Medha Patkar
-
హైదరాబాద్‌లో ప్రత్యక్షమైన మేధా పాట్కర్
హైదరాబాద్, సాక్షి: ప్రముఖ సామాజిక కార్యకర్త మేధా పాట్కర్ హఠాత్తుగా నగరంలో ప్రత్యక్షమయ్యారు. ఛాదర్‌ఘాట్ సమీపంలోని ఓ ఇంటికి ఆమె చేరుకోగా.. పోలీసులు అప్రమత్తమై ఆమెను అడ్డుకున్నారు. మూసీ సుందరీకరణ ప్రాంతానికి ఆమె వెళ్తారనే సమాచారంతో పోలీసులు ఆమె బస చేసిన ఇంటికి భారీగా చేరుకున్నారు. అయితే ఆమె స్నేహితుల ఇంటికి వచ్చానని చెప్పడం గమనార్హం. అయినప్పటికీ ఆమెను అదుపులోకి తీసుకుని.. అక్కడి నుంచి పంపించేసినట్లు సమాచారం. -
మేధా పాట్కర్‌కు 5 నెలల జైలు
న్యూఢిల్లీ: సామాజిక వేత్త, నర్మదా బచావో ఉద్యమకారిణి మేధా పాట్కర్‌కు ఢిల్లీ కోర్టు సోమవారం ఐదు నెలల సాధారణ కారాగార శిక్ష విధించింది. గుజరాత్‌లోని ఒక ఎన్జీవోకు సారథి, ప్రస్తుత ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా 23 ఏళ్ల క్రితం పాట్కర్‌పై వేసిన కేసులో ఆమెను దోషిగా తేలుస్తూ గత నెల ఏడో తేదీన ఢిల్లీ మెట్రోపాలిటన్ మేజి్రస్టేట్ తీర్పు చెప్పారు. అయితే శిక్ష ఖరారును రిజర్వ్‌చేసి సోమవారం తీర్పును వెలువరించారు. పరువునష్టం కింద సక్సేనాకు రూ.10 లక్షల జరిమానా చెల్లించాలని పాట్కర్‌ను కోర్టు ఆదేశించింది. తీర్పును పాట్కర్ పై కోర్టులో సవాల్ చేసుకునేందుకు అవకాశం కలి్పస్తూ నెలరోజులపాటు శిక్ష అమలును నిలిపివేస్తూ న్యాయమూర్తి రాఘవ్ శర్మ ఉత్తర్వులిచ్చారు. అయితే శిక్ష ప్రస్తుతానికి నిలుపుదల చేసిన నేపథ్యంలో తనకు బెయిల్ ఇవ్వాలని పాట్కర్ కోర్టులో పిటిషన్ దాఖలుచేశారు. ఆనాడు సక్సేనాను పిరికిపంద అంటూ పాట్కర్ దూషించిన అంశం కోర్టులో రుజువుకావడంతో ఆమెను దోషిగా తేల్చారు. హవాలా లావాదేవీల్లో సక్సేనా హస్తముందంటూ పాట్కర్ చేసిన ఆరోపణల్లో నిజంలేదని, పాట్కర్ కారణంగా ఆయన పరువుకు నష్టం కలిగిందని కోర్టు అభిప్రాయపడిన విషయం విదితమే. 2000 సంవత్సరంలో అహ్మదాబాద్ కేంద్రంగా పనిచేసే ‘కౌన్సిల్ ఫర్ సివిల్ లిబరీ్టస్’ అనే స్వచ్ఛంద సంస్థకు వీకే సక్సేనా అధ్యక్షునిగా ఉండేవారు. తనకు, నర్మదా బచావో ఆందోళన్ ఉద్యమానికి వ్యతిరేకంగా సక్సేనా ప్రకటనలు ఇచ్చారని ఆయనపై పాట్కర్ తొలిసారిగా ఫిర్యాదుచేశారు. -
పరువు నష్టం కేసు.. మేధాపాట్కర్ను దోషిగా తేల్చిన కోర్టు
న్యూఢిల్లీ: ‘నర్మదా బచావో’ ఆందోళన్ ఉద్యమానికి నాయకత్వం వహించిన మేధాపాట్కర్ను పరువు నష్టం కేసులో ఢిల్లీ కోర్టు దోషిగా తేల్చింది. ఈకేసులో ఆమెకు రెండేళ్ల జైలు శిక్ష లేదా జరిమానా లేదంటే రెండూ విధించే అవకాశం ఉంది. పాట్కర్ దోషిగా తేలిన పరువు నష్టం కేసును ప్రస్తుత ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా గతంలో ఫైల్ చేశారు. అప్పట్లో సక్సేనా అహ్మదాబాద్ కేంద్రంగా పనిచేసే ఎన్జీవో నేషనల్ కౌన్సిల్ ఫర్ సివిల్ లిబర్టీస్‌కు నేతృత్వం వహించేవారు. పాట్కర్ గుజరాత్లో ‘నర్మదా బచావో’ ఆందోళన్‌కు నాయకత్వం వహించేవారు.ఈ క్రమంలోనే పాట్కర్, సక్సేనా ఒకరిపై ఒకరు తరచూ కోర్టులకెక్కేవారు. తనపై పాట్కర్ అనుచిత వ్యాఖ్యలు చేశారని సక్సేనా క్రిమినల్ డిఫమేషన్ కేసు దాఖలు చేశారు. ఈ కేసులోనే ప్రస్తుతం ఢిల్లీ సాకేత్ కోర్టు పాట్కర్‌ను దోషిగా తేల్చింది. -
కౌలు రైతులకూ సంక్షేమ ఫలాలు అందాలి
సాక్షి, అమరావతి: ‘దేశంలో మరెక్కడా లేనివిధంగా ఆంధ్రప్రదేశ్‌లో పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. అవి నిరుపేదలకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. భూమినే నమ్ముకొన్న కౌలు రైతులకు కూడా అవి పూర్తి స్థాయిలో అందాలి. ఈ విషయమై త్వరలో ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిసి వివరిస్తాను’ అని ప్రజా ఉద్యమాల జాతీయ వేదిక నాయకురాలు మేధా పాట్కర్ చెప్పారు. రైతు స్వరాజ్య వేదిక ఆధ్వర్యంలో విజయవాడలో కౌలు రైతుల సమస్యలపై నిర్వహించిన సదస్సులో ఆమె మాట్లాడారు. ఆత్మహత్యలకు పాల్పడే రైతుల్లో 90 శాతం కౌలు రైతులేనని చెప్పారు. విజయ్ మాల్యా లాంటి వారు వేల కోట్లు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోతుంటే భూమినే నమ్ముకున్న రైతులు మాత్రం అప్పుల ఊబిలో కూరుకుపోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు. ప్రకృతి, నేలపై ఆధారపడి జీవించే వారిని ఆదుకోకపోతే అధోగతి తప్పదని చెప్పారు. దేశంలో సంపన్నుల ఆస్తులు రోజురోజుకు పెరుగుతున్నాయని, రైతులు మాత్రం భూములమ్ముకొని కూలీలుగా మారిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దశాబ్దాలుగా రైతుల సాగులో ఉన్న భూములు కార్పొరేట్ శక్తుల చేతుల్లోకి వెళ్లిపోతున్నాయని, అటవీ భూములనూ వదలడంలేదని తెలిపారు. మోదీ సర్కారు చట్టాలు అమలులో మాయ చేస్తోందన్నారు. పంటలకు గిట్టుబాటు ధర ఇవ్వాలని, దేశవ్యాప్తంగా రుణ విముక్తి, కనీస మద్దతు ధరల చట్టాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఆ ఒక్క సంతకం వల్ల కౌలు రైతులు నష్టపోతున్నారు 2019 లో తెచ్చిన పంట సాగుదారు హక్కుల చట్టాన్ని సమర్ధవంతంగా అమలు చేయకపోవడం వల్ల కౌలు రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని చెప్పారు. భూ యజమాని సంతకం చేస్తేనే కౌలుదారులకు పంట సాగుదారు హక్కు పత్రం (సీసీఆర్సీ) ఇస్తున్నారని తెలిపారు. కానీ 90 శాతం భూయజమానులు సీసీఆర్సీలపై సంతకం చేయడంలేదన్నారు. ఈ కారణంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వైఎస్సార్ రైతు భరోసా, ఉచిత పంటల బీమా, పంట నష్టపరిహారం వంటి సంక్షేమ ఫలాలు కౌలుదారులకు అందడం లేదని వివరించారు. ఈ ఫలాలన్నీ సాగు చేయని భూ యజమానుల ఖాతాల్లో జమ అవుతున్నాయని తెలిపారు. అందువల్ల వారికి భూ యజమాని సంతకంతో సంబంధం లేకుండా క్షేత్రస్థాయి అధికారుల సిఫారసుతో సీసీఆర్సీ కార్డులు ఇవ్వాలని కోరారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కౌలు రైతులకు న్యాయం చేయాలన్నారు. సచివాలయ వ్యవస్థ ద్వారా గ్రామ స్థాయిలోనే ధ్రువీకరించి కౌలు రైతులకు సీసీఆర్సీ కార్డులివ్వాలని మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు డిమాండ్ చేశారు. దేవదాయ, ఈనాం, వక్ఫ్, ఎస్సీ కార్పొరేషన్ నుంచి లీజుకు తీసుకుని సాగు చేస్తున్న కౌలుదారులకు సీసీఆర్సీ కార్డులు ఇవ్వాలని అఖిల భారత వ్యవసాయ, గ్రామీణ కార్మికుల సంఘం జాతీయ కార్యదర్శి పీఎస్ అజయ్‌కుమార్ డిమాండ్ చేశారు. సదస్సుకు అధ్యక్షత వహించిన రైతు స్వరాజ్య వేదిక నాయకులు విస్సా కిరణ్‌కుమార్ రాష్ట్రంలోని 12 జిల్లాలో 4,154 మంది కౌలు రైతులను సర్వే చేసినట్టు చెప్పారు. రాష్ట్రంలో 16 లక్షల మంది కౌలుదారులుంటే, 5.47లక్షల మందికి (8.8 శా తం) మాత్రమే సీసీఆర్సీ కార్డులిచ్చారని తెలిపారు. కౌలు రైతుల హక్కుల పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై ఏడు తీర్మానాలు చేశారు. -
ఆదివాసీ హక్కులకోసం జాతీయ స్థాయి ఉద్యమం
సుందరయ్యవిజ్ఞానకేంద్రం: ఆదివాసీల హక్కుల పరిరక్షణ కోసం రైతు ఉద్యమం తరహాలో జాతీయస్థాయి ఉద్యమం చేయనున్నట్లు పర్యావరణ వేత్త మేధా పాట్కర్ తెలిపారు. ఆదివాసీ, రైతు ప్రజాసంఘాల ఆధ్వర్యంలో సుందరయ్య విజ్ఞానకేంద్రంలో శనివారం సమా వేశం జరిగింది. ఈ సందర్భంగా మేధాపాట్కర్ మాట్లాడుతూ... అటవీ భూములను కార్పొరేట్లకు కట్టబెట్టే విధంగా నూతన చట్టాన్ని తెచ్చారని, దీనివల్ల పోడు భూములపై గిరిజనులకు హక్కులేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. పీపీఐఎంఎల్ న్యూడెమొక్రసీ రాష్ట్ర నాయకులు వేములపల్లి వెంకట్రామయ్య మాట్లాడుతూ.... అడవుల నుంచి గిరిజనులను నెట్టేసేందుకు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కుట్రలు చేస్తోందని విమర్శించారు. ఆదివాసీ అధికార్ రాష్ట్రీయ మంచ్ జాతీయ నాయకులు, మాజీ ఎంపీ మిరియం బాబూరావు మాట్లాడుతూ... గిరిజనులకు తీవ్ర నష్టం చేసే అటవీ హక్కుల నూతన చట్టాన్ని ఉపసంహరించుకోవాలన్నారు. -
కాంగ్రెస్ పని ఖతం.. వాళ్లను సీరియస్‌గా తీసుకోవద్దు..
అహ్మదాబాద్: ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న గుజరాత్లో రెండో రోజు పర్యటిస్తున్నారు అరవింద్ కేజ్రీవాల్. అహ్మదాబాద్‌లోని టౌన్హాల్లో పారిశుద్ధ్య కార్మికులతో సమావేశమయ్యారు. అనంతరం మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. ఈ క్రమంలో పంజాబ్ ప్రభుత్వం ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని స్థితిలో ఉన్నప్పటికీ.. గుజరాత్లో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రచారం కోసం కోట్ల రూపాయలు వెచ్చిస్తోందని వచ్చిన ఆరోపణలపై ఓ మీడియా ప్రతినిధి కేజ్రీవాల్‌ను ప్రశ్నించారు. దీనికి ఆయన స్పందిస్తూ ఈ ప్రశ్న ఎవరు అడిగారని ఎదురు ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ నాయకుడని మీడియా ప్రతినిధి బదులిచ్చారు. దీనిపై రియాక్ట్ అయిన కేజ్రీవాల్.. కాంగ్రెస్ పని ఖతమైపోయిందని అన్నారు. ఆ పార్టీ నాయకులు అడిగే ప్రశ్నలను ఎవరూ పట్టించుకోరని మీడియా కూడా సీరియస్‌గా తీసుకోవద్దని సూచించారు. అంతేకాదు గుజరాత్లో బీజేపీకి ప్రత్యామ్నాయం ఆమ్ ఆద్మీ పార్టీనే అని కేజ్రీవాల్ ధీమాగా చెప్పారు. గుజరాత్ ఓటర్లు బీజేపీపై విముఖతతో ఉన్నారని, అలాగే వారు కాంగ్రెస్‌కు కూడా ఓటు వేయాలని అనుకోవడం లేదని చెప్పారు. కాంగ్రెస్‌కు ఓటు వేసి ప్రజలు తమ ఓటు హక్కును వృథా చేసుకోవద్దన్నారు. ఆప్ వైపే అందరూ చూస్తున్నారని పేర్కొన్నారు. అలాగే సామాజిక కార్యకర్త మేధా పాట్కర్‌ను గుజరాత్ సీఎం చేయాలని ఆప్ చూస్తోందని బీజేపీ చేసిన ఆరోపణలపైనా కేజ్రీవాల్ తనదైన శైలిలో స్పందించారు. నరేంద్ర మోదీ తర్వాత సోనియా గాంధీని ప్రధాని చేయాలని బీజేపీ ప్లాన్ చేస్తోందని తాను ఆరోపిస్తున్నానని, బీజేపీ దీనిపై ఏమంటుందని ప్రశ్నించారు. చదవండి: బెంగాల్లో తీవ్ర ఉద్రిక్తత.. పోలీసులు, బీజేపీ శ్రేణులకు మధ్య ఘర్షణ -
రైతు ఉద్యమం తరహాలో విశాఖ ఉక్కు పోరు
సాక్షి, విశాఖపట్నం: ప్రభుత్వ రంగం మొత్తాన్ని మోదీ ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తులకు కట్టబెడుతోందని జాతీయ ప్రజా ఉద్యమ ప్రతినిధి మేధా పాట్కర్ నిప్పులు చెరిగారు. అందులో భాగంగానే ప్రజల సంపద అయిన విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటీకరించాలని నిర్ణయించారని మండిపడ్డారు. మోదీ ప్రభుత్వం జాతి సంపదను అత్యంత చౌకగా కార్పొరేట్ సంస్థలకు, ప్రైవేట్ వ్యక్తులకు అప్పగిస్తోందని దుయ్యబట్టారు. రైతు ఉద్యమం తరహాలో విశాఖ ఉక్కు ఉద్యమాన్ని దేశవ్యాప్తంగా నడపాల్సిన అవసరం ఉందన్నారు. ఐక్య ఉద్యమాలే దేశ పాలకులు తమ నిరంకుశ నిర్ణయాలను వెనక్కి తీసుకునేలా చేస్తాయన్నారు. ఐక్య ఉద్యమాలను బలోపేతం చేయడం ప్రజలందరి కర్తవ్యమని తెలిపారు. విశాఖపట్నం కూర్మన్నపాలెంలో స్టీల్‌ప్లాంట్ కార్మికుల నిరాహార దీక్షా శిబిరాన్ని శనివారం సందర్శించి మద్దతు తెలిపిన మేధా పాట్కర్ ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. సాక్షి: ప్రైవేటీకరణపై విశాఖ ఉక్కు కార్మికులు చేపట్టిన ఉద్యమాన్ని మీరెలా చూస్తున్నారు? మేధా పాట్కర్: విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మికులు చేపట్టిన ఐక్య ఉద్యమం అద్భుతం. స్టీల్‌ప్లాంట్ కార్మికులు 261 రోజులుగా పోరాడుతున్నారు. ఇది అనేక ఉద్యమాలకు ప్రేరణగా నిలుస్తోంది. సాక్షి: స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ వెనుక కేంద్ర ప్రభుత్వ ఉద్దేశం ఏమై ఉండవచ్చు? మేధా పాట్కర్: మొత్తం దేశాన్ని ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టాలని మోదీ ప్రభుత్వం చూస్తోంది. అందులో భాగంగానే విశాఖ స్టీల్‌ప్లాంట్ సహా ప్రభుత్వ రంగాన్ని ప్రైవేటుపరం చేస్తున్నారు. ఈ విధానం వల్ల దేశానికి చాలా నష్టం జరుగుతుంది. జాతి సంపదను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించాలనుకోవడం రాజ్యాంగ విరుద్ధం కూడా. సాక్షి: ప్రైవేటీకరణ వల్ల ఎలాంటి నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది? మేధా పాట్కర్: ప్రైవేటీకరణతో అన్నీ నష్టాలే. దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది. ఉద్యోగులు తమ ఉద్యోగాన్ని కోల్పోతారు. స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్ఎస్), తప్పనిసరి పదవీ విరమణ (సీఆర్ఎస్), గోల్డెన్ షేక్ హ్యాండ్ పేరుతో కార్మికులను తొలగిస్తారు. ప్రైవేటు యాజమాన్యాలు తమ ఉద్యోగులను కాంట్రాక్టు లేబర్‌గా మార్చుకుంటారు. రిజర్వేషన్లు అమలు కావు. ఇది ఊహాజనితం కాదు.. అనేక చోట్ల రుజువైంది కూడా. ఇప్పుడు రైల్వే రంగాన్ని చూస్తే ఇది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. రైల్వేలో అన్ని విభాగాలను ఒక్కొక్కటిగా కాంట్రాక్టర్లకు ఇచ్చేస్తున్నారు. రేపు ఇక్కడా (విశాఖ స్టీల్ ప్లాంట్‌లోనూ) అదే జరుగుతుంది. దీనివల్ల కార్మికులు తమ హక్కులను కోల్పోతారు. ఇప్పటికే 29 కార్మిక చట్టాలను రాజ్యాంగ విరుద్ధంగా నాలుగు కోడ్లుగా మార్చి హక్కులను హరించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. సాక్షి: మీరు కొంతమంది నిర్వాసితులను కలిశారు కదా. వారు ఏమంటున్నారు? మేధా పాట్కర్: వారి సమస్యలను తెలుసుకొన్నాను. నిర్వాసితులు దుర్భరమైన పరిస్థితుల్లో ఉన్నారు. కొంతమందికి ఇంకా పునరావాసం కూడా కల్పించలేదు. ఉద్యోగాలిస్తామన్న హామీ ఇప్పటివరకు పూర్తిస్థాయిలో నెరవేరలేదు. స్టీల్‌ప్లాంట్ కోసం తమ వ్యవసాయాన్ని వదులుకొని భూములిచ్చారు. పబ్లిక్ అవసరాల కోసం భూములను ఇస్తే ప్రభుత్వం మాత్రం వాటిని ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెడుతోంది. సాక్షి: ప్లాంట్ విలువను చాలా తక్కువకే అంచనా వేశారన్న ఆరోపణలున్నాయి. నిజమేనంటారా? మేధా పాట్కర్: అవును. రెండున్నర లక్షల కోట్ల విలువైన ప్రజా సంపదను కేవలం రెండు, మూడు వేల కోట్లుగా అంచనా వేసినట్టు తెలుస్తోంది. ప్రైవేట్ వ్యక్తులకు కారుచౌకగా దీన్ని ఇచ్చేయాలన్నది మోదీ ప్రభుత్వ ఉద్దేశం. ఇప్పటికే గంగవరం పోర్టును అదానీకి కట్టబెట్టేశారు. స్టీల్‌ప్లాంట్‌ను కూడా ఆయనకే అప్పగిస్తారు. ఆ రెండింటినీ అనుసంధానం చేసి రూ.