సాక్షి, ముంబై: లోక్‌సభ ఎన్నికలకు ఒకరోజు ముందు మాన్‌ఖుర్డ్‌లో బుధవారం అర్ధరాత్రి శివసేన-ఎమ్మెన్నెస్‌ల మధ్య ఘర్షణ జరిగింది. డబ్బులు పంపిణీ చేస్తున్నారనే విషయంపై ఇరు పార్టీల కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణలో ఒకరిపై మరొకరు రాళ్లు రువ్వుకున్నారు. ఇరు వర్గాలను అడ్డుకునేందుకు ప్రయత్నించిన పోలీసులపై కూడా కొందరు కార్యకర్తలు దాడి చేశారు. ఈ ఘటనలో ఓ పోలీసు కానిస్టేబుల్ తీవ్రంగా గాయపడ్డారు. దీంతో ఒక్కసారిగా మాన్‌ఖుర్డ్ పరిసరాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
ఎన్నికల ప్రచారం ముగియడంతో అంతా సవ్యంగా ప్రచారం ముగిసిందని భావించారు. అయితే బుధవారం అర్ధరాత్రి ఓటర్లకు డబ్బులు పంపిణీ విషయంపై శివసేన, ఎమ్మెన్నెస్‌ల మధ్య ఘర్షణ తలెత్తింది. మాన్‌ఖుర్డ్ ప్రాంతం దక్షిణ మధ్య ముంబై లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోకి వస్తుంది. ఈ లోక్‌సభ నియోజకవర్గం నుంచి శివసేన నుంచి రాహుల్ శెవాలే పోటీ చేస్తుండగా ఎమ్మెన్నెస్ నుంచి ఆదిత్య శిరోడ్కర్ బరిలో ఉన్నారు. బుధవారం అర్ధరాత్రి స్థానికంగా డబ్బులు పంపిణీ చేస్తున్నారనే సమాచారంతో ఇరు పార్టీల కార్యకర్తలు అక్కడికి చేరుకోవడంతో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది. రెండు వర్గాలు రాళ్లు రువ్వుకోవడం మొదలుపెట్టారు. వారిని అదుపు చేసేందుకు వచ్చిన వికాస్ థోరబోలే అనే పోలీస్ కానిస్టేబుల్‌కు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఆయనను ఆస్పత్రికి తరలించారు. కాగా, ఈ ఘర్షణకు కారణం మీరంటే మీరని శివసేన, ఎమ్మెన్నెస్ పార్టీలు ఒకరిపై ఒకరు బురద జల్లుకోవడం మొదలుపెట్టారు.
కామిని శెవాలేతోపాటు మొత్తం 18 మందిపై కేసులు నమోదు...
దక్షిణ మధ్య ముంబై లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న శివసేన అభ్యర్థి రాహుల్ శెవాలే సతీమణి, మాజీ కార్పొరేటర్ కామిని శెవాలేతోపాటు మొత్తం 18 మందిపై ట్రాంబే పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ విషయంపై సీనియర్ ఇన్‌స్పెక్టర్ విజయ్ కదం అందించిన వివరాల మేరకు ఘర్షణలో కామినితోపాటు 18 మందిపై హత్యాయత్నం, ప్రభుత్వ పనుల్లో అడ్డంకులు సృష్టించడం, సిబ్బందిపై దాడిచేయడం, అల్లర్లు సృష్టించేందుకు ప్రయత్నించడం తదితర అంశాల కేసులు నమోదు చేశారన్నారు.
కానిస్టేబుల్ గొంతు కోశారా..?
శివసేన, ఎమ్మెన్నెస్ ఘర్షణలో పోలీసు కానిస్టేబుల్ వికాస్ థోరబోలేపై దాడి జరిగిందని తెలిసిన కొందరు దుండగులు కావాలనే అతడిపై దాడిచేసి గొంతు కోశారని తెలిసింది. తీవ్రంగా గాయపడ్డ ఆయనను చెంబూర్‌లోని జాయి ఆస్పత్రిలో చేర్పించారు. ఈ విషయంపై పెద్దగా ఎవరూ మాట్లాడేందుకు ముందుకు రాకపోయినప్పటికీ దుండగులు వికాస్ థోరబోలే గొంతుకోశారని తెలిసింది. ఆయన గొంతు వద్ద శ్వాసనాళికకు తీవ్ర గాయమైందని దీంతో రక్తస్రావం కూడా అధికంగా జరిగింది. దీంతో బాధితుడి ఆరోగ్య పరిస్థితి కొంత విషమంగా ఉందని సమాచారం.
శివసేన, ఎమ్మెన్నెస్ మధ్య ఘర్షణ
Published Thu, Apr 24 2014 10:36 PM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM
Advertisement
Advertisement