సాక్షి, ముంబై: అసెంబ్లీ ఎన్నికల కోసం రాష్ట్రంలోని అన్ని పార్టీలు సిద్ధమవుతున్నాయి. ఎన్నికల వ్యూహరచనతోపాటు సీట్ల పంపకాల విషయంపై నిమగ్నమయ్యాయి. పార్టీలను బలోపేతం చేయడంతోపాటు ప్రజాదరణ పొందేందుకు వివిధ కార్యక్రమాలను చేపట్టాలని యోచిస్తున్నాయి. రాబోయే ఉట్టి ఉత్సవాలు, గణేషోత్సవాల సందర్భంగా వివిధ కార్యక్రమాలు నిర్వహించి ప్రజాదరణ పొంది తమ ఓటు బ్యాంకును పెంచుకునేందుకు ప్రణాళికలు రూపొందించుకుంటున్నాయి.
అదేవిధంగా కొన్ని పార్టీలు అంతర్గత విభేదాలు, సమస్యలను పరిష్కరించుకోవడంతోపాటు మార్పులు చేర్పులు చేపట్టాలని భావిస్తున్నాయి. సీట్ల పంపకాల విషయంలో కూటములు అంతర్గత కుమ్ములాటల్లో ఉన్నాయన్న సంగతి బహిర్గతమే. మహాకూటమిలోని ఆర్‌పిఐ, స్వాభిమాని, శివసంగ్రామ్ తదితర పార్టీలకు ఎన్ని సీట్లు కేటాయించాలనేది బీజేపీ, శివసేన మధ్య ఇంకా తేలలేదు. డీఎఫ్‌లోని కాంగ్రెస్, ఎన్సీపీ మధ్య టికెట్ల లొల్లి ఇంకా నడుస్తూనే ఉంది.
మహాకూటమిలో కుమ్ములాటలు...
మహాకూటమిలో శివసేన, బీజేపీలు పైచేయి కోసం యత్నిస్తున్నారు. ఓవైపు శివసేన తనపట్టు నిలుపుకుని రాష్ట్రంలో మళ్లీ ముఖ్యమంత్రి పదవిని చేపట్టాలని భావిస్తోంది. మరోవైపు తన బలం పెరిగిందని పేర్కొంటూ బీజేపీ ఈసారి ఎక్కువ స్థానాల్లో పోటీచేసి ముఖ్యమంత్రి పదవిని చేజిక్కుంచుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. ముఖ్యమంత్రి అభ్యర్థి మా పార్టీ నుంచి ఉంటాడని శివసేన పేర్కొంటుండగా అలాంటిదేమి లేదని మహాకూటమి నాయకులందరితో చర్చించి ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరన్నది నిర్ణయం తీసుకుంటామని బీజేపీ నాయకుడు వినోత్ తావ్డే తెలుపుతున్నారు. సీట్ల పంపకాల విషయానికొస్తే బీజేపీ ఎక్కువ లోక్‌సభ స్థానాల్లో పోటీచేస్తే, శివసేన అసెంబ్లీ సీట్లు ఎక్కువ తీసుకునేది.
దీంతో 1995లో కేంద్రంలో బీజేపీకి ప్రధాని పదవి లభించగా రాష్ట్రంలో శివసేనకు ముఖ్యమంత్రి పదవి లభించింది. అయితే గత ఎన్నికల్లో ఈ సీన్ మారిందని చెప్పవచ్చు. 2009లో శివసేన 160 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయగా బీజేపీ 119 స్థానాల్లో పోటీ చేసింది. అయితే శివసేన కేవలం 44 స్థానాల్లో విజయం సాధించగా బీజేపీ మాత్రం 46 స్థానాల్లో గెలుపొందింది. దీంతో అప్పుడు బీజేపీకి ప్రతిపక్షహోదా దక్కింది. అయితే ఈసారి మళ్లీ లోక్‌సభ ఫలితాల అనంతరం ఎంతో ఉత్సాహంగా ఉన్న బీజేపీ రాష్ట్రంలో అధిక స్థానాలు కావాలని డిమాండ్ చేస్తోంది. మరోవైపు శివసేన మాత్రం ఎట్టిపరిస్థితిల్లోనూ అధిక స్థానాలు ఇచ్చేదిలేదని, తామే అసెంబ్లీకి సంబంధించి కూటమి తరఫున ఎక్కువ స్థానాల్లో పోటీచేస్తామని స్పష్టం చేస్తోంది.
ప్రజాస్వామ్య కూటమిలో అసంతృప్తిసెగలు....
లోకసభ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత ప్రజాస్వామ్య కూటమిలో ఆందోళనతోపాటు అసంృప్తి కన్పిస్తోంది. దీంతో అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించి రాష్ట్రంలో తమ పట్టును నిలుపుకునేందుకు కూటమి ప్రయత్నిస్తోంది. అయితే సీట్ల పంపకాల విషయంలో మాత్రం వీరి మధ్య ఈసారి కూడా విభేదాలు పొడసూపుతున్నాయి. ఎన్సీపీ ఒక మెట్టు దిగి కనీసం 134 సీట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తుండగా కాంగ్రెస్ మాత్రం ఇంకా ససేమిరా అంటోంది. అయితే 124 వరకు ఇచ్చేందుకు కాంగ్రెస్ నాయకులు సుముఖంగా ఉన్నారని సమాచారం.
పట్టుపెంచుకునేందుకు ఎమ్మెన్నెస్ పాట్లు ...
లోకసభ ఎన్నికల్లో ఘోర పరాజయం అనంతరం మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎమెమన్నెస్) కూడా అసెంబ్లీ ఎన్నికల కోసం సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా ఇప్పటికే సమీక్ష మంతనాలు జరిపిన సంగతి తెలిసిందే. 2009 ఎన్నికలను పరిశీలించినట్టయితే ఎమ్మెన్నెస్ మొత్తం 143 స్థానాల్లో పోటీ చేసింది. మొదటిసారిగా పోటీ చేసినప్పటికీ 13 స్థానాలు కైవసం చేసుకోవడంతోపాటు పలు స్థానాల్లో రెండు, మూడు స్థానాలను దక్కించుకుంది. దీంతో ఉత్సాహం పెరిగినప్పటికీ లోకసభ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు మాత్రం ఎమ్మెన్నెస్‌ను కొంత నిరాశపరిచాయని చెప్పవచ్చు.
గత లోకసభ ఎన్నికల్లో కూడా ఖాతా తెరవకపోయినా పోటీ చేసిన 13 స్థానాల్లో ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచింది. అయితే ఈసారి లోకసభలో పోటీ చేసిన 10 స్థానాల్లో డిపాజిట్ కూడా దక్కలేదు. దీంతో అసెంబ్లీ ఎన్నికలకు ముందు మరోసారి పార్టీని, పార్టీ కార్యకర్తలు, పదాధికారుల్లో నూతన ఉత్సాహం నింపేందుకు రాజ్‌ఠాక్రేతోపాటు పార్టీ సీనియర్ నాయకులు ప్రయత్నిస్తున్నారు. పార్టీని మరింత బలోపేతం చేసేందుకు రాజ్‌ఠాక్రే ఇప్పటికే రాష్ర్టవ్యాప్తంగా పర్యటనలు చేస్తున్నారు.
మిషన్ ‘అసెంబ్లీ’
Published Mon, Aug 11 2014 11:12 PM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM
Advertisement
Advertisement