Distributions of the seats
-
బహుముఖ పోటీ
సాక్షి ముంబైః మహారాష్ట్ర రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి. సీట్ల పంపకాలలో విభేదాలతో ప్రధాన కూటములైన ప్రజాసామ్య కూటమి, మహాకూటములు ముక్కలు కావడంతో ప్రధాన పార్టీలన్నీ ఒంటరిగానే బరిలోకి దిగనున్నాయి. దీంతో ఈసారి దాదాపు అన్ని నియోజకవర్గాల్లో బహుముఖ పోటీ జరగనుంది. కొన్ని నియోజకవర్గాల్లో శివసేన, బీజేపీల మధ్య ప్రధాన పోటీ జరగనుండగా మరి కొన్ని స్థానాల్లో కాంగ్రెస్, ఎన్సీపీలు హోరాహోరీ తలపడనున్నాయి. బహుముఖ పోరు నేపథ్యంలో అనేక నియోజకవర్గాల్లో విజేతలు స్వల్ప మెజారిటీతోనే గట్టెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదివరకు జరిగిన ఎన్నికలను పరిశీలిస్తే ప్రధాన కూటములైన శివసేన-బీజేపీ, కాంగ్రెస్-ఎన్సీపీల మధ్య ప్రధానపోటీ జరిగింది. అయితే కొన్ని నియోజకవర్గాల్లో మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎమ్మెన్నెస్), ఇతర పార్టీల కారణంగా త్రిముఖ పోటీ జరిగింది. కానీ ఈసారి అన్ని పార్టీలు ఒంటరిగా బరిలోకి దిగుతుండడంతో ఈసారి ఎన్నికలు రసవత్తరంగా మారాయి. ఎమ్మెన్నెస్ ప్రభావం.... మహరాష్ట్ర నవనిర్మాణ సేన (ఎమ్మెన్నెస్) గత ఎన్నికలలో శివసేన-బీజేపీల కూటమిపై తీవ్ర ప్రభావం చూపింది. ఎమ్మెన్నెస్ కారణంగా ముంబైతో పాటు పలు నియోజకవర్గాలలో శివసేన-బీజేపీ అభ్యర్థులు పరాజయం పాలయ్యారు. ముంబై, ఠాణే, పుణే, నాసిక్ తదితర ప్రాంతాల్లో గట్టి పట్టున్న ఎమ్మెన్నెస్ ఏ మేరకు ప్రభావం చూపుతుందో వేచి చూడాల్సిందే. కొత్త సమీకరణాలకు అవకాశం... రాష్ట్రంలో ప్రధాన కూటములు విడిపోవడంతో రాష్ట్ర రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు అవకాశాలు ఏర్పడ్డాయి. ఎమ్మెన్నెస్‌తో బీజేపీ జతకడ్తుందని ఒకవైపు, శివసేనతో ఎమ్మెన్నెస్ కలిసే అవకాశాలున్నాయన్న వార్తలు మరోవైపు గుప్పుమంటున్నాయి. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో అలాంటి అవకాశాలు లేవని చెప్పాలి. శనివారంతో నామినేషన్ల పర్వం ముగియనుంది. దీంతో పొత్తులు కుదరకపోయిన స్నేహపూర్వక పోటీ, రహస్య ఒప్పం దాలు కుదిరే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఇది ఇలా ఉండగా మహాకూటమిలోని ఆర్పీఐ, స్వాభిమాని షేట్కారీ సంఘటన, శివసంగ్రామ్, జనస్వరాజ్య్ తదితర పార్టీలు ఎవరితో కలిసి పోటీ చేయనున్నాయనే విషయంపై కూడా ఇంకా స్పష్టత రాలేదు. బలాబలాలు... రాష్ట్రంలో బలాబలాను పరిశీలిస్తె నగరాలు, పట్టణ ప్రాంతాలలో శివసేనకు పట్టుండగా పశ్చిమ మహారాష్ట్ర, ఖాందేశ్లలో ఎన్సీపీ, కాంగ్రెస్‌లు బలంగా ఉన్నాయి. విదర్భలో బీజేపీ-శివసేనలు పటిష్టంగా ఉన్నాయి. మరాఠ్వాడాలో బీజేపీ-శివసేనలతో పాటు కాంగ్రెస్-ఎన్సీపీలకు కూడా పట్టుంది. అయితే ఈసారి అందరు ఒంటరిగా బరిలోకి దిగుతున్న నేపథ్యంలో ఓటర్లు ఎవరికి పట్టం కట్టనున్నారనే విషయంపై ఉత్కంఠత చోటు చేసుకుంది. 