వేల కోట్ల లాభాలను సంపాదిస్తారు. వారి ఆకలి అక్కడితో ఆగదు. సాక్షి: స్టీల్‌ప్లాంట్ కార్మికుల పోరాటం మరింత బలోపేతం కావాలంటే ఏం చేయాలి? మేధా పాట్కర్: ప్రస్తుతం కార్మికులు, నిర్వాసితులు వేర్వేరుగా ఆందోళన శిబిరాలను నిర్వహిస్తున్నారు. వారిద్దరూ కలిసి పోరాడాలి. రైతు ఉద్యమం తరహాలో విశాఖ ఉక్కు ఉద్యమం కొనసాగాలి. దీనికి మేము కూడా కృషి చేస్తాం. పార్లమెంట్లో పోరాడటానికి అవకాశం లేదు. అందువల్ల పార్లమెంట్ బయట ఉధృతంగా ఉద్యమాలను నడపాలి. కార్మిక సంఘాల నాయకులు, నిర్వాసితులు, రైతులు, ప్రజలు, ఐక్యంగా పోరాడాలి. సాక్షి: పోరాడటం వల్ల ప్రైవేటీకరణను అడ్డుకొనే అవకాశం ఉందా? మేధా పాట్కర్: ఖచ్చితంగా అడ్డుకోవచ్చు. అలాంటి విజయాలు చాలా ఉన్నాయి. మహారాష్ట్రలో ఎన్రాన్ ప్రాజెక్టు ఆగింది.. నర్మదా ప్రాజెక్టుపై పోరాటం జయప్రదంగా సాగింది. పోరాడితే కచ్చితంగా విజయం సాధించవచ్చు. -
70 ఏళ్లు పైబడిన ఖైదీలను వెంటనే విడుదల చేయాలి
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా జైళ్లలో ఉన్న 70 ఏళ్లు పైబడిన వారిని వెంటనే విడుదల చేయాల్సిందిగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలివ్వాలంటూ సామాజిక కార్యకర్త మేథా పాట్కర్ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. జైళ్లలో పరిమితికి మించి ఖైదీలున్నందున కోవిడ్ మహమ్మారి దృష్ట్యా 70 ఏళ్ల పైబడిన వారి సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని, మధ్యంతర బెయిల్ లేదా అత్యవసర పెరోల్‌పై విడుదల చేయాలన్నారు. ఇందుకోసం ఏకీకృత విధానాన్ని రూపొందించాలన్నారు. దేశంలోని జైళ్లలోని ఖైదీల్లో 50 ఏళ్లు, ఆపై వయస్సు వారు 19.1% మంది ఉన్నట్లు నేషనల్ క్రైమ్స్ రికార్డు బ్యూరో గణాంకాలు చెబుతున్నాయన్నారు. విచారణ ఖైదీల్లో 50 ఏళ్లు ఆపైని వారు 10.7% వరకు ఉండగా మొత్తం ఖైదీల్లో 50 ఏళ్లు పైబడిన వారు 63,336(13.2%) ఉన్నారని చెప్పారు. వీరిలో 70 ఏళ్లు, ఆపైబడిన వారు మహారాష్ట్ర, మణిపూర్, లక్షద్వీప్ మినహాయించి 5,163 మంది అని వివరించారు. గుజరాత్, రాజస్తాన్లలోని జైళ్లలో సామర్థ్యానికి మించి ఖైదీలున్నారనీ, అక్కడ కనీస సౌకర్యాలు కూడా లేవని తెలిపారు. అక్కడి జైళ్లలో 70 ఏళ్ల పైబడిన సుమారు 180 మంది ఖైదీలున్నారన్నారు. వృద్ధ ఖైదీలను వారిపై ఉన్న ఆరోపణలతో సంబంధం లేకుండా వెంటనే విడుదల చేసేలా ఆదేశాలివ్వాలని మేథా పాట్కర్ విజ్ఞప్తి చేశారు. చదవండి: కారులో 260 బంగారు బిస్కెట్లు.. తీయడానికి 18 గంటలు -
జేఎన్‌యూలో దారుణ పరిస్థితులు
సుందరయ్య విజ్ఞాన కేంద్రం: ఢిల్లీలోని జేఎన్‌యూలో దారుణ పరిస్థితులు నెలకొన్నాయని నేషనల్ అలయెన్స్ ఆఫ్ పీపుల్స్ మూమెంట్ ప్రతినిధి, సామాజికవేత్త మేధా పాట్కర్ ఆవేదన వ్యక్తం చేశారు. భారతదేశంలో ఇప్పుడుస్వేచ్ఛ కోసం అన్ని వర్గాలు పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. గురువారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ‘కమ్యూనిటీ టు రెసిస్ట్ కమ్యూనలిజం అండ్ ఫాసిజం’ఆధ్వర్యంలో ఎన్ఆర్సీ, సీఏఏ, ఎన్పీఆర్లకు వ్యతిరేకంగా సదస్సు జరిగింది. ఈ సదస్సులో మేధా పాట్కర్ మాట్లాడుతూ.. బీజేపీ రాజ్యాంగ వ్యతిరేక విధానాలపై నేడు అన్ని వర్గాలు ఏకం అవుతున్నాయని చెప్పారు. జనవరి 30న మహాత్మా గాంధీ వర్ధంతిని పురస్కరించుకొని అహింసా దినంగా పాటించాలని పిలుపునిచ్చారు. హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి.చంద్రకుమార్ మాట్లాడుతూ.. జేఎన్‌యూలో దాడి జరిగి 4 రోజులు కావస్తున్నా ఒక్కరిని కూడా అరెస్టు చేయకపోవటం దారుణమన్నారు. -
ఒక్కడి కోసం వేల మందిని ముంచుతారా?
భోపాల్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పుట్టిన రోజు వేడుకలను బాగానే జరిపారు.. కానీ ఆయన ఒక్కడి కోసం దాదాపు 32 వేల మందిని నీట ముంచారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నర్మద బచావో ఆందోళన్ కార్యకర్తలు. నిన్న ఓ వైపు నరేంద్ర మోదీ పుట్టిన రోజు వేడుకలు జరుగుతుండగా.. మరోవైపు నర్మదా బాచావో ఆందోళనకారులు ఖంద్వా-బరోడా రోడ్డు మీద బైఠాయించి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో సామాజిక కార్యకర్త మేధా పాట్కర్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మేధా పాట్కర్ మాట్లాడుతూ.. ‘ప్రధాని మోదీ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్థిల్లాలని కోరుకుంటున్నాను. ఈ సందర్భంగా ఆయన ఒక విషయం గుర్తిస్తే మంచిది. జనజీవనానికిక ఆటంకం కలగకుండా నడుచుకోవాల్సిన బాధ్యత ప్రధానిగా ఆయన మీద ఉంది. మోదీ పుట్టిన రోజు వేడుకల కోసం గుజరాత్ ప్రభుత్వం సర్దార్ సరోవర్ ఆనకట్టలో నీటి మట్టాన్ని 139 మీటర్లకు పెంచింది. ఆయన ఒక్కడి కోసం ఎందరో ప్రజలను ఇబ్బందులకు గురి చేయడం మంచిది కాదు. అందుకే మేం ఆయన పుట్టిన రోజు వేడుకలను బహిష్కరిస్తున్నాం. బ్యాక్ వాటర్ వల్ల బర్వానీ, ధార్, అలీరాజ్‌పూర్ జిల్లాలోని 192 గ్రామాలు పూర్తిగా, పాక్షికంగా మునిగిపోయాయి. ఆ ప్రాంతాల్లోని ప్రజలకు పూర్తిస్థాయిలో పునరావాసం కల్పించిన తర్వాతే.. స్లూయిస్ గేట్లను మూసివేయాలి’ అని మేధా పాట్కర్ డిమాండ్ చేశారు. -
నాలుగు రాష్ట్రాలకు సుప్రీం నోటీసులు
సాక్షి, న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, గుజరాత్, జార్ఖండ్ రాష్ట్రాలకు సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. ప్రముఖ సామాజికవేత్త మేధా పాట్కార్ పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు నాలుగు రాష్ట్రాలకు నోటీసులు జారీ చేసింది. 2013 భూసేకరణ చట్టాన్ని నీరుగార్చే విధంగా నాలుగు రాష్ట్ర ప్రభుత్వాలు సవరణలు చేయటాన్ని సవాలు చేస్తూ మేధా పాట్కార్ పిటిషన్ వేశారు. పిటిషన్లో.. నిర్వాసితుల ఉపాధికి భద్రత కల్పించకుండా, రైతుల అనుమతి లేకుండా బలవంతంగా భూసేకరణ చేసేలా సవరణలు చేయడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సామాజిక ప్రభావ మదింపు అంచనా వేయకుండా భూసేకరణ జరపడం కేంద్ర చట్టానికి విరుద్ధమన్నారు. కేంద్రం చేసిన చట్టానికి వ్యతిరేకంగా ఆర్డినెన్సు తీసుకురావటం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్నారు. రైతులు, భూ యాజమానుల ప్రయోజనాలు దెబ్బతినే విధంగా భూసేకరణ చట్టాన్ని సవరణలు చేశారని మండిపడ్డారు. జీవనోపాధి అనే ప్రాథమిక హక్కును హరిస్తున్నారని, భూసేకరణ కింద తీసుకున్న భూమిని ఉపయోగించకుండా తిరిగి వెనక్కి తీసుకునే అవకాశాన్ని కూడా చేశారని మేధా పాట్కర్ పేర్కొన్నారు. పిటిషనర్ తరుపున ప్రశాంత్ భూషణ్ వాదనలు వినిపించారు. -
గర్జించిన అన్నదాత
న్యూఢిల్లీ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: అన్నదాత గర్జనతో రాజధాని ఢిల్లీ దద్దరిల్లింది. దేశం నలుమూలల నుంచి వచ్చిన రైతులు శుక్రవారం నిర్వహించిన మహా ర్యాలీ విజయవంతమైంది. సప్త వర్ణాలను తలపించేలా పతాకాలు చేతబట్టిన రైతన్నలు రామ్‌లీలా మైదానం నుంచి పార్లమెంటు స్ట్రీట్‌కు సమీపంలోని జంతర్ మంతర్ వరకు ర్యాలీ నిర్వహించి తమ నిరసన తెలిపారు. అడుగడుగునా పోలీసు బందోబస్తు, దారిపొడవునా బారికేడ్లు, వాటర్ క్యానన్లు, పోలీసు కెమెరాలు, సాయుధ బలగాలకు తొణకకుండా ముందుకు సాగారు. పంటలకు గిట్టుబాటు, మద్దతు ధర కల్పించాలని, శాశ్వతంగా రుణ విముక్తి కల్పించాలన్న డిమాండ్‌తో అఖిల భారత కిసాన్ పోరాట సమన్వయ సమితి (ఏఐకేఎస్‌సీసీ) ఇచ్చిన పిలుపు మేరకు ఈ రెండు రోజుల కవాతు జరిగింది. రామ్‌లీలా మైదానం నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలోని పార్లమెంటుకు ర్యాలీగా బయల్దేరారు. కానీ జంతర్‌మంతర్ వద్దే పోలీసులు అడ్డుకోవడంతో అక్కడే రైతు పార్లమెంట్ నిర్వహించి తమ డిమాండ్లపై పలు తీర్మానాలు చేశారు. ఢిల్లీలో ఇటీవలి కాలంలో జరిగిన అతి పెద్ద ర్యాలీగా చెబుతున్న ఈ కార్యక్రమంలో ఏఐకేఎస్‌సీసీ నాయకులు మేథాపాట్కర్, యోగేంద్ర యాదవ్, అతుల్ కుమార్, హన్నన్ మొల్లా, కవితా కురగంటి, వీఎంకే సింగ్ తదితరులు ముందు నడవగా రైతులు వారిని అనుసరించారు. అయోధ్య కాదు..రుణ మాఫీ కావాలి: డప్పు నృత్యాలు, అర్ధనగ్న ప్రదర్శనలు, కోలాటాలు, విచిత్ర వేషాలు, గిరిజన నత్యాలు, ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కపాలాలు, ఉరితాళ్లు, అప్పుల కోసం రాసిన ప్రామిసరీ నోట్లు వంటివి ప్రదర్శిస్తూ రైతులు ర్యాలీలో పాల్గొన్నారు. ‘అయోధ్య–రామజన్మభూమి కాదు.. రుణాలు మాఫీ కావాలి’, ‘రైతుల్ని రుణభారం నుంచి విముక్తం చేయాలి’, ‘చౌకీదార్ బడాచోర్’, ‘మోదీ కిసాన్ విరోధి’, ‘ఇంక్విలాబ్ జిందాబాద్’, ‘కిసాన్ ఏక్తా– జిందాబాద్’ లాంటి నినాదాలు ఢిల్లీ వీధుల్లో మార్మోగాయి. పోలీసులు అడ్డగించిన చోటల్లా రైతు ఉద్యమకారులు రోడ్లపై బైఠాయించి నిరసన తెలిపారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు, బెంగాల్, పంజాబ్సహా దేశంలోని 24 రాష్ట్రాల రైతులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. తెలంగాణ నుంచి వచ్చిన మహిళలు అనేక మంది అప్పుల భారంతో మరణించిన తమ కుటుంబ పెద్దల ఫొటోలను చేతబూని ర్యాలీలో పాల్గొనగా ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన రైతులు.. ‘రుణమాఫీ పెద్ద దగా’ అని రాసి ఉన్న బ్యానర్లను ప్రదర్శించారు. రైతు సమస్యలే అజెండా కావాలి... జంతర్‌మంతర్ వద్ద రైతు పార్లమెంట్(సభ)లో పలువురు వక్తలు ప్రసంగిస్తూ.. రైతులు బిచ్చగాళ్లు కాదని, అన్ని రాజకీయ పార్టీలు ఒకే తాటిపై నిలిచి ఒకే వాణి వినిపించాలని విజ్ఞప్తి చేశారు. రైతు వ్యతిరేక ప్రభుత్వం ఏదీ బతికి బట్ట కట్టలేదని, అయోధ్య, రామజన్మభూమి..రైతు ఆత్మహత్యల కన్నా ఎక్కువ కాదని అన్నారు. మరోవైపు, రుణ విముక్తి, వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతూ పార్లమెంటులో ప్రవేశపెట్టిన బిల్లులకు అన్ని రాజకీయ పార్టీల మద్దతివ్వాలని విజ్ఞప్తి చేస్తూ రైతు సదస్సు తీర్మానం చేసింది. రైతు మేనిఫెస్టోను ఆమోదిస్తూ మరో తీర్మానం చేసింది. రైతు సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఏకేఎస్సీసీ నేతలు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. జంతర్‌మంతర్ వద్ద రైతుల్ని ఉద్దేశించి ప్రసంగించిన వారిలో రాహుల్, కేజ్రీవాల్‌తో పాటు సీతారాం ఏచూరీ (సీపీఎం), సురవరం సుధాకరరెడ్డి (సీపీఐ), శరద్ పవార్ (ఎన్సీపీ), ఫరూక్ అబ్దుల్లా (నేషనల్ కాన్ఫరెన్స్), శరద్ యాదవ్ (ఎల్జేడీ) తదితర జాతీయ నాయకులున్నారు. సంపన్నులకేనా రుణమాఫీ: రాహుల్ సాక్షి, న్యూఢిల్లీ: ప్రధానికి సన్నిహితులైన 15 మంది బడా పారిశ్రామికవేత్తలు బకాయిలు పడిన రూ.3.5 లక్షల కోట్ల రుణాల్ని మాఫీ చేసిన ప్రభుత్వం రైతు రుణాలను ఎందుకు విస్మరిస్తోందని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నిలదీశారు. రైతులు ప్రభుత్వం నుంచి ఉచిత కానుకలు కోరడం లేదని వారు అడుగుతున్న రుణమాఫీ, మద్దతు ధర వారి హక్కని రైతు సభలో పేర్కొన్నారు. రైతులు, యువత గొంతుకల్ని ప్రభుత్వం అణగదొక్కలేదని, ఒకవేళ వారిని అవమానిస్తే ఆ ప్రభుత్వాన్ని పడగొడతామని హెచ్చరించారు. ఫసల్ బీమా యోజన ద్వారా అనిల్ అంబానీ సంస్థలకు ప్రధాని దోచిపెడుతున్నారని మండిపడ్డారు. బీమా పథకాన్ని రెండుగా విభజించి అంబానీ, అదానీ సంస్థలకు పంచిపెట్టారని మండిపడ్డారు. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ మాట్లాడుతూ..స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను అమలు చేయలేమని సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేయడం ద్వారా రైతులను ప్రధాని నరేంద్ర మోదీ వెన్నుపోటు పొడిచారని విమర్శించారు. ఎన్డీయే హయాంలో వ్యవసాయ రంగం తిరోగమన బాట పట్టిందని, అందువల్లే రైతు ఆత్మహత్యలు పెరిగాయని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. బీజేపీ విభజనవాద రాజకీయాలపై గళమెత్తాలని, రైతు సమస్యలపై అందరూ ఏకమవ్వాలని పిలుపునిచ్చారు. మోదీ–అమిత్ షా ద్వయాన్ని ఆయన దుర్యోదన–దుశ్శాసనలుగా అభివర్ణించారు. శుక్రవారం ఢిల్లీలో నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న రైతులు ఢిల్లీలో జరిగిన మహా ర్యాలీలో పాల్గొన్న తెలంగాణ రైతులు -
