సాక్షి, ముంబై: కొత్తగా ఎన్నికల బరిలో దిగిన అభ్యర్థులు తమ ప్రత్యర్థులతో రహస్య ఒప్పందాలు కుదుర్చుకోకుండా అన్ని పార్టీల కార్యకర్తలు దృష్టిసారించారు. వారి కదలికలపై ప్రత్యేక దృష్టి సారించారు. ఎప్పటికప్పుడు అభ్యర్థుల కదలికలపై తమతమ పార్టీ నాయకులకు రిపోర్టులు అందజేస్తున్నారు. శివసేన, బీజేపీ నేతృత్వంలోని మహాకూటమి, కాంగ్రెస్, ఎన్సీపీ నేతృత్వంలోని ప్రజాస్వామ్య కూటముల మధ్య పొత్తు బెడిసి కొట్టడంతో ఈసారి అన్ని పార్టీలు ఒంటరిగానే పోటీ చేస్తున్నాయి. శివసేన, బీజేపీ 25 ఏళ్ల తరువాత, కాంగ్రెస్, ఎన్సీపీ 15 ఏళ్ల తరువాత విడిపోయాయి.
దీంతో నగరంలోని 36 శాసన సభ నియోజకవర్గాలలో ప్రధాన పార్టీలన్నీ కొత్త అభ్యర్థులను బరిలో దింపాయి. అనేక నియోజక వర్గాల్లో కొన్ని పార్టీలకు బలమైన అభ్యర్థులే దొరకలేదు. అందులో కొత్తగా బరిలో దిగిన వారి సంఖ్య అధికంగా ఉండడంతో మరింత ఆందోళనకు గురవున్నారు. ఆఖరుక్షణంలో అభ్యర్థిత్వం ఇవ్వడంవల్ల వారు ఈ ఎన్నికల్లో నిలదొక్కుకోవడం కొంత కష్టంతో కూడుకున్న పనేనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
దీంతో తమ ప్రత్యర్థులతో రహస్య మంతనాలు జరిపి ఏదైనా ఒప్పందం కుదుర్చుకునే ప్రమాదం పొంచి ఉందనే భయం పార్టీల అధినేతల్లో స్పష్టంగా కనిపిస్తోందని చెబుతున్నారు. ఆకస్మాత్తుగా అభ్యర్థిత్వం పొందడంతో బరిలో దిగిన అభ్యర్థులు ప్రచారాలు, సభలకు తగిన ఏర్పాట్లు పూర్తి చేసుకోలేదు. ఈ ఎన్నికల్లో గెలుస్తామనే నమ్మకం కూడా వారిలో లేకుండా పోయింది. ఇలాంటి సందర్భంలో ఎన్నికల్లో డబ్బులు వృథా చేయడం కంటే నామినేషన్ ఉపసంహరించుకుంటే బాగుంటుందా? లేక ఒప్పం దం (సెట్టింగ్) కుదుర్చుకుంటే బాగుంటుందా? అని కొందరు అభ్యర్థులు ఆలోచిస్తున్నారు. ఇలాంటి అభ్యర్థులపై నిఘా పెట్టాలని అన్ని పార్టీల నాయకులు కార్యకర్తలకు ఆదేశాలిచ్చారు.
కొత్తవారు అమ్ముడుపోతారేమో?
Published Mon, Sep 29 2014 10:39 PM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM
Advertisement