2009 ఎన్నికలను పరిశీలిస్తే కాంగ్రెస్ 169 స్థానాల్లో పోటీ చేయగా ఎన్సీపీ 114 స్థానాలు, శివసేన 160, బీజేపీ 119 స్థానాల్లో పోటీ చేశాయి. అయితే కాంగ్రెస్ 82, ఎన్సీపీ 62 స్థానాల్లో విజయం సాధించగా శివసేన 44, బీజేపీ 46 స్థానాల్లో గెలుపొందాయి. మరోవైపు మొదటిసారిగా పోటీ చేసిన ఎమ్మెన్నెస్ 13 స్థానాలలో గెలుపొందింది. అంతకుముందు 2004లో జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్-75, ఎన్సీపీ-71, బీజేపీ-54, శివసేన-56, ఇతరులు-32 స్థానాల్లో గెలుపొందారు. -
మిషన్ ‘అసెంబ్లీ’
సాక్షి, ముంబై: అసెంబ్లీ ఎన్నికల కోసం రాష్ట్రంలోని అన్ని పార్టీలు సిద్ధమవుతున్నాయి. ఎన్నికల వ్యూహరచనతోపాటు సీట్ల పంపకాల విషయంపై నిమగ్నమయ్యాయి. పార్టీలను బలోపేతం చేయడంతోపాటు ప్రజాదరణ పొందేందుకు వివిధ కార్యక్రమాలను చేపట్టాలని యోచిస్తున్నాయి. రాబోయే ఉట్టి ఉత్సవాలు, గణేషోత్సవాల సందర్భంగా వివిధ కార్యక్రమాలు నిర్వహించి ప్రజాదరణ పొంది తమ ఓటు బ్యాంకును పెంచుకునేందుకు ప్రణాళికలు రూపొందించుకుంటున్నాయి. అదేవిధంగా కొన్ని పార్టీలు అంతర్గత విభేదాలు, సమస్యలను పరిష్కరించుకోవడంతోపాటు మార్పులు చేర్పులు చేపట్టాలని భావిస్తున్నాయి. సీట్ల పంపకాల విషయంలో కూటములు అంతర్గత కుమ్ములాటల్లో ఉన్నాయన్న సంగతి బహిర్గతమే. మహాకూటమిలోని ఆర్పిఐ, స్వాభిమాని, శివసంగ్రామ్ తదితర పార్టీలకు ఎన్ని సీట్లు కేటాయించాలనేది బీజేపీ, శివసేన మధ్య ఇంకా తేలలేదు. డీఎఫ్లోని కాంగ్రెస్, ఎన్సీపీ మధ్య టికెట్ల లొల్లి ఇంకా నడుస్తూనే ఉంది. మహాకూటమిలో కుమ్ములాటలు... మహాకూటమిలో శివసేన, బీజేపీలు పైచేయి కోసం యత్నిస్తున్నారు. ఓవైపు శివసేన తనపట్టు నిలుపుకుని రాష్ట్రంలో మళ్లీ ముఖ్యమంత్రి పదవిని చేపట్టాలని భావిస్తోంది. మరోవైపు తన బలం పెరిగిందని పేర్కొంటూ బీజేపీ ఈసారి ఎక్కువ స్థానాల్లో పోటీచేసి ముఖ్యమంత్రి పదవిని చేజిక్కుంచుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. ముఖ్యమంత్రి అభ్యర్థి మా పార్టీ నుంచి ఉంటాడని శివసేన పేర్కొంటుండగా అలాంటిదేమి లేదని మహాకూటమి నాయకులందరితో చర్చించి ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరన్నది నిర్ణయం తీసుకుంటామని బీజేపీ నాయకుడు వినోత్ తావ్డే తెలుపుతున్నారు. సీట్ల పంపకాల విషయానికొస్తే బీజేపీ ఎక్కువ లోక్‌సభ స్థానాల్లో పోటీచేస్తే, శివసేన అసెంబ్లీ సీట్లు ఎక్కువ తీసుకునేది. దీంతో 1995లో కేంద్రంలో బీజేపీకి ప్రధాని పదవి లభించగా రాష్ట్రంలో శివసేనకు ముఖ్యమంత్రి పదవి లభించింది. అయితే గత ఎన్నికల్లో ఈ సీన్ మారిందని చెప్పవచ్చు. 