స్ఫూర్తిదాయక మహిళామణులు
సమాజం ఎప్పుడు మగవారు చేసే పనికే విలువ ఇస్తుంది. మగవారు అంటేనే శక్తిమంతులు, ఏమైనా చేయగలరు అనే భావనలో ఉంటుంది. స్త్రీ అంటే బలహీనురాలు, ఇంటిని చక్కపెట్టుకోవడం వరకే ఆమెకు చేతనవుతుంది అనే అనుకుంటుంది. కానీ ఇక్కడ మనందరం ఒక విషయాన్ని మరవకూడదు భారత స్వాతంత్ర పోరాటానికి పునాది వేసిందే ఒక మహిళా....నేటి మారుతున్న సమాజంతో పాటు స్త్రీ పాత్ర కూడా మారింది. ప్రస్తుతం భారతీయ మహిళా అంటే కేవలం ఇంటికే పరిమితమయ్యే ఒక అబల కాదు. నేడు ప్రతిరంగంలో వారు దూసుకుపోతున్నారు. తమను బంధించే సనాతన ఆచార సంప్రదాయాలను తెంచుకుని ప్రతిరంగంలో తమదైన ముద్ర వేస్తున్నారు. కేవలం ఇంటిని చక్కబెట్టడం మాత్రమే కాకుండా సామాజిక మార్పు కోసం కృషి చేస్తూ ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. వారిలో ప్రముఖమైన మహిళా సామాజిక సంఘసంస్కర్తల గురించి తెలుసుకుందాం..... ఝాన్సీ లక్ష్మీబాయి భారత స్వాతంత్ర పోరాటంలో తొలి ఘట్టం 1857లో జరిగిన ‘‘సిపాయిల తిరుగుబాటు’’. చరిత్రకేక్కిన ఈ సంఘటనలో పాల్గొన్నది ఒకే ఒక్క మహిళ. కానీ చాలామందికి తెలియని ఆ వీరనారే ఝాన్సీ లక్ష్మీభాయి. భారతీయ స్త్రీ అంటే కేవలం అందానికి మాత్రమే కాదు ధైర్యానికి ప్రతీక అని నిరూపించింది. బ్రిటిష్ వారి కబంధ హస్తాలనుంచి దేశాన్ని విడిపించడం కోసం విరోచితంగా పోరాడి మిగితా వారికి స్ఫూర్తిగా నిలిచింది. సరోజిని నాయుడు భారత స్వాతంత్ర పోరాటంలో చిరస్థాయిగా నిలిచిపోయే మరో వనిత సరోజిని నాయుడు. ఆమెకున్న బిరుదు భారత కోకిల. శాసనోల్లంఘన ఉద్యమంతో పాటు ఎన్నో ఉద్యమాలలో కీలక పాత్ర పోషించింది. గొప్ప కవయిత్రి కూడా. స్వతంత్ర భారతదేశంలో గవర్నర్ పదవి నిర్వహించిన తొలి మహిళ. దేశంలో ప్లేగు వ్యాధి వ్యాపించినప్పుడు ఆమే చేసిన సేవలకు మెచ్చి బ్రిటిష్ ప్రభుత్వం ఆమేను కైసెర్-ఐ-హింద్ పతకంతో సత్కరించింది. అరుణ రాయ్ మన దేశంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందర్భంలో అవినీతి వల్ల బాధపడినవారే. కానీ ఎవ్వరూ ముందుకు వచ్చి దీనిగురించి పోరాడినవారు లేరు అలాంటి సందర్భంలో అవినీతికి వ్యతిరేకంగా పోరాడాలని, ప్రభుత్వంలో పారదర్శకతను తీసుకురావాలని నిర్ణయించుకుంది ఒక మహిళ. ఆమే అరుణ రాయ్. ఒక టీచర్ గా తన ప్రయాణాన్ని ప్రారంభించి తర్వాత గొప్ప సామాజిక కార్యకర్తగా మారింది. ఆమె 1967 సంవత్సరంలోఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (ఐఏఎస్)పరీక్షలో ఉత్తీర్ణురాలైంది. కార్మికులు మరియు రైతులు మేలు కోసం స్థాపించినన మజ్దూర్ కిసాన్ శక్తి సంఘటన్ (ఎమ్కేఎస్ఎస్)లో చేరి ప్రముఖ నాయకురాలిగా ఎదిగింది. సమాచార హక్కు చట్టం (ఆర్ టి ఐ) రావాడానికి కారణం ఆమే చేసిన కృషే. అవినీతి రహిత సమాజం కోసం ఆమే చేస్తున్న కృషికి గాను ఎన్నో అవార్డులు అందుకుంది. మేధాపాట్కర్ ప్రభుత్వం ప్రజల కోసం ఎన్నో ప్రాజేక్టులను తలపెడుతుంది. కానీ దాని వల్ల నిర్వాసితులైన వారి గురించి మాత్రం పట్టించుకోదు. అలాంటివారి తరుపున నిలబడి పోరాడుతున్న మహిళ మేధా పాట్కర్. ఒక ప్రముఖ కార్మిక నాయకుడి ఇంట్లో జన్మించిన పాట్కర్‌కు సమాజసేవ అంటే మక్కువ. కార్మికులు,రైతుల జీవితాలను మెరుగుపర్చడం ఆమే లక్ష్యం. ఆమే చిన్నతనం నుంచే సమాజసేవను ప్రారంభించింది. కానీ నర్మాదా బచావో ఆందోళన ద్వారా అందరికి ఆమే పరిచితురాలయ్యింది. కిరణ్ బేడి పరిచయం అవసరంలేని మహిళ. మనదేశంలో పోలీసులంటే అందరికి భయమే, స్త్రీలకయితే మరీనూ. అలాంటి రంగంలో మొట్టమొదటి మహిళా ఐపీఎస్ అధికారి కిరణ్ బేడి. ఆమే ప్రముఖ సామాజిక కార్యకర్త. కిరణ్ బేడి సంకల్పం, అంకితభావం ఉంటే ప్రతి ఒక్కరూ తన లక్ష్యాన్ని సాధించవచ్చనడానికి ఆమె ఒక ఉదాహరణ. పశ్చిమ ఢిల్లీలో ఐపిఎస్ అధికారిగా ఆమె బాధ్యతలు చేపట్టిన తర్వాత మహిళలపై జరిగే నేరాలు తగ్గుముఖం పట్టాయి. తీహార్ జైల్లో ఆమె తీసుకువచ్చిన సంస్కరణలకు గాను ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు పొందింది. 1993లో రామన్ మెగసెసే అవార్డును కూడా అందుకుంది. యునైటెడ్ నేషన్స్ సెక్రటరీ జనరల్‌కి మొదటి పోలీస్ సలహాదారుగా కిరణ్ బేడి నియమితురాలయ్యింది. షాహీన్ మిస్త్రీ సమాజంలోని అసమానతలకు ప్రధాన కారణం విద్య. మనదేశంలో విద్యాహక్కును ప్రాధమిక హక్కుగా గుర్తించినప్పటికీ నేటికి ఎంతో మందికి అది అందని ద్రాక్షేగానే మిగిలింది.ఇలాంటి పరిస్ధితుల్లో మురికివాడల పిల్లల పరిస్థితి మరీ దారుణం. అలాంటి ముంబై మురికివాడల్లోని పిల్లలకు నాణ్యమైన విద్యను అందించడం కోసం కృషి చేస్తున్న వ్యక్తి షాహీన్ మిస్త్రీ. ముంబైలో సామాన్య కుటుంబంలో పుట్టినన షాహీన్ మిస్త్రీ సమాజంలో విద్యా సమానత్వం కోసం ముంబయి మురికివాడల పిల్లలకు విద్యా సదుపాయాలు కల్పించడం కోసం చేసిన పోరాటాలు నేడు ఆమేకు ప్రపంచవ్యాప్త గుర్తింపు తెచ్చాయి. ముంబాయి మురికివాడల్లోని పిల్లలకు నాణ్యమైన విద్యను అందిచడం కోసం ఆమే ‘‘ఆకాంక్ష ఫౌండేషన్’’ను స్థాపించింది. ఆమే చేసిన సేవలకు గాను ఎన్నో గ్లోబల్ పురస్కారాలను అందుకుంది. ఇరోమ్ షర్మిల ఈశాన్య రాష్ట్రాలు ప్రకృతి అందాలకే కాదు, ఎల్లప్పుడు సైనిక పహారాలో ఉండే ప్రాంతాలుగా ప్రాచుర్యం పొందాయి. అక్కడి సాయుధ దళాలకు కేంద్రం ఎన్నో ప్రత్యేక అధికారాలను కల్పించింది. దాంతో వారి విచ్చలవిడితనానికి హద్దులు లేకుండా పోయింది. ఇందుకు నిదర్శనం ‘‘మాల్కం-ఊచకోత’’. ఈ ఘటనలో పదిమంది అమాయకులను కారణం లేకుండా హతమార్చాయి సైనిక దళాలు. ఈ దాడితో చలితురాలై, ఏకధాటిగా 500వారాల పాటు నిరహారదీక్ష చేస్తూ ఉక్కుమహిళాగా గుర్తింపు పొందింది మణిపూర్‌కు చెందిన ఇరోమ్ షర్మిల. కేంద్రం ఏడు ఈశాన్య రాష్ట్రాల్లో అమలు చేస్తున్నసాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టం ఉపసంహరణకోసం షర్మిల చేపట్టిన ఈ దీక్ష ప్రపంచంలోనే సుదీర్ఘ నిరాహార దీక్ష. ప్రమీలా నెసర్గి ప్రమీలా నెసర్గి వృత్తిరిత్యా న్యాయవాది ప్రవృత్తిరిత్యా మహిళల హక్కుల కోసం పోరాడే ఒక ప్రసిద్ధ సామాజిక కార్యకర్త. స్వతంత్ర న్యాయవాది అయినా ఆమే బాల కార్మికులు,లైంగిక హింస, మహిళల భద్రత, ఖైదీల దుస్థితి వంటి కొన్ని తీవ్రమైన సమస్యలకు వ్యతిరేకంగా పోరాడుతుంది. తన వృత్తిలో భాగంగా పలు వివాదాస్పద సమస్యలను చేపట్టి అనేక విమర్శలు ఎదుర్కొంది. లక్ష్మి అగర్వాల్ తమ మొహం మీద చిన్న మొటిమ, మచ్చ వస్తేనే ఆడపిల్లలు భరించలేరు, అలాంటిది మొహం మీద యాసిడ్దాడి జరిగితే వారి పరిస్థితి వర్ణానాతీతం. నలుగురిలో కలవడం కాదు కదా అసలు సమాజమే వారిని దూరం పెడుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో తనకు జరిగిన అన్యాయం మరే ఆడపిల్లకు జరగకూడదని మహిళల పట్ల జరిగే శారీరక, మానసిక హింసకు వ్యతిరేకంగా పోరాడుతుంది లక్ష్మి అగర్వల్ ఓ యాసిడ్ దాడి బాధితురాలు. ఈ ఘటన తర్వాత సుప్రీం కోర్టు యాసిడ్ అమ్మకాలకు కొన్ని నియంత్రణలను రూపొందించింది, యాసిడ్ దాడులకు వ్యతిరేకంగా కొన్ని కఠిన చట్టాలను చేసింది. ప్రస్తుతం లక్ష్మీ అగర్వాల్ భారతదేశంలో యాసిడ్ దాడుల నిరోధానికి నిర్వహిస్తున్న కార్యక్రమానికి ప్రచారకురాలిగా, టీ.వీ. వ్యాఖ్యతగా వ్యవహరిస్తుంది. -
32ఏళ్ల పోరాటానికి ఫలితమేదీ?
న్యూఢిల్లీ: దేశంలో అత్యంత పెద్దదైన నర్మదా సరోవర్ జలాశయాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదివారం ప్రారంభించి జాతికి అంకితం చేసిన సందర్భంగా, ఈ ప్రాజెక్ట్‌ను కార్యరూపం దాల్చకుండా నిలువరించేందుకు 32 సంవత్సరాలపాటు సుదీర్ఘంగా సాగిన పోరాటం గురించి ఒక్కసారి కూడా గుర్తుచేసుకోకపోవడం శోచనీయం. సామాజిక కార్యకర్త మేథాపాట్కర్ ఈ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా జరిగిన ఆందోళన కోసం దాదాపు తన జీవితాన్నే అంకితం చేశారు. బాబా ఆమ్టే లాంటి మహానుభావులు, అరుంధతీరాయ్ లాంటి రచయితలు, మేథావులు ఈ ఆందోళనలో భాగస్వాములయ్యారు. ఆమీర్ ఖాన్ లాంటి సినిమా నటులు ఆందోళనకు అండగా నిలిచారు. ‘వికాష్ చాయియే...వినాశ్ నహీ’ నినాదంతో సుదీర్ఘకాలంపాటు కొనసాగిన ఈ ఆందోళనకు మరో ప్రత్యేకత ఉంది. హింసకాండకు ఆస్కారం లేకుండా శాంతియుతంగా కొనసాగడం. జల సత్యాగ్రహం అనే పదం కూడా ఈ ఆందోళన నుంచే పుట్టింది. కోర్టులు, ర్యాలీలు, ప్రదర్శనలు, ధర్నాలు, సత్యాగ్రహాలు....ఇలా పలు రూపాల్లో కొనసాగిన నర్మదా బచావో ఆందోళనల్లో బాధిత ఆదివాసీలు, అటవి తెగలు, పలు ఎన్జీవో సంస్థలు, మేథావులు, రంగస్థల, సినీ కళాకారులు, రాజకీయ నాయకులు పాల్లొన్నారు. ప్రస్తుతం బీజీపీతో దోస్తీ కుదుర్చుకున్న బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కూడా గత ఏడాది, సెప్టెంబర్ నెలలో బాధితుల తరఫున ఆందోళన చేశారు. ‘డ్యామ్‌లు ఆధునిక భారత దేశానికి దేవాలయాలు’గా అభివర్ణించే భారత తొలి ప్రధాన మంత్రి జవహర్ లాల్ నెహ్రూ 1961లో ఈ నర్మదా ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. అప్పుడు చిన్న డ్యామ్ కోసం ప్రణాళిక రచించారు. కాంగ్రెస్ పార్టీ తరఫున గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేసిన చిమన్‌భాయ్ పటేల్ ఈ ప్రాజెక్ట్‌ను అనూహ్యంగా విస్తరించారు. రెండోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక పనులను వేగవంతం చేశారు. ఈ ప్రాజెక్ట్‌తో గుజరాత్ నందనవనంగా మారుతుందని ఆయన కలుగన్నారు. ఆ కల తీరకుండానే ఆయన మరణించడంతో ఆయన ముందస్తుగా చేసిన సూచనల మేరకు ఆయన అస్థికలను కూడా డ్యామ్‌లోనే కలిపారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చాక డ్యామ్ నిర్మాణం పనులు మళ్లీ ఊపందుకున్నాయి. ఈ ప్రాజెక్ట్‌ను విస్తరించడాన్ని పొరుగునున్న మధ్యప్రదేశ్ రాష్ట్రం మందుగా వ్యతిరేకించింది. ఆ తర్వాత మహారాష్ట్ర, రాజస్థాన్ రాష్ట్రాలు కూడా వ్యతిరేకించాయి. ఈ వివాదాన్ని పరిష్కరించడం కోసం ఓ ట్రిబ్యునల్‌కు కూడా వేశారు. 1984లో మేథాపాట్కర్ లాంటి సామాజిక కార్యకర్తలు ప్రాజెక్ట్ స్థలాన్ని సందర్శించి ఆదివాసీల స్థానభ్రంశం గురించి తెలుసుకున్నారు. వారి తరఫున వెంటనే ఆందోళన చేపట్టారు. 