* 36 జిల్లాల్లోనూ పట్టున్న పార్టీ శూన్యం..
* 17 జిల్లాల్లో ఖాతా తెరవని ఎన్సీపీ
* బీజీపీని ఆదరించని మూడు జిల్లాలు
* కాంగ్రెస్‌కు 12 జిల్లాల్లో మొండిచేయి
* శివసేనకు 11 జిల్లాల్లో చుక్కెదురు
సాక్షి, ముంబై: అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరి పోరుకు సిద్ధమైన అన్ని పార్టీలకు తమ అసలు బలమెంతో స్పష్టమైంది. ప్రధాన పార్టీలుగా ఇన్నాళ్లూ చలామణి అవుతున్న బీజేపీ,కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేనలకు కొన్ని జిల్లాల్లో ఎమ్మెల్యేలే లేరంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. రాష్ట్రంలో 122 స్థానాలు దక్కించుకుని అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీతోపాటు శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీలు కూడా అనేక జిల్లాల్లో ఖాతా కూడా తెరవలేకపోయాయి. ముఖ్యంగా ఒంటరిగా పోటీ చేస్తే అధికారంలోకి వస్తామన్న ధీమాతో బరిలోకి దిగిన ఎన్సీపీ 41 సీట్లను గెలుచుకుని నాలుగవ స్థానంతో సరిపెట్టుకోవల్సివచ్చింది.
రాష్ట్రవ్యాప్తంగా పట్టుందని భావించిన ఎన్సీపీని 17 జిల్లాల ప్రజలు తిరస్కరించారని స్పష్టమైంది. నందుర్బార్, అకోలా, ధులే, బుల్డానా, వాశీం, అమరావతి, వర్దా, నాగపూర్, భండారా, గోండియా, గడ్చిరోలి, చంద్రాపూర్, హింగోలి, పాల్ఘర్, ముంబై, లాతూర్, సింధుదుర్గా మొదలగు జిల్లాల్లో ఎన్సీపీ ఖాతా కూడా తెరవలేదు. మరోవైపు ఈ సారి ఎన్నికల్లో విదర్భతోపాటు ముంబైలో కూడా ఎన్సీపీ చాలా బలహీనపడిందని మరోసారి స్పష్టమైంది. విదర్భలో 62, ముంబైలో 36 మొత్తం 98 స్థానాలున్నాయి. అయితే ఎన్సీపీ మాత్రం విదర్భలోని ఒకే ఒక్క స్థానాన్ని గెలుచుకోగలిగింది.
బీజేపీకి మూడు జిల్లాల్లో ప్రాతినిధ్యం కరువు...
అతిప్దె పార్టీగా అవతరించిన బీజేపీ కూడా మూడు జిల్లాల్లో ఖాతా తెరవలేకపోయింది. వీటిలో కొంకణ్‌లోని రత్నగిరి, సింధుదుర్గాలతోపాటు పశ్చిమ మహారాష్ట్రలోని సాతారా జిల్లాలున్నాయి. కొంకణ్‌లో ఠాణే మినహాయిస్తే రాయిగఢ్, రత్నగిరి, సింధుదుర్గా మొదలగు మూడు జిల్లాలున్నాయి. ఈ మూడు జిల్లాల్లో 15 అసెంబ్లీ నియోజకవర్గాలుంగా వీటిలో బీజేపీ కేవలంఒక్క స్థానాన్ని గెలుచుకోగలిగింది.
కాంగ్రెస్‌ను తిరస్కరించిన 12 జిల్లాలు..
జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ పరిస్థితి కూడా ఈ సారి చాలా దయనీయంగా మారిందని చెప్పవచ్చు. 42 సీట్లతో తృతీయ స్థానంతో సరిపెట్టుకున్న కాంగ్రెస్ జల్గావ్, అకోలా, భండారా, గడ్చిరోలి, యావత్మాల్, పర్భణీ, జాల్నా, పాల్ఘర్, ఠాణే, రాయిగఢ్, రత్నగిరి, కొల్హాపూర్ మొదలగు 12 జిల్లాల్లో ఖాతా తెరవలేకపోయింది. ముఖ్యంగా కొంకణ్‌లోని మూడు జిల్లాల్లో 15 సీట్లుండగా కేవలం ఒకే స్థానాన్ని దక్కించుకోగలిగింది.
శివసేనకు 11 జిల్లాల్లో చుక్కెదురు..
ఈ సారి ఎన్నికల్లో శివసేన 63 స్థానాలను దక్కించుకుని ద్వితీయ స్థానంలో నిలిచింది. అయితే ఈ పార్టీ కూడా 11 జిల్లాల్లో ఖాతా తెరవలేకపోయింది. వీటిలో నందుర్బార్, ధులే, అకోలా, వాసిం, అమరావతి, వార్దా, నాగపూర్, భండారా, గోండియా, గడ్చిరోలి, లాతూర్ మొదలగు జిల్లాలున్నాయి.
ఎవరికీ అంత ‘సీన్’ లేదు..
Published Wed, Oct 22 2014 11:29 PM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM
Advertisement