
న్యూఢిల్లీ, సాక్షి: పాకిస్థాన్ పౌరుల విషయంలో కేంద్ర ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసింది. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా(Amit Shah) అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు శుక్రవారం ఫోన్ చేశారు. పాక్ పౌరుల్ని గుర్తించి తక్షణమే వెనక్కి పంపాలని ఆదేశించినట్లు సమాచారం.
పహాల్గం ఉగ్రదాడి తర్వాత పాకిస్థానీయుల వీసాలు కేంద్రం రద్దు చేసిన సంగతి తెలిసిందే. వారం లోపు దేశం విడిచిపోవాలంటూ ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలోనే తాజాగా రాష్ట్రాలను కేంద్ర హోం శాఖ మరోమారు అప్రమత్తం చేసింది. మరోవైపు వివిధ రాష్ట్రాల్లో ఉన్న పాకిస్థానీయులపై పోలీసులు నజర్ వేశారు.
పాక్ పౌరులకు సంబంధించిన వివరాలను పోలీసులు ఆరా తీస్తున్నారు. హైదరాబాద్ స్పెషల్ బ్రాంచ్‌లో 208 మంది పాకిస్తానీయులు నమోదు అయినట్లు తెలుస్తోంది. వీరిలో లాంగ్ టర్మ్ వీసా ఉన్నవాళ్లు 156 మంది.. షార్ట్ టర్మ్ వీసా కలిగిన వారు 13 మంది ఉన్నట్లు తేలింది. వీళ్లను రెండు రోజుల్లో వెళ్లిపోవాలని పోలీసులు సూచించినట్లు సమాచారం.
నల్లరిబ్బన్‌లతో నమాజ్‌కు..
పహల్గాం ఉగ్రదాడిని ఖండిస్తూ.. మృతుల కుటుంబాలకు సంఘీభావం తెలుపుతూ మక్కా మసీదులో నల్ల రిబ్బన్లతో ముస్లింలు నమాజ్‌కు హాజరయ్యారు. మరోవైపు.. శాస్త్రిపురంలోని ఒక మసీదులో ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ నమాజ్ కోసం వచ్చిన వాళ్లకు నల్లటి రిబ్బన్ పంపిణీ చేశారు.