1989లో ‘నర్మదా బచావో ఆందోళన్ (ఎన్బీఏ)’ పేరుతో ఆందోళనను తీవ్రతరం చేశారు. ఆ తర్వాత బాధితుల తరఫున మధ్యప్రదేశ్‌లో ‘నర్మదా ఘటీ నవ నిర్మాణ సమితి’, మహారాష్ట్రలో ‘నర్మదా ధరంగ్రాష్ట్ర సమితి’ పేరిట ఆందోళనలు కొనసాగాయి. ప్రజా పోరాటాలు, సుప్రీం కోర్టు జోక్యం కారణంగా మధ్యప్రదేశ్‌లో నిరాశ్రీయులైన దాదాపు 50 వేల మందికి, గుజరాత్లో నిరాశ్రీయులైన దాదాపు రెండు లక్షల మంది ఆదివాసీలకు పునరావాసం కల్పించారు. కొత్త చోట అరకొర సౌకర్యాలు మాత్రమే ఉండడంతో వారు ఆందోళన చెందుతున్నారు. నష్టపరిహారం అందకపోవడంతో ఇప్పటికీ ముంపుకు గురయ్యే ప్రమాదం ఉన్న గ్రామాల్లో సగం జనాభా ఖాళీ చేయలేదు. అయినప్పటికీ నర్మదా నది డ్యామ్ గేట్లను మూసివేసేందుకు గత జూన్ నెలలో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వానికి అనుమతి ఇవ్వడంతో ప్రపంచ దేశాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. పూర్తి నష్టపరిహారం చెల్లించి, ముంపు గ్రామాల ప్రజలను పూర్తిగా తరలించేవరకు డ్యామ్ గేట్లను మూయరాదంటూ ప్రపంచవ్యాప్తంగా 26 మంది నోబెల్ బహుమతి గ్రహీతలు, దాదాపు రెండువందల ఎన్జీవో సంస్థలు ప్రధాని నరేంద్ర మోదీకి లేఖలు రాశాయి. భూమి కోల్పోయిన రైతులకు భూమి ఇవ్వలేని సందర్భాల్లో 60 లక్షల రూపాయల నగదు చొప్పున నష్టపరిహారంగా ఇవ్వాలని సుప్రీం కోర్టు తీర్పు చెబుతోంది. అయితే నాలుగోవంత నష్టపరిహారం కూడా అందలేదని బాధితులు ఆరోపిస్తున్నారు. అంతేకాకండా ముంపు గ్రామాలను ఖాళీచేయమని, ఆ గ్రామాల్లోనే ఉంటామని 53 శాతం ప్రజలు తెలియజేస్తుండగా, 31 శాతం మంది ప్రజలు ఖాళీచేసి పునరావాస గ్రామాలకు వెళ్లేందుకు సిద్ధమని తెలియజేస్తున్నారు. అలాగే పునరావాస కేంద్రాల నుంచి తిరిగి సొంత గ్రామాలకు వెళ్లేందుకు 50 శాతం మంది సంసిద్ధత వ్యక్తం చేస్తుండగా, 30 శాతం మంది అక్కడే ఉండేందుకు ఇష్టపడుతున్నారు. అంటే, మెజారిటీ గ్రామాల ప్రజలు సొంత గ్రామాల్లో ఉండేందుకే ఇష్టపడుతున్నారు. పునరావాస గ్రామల్లో 55 శాతం మందికి రక్షిత మంచినీరు అందకపోవడం, 63 శాతం మందికి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు అందుబాటులో లేకపోవడం, 86 శాతం మందికి ఆస్పత్రులు అందుబాటులో లేకపోవడం వారి వైఖరికి కారణంగా కనిపిస్తోంది. ఈ ప్రాజెక్ట్‌ను నరేంద్ర మోదీ ప్రారంభించిన ఆదివారం రోజున కూడా మధ్యప్రదేశ్‌లోని బరోలా గ్రామంలో మేథాపాట్కర్ సత్యాగ్రహం చేశారు. ఆధునీకరణ, అభివృద్ధి, సామాజిక, ఆర్థికాభివద్ధికి భారీ ప్రాజెక్టులు అవసరమని పాలకులు వాదిస్తారుగానీ, బాధితుల జీవితాలను పణంగాపెట్టే ఈ మార్పులను సమాజం అంగీకరించలేదు. ఆడవుల్లో ఉండే మానవులను అభివద్ధి పేరిట రోడ్లపైకి ఈడ్చుకురావడంకన్నా వారుండే అడవుల్లోకే అభివద్ధి రోడ్లను తేసుకెళ్లడం ఎంత ఉత్తమమో ఆలోచించాలి. -
ఆమె దీక్ష భగ్నం
ధార్: సామాజిక ఉద్యమ కారిణి మేధా పాట్కర్(62) నిరాహార దీక్షను మధ్యప్రదేశ్ పోలీసులు భగ్నం చేశారు. సర్దార్ సరోవర్ డ్యాం ముంపు బాధితులకు సరైన పునరావాసం కల్పించాలని కోరుతూ గత 12 రోజులుగా దీక్ష చేస్తున్న ఆమెను సోమవారం రాత్రి బలవంతంగా ఇండోర్ ఆస్పత్రికి తరలించారు. మేధా పాట్కర్‌తో పాటు 11 మంది ఉద్యమకారుల దీక్షను కూడా పోలీసులు భగ్నం చేశారు. వీరంతా జూలై 27 నుంచి మధ్యప్రదేశ్‌లోని ధార్ జిల్లా ఛిఖల్డా గ్రామంలో నిరవధిక నిరాహార దీక్షకు దిగారు. దీక్షను భగ్నం చేయడానికి ముందు పోలీసులు వ్యూహాత్మకంగా వ్యవహరించారు. రాజ్‌ఘాట్ వంతెనపై చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి ఛిఖల్డాకు వెళ్లే దారులను ముసివేశారు. డ్రోన్ కెమెరాలతో ఆందోళనకారుల కదలికలను ఎప్పటికప్పుడు గుర్తించారు. ముందుగానే ఛిఖల్డా గ్రామానికి 12 అంబులెన్స్‌లు పంపించారు. రాత్రి బాగా పొద్దుపోయాక వేదిక వద్దకు చేరుకుని మేధా పాట్కర్‌తో సహా 11 మంది ఉద్యమకారుల దీక్షను భగ్నం చేశారు. పోలీసులను ఆందోళనకారులు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. పోలీసులు దురుసుగా ప్రవర్తించడంతో పిల్లలు, మహిళలతో సహా 12 మంది గాయపడ్డారని నర్మదా బచావో ఆందోళన్ కార్యకర్తలు ఆరోపించారు. 12 రోజులుగా దీక్ష చేస్తున్న తమతో సమగ్ర చర్చలు జరపకుండా మోదీ, శివరాజ్ సింగ్ సర్కారు అక్రమంగా అరెస్ట్ చేసిందని మేధా పాట్కర్ ఆరోపించారు. పోలీసుల చర్యతో గాంధీజీ కన్న కలలను హత్య చేశారని పేర్కొన్నారు. ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని, ప్రభుత్వం సమాజానికి సమాధానం చెప్పాల్సిన అవసరముందన్నారు. -
మరింతగా క్షీణించిన మేధా పాట్కర్ ఆరోగ్యం
ధార్: సర్దార్ సరోవర్ డ్యాం ముంపు బాధితులకు సరైన పునరావాసం కల్పించాలని కోరుతూ గత 9 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న సామాజిక ఉద్యమ కారిణి మేధా పాట్కర్(62) ఆరోగ్యం మరింతగా క్షీణించింది. వైద్య పరీక్షల్లో పాట్కర్ రక్తపోటు, షుగర్ స్థాయి పడిపోయినట్లు తేలిందని అదనపు కలెక్టర్ డి.కె.నాగేంద్ర తెలిపారు. మేధా పాట్కర్‌తో పాటు 11 మంది ఉద్యమకారులు జూలై 27 నుంచి మధ్యప్రదేశ్‌లోని ధార్ జిల్లా ఛిఖల్డా గ్రామంలో నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్నారు. -
‘నర్మదా బచావ్’ ఓడిపోలేదు
విశ్లేషణ నర్మదా ఉద్యమం ప్రజా కార్యాచరణకు కొత్త వ్యాకరణాన్ని ఆవిష్కరించింది. మన నైతిక ఊహాత్మకతను విస్తరింపజేసి, అభివృద్ధి బాధితులను బాధితులుగా మన చేత గుర్తింపజేసింది. రాజ్యాంగబద్ధమైన మన ప్రజాస్వామ్యంలో మాట్లాడటానికి అర్హతేలేని వారికి గొంతునిచ్చింది. మన ప్రజాస్వామ్యాన్ని ప్రజాస్వామ్యీకరించింది. అంతిమ పోరాటంలో అది ఓడిపోతున్నట్టు కనిపించవచ్చు. కానీ అది ఇప్పటికే మనల్నందరినీ గెలుచుకుంది. ఆ ఉద్యమ అపజయాలు మన గతం, విజయాలు మనందరి సమష్టి భవితకు చెందుతాయి. నర్మదా బచావ్ ఆందోళన్(ఎన్బీఏ) అంతిమ పోరాటానికి దిగింది. అలాంటి ఈ సమయంలో నేను ఒక తరం కార్యకర్తలకు ఆదర్శమూర్తి మేధా పాట్కర్ గురించి ఎంతగా ఆలోచిస్తున్నానో, శ్యామా భారత్ గురించి కూడా అంతగా ఆలోచిస్తున్నానని అనుకుంటాను. శ్యామా, ధార్ జిల్లాలోని బిద్వానీ తెహసిల్ పిచ్చోది గ్రామంలోని జాలరి మహిళ. నర్మదా పోరు చివరి దశలోకి ప్రవేశించింది. సర్దోవర్ డ్యాం ప్రతిపాదిత ఎత్తుకు చేరుకుంది. కొందరికి కల, ఇతరులకు పీడకల వంటి ఆ ప్రాజెక్టు వాస్తవమైంది. చివరకు, గేట్లను కూడా మూసేశారు. ఇక రిజర్వాయరు నీటి మట్టం పెరిగి... ప్రభుత్వం ‘‘ప్రాజెక్టు ప్రభావిత ప్రజలు’’గా పిలుస్తున్న వారి ఇళ్లూ, వాకిళ్లూ సర్వస్వాన్నీ ముంచేస్తుంది. వారా ప్రాంతాన్ని ఖాళీ చేసి వెళ్లిపోవడానికి పెట్టిన తుది గడువు జూలై 31. ప్రభుత్వం ఇక ఏ రోజునైనా బలవంతంగా వారిని ఖాళీ చేయించడాన్ని ప్రారంభించవచ్చు. ఇక అంతా ముగిసిపోయినట్టే అనిపించవచ్చు. నర్మదను కాపాడటానికి చేస్తున్న 32 ఏళ్ల చరిత్రాత్మక పోరాటం పూర్తయిందని అనిపించవచ్చు. వెనకడుగు... కొత్త పోరు దుస్సాధ్యమైన ప్రతిఘటనా పోరాటాన్ని ఇంకా నడుపుతున్న మేధా పాట్కర్ మీదికి నా ఆలోచనలు పోతున్నాయి. ఖాళీ చేసి వెళ్లాలన్న ప్రభుత్వ ఆదేశాలను ధిక్కరించి వేలాది కుటుంబాలు ఇంకా తమ ఇళ్లలోనే ఉంటున్నాయి. వందలాది మంది గ్రామస్తులు చివరి దఫా జల సత్యాగ్రహంలో చేరారు. జూలై 27 నుంచి మేధాపాట్కర్ సహా ఓ డజను మంది కార్యకర్తలు చికల్దా గ్రామంలో ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు. ఆసియాలో మొట్టమొదట వ్యవసాయం చేసినది ఇక్కడేనని తెలిపే ఆధారాలను పురావస్తు శాస్త్రవేత్తలు కనుగొన్నారని మేధా పాట్కర్ తెలిపారు. ఈ వానా కాలంలోనే బహుశా ఆ గ్రామం సైతం డ్యామ్ రిజర్వాయర్‌లో మునిగిపోతుంది. ఏళ్ల తరబడి నర్మదా బచావ్ ఆందోళన్‌ను గమనిస్తున్నవారు ఎవరైనా... ప్రతి కొత్త పోరాటమూ ఒక వెనుకడుగేనని గుర్తిస్తారు. మొదట అసలా డ్యామ్‌ను నిర్మించడానికి అనుమతించేది లేదని, దాన్ని అడ్డుకోడానికి చేసిన పోరాటం. తర్వాత డ్యామ్ ఎత్తు గురించి పోరాటం. ఇప్పుడిక ఈ ఆఖరు పోరాటం, డ్యామ్ వల్ల మధ్యప్రదేశ్‌లో నిర్వాసితులైన వారి సహాయ, పునరావాసాలా గురించి జరుగుతున్నది. డ్యామ్ నిర్మాణానికి అనుమతినిస్తూ సుప్రీం కోర్టు.. నిర్మాణానికి ముందే ప్రభావిత ప్రజలకు పునరావాసాన్ని కల్పించడం తప్పనిసరి అని షరతును విధించింది. గత కొన్నేళ్లుగా ప్రభుత్వం, పునరావాస షరతులను వేటినీ పరిపూర్తి చేయకుండానే నిర్మాణాన్ని కొనసాగించి, డ్యామ్ ఎత్తును పెంచే మార్గాలను కనిపెట్టింది. వాగ్దానాల కాలరాచివేత డ్యామ్ నిర్మాణాన్ని కొనసాగించడంతో పాటూ ప్రభుత్వం వాస్తవాలను తారుమారు చేయడమూ సాగించింది. వాటిని ఎన్బీఏ నిర్విరామంగా ఎండగడుతూ వచ్చింది. చాలా వరకు వాగ్దానాలు పరిపూర్తి కాకుండానే మిగిలిపోయాయి. భూమికి బదులుగా భూమి అనే సూత్రాన్ని విడనాడారు. అర్హతగల చాలా కుటుంబాలకు నగదు పరిహారాన్ని సైతం ఎగవేశారు. ప్రత్యామ్నాయ గృహ వసతి వాగ్దానం కార్యరూపం దాల్చలేదు. ప్రత్యామ్నాయ గృహం వాగ్దానం చివరకు ప్రభుత్వం హడావుడిగా వేసిన రేకుల షెడ్డుకు కుదించుకుపోయింది. రైతులు వాటిలోకి తమ నివాసాన్ని మార్చుకోవాలని ప్రభుత్వం ఆశిస్తోంది. కోర్టు ఆదేశాలను అనుసరించి పునరావాసం పూర్తయ్యేవరకు గేట్లను మూసివేయకూడదని చికల్దాలోని ఆందోళనకారులు, దేశవ్యాప్తంగా ఉన్న వారి మద్దతుదార్లు డిమాండు చేస్తున్నారు. పాలకులు అదేమీ వినిపించుకునే ధోరణిలో లేరని స్పష్టంగానే కనిపిస్తోంది. గుజరాత్ ఎన్నికల్లోగా ప్రాజెక్టు పూర్తయిందని వాళ్లు ప్రకటించుకోవాలి. ఈ దశలో కోర్టులు దీన్ని అడ్డుకున్నాగానీ, ఆందోళనకారుల ఎజెండా బాగా కుదించుకుపోయిందనే విషయాన్నే అది గుర్తుచేçస్తూనే ఉంటుంది. నిరాశావాదులైన పరిశీలకులు నర్మదా ఉద్యమం అసలు లక్ష్యాన్నే కోల్పోయిందని మీకు చెప్పొచ్చు. ఎనలేని ఉద్యమ విజయాలు నేను మాత్రం అంగీకరించను. ఈ ఉద్యమం వల్ల నిర్వాసిత ప్రజలకు స్పష్టంగా కళ్లకు కనిపించే పలు లాభాలు సమకూరాయని భావిస్తున్నాను. ఈ పోరాటం, మహారాష్ట్ర, గుజరాత్‌లలో నిర్వాసిత కుటుంబాలకు దేశంలో మనం ఇంతవరకు ఎరుగనంత మంచి పునరావాస ప్యాకేజీని సాధించిపెట్టింది. అంతకు మించి అది ‘పర్యావరణ ప్రభావ నివేదిక’ను ప్రభుత్వ విధివిధానాలలో భాగం చేసింది. 2013 భూసేకరణ బిల్లును తెచ్చిన ప్రతిష్ట ఎవరికి చెందుతుంది అనేట్టయితే, నిస్సందేహంగా నర్మదా బచావ్ ఆందోళనకే. ఈ ప్రయోజనాలు కేవలం మన దేశానికే పరిమితం కాలేదు. సర్దార్ సరోవర్ ప్రాజెక్టుకు నిధులను సమకూర్చే బాధ్యతల నుంచి ప్రపంచ బ్యాంకు ఉపసంహరించుకుంది. భారీ డ్యామ్ ప్రాజెక్టులకు ఆర్థికసహాయం అందించడాన్ని సమీక్షించింది. ఎన్బీఏ నిర్వాసితులకు సాధించిపెట్టిన ప్రయోజనాలు ప్రత్యక్షంగా కంటికి కనిపించే వాటి పరిధికి మించి విస్తరించాయి. ‘నిర్వాసిత ప్రజలు’ అనే వర్గీకరణను తెచ్చినది అనేక విధాలుగా ఎన్బీఏనే. సర్దార్ సరోవర్ ప్రాజెక్టుకు ముందు దేశంలో పలు డ్యామ్‌లు వచ్చాయి. బాక్రా డ్యామ్, హిరాకుడ్ డ్యాం వంటివి వాటిలో కొన్ని. చండీగఢ్ నగరం కూడా అలాంటి భారీ ప్రాజెక్టే. ఇవన్నీ భారీ ఎత్తున ప్రజలను విస్థాపితులను చేశాయి. అయినా, ఈ శరణార్థులకు ప్రభుత్వ పత్రాలలో తప్ప గుర్తింపే లేదు. వారి కడగండ్లు, బాధ, విషాదం సమంజసమైనవిగా పరిగణించేవారే కారు. వారిది దేశ నిర్మాణ ప్రాజెక్టుకు వ్యతిరేకమైన ఆందోళనగా కనిపించేది. మన నైతిక ఊహాత్మకతను విస్తరింపజేసి, అభివృద్ధి బాధితులను బాధితులుగా మన చేత గుర్తింపజేయడం ఎన్బీఏ సాధించిన విజయం. అది ఎన్నటికీ నిలిచి ఉండేది. ఎన్బీఏ, మనందరికీ పర్యావరణ, జీవావరణ స్పృహ కల్పిం చిందనడం సర్వసాధారణమే. కానీ అంతకు మించి అది చాలానే చేసింది. మనకు చూపుతున్న అభివృద్ధి నమూనాను... ఆధునికవాద సాంప్రదాయకత మూసల పరి ధిని దాటి పునరాలోచించడానికి అది మనల్నందర్నీ ఆహ్వానించింది. నర్మదా ఉద్యమం ప్రజా కార్యాచరణకు కొత్త వ్యాకరణాన్ని ఆవిష్కరించింది. గాంధేయవాదం ఆకర్షణను కోల్పోతూ, వివ్లవ హింస మాత్రమే ఏకైక ప్రత్యామ్నాయంగా అనిపిస్తున్న సమయంలో... మేధాపాట్కర్, ఆమె సహచరులు కలసి అహింసకు కట్టుబడి ఉంటూనే పోరాటం, ప్రతిఘటన అనే రాడికల్ గాంధేయవాదాన్ని పునరుద్ధరించారు. ప్రభుత్వ కార్యాలయాలపై దాడి చేసి, వాటిని ఆక్రమించడం మొదలు నీటిలో నిలబడటం వరకు కొత్త పోరాట రూపాలను ఆవిష్కరించారు. ఇటీవలి కాలంలోని మరే ఉద్యమం కన్నా, ఎక్కువగా ఎన్బీఏ పోరాటమే... పాటలు, వాద్య బృందాలు, సినిమాలు, కథలు వగైరా పలు రకాల సాంస్కృతిక కార్యక్రమాలకు విస్తరించడంలో ఆశ్చర్యమేమీ లేదు. పూర్తి డొల్ల రాజకీయాల యుగంలో, ఎన్బీఏ మనకు లోతైన రాజకీయాలకు అర్థం చెప్పింది. ‘నర్మదా బచావ్’ సాధించిన అసలు విజయం నేను, శ్యామా భారత్ గురించి ఆలోచిస్తున్నాను. గత నెలలో ఎన్బీఏ, మా కిసాన్ ముక్తి యాత్రకు బద్వానీ వద్ద స్వాగతం పలికింది. ఆ సందర్భంగానే నేను మొదటిసారిగా ఆమెను కలుసుకున్నాను, ఆమె మాటలు విన్నాను. మా యాత్ర సందర్భంగా ఏర్పాటు చేసిన స్వాగత సభలో శ్యామా మాట్లాడారు. ఆ ప్రాంతపు నిమదీ భాషలో మాట్లాడిన ఆమె ఉపన్యాసాన్ని నేను పూర్తిగా అర్థం చేసుకోలేకపోయాను. అయితే, ఆమె, తన మాటల కంటే బిగ్గరగా మాట్లాడుతుంటే అందులోని ప్రతి మాటా అర్థం చేసుకోవాల్సిన అవసరమే రాలేదు. ఆ సాధారణ గ్రామీణ జాలరి మహిళ భారత రాజ్యాన్ని సవాలు చేయడానికి సాహసించింది. తనను తన ఇంటిని వదిలి పొమ్మనే హక్కు ఎవరిచ్చారని ముఖ్యమంత్రిని, జిల్లా కలెక్టర్‌ను, ఎస్‌డీఎమ్‌ను నిలదీస్తోంది. ఆమె ధిక్కారం తెలుపుతోంది. మూర్తీభవించిన సాహసమై నిలిచింది. నర్మదా బచావ్ ఆందోళన సాధించిన నిజమైన ప్రయోజనం ఆమే. రాజ్యాంగబద్ధమైన మన ప్రజాస్వామ్యంలో మాట్లాడటానికి అర్హతేలేని వారికి ఈ ఉద్యమం గొంతునిచ్చింది. మన ప్రజాస్వామ్యాన్ని అది ప్రజాస్వామ్యీకరించింది. ఎన్బీఏ, తన అంతిమ పోరాటంలో ఓడిపోతున్నట్టుగా కని పించవచ్చు. కానీ అది ఇప్పటికే మనల్నందరినీ గెలుచుకుంది. ఆ ఉద్యమం ఎదుర్కొన్న అపజయాలు మన గతం, విజయాలు మనందరి సమష్టి భవి తకు చెందుతాయి. వ్యాసకర్త స్వరాజ్ అభియాన్, జైకిసాన్ సంస్థల్లో సభ్యుడు, యోగేంద్ర యాదవ్ మొబైల్ : 98688 88986 Twitter: @_YogendraYadav -
పోలీసుల అదుపులో మేథాపాట్కర్
మంద్సౌర్: మధ్యప్రదేశ్‌లోని మంద్సౌర్ మృతుల కుటుంబాలను పరామర్శించేందుకు వెళ్తున్న సామాజిక కార్యకర్తలు మేథాపాట్కర్, స్వామి అగ్నివేశ్, స్వరాజ్ ఇండియా చీఫ్ యోగేంద్ర యాదవ్ తదితరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గిట్టుబాటు ధరలు కల్పించాలని, రుణ మాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేసిన రైతులపై పోలీసులు కాల్పులు జరపడంతో ఐదుగురు రైతులు మృతిచెందారు. మృతుల కుటుంబాలను కలిసేందుకు వస్తుండగా మంద్సౌర్ బయట ధోల్‌దార్ టోల్‌ప్లాజా వద్ద పోలీసులు వీరిని అడ్డుకున్నారు. శనివారం కర్ఫ్యూ ఎత్తివేసినందున ఇపుడిపుడే పరిస్థితులు కుదుటపడుతున్నాయని, ఇపుడు వీరి పర్యటన వల్ల శాంతికి విఘాతం కలిగే ప్రమాదముందని పోలీసులు పేర్కొన్నారు. నిషేధాజ్ఞలు ఉన్నందున అక్కడికి వెళ్లడానికి వీల్లేదని వీరిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో మాహౌ-నీముచ్ జాతీయ రహదారిపై వారు బైఠాయించారు. వీరితో పాటు మరో 30మందిని పోలీసులు బలవంతంగా అక్కడి నుంచి తరలించారు. -
ప్రొ.కోదండరామ్ తో మేథాపాట్కర్ భేటీ
⇔ తెలంగాణలో సమావేశం ఏర్పాటు చేస్తాం: మేథాపాట్కర్ హైదరాబాద్: టీజేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ తో ప్రముఖ పర్యావరణవేత్త, ప్రజా ఉద్యమాల జాతీయ సంఘటన(ఎన్ఏపీఎం) వ్యవస్థాపకురాలు మేథాపాట్కర్ హైదరాబాద్ లో భేటీ అయ్యారు. తెలంగాణలో నిరుద్యోగ సమస్య, రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై చర్చించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో పరిస్థితులను ప్రొఫెసర్ కోదండరామ్ ను అడిగి ఆమె తెలుసుకున్నట్లు చెప్పారు. జాతీయ స్థాయిలో ఉద్యమ సంస్థలు, ప్రజాసంఘాలతో కలిసి తెలంగాణలో త్వరలోనే సమావేశం ఏర్పాటు చేస్తామని మేథాపాట్కర్ తెలిపారు. -
తుందుర్రు ఆక్వా పార్క్‌ను తరలించేదాకా పోరాటం ఆగదు
పర్యావరణాన్ని బాబు ఖూనీ చేస్తున్నారు: మేధా పాట్కర్ భీమవరం/తణుకు: ‘‘తుందుర్రు నుంచి గోదావరి మెగా ఆక్వా ఫుడ్‌పార్క్‌ను తరలించే వరకూ పోరాటం ఆగదు. 25 గ్రామాల ప్రజలు ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడం దారుణం. ప్రజల హక్కులను రాష్ట్ర ప్రభుత్వం ఉల్లంఘిస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యావరణాన్ని ఖూనీ చేస్తున్నారు’’ అని ప్రముఖ పర్యా వరణవేత్త, ప్రజా ఉద్యమాల జాతీయ సంఘటన(ఎన్ఏపీఎం) వ్యవస్థాపకురాలు మేధా పాట్కర్ ధ్వజమెత్తారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరం మండలం తుందుర్రులో నిర్మాణంలో ఉన్న ఆక్వా ఫుడ్‌పార్క్ వ్యతిరేక ఆందోళనకారులతో ఆమె శనివారం రాత్రి సమావేశమయ్యారు. కంసాలి బేతపూడి, తుందుర్రు ప్రజలతో మాట్లాడారు. ఆక్వా ఫుడ్‌పార్క్ నిర్మాణానికి వ్యతిరేకంగా ప్రజలు సాగిస్తున్న పోరా టం న్యాయపరమైన ప్రణాళికలతో ముందుకు వెళ్లేలా జాతీయ స్థాయిలో సహకారం అందిస్తామని చెప్పారు. ఇక్కడి ఆక్వా కాలుష్యంపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం లేదని, కనీసం కేంద్రమైనా సత్వరమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు సింగపూర్ కంపెనీలపై ఉన్న శ్రద్ధ రాష్ట్రంలో పర్యావర ణంపై లేదన్నారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్, పొల్యుషన్ కంట్రోల్ బోర్డు సంయు క్తంగా కలుగజేసుకుని ఇక్కడి మెగా ఆక్వాఫుడ్ పార్క్‌ను తరలించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రజలు ఎలా బతికినా నాకెందుకులే అన్న రీతిలో బాబు పాలన సాగిస్తున్నారని ధ్వజమెత్తారు. మొగల్తూరులోని ఆనంద ఆక్వా ప్లాంట్‌లో ఐదుగురి మృతికి కారణమైన యాజమాన్యంపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
‘చంద్రబాబు కొత్త నిర్వచనం చెబుతున్నారు’
-
భూ సేకరణ బిల్లును ఆమోదించకండి
రాష్ట్రపతికి మేధాపాట్కర్ తదితరుల లేఖ న్యూఢిల్లీ: తెలంగాణ భూ సేకరణ సవరణ బిల్లు–2016 రైతుల ప్రయోజనాలకు గొడ్డలి పెట్టని ప్రముఖ పర్యావరణ వేత్త మేధా పాట్కర్‌తో సహా పలు ప్రజా, రైతు, మహిళా సంఘాల నేతలు తీవ్రంగా విమర్శించారు. ప్రజల మౌలిక హక్కులను కూడా హరిస్తున్న క్రూరమైన జీవో 123కి ఈ బిల్లు ప్రతిరూప మంటూ దుయ్యబట్టారు. దాన్ని ఆమోదిం చొద్దని కోరుతూ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి బుధవారం వారు లేఖ రాశారు. జీవో 123పై ఉమ్మడి హైకోర్టు ఇప్పటికే స్టే ఇచ్చిందని గుర్తు చేశారు. మెరుగైన పరిహారంతో పాటు భూ సేకరణ ప్రక్రియలో పూర్తి పారదర్శకత పాటిస్తూ కేంద్రం తెచ్చిన 2013 చట్టంలోని నిబంధనలన్నింటినీ సవరణ బిల్లు–2016 తుంగలో తొక్కుతోం దని రాష్ట్రపతి దృష్టికి తెచ్చారు. దీనివల్ల తెలంగాణలో లక్షలాది చిన్న, సన్నకారు రైతులకు నష్టం జరుగుతుం దని ఆందోళన వెలిబుచ్చారు. లేఖపై మేధాపాట్కర్, అరుణా రాయ్, సందీప్ పాండే, సుజాత సూరేపల్లి, పద్మజా షా, జీవన్‌కుమార్ వంటి పర్యావరణవేత్తలు, న్యాయవాదులతో పాటు నేషనల్ అలయెన్స్ ఆఫ్ పీపుల్స్ మూవ్మెంట్స్, హక్కుల సంఘం, మల్లన్నసాగర్ ప్రాజెక్టు ప్రభా వితుల సంఘం, రైతు స్వరాజ్య వేదిక, తెలంగాణ వ్యవసాయ వృత్తిదారుల సంఘాల ప్రతినిధులు సంతకాలు చేశారు. -
ఆంధ్రప్రదేశ్‌లో మద్యం తుపాన్
* ప్రముఖ సామాజికవేత్త మేధా పాట్కర్ మండిపాటు * చంద్రబాబు హయాంలో గణనీయంగా పెరిగిన మద్యం వినియోగం * రాజధాని నిర్మాణం పేరిట చంద్రబాబు ప్రజలను మోసగించారు * స్విస్ చాలెంజ్ పేరుతో భారీ అవినీతికి తెరతీశారు * కేంద్రం సహకారంతోనే అరాచకాలకు పాల్పడుతున్నారు సాక్షి, అమరావతి: అప్పట్లో అతిపెద్ద తుపాన్ వల్ల దివిసీమ ఉప్పెన సంభవిస్తే.. మళ్లీ ఇప్పుడు మద్యం తుపాన్ రాష్ట్రాన్ని చుట్టుముట్టిందని ప్రముఖ సామాజికవేత్త మేధాపాట్కర్ ఆందోళన వ్యక్తం చేశారు. మద్య రహిత దేశం కోసం ఉద్యమిస్తేనే స్వచ్ఛభారత్ రూపుదిద్దుకుంటుందని అభిప్రాయపడ్డారు. మత్తు లేని దేశం కోసం ప్రతి ఒక్కరూ ప్రతినబూనాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. మద్యపానానికి వ్యతిరేకంగా గాంధీ జయంతి రోజున కన్యాకుమారి నుంచి మద్య విముక్త భారత్ కోసం మేధా పాట్కర్ ఆందోళన యాత్ర చేపట్టారు. ఆమె గురువారం విజయవాడలో ‘సంగమం’ (లౌకిక ప్రజాస్వామ్యవాదుల, సంస్థల సమైక్య వేదిక) ఆధ్వర్యంలో సభ నిర్వహించారు. ఈ సందర్భంగా మేధా పాట్కర్ ప్రసంగిస్తూ... చంద్రబాబు నాయుడు 1997లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రంలో మద్య నిషేధాన్ని ఎత్తేశారని గుర్తుచేశారు. చంద్రబాబు హయాం నుంచే ఏపీలో మద్యం వినియోగం గణనీయంగా పెరిగిందన్నారు. తమిళనాడులో మద్యం ఆదాయం రూ.26 వేల కోట్లుంటే, ఏపీలో రూ.50 వేల కోట్లకు చేరిందని చెప్పారు. మద్యం ఆదాయాన్ని భారీగా పెంచుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. మద్యం ఉత్పత్తిని అడ్డుకుని, ఎక్సైజ్ చట్టాలను పటిష్టంగా అమలు చేస్తే మద్య నియంత్రణ అసాధ్యం కాదని పేర్కొన్నారు. రాజధాని గ్రామాల్లో పర్యటన సామాజికవేత్త మేధా పాట్కర్ గురువారం రాజధాని గ్రామాల్లో పర్యటించారు. పర్యావరణానికి విఘాతం కలిగించే విధంగా కృష్ణా నదీ తీరంలో వెంకటపాలెం రీచ్‌లో జరుగుతున్న ఇసుక దోపిడీని స్వయంగా పరిశీలించారు. తాత్కాలిక సచివాలయానికే ఇప్పటిదాకా రూ.800 కోట్లు దుబారా చేస్తే శాశ్వత నిర్మాణాలు ఎప్పుడు చేపడతారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రాజధాని ప్రాంతంలోని భూములను పరిశీలించి రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రాజధాని శంకుస్ధాపన ప్రాంతమైన ఉద్ధండరాయునిపాలెంలోనూ పర్యటించారు. చంద్రబాబు కచ్చితంగా నేరస్తుడే రాజధాని నిర్మాణం పేరుతో ప్రకృతి సంపదను అడ్డగోలుగా దోచుకొని, ప్రజలను దారుణంగా మోసగించిన ముఖ్యమంత్రి చంద్రబాబు కచ్చితంగా నేరస్తుడేనని మేధా పాట్కర్ తేల్చి చెప్పారు. చంద్రబాబు ఇక్కడి భూములను సింగపూర్ కంపెనీలకు అప్పగించేందుకు వ్యూహం పన్నారని ఆరోపించారు. ఆమె గురువారం విజయవాడలోని సీపీఎం రాష్ట్ర కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. పంట భూములను బలవంతంగా లాక్కునే హక్కు చంద్రబాబుకు ఎవరిచ్చారని నిలదీశారు. ఆయన కేంద్ర ప్రభుత్వ సహకారంతోనే అరాచకాలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. స్విస్ చాలెంజ్ పేరిట భారీ దోపిడీకి తెరతీశారని ఆరోపించారు. సింగపూర్‌లోని రెండు కంపెనీలతో ముందుగానే మాట్లాడుకొని ఆర్థిక లావాదేవీలు కుదుర్చుకున్నారని దుయ్యబట్టారు. మునిగిపోయే చోట సచివాలయమా? ‘‘శివరామకృష్ణన్ కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం రాజధానిని నిర్మించి ఉంటే పంట భూములు పోయేవి కాదు. ప్రస్తుతం వెలగపూడిలో నిర్మించిన తాత్కాలిక సచివాలయం భవనాలు కొండవీటి వాగు పొంగితే మునిగిపోతాయి. ఇలాంటి ప్రాంతం, మాగాణి భూముల్లో సచివాలయం ఏమిటి? ప్రజావసరాల కోసం భూములు తీసుకోవాల్సి వస్తే 2013 భూసేకరణ చట్టం ప్రకారం ముందుకెళ్లాలే గానీ ఇలా దురాక్రమణ చేయడం దారుణం. ఇలాంటి పరిణామాలు ప్రజల హక్కులకు, ముఖ్యంగా దళితుల హక్కులకు భంగం కలిగిస్తున్నాయి. ఇంతటి ఘోరానికి ఒడిగట్టిన చంద్రబాబు నేరస్తుడు కాక మరేమిటి? ఎస్సీలకు ఇచ్చిన అసైన్మెంట్ భూములపై చంద్రబాబుకు ఎలాంటి హక్కు లేదు. గ్రీన్ ట్రిబ్యునల్‌లో కేసులు నడుస్తున్నందున ప్రజలకు అనుకూలమైన తీర్పు వస్తుందని ఆశిస్తున్నాం’’ అని మేధాపాట్కర్ చెప్పారు. చంద్రబాబు ఇంటి పక్కనే ఇసుక దోపిడీ ‘‘ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంటిపక్కనే కృష్ణా నదిలో ఇసుక దోపిడీ జరుగుతోంది. ఇది చంద్రబాబుకు తెలియకుండా జరిగే అవకాశమే లేదు. అధునాతనమైన యంత్రాలు ఉపయోగించి నదుల్లో ఇసుకను దోపిడీ చేయడం వెనుక చంద్రబాబు హస్తం ఉంది. నదుల్లో ఇసుకను ఇష్టారాజ్యంగా తవ్వేస్తే పర్యావరణానికి తీవ్ర విఘాతం కలుగుతుంది’’ అని మేధా పాట్కర్ ఆందోళన వ్యక్తం చేశారు. మరో సామాజిక కార్యకర్త ఉపేంద్రసింగ్ రావత్ మాట్లాడుతూ... చంద్రబాబు రాజధాని నిర్మాణం పేరుతో పంట భూముల్లో వ్యాపారాలు చేసి, ఆ డబ్బును స్విస్ బ్యాంకుల్లో దాచుకుంటున్నారని ఆరోపించారు. -
సిగ్గుచేటు.. మద్యం లేకుంటే నడవదా?
-
'అమరావతికి పర్యావరణ అనుమతి లేదు'
విజయవాడ: పర్యావరణ అనుమతులు లేకుండా అమరావతి నిర్మాణం జరుగుతోందని సామాజిక ఉద్యమకారిణి మేధా పాట్కర్ ఆరోపించారు. శుక్రవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ... సింగపూర్ కంపెనీలకు దోచిపెట్టేందుకే స్విస్ చాలెంజ్ విధానం అవలంభిస్తున్నారని విమర్శించారు. రాజధాని నిర్మాణం కోసం మూడు పంటలు పండే భూములు తీసుకోవద్దని శివరామకృష్ణన్ కమిటీ ముందే చెప్పిందని గుర్తు చేశారు. ల్యాండ్ పూలింగ్ పేరుతో రాజధాని గ్రామాల్లో భూములను దోచుకుంటున్నారని ఆరోపించారు. ప్రజల హక్కులను హరిస్తూ రాజధాని నిర్మాణం జరుగుతోందని దుయ్యబట్టారు. రాజ్యాంగ విరుద్ధంగా ప్రకృతిని ధ్వంసం చేస్తున్నారని మండిపడ్డారు. వరదొస్తే మునిగిపోయే ప్రాంతంలో రాజధాని కడుతున్నారని తెలిపారు. చంద్రబాబు ఇంటిపక్కనే ఇసుక క్వారీల పేరుతో నదిని కొల్లగొడుతున్నారని విమర్శించారు. ఇదంతా చంద్రబాబు ఆశీస్సులతోనే జరుగుతోందన్నారు. రాజధాని ప్రాంతంలో దళితుల హక్కులను కాలరాస్తున్నారని మేధా పాట్కర్ ధ్వజమెత్తారు. -
సిగ్గుచేటు.. మద్యం లేకుంటే ఏపీ ప్రభుత్వం నడవదా?
