను, జ్ఞాపకాలను మర్చిపోవాలి. నూతన అధ్యయాన్ని ప్రారంభించాలి. కొత్త భవనంలో ఎంపీలు చేసే ఏం చేసినా సరే అది దేశ పౌరులకు స్ఫూర్తిదాయకంగా ఉండాలి. పార్లమెంట్ సమావేశా లను ప్రజలు ప్రత్యక్షంగా తిలకిస్తున్నారు. సభ్యులు అధికార పక్షంలో ఉంటారా? లేక ప్రతిపక్షంలో ఉంటారా? అనేది వారి ప్రవర్తనే నిర్దేశిస్తుంది.
పార్లమెంట్ సంప్రదాయాలను సభ్యులంతా పాటించాలి. లక్ష్మణ రేఖ దాటకుండా జాగ్రత్తపడాలి. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా మనమంతా కలిసికట్టుగా పనిచేయాలి. ఈ పార్లమెంట్ ఏర్పాటైంది కేవలం దేశ ప్రగతి కోసమే తప్ప ఏదో ఒక రాజకీయ పార్టీ ప్రయోజనం కోసం కాదు. దేశానికి సేవలందించే విషయంలో పార్లమెంట్ స్థానం అత్యున్నతం. పార్లమెంట్ కొత్త భవనం 140 కోట్ల మంది భారతీయుల ఆకాంక్షలకు ప్రతిబింబం.
ఇంజనీర్ల, శ్రామికుల శ్రమతోనే ఈ భవనం రూపుదిద్దుకుంది. 30 వేల మందికిపైగా కారి్మకులు స్వేదం చిందించారు. వారి వివరాలతో డిజిటల్ బుక్ తీసుకొచ్చాం. పవిత్ర ‘సెంగోల్’ను పార్లమెంట్ నూతన భవనంలో ప్రతిష్టించుకున్నాం. భారత తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ ఈ సెంగోల్‌ను స్వీకరించారు. ఎన్నో ఘట్టాలు సెంగోల్‌తో ముడిపడి ఉన్నాయి’’ అని ప్రధానమంత్రి మోదీ వివరించారు.
చరిత్రలో నిలిచిపోతుంది
మహిళలకు హక్కులు కల్పించడం, వాటిని కాపాడడం, వారి శక్తిసామర్థ్యాలను ఉపయోగించుకోవడం వంటి గొప్ప పనుల కోసం భగవంతుడు నన్ను ఎన్నుకున్నాడేమో! అందుకే ఆ దిశగా మన ప్రభుత్వం అడుగు ముందుకేసింది. మహిళా రిజర్వేషన్ బిల్లుకు మంత్రివర్గం నిన్న(సోమవారం) ఆమోదముద్ర వేసింది. ఈ రోజు(సెప్టెంబర్ 19) చరిత్రలో నిలిచిపోతుంది. ఏ దేశ అభివృద్ధి ప్రయాణంలోనైనా చరిత్రను సృష్టించే సమయం వస్తుంది. అలాంటి సమయం ఇప్పుడు భారత్‌కు వచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment