గిరిజన రైతుల అరెస్టులపై విచారణకు డిమాండ్
వెంటనే సహాయం అందించి రక్షణ కల్పించాలనే విజ్ఞప్తులు
ఆదివారం ఢిల్లీకి చేరుకున్న బాధిత కుటుంబాల సభ్యులు
నేడు జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్.. మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేయనున్న బాధితులు
సాక్షి, న్యూఢిల్లీ/బొంరాస్‌పేట: సీఎం రేవంత్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గం లగచర్లలో అధికారులపై దాడి, గిరిజన రైతుల అరెస్టుల అంశం ఢిల్లీకి చేరింది. రైతుల అరెస్టులపై తక్షణమే విచారణ జరిపించాలని... బాధితులకు వెంటనే సహాయం అందించి, రక్షణ కల్పించాలంటూ ఇప్పటికే జాతీయ ఎస్సీ, ఎస్టీ, బీసీ కమిషన్లకు ఆన్‌లైన్ ద్వారా 19 ఫిర్యాదులు అందాయి.
అంతేకాదు నేరుగా ఈ కమిషన్లతోపాటు మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్సీ)కు ఫిర్యాదు చేసేందుకు కొందరు లగచర్ల బాధితులు, కుటుంబ సభ్యులు ఆదివారమే ఢిల్లీకి చేరుకున్నారు. సోమవారం జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్, ఎన్‌హెచ్‌ఆర్సీలను కలసి.. సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం, పోలీసులపై ఫిర్యాదు చేయనున్నారు. బాధితులకు మద్దతుగా బీఆర్‌ఎస్ మాజీ మంత్రి సత్యవతిరాథోడ్, ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్, ఎమ్మెల్యేలు కోవ లక్ష్మి, అనిల్‌జాదవ్ కూడా ఢిల్లీకి వెళ్లారు.
పోలీసులు వేధిస్తున్నారంటూ ఆందోళన
వికారాబాద్ జిల్లా దుద్యాల్ మండలంలో ఫార్మా విలేజీ కోసం రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ చేపట్టింది. తాము భూములు ఇవ్వబోమంటూ అక్కడి గిరిజన రైతులు కొంతకాలం నుంచి ఆందోళన చేస్తున్నారు. ఇటీవల భూసేకరణ అంశంపై గ్రామసభ నిర్వహించేందుకు అధికారులు వెళ్లగా.. స్థానికులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో కొందరు కలెక్టర్, అధికారులపై దాడికి దిగారు. ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన పోలీసులు.. మూడు కేసులు నమోదు చేసి, 20 మందికిపైగా అరెస్టు చేశారు.
మరికొందరి కోసం గాలింపు జరుపుతున్నారు. అయితే పోలీసులు తమ పట్ల అమానుషంగా వ్యవహరిస్తున్నారని గిరిజన కుటుంబాలు ఆరోపిస్తున్నాయి. తమ భూము లు కోల్పోతామేమోనన్న భయంతోనే నిరసన వ్యక్తం చేశామని చెబుతున్నాయి. కానీ పోలీసులు అర్ధరాత్రి గ్రామానికి విద్యుత్ సరఫరా ఆపేసి మరీ, ఇళ్లపై దాడి చేశారని బాధిత కుటుంబాల వారు ఆరోపిస్తున్నారు.
తమ వారిని తీవ్రంగా కొట్టి అరెస్టు చేశారని.. మహిళలను కూడా వేధించారని పేర్కొంటున్నారు. ఈ అంశంలో కల్పించుకుని తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. సోమవారం ఎస్సీ, ఎస్టీ, మానవ హక్కుల కమిషన్లకు ఈ అంశాలపై ఫిర్యాదులు చేయనున్నారు.
నేడు లగచర్లకు ఎస్టీ కమిషన్ జాతీయ సభ్యుడి రాక
కొడంగల్ రూరల్: లగచర్ల, ఫార్మా విలేజీ ప్రతిపాదిత ప్రాంతాల్లో సోమవారం ఉదయం 10 గంటలకు ఎస్టీ కమిషన్ జాతీయ సభ్యుడు హుస్సేన్ నాయక్, గిరిజన మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కల్యాణ్‌నాయక్, ఎంపీలు కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, డీకే అరుణ, బీజేపీ జిల్లా అధ్యక్షుడు మాధవరెడ్డి పర్యటించనున్నట్లు గిరిజన మోర్చా నేతలు తెలిపారు. వారు బాధిత కుటుంబాలకు భరోసా ఇవ్వడంతోపాటు, గిరిజనుల అభిప్రాయాలు తెలుసుకుంటారని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment