
న్యూఢిల్లీ: పరువు నష్టం కేసులో సామాజిక కార్యకర్త మేధా పాట్కర్‌ను శుక్రవారం ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా(VK Saxena) సుమారు 24 ఏళ్ల కిందట దాఖలు చేసిన కేసులో ఈ పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం. అంతకుముందు, ఈ కేసుకు సంబంధించిన ప్రొబేషన్ బాండ్ అమలు ప్రక్రియను రెండు వారాల పాటు నిలిపివేయాలన్న పాట్కర్ విజ్ఞప్తిని ఢిల్లీ హైకోర్టు తిరస్కరించిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో క్రవారం నిజాముద్దీన్‌లోని ఆమె నివాసానికి చేరుకున్న పోలీసుల బృందం ఆమెను అదుపులోకి తీసుకుంది. మేధా పాట్కర్ అరెస్ట్‌ను సౌత్‌ఈస్ట్ డీసీపీ రవి కుమార్ సింగ్ ధృవీకరించారు. మధ్యాహ్నం ఆమెను సాకేత్ కోర్టులో పోలీసులు ప్రవేశపెట్టే అవకాశం ఉంది.
ఇదిలా ఉంటే.. ఈ కేసుకు సంబంధించి రెండు రోజుల కిందటే ఢిల్లీ సాకేత్ కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్‌ను జారీ చేసింది. ఈ కేసులో న్యాయ స్థానం నుంచి మేధా పాట్కర్ తప్పించుకునే ప్రయత్నం చేస్తోందని, కోర్టు ఆదేశాలను ఆమె ఉల్లంఘించారని, ప్రొబేషన్ బాండ్ సమర్పించలేదని, రూ. లక్ష జరిమానా చెల్లించలేదంటూ వారెంట్‌లో పేర్కొంది.
నర్మదా బచావో ఆందోళన్‌కు వ్యతిరేకంగా ప్రకటనలు ప్రచురించారనే ఆరోపణలపై వినయ్ కుమార్ సక్సేనా(VK Saxena)పై ఆమె అప్పట్లో కేసు వేశారు. అప్పుడు ఆయన అహ్మదాబాద్ కేంద్రంగా ఉన్న ‘నేషనల్ కౌన్సిల్ ఫర్ సివిల్ లిబర్టీస్’ అనే ఎన్జీవోకు చీఫ్‌గా ఉన్నారు. ఆ సమయంలో గుజరాత్ ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన సర్దార్ సరోవర్ ప్రాజెక్టుకు సక్సేనా మద్దతు ఇచ్చారు. అయితే ఓ టీవీ ఛానెల్ ఇంటర్వ్యూలో తనను కించపరిచేలా వ్యాఖ్యలు చేయడంతోపాటు పరువునష్టం కలిగించేలా పత్రికా ప్రకటన జారీ చేశారని ఆరోపిస్తూ పాట్కర్‌పై వీకే సక్సేనా సైతం రెండు కేసులు దాఖలు చేశారు.

సక్సేనా పిరికిపంద అని, హవాలా లావాదేవీల్లో ఆయన హస్తం ఉందని ఆరోపించారామె. నవంబర్ 5, 2000 సంవత్సరంలో మేధా పాట్కర్ వీకే సక్సేనాపై వ్యాఖ్యలు చేయగా.. పరువు నష్టం దావా వేశారు. ఈ కేసులో ఆమె వేసిన పిటిషన్‌ను కోర్టు తోచ్చింది. అంతేకాదు.. కిందటి ఏడాది జులై1వ తేదీన ఆమె ఐదు నెలల జైలు శిక్ష విధిస్తూ తీర్పు కూడా ఇచ్చింది. అయితే అదే నెల ఆఖరులో ఆ శిక్షను రద్దు చేస్తూ పలు షరతుల మీద న్యాయమూర్తి మేధా పాట్కర్‌కు బెయిల్ మంజూరు చేశారు. అయితే ఆ షరతులను ఉల్లంఘించడంతోనే కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.