విజయవాడ: మద్యం అమ్మకాల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిన నిర్లక్ష్యపు ప్రకటనపై ప్రముఖ సామాజిక వేత్త, రచయిత మేథాపాట్కర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మద్యం అమ్మకపోతే, స్కూళ్లు పథకాలు నడపలేమని ప్రభుత్వాలు అనడం సిగ్గు చేటని మేథాపాట్కర్ మండిపడ్డారు. మద్యం లేని సమాజం కావాలని ఆమె డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వాలు ఇలాగే ముందుకెళితే ఏర్పడేది స్వచ్ఛ భారత్ కాదని, మద్యంతో నిండిన అస్వచ్ఛ భారత్ అవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని గుర్తు చేశారు. నాటి స్వర్గీయ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ మద్యపానాన్ని నిషేధిస్తే నేటి ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు మాత్రం మద్యం అమ్మకాలను తెగ ప్రోత్సహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మద్యం వల్ల రాష్ట్రంలో భయంకరపరిస్థితులు ఉన్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మద్యంపై నిషేధం విధించాలని ఆమె డిమాండ్ చేశారు. -
'రైతులకు కాదు.. రియల్టర్లకు లాభం'
ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి కోసం ప్రభుత్వం చేపట్టిన ల్యాండ్ పూలింగ్తో రైతులకు కాదు, రియల్టర్లకు మాత్రమే లాభం చేకూరుతుందని సామాజికవేత్త మేథా పాట్కర్ విమర్శించారు. మంగళవారం ఢిల్లీలో మేథా మాట్లాడారు. అమరావతి ప్రస్తుత నిర్మాణంతో అన్ని వృత్తులవారి జీవన పరిస్థితులు తీవ్రంగా ప్రభావితమతున్నాయని ఆమె అన్నారు. వరదలు వస్తే సగం నగరం తుడిచి పెట్టుకుపోతుందని మండిపడ్డారు. ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించి అమరావతి నిర్మించాలని మేథా పాట్కర్ డిమాండ్ చేశారు. -
యోధా పాట్కర్
బయోగ్రఫీ అశాంతి, అస్థిమితం, అభివృద్ధి నిరోధకం.. ఈ మూడూ కలిస్తే.. మేధా పాట్కర్! ఇది ప్రభుత్వాల మాట. పర్యావరణ సంరక్షణ, మానవ హక్కుల పరిరక్షణ, సామాజిక ప్రక్షాళన... ఈ మూడింటి కోసం ప్రభుత్వాలను మూడు చెరువుల నీళ్లు తాగిస్తే.. మేధా పాట్కర్!! ఇది ‘నర్మద’ను నమ్ముకున్నవారి మాట. నర్మదా నది నీళ్లను నిజంగా దాహం లేనివాళ్లు తాగినా, నర్మదా నది నీళ్లను నిజంగా రైతులు కానివాళ్లు తాకినా మేధకు ఆగ్రహం వస్తుంది. ఆమె పోరాటం... జల జనిత జ్వాల! ఆమె ఆరాటం జన జీవన మహోజ్వల. ఈమధ్యే మేధ.. మోదీ, అమిత్‌షాల తలలపై నర్మద నీళ్లను కుమ్మరించారు. ఉజ్జయినీ కుంభమేళాకు 172 కోట్ల లీటర్ల నీటిని నర్మదా నది నుంచి తరలించడం ఆమెకు నచ్చలేదు. ఇక మేధ, తర్వాత ఏం చేయబోతున్నారన్నది ఈ దేశంలోని ప్రభుత్వాలు తెలివిమీరి, తెలివితక్కువగా తీసుకోబోయే విధ్వంసకర నిర్ణయాలను బట్టి మాత్రమే ఉంటుంది. ప్రభుత్వం ‘డామ్’ ఇట్ అంది! మేధ 1989 లో నర్మదా బచావో ఆందోళన్ (ఎన్బీయే) మొదలు పెట్టినప్పుడు ఆమె వయసు 35 సం. నర్మదా నదిపై ఆనకట్టలు కట్టడానికి వీల్లేదని ఆమె ఆందోళన. అతి పెద్ద సర్దార్ సరోవర్ డ్యామ్‌ను అసలే కట్టనివ్వకూడదని ఆమె ప్రతిఘటన. ప్రభుత్వం వింటుందా? అభివృద్ధి అంటుంది. సర్దార్ సరోవర్ ఒకటేనా.. నర్మద మీద ఇంకా 30 పెద్ద డ్యాములు, 135 మీడియం డ్యాములు, 3000 చిన్న డ్యాములు కట్టుకోవచ్చుని ట్రిబ్యునలే చెప్పాక ప్రభుత్వానికి మాత్రం ఆగాల్సిన పనేముంది? 2006లో వర్క్ మొదలుపెట్టింది. రెండేళ్లలో ఒక కొలిక్కి తెచ్చింది. కేసుల కొర్రీలతో ఇప్పటికీ డ్యామ్ నిర్మాణం జరుగుతూనే ఉంది. మేధ అన్నం, నీళ్లు మానేశారు నర్మద మధ్యప్రదేశ్‌లో పుట్టింది. అమర్కంఠ్ కొండల్లో. మేధ మహారాష్ట్రలో పుట్టారు. ముంబైలో. నర్మద మూడు రాష్ట్రాల గుండా ప్రవహిస్తుంది. గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర. మేధ.. నర్మదపై డ్యామ్‌ల నిర్మాణానికి వ్యతిరేకంగా రాష్ట్రాలన్నీ తిరుగుతున్నారు. ఇప్పుడు ఆమె వయసు 61 ఏళ్లు. ఆమె ఉద్యమం వయసు 27 ఏళ్లు. ఇప్పటి వరకు మేధ చేపట్టిన అతి పెద్ద ఆందోళన 2006లో ఢిల్లీలో ఆమె చేసిన నిరాహార దీక్ష. మొన్న ఏప్రిల్‌కి ఆ దీక్షకు పదేళ్లు. (అదే ఏడాది జూన్‌లో మేధ వ్యతిరేకిస్తున్న సర్దార్ సరోవర్ డ్యామ్ నిర్మాణం మొదలైంది). కూతురి దీక్ష.. తల్లికి బెంగ మేధ దీక్షకు కూర్చున్నప్పుడు ప్రభుత్వం కన్నా ముందు ఆందోళన చెందే వ్యక్తి ఇందు ఖనోల్కర్. మేధ తల్లి ఆమె. 2006లో మేధ ‘నిరశన’కు కూర్చున్నప్పుడు 77ఏళ్ల ఇందు.. ఎప్పుడూ లేనంతగా కలత చెందారు. అందుకు కారణం ఉంది. మేధకు తిండి మానేసి, పిడికిలి బిగించి కూర్చోవడం మామూలై పోయింది. ఆమె ఆరోగ్యం దెబ్బ తింటుందేమోనని తల్లి బెంగ. 1996లో ఓసారి మేధ 82 రోజుల నిరశనలో కూర్చున్నారు. అప్పట్నుంచి కూతురి నిరశనలను, ధర్నాలను లెక్కించడం మానుకున్నారావిడ! మొదట్లో అప్పుడప్పుడు వెళ్లి వేదిక మీద కూతుర్ని చూసుకుని వచ్చేవారు. ఏం చేస్తోందో, ఎలా ఉందోనని. మేధ పక్కన ఎవరెవరో ఉండేవారు. ఆదివాసీలు, పర్యావరణ పరిరక్షకులు, సామాజిక కార్యకర్తలు, ఇంకా... వచ్చిపోతూ, పూలగుచ్ఛాలు ఇచ్చిపోతుండే సెలబ్రిటీలు. వాళ్లను చూసి తన కూతురు కరెక్టే అనుకునేవారు ఇందు. 2006 నిరశనకు ఆమె వెళ్లలేదు. మేధ సోదరుడు మాత్రం ముంబై నుంచి ఢిల్లీ వెళ్లి ఆమెతో కొద్దిసేపు కూర్చుని వచ్చేశాడు. ఏప్రిల్ 17 సోమవారం 2006 ‘పునరావాసం కల్పించండి’ అని సుప్రీంకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆ వార్త అందగానే ఎవరో వచ్చి మేధకి నిమ్మరసం అందించారు. నిజానికైతే అక్కడి నుంచి ఆమె వెంటనే ముంబై బయల్దేరి వెళ్లాలి. ఆమె కుటుంబ సభ్యులు కూడా అదే ఆశించారు. కానీ ఆమె ఢిల్లీలోనే ఇంకో ఉద్యమ కార్యక్రమంలో నిమగ్నమైపోయారు. రెండు రోజుల తర్వాత గానీ తల్లికి కూతురు అందుబాటులోకి రాలేదు! ‘ఎక్కువ తినొద్దు. చాలా రోజులుగా ఖాళీ కడుపుతో ఉన్నావు కదా. తింటే వాంతి అవుతుంది. ఆరోగ్యం జాగ్రత్త’.. ఇంతకుమించి ఆమె చెప్పేదేమీ ఉండదు. మేధ తల్లికి బీపీ ఉంది. షుగర్ ఉంది. తన కూతురికీ అవి రావచ్చేమోనని ఆమె భయం. 300కు పైగా నిరాహార దీక్షలు మేధ కాలేజీ రోజుల్లో ఎంత చురుగ్గా ఉన్నారో, ఇప్పుడూ అంతే పోరాట పటిమతో ఉన్నారు. మేధ టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సెన్సైస్‌లో ఎం.ఎ. (సోషల్ వర్క్) చదివారు. పీహెచ్‌డీని, ఫ్యాకల్టీగా టాటాలో వచ్చిన అవకాశాన్నీ వదులుకుని స్వచ్ఛంద సంస్థలతో కలిసి ఐదేళ్ల పాటు ముంబై మురికివాడలలో పనిచేశారు. తర్వాత రెండేళ్లు ఈశాన్య గుజరాత్‌లోని ఆదివాసీ జిల్లాల్లో సేవలను అందించారు. మరో ఐదేళ్లు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్‌లలోని నర్మదా నదీ పరివాహక ప్రాంతాలలో పర్యటించారు. డ్యామ్ నిర్మాణాలతో అక్కడి ఆదివాసీలకు జరగబోయే నష్టాన్ని పసిగట్టి ప్రభుత్వాన్ని డీ కొట్టేందుకు సిద్ధమయ్యారు. ‘నర్మదా బచావో ఆందోళన్’ ప్రారంభం అయింది అప్పుడే. ‘నిర్మాణం మనిషి బతుకును కూల్చేయకూడదు’ అన్నది మేధ సిద్దాంతం. ఈ సిద్ధాంతానికి కట్టుబడి ఆమె ఈ మూడున్నర దశాబ్దాలలోనూ అనేక పోరాటాలు చేశారు. 300 కు పైగా నిరాహార దీక్షలు చేశారు! బాల్యంలో మేధ ఎలా ఉండేది? మేధ దయ గల అమ్మాయి! చిన్నప్పుడు తల్లితో కలిసి నడుస్తున్నపుడు.. చేయి చాచిన ప్రతి యాచకునికీ డబ్బు ఇమ్మని తల్లిని పోరేది. స్కూల్లో తెలివైన విద్యార్థిని. ఎప్పుడూ క్లాస్ ఫస్టే. వక్తృత్వపు పోటీల్లోనైతే ఇక చెప్పే పనిలేదు. ఎంతో ఆత్మవిశ్వాసంతో మాట్లాడేది. తన వాదనను స్పష్టంగా వినిపించేది. దాదర్‌లోని కింగ్ జార్జి స్కూల్లో ఆమె చదువుకుంది. (ఇప్పుడది రాజా శివాజీ స్కూలు). మేధ టీచర్లకు ఆమె అంటే ఎంతో ఇష్టం. మేధలో సేవాభావాలు మొలకెత్తడానికి పుష్పాభావే అనే టీచరే కారణం. ప్రధానంగా తల్లిదండ్రుల ప్రభావం మేధపై ఎక్కువగా ఉంది. తండ్రి వసంత్ ఖనోల్కర్ స్వాతంత్య్ర సమరయోధుడు. సామాజిక కార్యకర్త. కార్మిక సంఘం నాయకుడు. తల్లి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి. పోస్టు మాస్టర్‌గా రిటైర్ అయ్యారు. ఉద్యోగంలో ఉన్నప్పుడు, రిటైర్ అయ్యాక కూడా ఆమె ఎన్నో సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. ‘ఉమెన్ ఇన్ డిస్ట్రెస్’ అని మృణాల్ గోర్ సంస్థ ఒకటి ఉండేది. దాంతో పాటు, ‘స్వాధార్’ అనే సంస్థలో ఆమె పని చేశారు. మేధ తండ్రి కూడా 1999లో... ఆయన చనిపోయే ముందు వరకు సంఘహితం కోసం ఏదో ఒకటి చేస్తూనే ఉన్నారు. ఇదంతా మేధ బాల్యపై ప్రభావం చూపింది. క్రమంగా ఆమెను ఉద్యమాల వైపు నడిపింది. విజ్ఞానం.. పోరాటానికి ఆయుధం ఉద్యమ జీవితం మేధను రాటు తేల్చింది. పోలీసులు, కేసు లు, ఆరోగ్యం దెబ్బతినడం.. వేటినీ లెక్క చేయలేదు తను. అనుకున్నది సాధించాలి. అదే లక్ష్యం. అదే ధ్యేయం. విద్య, విజ్ఞానం ఆమె చేపట్టిన ఉద్యమాలకు వెన్నుదన్నుగా నిలబడ్డాయి. టాటా ఇన్స్టిట్యూట్లో ఉన్నప్పుడు మేధ వందల పుస్తకాలు చదివారు! ఉద్యమాలకు ప్రధాన శత్రువు.. చెడు రాజకీయం. ఆ చెడును.. సమాజంలోని మేధావుల, ఆలోచనాపరుల మద్దతుతో ఎదుర్కోగలిగారు మేధ. కానీ అది అంత తేలికైన విషయం కాదని ఈ యోధురాలికి ప్రతి సందర్భంలోనూ అర్థమౌతూనే ఉంది. అయినా.. ఈ జ్వాల ఆరేది కాదు. ఆమె దీక్ష చల్లారేదీ కాదు. మేధ రాజకీయాలు మేధా పాట్కర్ 2014 జనవరిలో ఆమ్ ఆద్మీ పార్టీలో చేరారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో ఆమె నేతృత్వంలోని ‘నేషనల్ అలయెన్స్ ఆఫ్ పీపుల్స్ మూవ్మెంట్’ ఆమ్ ఆద్మీ పార్టీకి మద్దతునిచ్చింది. మేధ కూడా ఆ ఎన్నికల్లో ఈశాన్య ముంబై నియోజకవర్గం నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థిగా లోక్‌సభకు పోటీ చేసినప్పటికీ విజయం సాధించలేకపోయారు. 2015లో ఆమ్ ఆద్మీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. మేధ అవార్డులు ♦ రైట్ లైవ్లీ అవార్డు ♦ గోల్డ్‌మన్ ఎన్విరాన్మెంట్ అవార్డు ♦ గ్రీన్ రాబిన్ అవార్డు ♦ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ అవార్డు ♦ థామస్ నేషనల్ హ్యూమన్ రైట్స్ అవార్డు ♦ దీనానాథ్ మంగేష్కర్ అవార్డు ♦ మమతా ఫూలె అవార్డు ♦ మదర్ థెరిస్సా అవార్డు మేధ ఉద్యమాలు నర్మద బచావో ఆందోళన్ (డ్యామ్ నిర్మాణాలకు వ్యతిరేకం) నేషనల్ అలయెన్స్ ఆఫ్ పీపుల్స్ మూవ్మెంట్స్ (సామాజిక న్యాయం కోసం మేధ నెలకొల్పిన కూటమి) వరల్డ్ కమిషన్ ఆన్ డ్యామ్స్ (మేధ నేతృత్వంలోని కమిషన్) టాటా నానో ప్లాంట్, సింగూర్ (ప్లాంటు స్థాపనకు వ్యతిరేకం) లావాసా (మహారాష్ట్రలోని లావాసా సిటీ నిర్మాణానికి వ్యతిరేకం) గోలిబర్ కూల్చివేత (ముంబైలోని గోలిబర్ ప్రాంతంలో కూల్చివేతలకు నిరసన) హీరానందిని భూ కుంభకోణం (అక్రమ కట్టడాలపై న్యాయపోరాటం) కొవ్వాడ న్యూక్లియర్ ప్రాజెక్టు (భూసేకరణలపై నిరసన) -
రాజధాని ప్రాంతంలో మేథాపాట్కర్
-
నేడు రాజధాని ప్రాంతంలో మేథాపాట్కర్
-
రాజధాని ప్రాంతంలో మేధా పాట్కర్
గుంటూరు: ఆంధ్రప్రదేశ్‌లో నూతనంగా నిర్మించ తలపెట్టిన రాజధాని ప్రాంతాన్ని ప్రముఖ సామాజికవేత్త మేధా పాట్కర్ గురువారం ఉదయం సందర్శించారు. స్థానిక ప్రజలతో మాట్లాడి వారి మనోభావాలు తెలుసుకున్నారు. ప్రజాభిప్రాయన్ని లెక్కచేయకుండా ప్రభుత్వం బలవంతంగా రైతుల భూములను లాక్కోవడాన్ని ఆమె తీవ్రంగా తప్పుపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నది ల్యాండ్ పూలింగ్ కాదన్నారు. దళితులకు తమ భూములను ఇవ్వడానికి ఇష్టపడటం లేదని మేధా పాట్కర్ తెలిపారు.తుళ్లూరు మండలంలోని మూడు పంటలు పండే భూములను సీఆర్డీఏ చట్టం కింద తీసుకోవడం ఏమిటని ఆమె ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రైతులు ఇష్టానుసారంగా కాకుండా వారి మీద ఒత్తిడి తె చ్చి భూమిని లాక్కోవడం సరైన పద్ధతి కాదని మేధా పాట్కర్ అన్నారు. ఇప్పటివరకు భూములు ఇచ్చిన వారు కూడా తమకు ఇష్టం లేకపోతే అభ్యంతర పత్రం దాఖలు చేసుకునే అవకాశం ఉందని ఆమె స్థానికులతో అన్నారు. ఈ కార్యక్రమంలో ఆమెతో పాటు వ్యవసాయశాఖ మాజీ మంత్రి వడ్డె శోభనాధ్రి, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తదితరులు ఉన్నారు. -
ఆ పార్టీ అంతా ఓ తమాషా: మేధాపాట్కర్
ఆమ్ ఆద్మీ పార్టీ మొత్తం ఓ తమాషాగా మారిపోయిందని ప్రముఖ సామాజికవేత్త మేధా పాట్కర్ విమర్శించారు. ఆ పార్టీకి ఆమె శనివారం నాడు రాజీనామా చేశారు. పార్టీ వ్యవస్థాపక సభ్యులైన ప్రశాంత భూషణ్, యోగేంద్ర యాదవ్‌లను పార్టీ నుంచి బయటకు పంపిన తర్వాత జరుగుతున్న అంతర్గత పరిణామాలను దృష్టిలో ఉంచుకుని ఆమె రాజీనామా చేశారు. ఢిల్లీలో జరిగిన ఆప్ సమావేశంలో పరిణామాలు దురదృష్టకరమని ఆమె ముంబైలో విలేకరులతో అన్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ గెలిచి, అధికారం చేపట్టిన నెల రోజుల్లోనే ఇలా జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీలో రాజకీయ సిద్ధాంతాలను మంటగలిపారని అన్నారు. ప్రశాంతభూషణ్, యోగేంద్ర యాదవ్‌లతో వ్యవహరించిన తీరును విమర్శిస్తున్నట్లు మేధాపాట్కర్ చెప్పారు. -
రైతుల కోసం జాతీయ స్థాయి ఉద్యమం
మార్చిలో మేధాపాట్కర్, అన్నాహజారేలను తీసుకొస్తాం సామాజిక వేత్త అగ్నివేశ్ ఏపీ రాజధాని ప్రాంతంలో పర్యటన సాక్షి, విజయవాడ బ్యూరో: కార్పొరేట్ శక్తుల ప్రయోజనాల కోసం రైతు శ్రేయస్సును కాలరాస్తూ, రాజధాని నిర్మాణానికి వేలాది ఎకరాల భూమిని లాక్కొనే చంద్రబాబు ప్రభుత్వ ప్రయత్నాలను తిప్పికొట్టేలా జాతీయ స్థాయిలో ఉద్యమాన్ని నిర్మిస్తామని ప్రముఖ సామాజిక వేత్త స్వామి అగ్నివేశ్ ప్రకటించారు. మార్చి రెండు లేదా మూడోవారంలో మేధాపాట్కర్ను, మార్చి చివరివారంలో అన్నా హజారేను రాజధాని ప్రతిపాదిత ప్రాంతానికి తీసుకొస్తామని రైతులకు ఆయన భరోసానిచ్చారు. గుంటూరు జిల్లా పెనుమాక, వెంకటపాలెం, ఎర్రబాలెం గ్రామాల్లో శుక్రవారం పర్యటించిన బృందానికి అగ్నివేశ్ నేతృత్వం వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబులు ఎన్నికల్లో గెలుపుకోసం డబ్బులు ఖర్చుపెట్టిన కార్పొరేట్ శక్తుల ప్రయోజనాల కోసమే పనిచేస్తున్నారని విమర్శించారు.టీడీపీ ప్రభుత్వం కోసం కేంద్రం తెచ్చిన భూ ఆర్డినెన్సును పార్లమెంటులో అడ్డుకోవాలని అన్ని పార్టీలనూ కోరుతున్నట్టు చెప్పారు. పొలాలు లాక్కునేందుకు వచ్చే వారిని అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. అధికారం ప్రయోగిస్తున్నారు: సంధ్య చంద్రబాబు చేసే కుట్రలను రైతులు, కూలీలు, ప్రజలు సంఘటితంగా తిప్పికొట్టాలని ప్రగతి శీల మహిళా సంఘం జాతీయ కన్వీనర్ సంధ్య పిలుపునిచ్చారు. జన చైతన్య వేదిక అధ్యక్షుడు వి.లక్ష్మణ్‌రెడ్డి మాట్లాడుతూ.. రాజధాని ప్రాంత రైతుల ప్రయోజనాలను కాపాడేలా అన్ని ప్రయత్నాలూ చేస్తున్నట్టు చెప్పారు. బృందంలో సీపీఐ(ఎంఎల్) న్యూడెమొక్రసి రాష్ట్ర నేత చిట్టిపాటి వెంకటేశ్వర్లు, ప్రజా ఉద్యమాల జాతీయ వేదిక కన్వీనర్ పి.రామకృష్ణంరాజు ఉన్నారు. పెట్టుబడిదారుల సేవలో ప్రభుత్వం విజయవాడ: ప్రజల ప్రయోజనాలను విస్మరిస్తున్న ప్రభుత్వాధినేతలు పెట్టుబడిదారుల సేవలో నిమగ్నమయ్యారని స్వామి అగ్నివేశ్ నిప్పులు చెరిగారు. ల్యాండ్ పూలింగ్, భూసేకరణపై కేంద్రం తెచ్చిన ఆర్డినెన్స్‌ను వ్యతిరేకిస్తూ సీపీఐ(ఎంఎల్) న్యూడెమొక్రసీ ఆధ్వర్యంలో విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో శుక్రవారం జరిగిన సదస్సులో అగ్నివేశ్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై మండిపడ్డారు. మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు మాట్లాడుతూ.. రాజధాని ప్రతిపాదిత తుళ్లూరులో ఇటీవల జరిగిన అగ్నిప్రమాదాన్ని విపక్ష పార్టీ అయిన వైఎస్సార్ సీపీపైకి నెట్టేయడం బాబు ప్రభుత్వ అసమర్ధతకు నిదర్శనమని అన్నారు. -
ఏపీ ప్రభుత్వ ఆలోచనలు దారుణం
-
ఏపీ సర్కారు అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోంది:మేధా పాట్కర్
ఢిల్లీ:ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని భూసేకరణ పట్ల అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోందిన ప్రముఖ సంఘ సంస్కర్త మేధా పాట్కర్ విమర్శించారు. సోమవారం సాక్షి టీవీతో మాట్లాడిన ఆమె.. పంట భూముల్లో బిల్డింగ్ లు నిర్మించి పంటలను నాశనం చేస్తారా?అని ప్రశ్నించారు. రైతుల జీవనోపాధి, పర్యావరణానికి జరిగే నష్టాన్ని ఏపీ సర్కారు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. రకరకాల పేరుతో రైతులను బెదిరించి భూసమీకరణ చేస్తున్నారని ఆమె విమ్శరించారు. త్వరలోనే రాజధాని ప్రాంతంలో పర్యటిస్తానని ఆమె స్పష్టం చేశారు. రైతులంతా ఐకమత్యంగా ఉండి పోరాటానాకి సిద్ధం కావాలని ఆమె సూచించారు. -
'భూసేకరణ' మార్పులను వ్యతిరేకించిన మేథా పాట్కర్
న్యూఢిల్లీ: నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకురావాలని భావిస్తున్న భూసేకరణ చట్టంలో మార్పులను సామాజిక ఉద్యమకారణి మేథాపాట్కార్ మంగళవారం న్యూఢిల్లీలో తీవ్రంగా వ్యతిరేకించారు. చట్టంలో మార్పులు తీసుకురావడానికి మోదీ ప్రభుత్వం ఎందుకు తొందరపడుతుందో అర్థం కావడం లేదన్నారు. మార్పులు చేర్పుల కోసం ఆర్డినెన్స్ మార్గాన్ని ఎందుకు ఎంచుకుంటోందని ఆమె ప్రశ్నించారు. కార్పొరేట్ వర్గాలకు మేలు చేసేందుకు మాత్రమే మోదీ ప్రభుత్వం ఈ మార్పులు చేస్తుందని ఆరోపించారు. కేవలం భూసేకరణ చట్టం వల్లే రూ. 20 లక్షల పెట్టుబడులు ఆగిపోయాయనడం సరికాదని మేథాపాట్కర్ అభిప్రాయపడ్డారు. -
మనమేమైనా ఎమర్జెన్సీలో ఉన్నామా?
ఢిల్లీ: భూసేకరణ చట్టంలో కేంద్ర ప్రభుత్వం మార్పులు చేయడాన్ని సామాజిక ఉద్యమకర్త మేథా పాట్కర్ వ్యతిరేకించారు. కేంద్రం ఆర్డినెన్స్ మార్గాన్ని ఎందుకు ఎంచుకుంటుందో చెప్పాలని డిమాండ్ చేశారు. మోదీ సర్కారు ఆరు నెలల కాలంలో మూడు ఆర్డినెన్సులు తీసుకొచ్చిందని గుర్తు చేశారు. మనమేమైనా ఎమర్జెన్సీలో ఉన్నామా అని ట్విటర్ లో ప్రశ్నించారు. కార్పొరేట్ వర్గాలకు మేలు చేసేందుకు మాత్రమే కేంద్ర ప్రభుత్వం భూసేకరణ చట్టంలో మార్పులు చేస్తోందని ఆమె ఆరోపించారు. కేవలం భూసేకరణ చట్టం వల్లే 20 లక్షల రూపాయల పెట్టుబడులు ఆగిపోయాయనడం సరికాదని మేథాపాట్కర్ పేర్కొన్నారు. భూసేకరణ చట్టంలో మార్పులు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్స్ రైతుల ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉందన్నారు. -
బాధితులకు ‘జాక్’ బాసట
అంబేద్కర్ కాలనీ క్రమబద్ధీకరణకు డిమాండ్ సాక్షి, ముంబై: ఎంతో మంది పేదలకు నిలువ నీడ లేకుండా చేస్తూ బీఎంసీ అధికారులు తూర్పు ములుండ్ బాబాసాహెబ్ అంబేద్కర్‌నగర్‌లో 130 గుడిసెలను కూలగొట్టడంపై ముంబై తెలంగాణ జాక్ (ఎంటీ జాక్) ఆగ్రహం వ్యక్తం చేసింది. ముందుగా నోటీసులు ఇవ్వకుండానే డెవలపర్లు ఈ నెల 21న ఈ గుడిసెలను నేలమట్టం చేశారు. మురికివాడల సంరక్షణ చట్టానికి ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీని ప్రకారం 2000 సంవత్సరం కంటే ముందు వేసుకున్న గుడిసెలను క్రమబద్ధీకరించి సదుపాయాలు కల్పిస్తారు. ఈ చట్టం ముంబైలోని మూడు లక్షల గుడిసెలను రక్షిస్తుందన్న అంచనా. అంబేద్కర్‌నగర్ కాలనీవాసులకుకూడా ఈ చట్టం ఎందుకు వర్తింపజేయడం లేదని జాక్ ప్రశ్నించింది. ఇక్కడున్న ప్రతి గుడిసెను 2000 కంటే ముందే నిర్మించారని స్పష్టం చేసింది. వీళ్లంతా 1985 నుంచే ఇక్కడ నివసిస్తున్నట్టు నిరూపించగల పత్రాలూ ఉన్నందున, కూల్చివేతలు చట్ట వ్యతిరేకమని స్పష్టం చేసింది. తమకు అదే స్థలంలోనే తిరిగి ఇళ్లు కట్టించాలి లేదా ప్రత్యామ్నాయం చూపెట్టాలనే డిమాండ్‌తో బాధితులు గత నెల 21 నుంచి ఆమరణ నిరాహారదీక్షకు పూనుకున్నారు. వీరిలో ఇరవై శాతం తెలుగు ప్రజలు. అంబేద్కర్‌నగర్ వాసుల న్యాయపరమైన పోరాటానికి ‘ఘర్ బచావ్-ఘర్ బనావ్ ఆందోళన్’ సంస్ధ నాయకురాళ్లు మేథా పాట్కర్, పూనం కనోడియా నాయక త్వం వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎంటీ జాక్ సభ్యులు శుక్రవారం సాయంత్రం ఘటనాస్థలానికి వెళ్లి నిర్వాసితులకు మద్దతు ప్రకటించారు. ములుండ్, భాండుప్ ప్రాంతాల్లోని తెలుగువారితోపాటు త్వరలోనే దీక్షలో పాల్గొంటామని ‘జాక్’ కన్వీనర్ బి. ద్రవిడ్ మాదిగ, గాది లక్ష్మణ్ తెలిపారు. ముంబైలోని ఇతర తెలుగు సంఘాలు ఈ ఆందోళనలో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. -
‘మెట్రో’ కారిడార్-2ను ఆపాలి
హైదరాబాద్: మెట్రోరైలు ప్రాజెక్టు కారిడార్-2ను ఆపాలని సామాజికవేత్త, ఆమ్ ఆద్మీ పార్టీ నేత మేథాపాట్కర్ డిమాండ్ చేశారు. ఈ అంశాన్ని తమ మేనిఫెస్టోలో పొందుపరిచామని తెలిపారు. ఆప్ ఆధ్వర్యంలో ఆదివారం మెట్రోరైలు ప్రాజెక్టు కారిడార్-2ను ఆపాలని కోరుతూ కాచిగూడ క్రాస్‌రోడ్స్ నుంచి బడీచౌడి, కోఠి ఆంధ్రాబ్యాంక్ చౌరస్తా వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సుల్తాన్‌బజార్‌లో మెట్రోరైలు ప్రాజెక్టు నిర్మాణం చేపట్టడం వల్ల చారిత్రాత్మక కట్టడాలైన ఆర్యసమాజ్, జైన్‌మందిర్, హనుమాన్ దేవాలయాలను కూల్చివేయాల్సి వస్తుందని తెలిపారు. దీంతో లాభాల కంటే నష్టాలే ఎక్కువన్నారు. మెట్రోరైలు నిర్మాణం పేరిట ఎల్అండ్టీ కంపెనీ అవసరం లేకున్నా.. వేలకోట్ల రూపాయల విలువగల భూములను స్వాధీనం చేసుకుందని ఆరోపించారు. చారిత్రాత్మకమైన కట్టడాలను ఉన్న చోట అండర్‌గ్రౌండ్ ద్వారా మెట్రో రైలు నిర్మాణం చేపట్టాలని ఆమె డిమాండ్ చేశారు. గుజరాత్లో ప్రతి మూడు నిమిషాలకు ఒక అత్యాచారం జరుగుతోందని తెలిపారు. శాంతి భద్రతలను పరిరక్షించడంలో విఫలమైన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నరేంద్రమోడీ మొత్తం దేశంలో ఎలా కాపాడుగలుగుతారని ప్రశ్నించారు. కాంగ్రెస్, బీజేపీలకు ఓటు వేయొద్దని ఆమె ప్రజలను కోరారు. కార్యక్రమంలో సామాజిక వేత్త సి.రామచంద్రయ్య, ఆప్ నేతలు సుమన్గుప్తా, సురేష్‌గోయల్, శశిభూషన్, రాజన్‌శర్మ, నీరజ్‌కుమార్, అలోఖ్, చక్రధర్ తదితరులు పాల్గొన్నారు. -
శివసేన, ఎమ్మెన్నెస్ మధ్య ఘర్షణ
సాక్షి, ముంబై: లోక్‌సభ ఎన్నికలకు ఒకరోజు ముందు మాన్ఖుర్డ్లో బుధవారం అర్ధరాత్రి శివసేన-ఎమ్మెన్నెస్‌ల మధ్య ఘర్షణ జరిగింది. డబ్బులు పంపిణీ చేస్తున్నారనే విషయంపై ఇరు పార్టీల కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణలో ఒకరిపై మరొకరు రాళ్లు రువ్వుకున్నారు. ఇరు వర్గాలను అడ్డుకునేందుకు ప్రయత్నించిన పోలీసులపై కూడా కొందరు కార్యకర్తలు దాడి చేశారు. ఈ ఘటనలో ఓ పోలీసు కానిస్టేబుల్ తీవ్రంగా గాయపడ్డారు. దీంతో ఒక్కసారిగా మాన్‌ఖుర్డ్ పరిసరాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎన్నికల ప్రచారం ముగియడంతో అంతా సవ్యంగా ప్రచారం ముగిసిందని భావించారు. అయితే బుధవారం అర్ధరాత్రి ఓటర్లకు డబ్బులు పంపిణీ విషయంపై శివసేన, ఎమ్మెన్నెస్‌ల మధ్య ఘర్షణ తలెత్తింది. మాన్‌ఖుర్డ్ ప్రాంతం దక్షిణ మధ్య ముంబై లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. ఈ లోక్‌సభ నియోజకవర్గం నుంచి శివసేన నుంచి రాహుల్ శెవాలే పోటీ చేస్తుండగా ఎమ్మెన్నెస్ నుంచి ఆదిత్య శిరోడ్కర్ బరిలో ఉన్నారు. బుధవారం అర్ధరాత్రి స్థానికంగా డబ్బులు పంపిణీ చేస్తున్నారనే సమాచారంతో ఇరు పార్టీల కార్యకర్తలు అక్కడికి చేరుకోవడంతో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది. రెండు వర్గాలు రాళ్లు రువ్వుకోవడం మొదలుపెట్టారు. వారిని అదుపు చేసేందుకు వచ్చిన వికాస్ థోరబోలే అనే పోలీస్ కానిస్టేబుల్‌కు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఆయనను ఆస్పత్రికి తరలించారు. కాగా, ఈ ఘర్షణకు కారణం మీరంటే మీరని శివసేన, ఎమ్మెన్నెస్ పార్టీలు ఒకరిపై ఒకరు బురద జల్లుకోవడం మొదలుపెట్టారు. కామిని శెవాలేతోపాటు మొత్తం 18 మందిపై కేసులు నమోదు... దక్షిణ మధ్య ముంబై లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న శివసేన అభ్యర్థి రాహుల్ శెవాలే సతీమణి, మాజీ కార్పొరేటర్ కామిని శెవాలేతోపాటు మొత్తం 18 మందిపై ట్రాంబే పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ విషయంపై సీనియర్ ఇన్స్పెక్టర్ విజయ్ కదం అందించిన వివరాల మేరకు ఘర్షణలో కామినితోపాటు 18 మందిపై హత్యాయత్నం, ప్రభుత్వ పనుల్లో అడ్డంకులు సృష్టించడం, సిబ్బందిపై దాడిచేయడం, అల్లర్లు సృష్టించేందుకు ప్రయత్నించడం తదితర అంశాల కేసులు నమోదు చేశారన్నారు. కానిస్టేబుల్ గొంతు కోశారా..? శివసేన, ఎమ్మెన్నెస్ ఘర్షణలో పోలీసు కానిస్టేబుల్ వికాస్ థోరబోలేపై దాడి జరిగిందని తెలిసిన కొందరు దుండగులు కావాలనే అతడిపై దాడిచేసి గొంతు కోశారని తెలిసింది. తీవ్రంగా గాయపడ్డ ఆయనను చెంబూర్‌లోని జాయి ఆస్పత్రిలో చేర్పించారు. ఈ విషయంపై పెద్దగా ఎవరూ మాట్లాడేందుకు ముందుకు రాకపోయినప్పటికీ దుండగులు వికాస్ థోరబోలే గొంతుకోశారని తెలిసింది. ఆయన గొంతు వద్ద శ్వాసనాళికకు తీవ్ర గాయమైందని దీంతో రక్తస్రావం కూడా అధికంగా జరిగింది. దీంతో బాధితుడి ఆరోగ్య పరిస్థితి కొంత విషమంగా ఉందని సమాచారం. -
మేధా పాట్కర్‌కు మద్దతిస్తాం: ఏఏపీ
న్యూఢిల్లీ: సామాజిక కార్యకర్త మేధా పాట్కర్ వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తానంటే మద్దతు ఇస్తామని ఆమ్ ఆద్మీ పార్టీ(ఏఏపీ) ప్రకటించింది. సాధారణ ఎన్నికల్లో బరిలోకి దిగాలని ఆమె భావిస్తే మద్దతు ఇచ్చేందుకు సిద్ధమని ఏఏపీ సీనియర్ నాయకుడు, రాజకీయ వ్యవహారాల కమిటీ(పీఏసీ) ప్రతినిధి సంజయ్ సింగ్ తెలిపారు. పోటీ చేయాలా, వద్దా అనేది ఆమె నిర్ణయించుకోవాలని సూచించారు. మేధా పాట్కర్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసినా ఆమెకు సంపూర్ణ మద్దతు పలుకుతామని వెల్లడించారు. దేశవ్యాప్తంగా పలు ఉద్యమాలు చేసిన మేధా పాట్కర్ ఇప్పటికే ఆమ్ ఆద్మీ పార్టీకి మద్దతు ప్రకటించారు. అయితే ఇంకా ఏఏపీలో చేరలేదు. వాయవ్య ముంబై స్థానం నుంచి ఆమె పోటీ అవకాశాలున్నాయని సంకేతాలు వస్తున్నాయి. ఈ ప్రాంతంలో మురికివాడలు ఎక్కువగా ఉన్నాయి. ఈ మురికివాడలను ప్రభుత్వం తొలగించేందుకు ప్రయత్నించినప్పుడు మేధా పాట్కర్ బాధితుల తరపున పోరాటం చేశారు. -
పోటికి సిద్దమైతే, మేధా పాట్కర్ కు పూర్తి మద్దతు: ఆప్
లోకసభ ఎన్నికల్లో సామాజిక కార్యకర్త మేధా పాట్కర్ పోటికి సిద్దమైతే పూర్తిస్థాయిలో తాము మద్దతిస్తాం అని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రకటించింది. అయితే పోటీ చేయాలో వద్దో మేధా పాట్కర్ నిర్ణయం తీసుకోవాలని ఆప్ పొలిటికల్ ఆఫైర్స్ కమిటీ నేత సంజయ్ సింగ్ తెలిపారు. ఒకవేళ పాట్కర్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసినా.. పూర్తి సహకారం అందిస్తామని సంజయ్ వెల్లడించారు. నర్మద బచావో ఆందోళన చేపట్టిన మేధా పాట్కర్ ఆప్ కు పూర్తి మద్దతు తెలిపిన సంగతి తెలిసింది. ఈశాన్య ముంబై స్థానం నుంచి కాని, తాను ఉద్యమించిన ప్రాంతంలోని ఓ స్థానం నుంచి లోకసభ బరిలోకి దిగే అవకాశం ఉంది అని వార్తలు వెలువడుతున్నాయి. ఈశాన్య ముంబైలోని మురికి వాడల కూల్చివేతకు వ్యతిరేకంగా మహారాష్ట్ర ప్రభుత్వంపై గతంలో పోరాటం చేశారు. -
ఇక జనతా దర్బార్ ఉండదు
ఆన్లైన్లో సమస్యలు చెప్పుకోవచ్చు: కేజ్రీవాల్ హాట్లైన్లను ఏర్పాటుచేస్తాం సాక్షి, న్యూఢిల్లీ: ప్రజా సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని, వారినుంచి వినతిపత్రాలు స్వీకరించే ఉద్దేశంతో ప్రారంభించిన జనతాదర్బార్ కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సోమవారం ప్రకటించారు. ఇకపై జనతాదర్బార్ ఉండబోదని, ఆన్లైన్లో కానీ, హెల్ప్‌లైన్ ద్వారా కానీ, పోస్ట్ ద్వారా కానీ ప్రజలు తమ సమస్యలను ప్రభుత్వానికి తెలియజేయాలని స్పష్టం చేశారు. సంబంధిత శాఖల అధికారులు హెల్ప్‌లైన్ నంబర్లను త్వరలో ప్రకటిస్తారని, సెక్రటేరియట్లో కూడా త్వరలో ఒక హెల్ప్బాక్స్ను ఏర్పాటు చేస్తామన్నారు. ఊహించని స్థాయిలో ప్రజలు రావడం, నిర్వహణ లోపంతో కేజ్రీవాల్ తన మంత్రివర్గ సహచరులతో కలిసి ఢిల్లీ సచివాలయ ఆవరణలో మొట్టమొదటిసారిగా శనివారం నిర్వహించిన జనతా దర్బార్ రసాభాసగా మారిన విషయం తెలిసిందే. పటిష్ట ఏర్పాట్లతో మళ్లీ జనతా దర్బార్‌ను ఏర్పాటుచేస్తామని అప్పుడు ప్రకటించిన ముఖ్యమంత్రి.. తాజాగా ఆ కార్యక్రమాన్ని రద్దుచేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అయితే, తనను ప్రత్యక్షంగా కలవాలనుకునేవారి కోసం వారంలో ఒక రోజు రెండు నుంచి మూడుగంటల సమయం కేటాయిస్తానన్నారు. ప్రభుత్వం తనకు కల్పిస్తున్న జెడ్ కేటగిరీ భద్రతపై, వాటర్ ట్యాంకర్ మాఫియా, టెండర్ మాఫియా నుంచి ముప్పు ఉందన్న ఐబీ నివేదికలపై విలేకరులు ప్రశ్నించగా ‘నాకు భద్రత అవసరం లేదని ఇప్పటికే చాలాసార్లు చెప్పాను. ముఖ్యమంత్రులకు, మంత్రులకు భద్రత కల్పించడం ముఖ్యం కాదు. సామాన్యులకు రక్షణ కల్పించాలి’ అన్నారు. ఆప్‌కు జైకొట్టిన మేధా పాట్కర్ ముంబై: ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)కి ప్రముఖ సామాజిక కార్యకర్త, నర్మదా బచావో ఆందోళన్ ఉద్యమకారిణి మేధా పాట్కర్ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో ఆప్ తరఫున ఆమె బరిలోకి దిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. దాదాపు 200 ప్రజా సంఘాలతో ఏర్పడిన ‘నేషనల్ అలయెన్స్ ఫర్ పీపు ల్స్ మూవ్మెంట్స్’ కూటమికి మేధాపాట్కర్ కన్వీనర్‌గా వ్యవహరిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ తరఫున పోటీ చేస్తారా అని అడగ్గా.. ‘నేను ఇప్పుడు దేన్నీ తోసిపుచ్చలేను. రాజకీయాలు అంటరానివని మేం భావించడం లేదు. మా ఆలోచనలు ఆ పార్టీ ఆలోచనలకు సారూప్యత ఉంది’ అని ఆమె చెప్పారు. ‘బీజేపీ ఇప్పటికైనా తన తప్పు తెలుసుకోవాలి. మోడీకి బదులు గోవా సీఎం మనోహర్ పారికర్‌ను ప్రధాని బరిలో దించాలి’ అని ఆప్ సూచించింది. -
ఆప్‌లో చేరడంపైనిర్ణయించుకోలేదు
ముంబై: ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)లో చేరే విషయంలో ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ప్రముఖ సంఘ సంస్కర్త మేధా పాట్కర్ తెలిపారు. తాను సభ్యురాలిగా ఉన్న నేషనల్ అలయన్స్ ఆఫ్ పీపుల్స్ మూమెంట్(ఎన్‌పీఎం)తో ఆప్ నాయకుడు యోగేంద్ర యాదవ్ చర్చలు జరిపారని ఆమె గురువారం మీడియాకు తెలిపారు. ఈ నెల 12న ముంబైలో, 23, 24న వార్ధాలో ఎన్‌పీఎం సమావేశాలున్నాయని చెప్పారు. ఇదిలావుండగా ఈ నెల 15 కల్లా ఆప్ పార్టీలో చేరడంపై ఓ స్పష్టత వచ్చే అవకాశముందని ఇటీవల ఇండోర్‌లో మేధా పాట్కర్ తెలిపారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నాయకత్వాన్ని ఆమె ప్రశంసించారు. ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు కేజ్రీవాల్ బృందానికి మంచి ప్లాట్‌ఫామ్ దొరికిందని తెలిపారు. -
విధ్వంసాన్ని ఆహ్వానించడమే : మేథా పాట్కర్
శ్రీకాకుళం: అణువిద్యుత్ కేంద్రం నిర్మించడమంటే విధ్వంసాన్ని ఆహ్వానించడమేనని ప్రముఖ సామాజిక పర్యావరణవేత్త మేథా పాట్కర్ హెచ్చరించారు. రణస్థలం మండలంలోని మత్స్యకార గ్రామమైన కొవ్వాడలో కేంద్ర ప్రభుత్వం అణువిద్యుత్ కేంద్రం నిర్మించ తలపెట్టిన విషయం తెసిందే. ఈరోజు కొవ్వాడలో మేథా పాట్కర్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజాఉద్యమం ద్వారా అణు విద్యుత్ కేంద్రం నిర్మాణాన్ని అడ్డుకుంటామన్నారు. ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాఅణువిద్యుత్ కేంద్ర నిర్మాణ పనులను ప్రభుత్వం వేగవంతం చేసింది. ఇందులో భాగంగా కోటపాలెం, రామచంద్రాపురం గ్రామాలకు చెందిన రైతులకు సంబంధించిన భూము లను స్వాధీనం చేసుకోవడానికి మొదటి విడతగా 481 ఎకరాలకు సంబంధించి 4(1) నోటీసులను ప్రభుత్వం జారీ చేసింది. అయితే, ఆ భూములపై ఎలాంటి అభ్యంతరాలున్నా తెలియజేయూలని రైతులను ప్రభుత్వం కోరింది. ఇందులో భాగంగా ఈ నెల 27న రామచంద్రాపురం, 29న కోటపాలెం గ్రామాల్లో అభ్యంతరాలపై గ్రామ సభలు నిర్వహిస్తున్నట్లు ఆయూ గ్రామాలతో పాటు మండల కేంద్రంలోని పలు ప్రభుత్వ కార్యాలయాల వద్ద ప్రభుత్వ అధికారులు నోటీసులను అతికించారు. దీంతో కొవ్వాడ పంచాయతీ పరిధిలోని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఏళ్ల తరబడి అణువిద్యుత్ కేంద్రానికి వ్యతిరేకంగా పోరాటాలు చేస్తున్నా కనీసం పట్టించుకోకపోవడంపై మండిపడుతున్నారు. గ్రామసభలకు ముందు ప్రజాభిప్రాయ సేకరణ సభలు ఏర్పాటు చేయూలని కోరుతున్నారు. ప్రజల అభిప్రాయం తెలుసుకోకుండా నేరుగా అభ్యంతరాలపై గ్రామ సభలు పెట్టడం సరికాదని ఈ ప్రాంత మత్స్యకారులు, రైతులు, ప్రజలు, పలు రాజకీయ నాయకులు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రభుత్వం క్షుణంగా పరిశీలించి నిర్ణయాలు తీసుకోకపోతే ఆందోళనలు, పోరాటాలు ఉధృతం చేస్తామని ప్రజలు హెచ్చరిస్తున్నారు. ప్రజా ఉద్యమం తీవ్రరూపం దాల్చడం, మేథా పాట్కర్ వంటివారు రావడంతో అణువిద్యుత్ కేంద్రంకై భూసేకరణ గ్రామసభలను అధికారులు వాయిదా వేశారు. -
విధ్వంసకర అభివృద్ధి వద్దు: మేధా పాట్కర్
సాక్షి, విశాఖపట్నం: ‘విధ్వంసకర అభివృద్ధి వద్దు. ప్రజలే కేంద్రంగా జరిగే అభివృద్ధి కావాలి. కార్పొరేట్ సంస్థల కోసం ప్రజల్ని బలిపెట్టొద్దు. ప్రభుత్వ భూములంటే.. అవి ప్రజలవే. అలాంటి ప్రజల్నే నిర్వాసితుల్ని చేసి సాధించే అభివృద్ధి ఎవరి కోసమో అందరికీ తెలిసిందే’నంటూ ప్రముఖ సామాజిక ఉద్యమకారిణి, ప్రజా ఉద్యమాల జాతీయ వేదిక (ఎన్ఏపీఎం) జాతీయ కన్వీనర్ మేధా పాట్కర్ అన్నారు. ‘మురికివాడ నివాసుల సంక్షేమ సంఘం-ప్రజల కేంద్రంగా అభివృద్ధి సాధనా ఉద్యమం’ ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద సోమవారం జరిగిన బహిరంగ సభలో ఆమె ప్రధాన వక్తగా మాట్లాడారు. ‘నగరం/పట్టణం అభివృద్ధిలో స్థానికుల పాత్ర మరువలేనిది. ఎవరి కారణంగా ప్రస్తుతం నగరాలు ఇంతలా అభివృద్ధి చెందాయో అలాంటి వారినే నగరానికి దూరంగా తరలిస్తున్నారు. పేదరికాన్ని దూరం చేయాలన్న ఆలోచన చేయకపోగా.. పేదల్ని దూరం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో 1956 చట్టం, మహారాష్ట్రంలో 1971 చట్టం మురికివాడల్ని స్థానికంగానే అభివృద్ధి పరిచి, వారికి ఆ స్థలంపై హక్కు కల్పించాలని చెప్తోంది. ఈ చట్టలను ప్రభుత్వమే నీరుగారుస్తోంది. గాంధీ, నెహ్రూ, అంబేద్కర్ పేరిట పథకాల్ని ప్రవేశపెట్టి, పేదల్ని ఇబ్బందులపాల్జేస్తున్నారు. ఉన్నతాధికారులు, బడా నేతలు, షాపింగ్ మాల్స్ ఊరుకు దూరంగా ఉన్నా.. ఫర్వాలేదు. పేదలు మాత్రం స్థానికంగానే ఉండాలి. లేకుంటే ఉపాధి, మౌలిక వసతులకు దూరమయ్యే ప్రమాదం ఉంది. పేదలకు వారున్న చోట, వారే ఇళ్లుకట్టుకునే అవకాశాలు కల్పించాలి’ అని మేధాపాట్కర్ అన్నారు. -
అక్రమ విక్రయం
సాక్షి, ముంబై: నష్టాల్లో నడుస్తున్నాయని కుంటిసాకులు చూపుతూ రాష్ట్రంలోని సహకార చక్కెర కర్మాగారాలను చౌకగా అమ్మేస్తున్నారని ప్రముఖ సామాజిక కార్యకర్తలు అన్నా హజారే, మేధా పాట్కర్‌లు ఆగ్రహం వ్యక్తం చేశారు. నష్టాలను కారణంగా చూపుతూ అయినవారికి తక్కువ ధరకే చక్కెర కర్మాగారాలను కట్టబెడుతున్నారని, ఈ వ్యవహారం మొత్తంలో పదివేల కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని వారు ఆరోపించారు. సహకార రంగంలోని చక్కెర కర్మాగారాల విక్రయాన్ని వ్యతిరేకిస్తూ నగరంలోని ఆజాద్ మైదాన్ నుంచి మంత్రాలయ వరకు బుధవారం భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో అన్నాహజారే, మేధా పాట్కర్‌లు అధికార, ప్రతిపక్షాలపై ధ్వజమెత్తారు. కర్మాగారాలను కొనుగోలు చేసిన వారితో రాజకీయ నాయకులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా సంబంధాలున్నాయని ఆరోపించారు. న్యాయవిచారణ జరిపించాలి.. చక్కెర పరిశ్రమల విక్రయాల్లో జరిగిన కుంభకోణానికి సంబంధించిన న్యాయవిచారణ జరిపించాలని అన్నా హజారే, మేధా పాట్కర్‌లు డిమాండ్ చేశారు. దీంతోపాటు ఇతర పరిశ్రమల నిర్వహణపై కూడా విచారణ జరపాలన్నారు. ఈ కుంభకోణంలో అధికార, ప్రతిపక్షాలు బాధ్యులేనని చెప్పారు. న్యాయవిచారణ జరిపించినట్టయితే బీహార్‌లో లాలూప్రసాద్ యాదవ్ జైలుకు వెళ్లినట్టు అనేక మంది మహారాష్టల్రోని నాయకులు కూడా కుంభకోణం కేసుల్లో జైలుకు వెళ్తారన్నారు. ఈ సభలో ఎంపీ రాజు శెట్టి, మాజీ ఎమ్మెల్యే మాణిక్ జాధవ్లతోపాటు రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన రైతులు, చక్కెర పరిశ్రమలపై ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడి జీవనం సాగిస్తున్న అనేక మంది రైతులు, కార్మికులు పాల్గొన్నారు. వీరంతా ప్రభుత్వ, ప్రతిపక్షాలపై తీవ్రంగా మండిపడ్డారు. జైలుభరో చేపడతాం.. న్యాయవిచారణ జరిపి, జరుగుతున్న విక్రయాలను నిలిపివేయనట్టయితే జైలుభరోకు పిలుపునిస్తామని హజారే, పాట్కర్‌లు హెచ్చరించారు. చక్కెర పరిశ్రమలన్నింటిపై యాజమాన్య హక్కులు రైతులకే కల్పించాలని డిమాండ్ చేశారు. తమ డిమాండ్లను నెరవేర్చకపోతే రాష్టవ్య్రాప్తంగా జైలుభరో చేపడతామని హెచ్చరించారు. ఈ సభ అనంతరం సహ్యాద్రి గెస్టహౌస్కు వెళ్లిన వీరందరు ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్‌తో భేటీ అయ్యారు. కుంభకోణానికి సంబంధించిన విషయాలను ఆయనకు వివరించారు. వెంటనే విక్రయాలను ఆపివేయాలని కోరారు.