2009లో శివసేన 160 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయగా బీజేపీ 119 స్థానాల్లో పోటీ చేసింది. అయితే శివసేన కేవలం 44 స్థానాల్లో విజయం సాధించగా బీజేపీ మాత్రం 46 స్థానాల్లో గెలుపొందింది. దీంతో అప్పుడు బీజేపీకి ప్రతిపక్షహోదా దక్కింది. అయితే ఈసారి మళ్లీ లోక్‌సభ ఫలితాల అనంతరం ఎంతో ఉత్సాహంగా ఉన్న బీజేపీ రాష్ట్రంలో అధిక స్థానాలు కావాలని డిమాండ్ చేస్తోంది. మరోవైపు శివసేన మాత్రం ఎట్టిపరిస్థితిల్లోనూ అధిక స్థానాలు ఇచ్చేదిలేదని, తామే అసెంబ్లీకి సంబంధించి కూటమి తరఫున ఎక్కువ స్థానాల్లో పోటీచేస్తామని స్పష్టం చేస్తోంది. ప్రజాస్వామ్య కూటమిలో అసంతృప్తిసెగలు.... లోకసభ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత ప్రజాస్వామ్య కూటమిలో ఆందోళనతోపాటు అసంృప్తి కన్పిస్తోంది. దీంతో అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించి రాష్ట్రంలో తమ పట్టును నిలుపుకునేందుకు కూటమి ప్రయత్నిస్తోంది. అయితే సీట్ల పంపకాల విషయంలో మాత్రం వీరి మధ్య ఈసారి కూడా విభేదాలు పొడసూపుతున్నాయి. ఎన్సీపీ ఒక మెట్టు దిగి కనీసం 134 సీట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తుండగా కాంగ్రెస్ మాత్రం ఇంకా ససేమిరా అంటోంది. అయితే 124 వరకు ఇచ్చేందుకు కాంగ్రెస్ నాయకులు సుముఖంగా ఉన్నారని సమాచారం. పట్టుపెంచుకునేందుకు ఎమ్మెన్నెస్ పాట్లు ... లోకసభ ఎన్నికల్లో ఘోర పరాజయం అనంతరం మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎమెమన్నెస్) కూడా అసెంబ్లీ ఎన్నికల కోసం సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా ఇప్పటికే సమీక్ష మంతనాలు జరిపిన సంగతి తెలిసిందే. 2009 ఎన్నికలను పరిశీలించినట్టయితే ఎమ్మెన్నెస్ మొత్తం 143 స్థానాల్లో పోటీ చేసింది. మొదటిసారిగా పోటీ చేసినప్పటికీ 13 స్థానాలు కైవసం చేసుకోవడంతోపాటు పలు స్థానాల్లో రెండు, మూడు స్థానాలను దక్కించుకుంది. దీంతో ఉత్సాహం పెరిగినప్పటికీ లోకసభ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు మాత్రం ఎమ్మెన్నెస్‌ను కొంత నిరాశపరిచాయని చెప్పవచ్చు. గత లోకసభ ఎన్నికల్లో కూడా ఖాతా తెరవకపోయినా పోటీ చేసిన 13 స్థానాల్లో ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచింది. అయితే ఈసారి లోకసభలో పోటీ చేసిన 10 స్థానాల్లో డిపాజిట్ కూడా దక్కలేదు. దీంతో అసెంబ్లీ ఎన్నికలకు ముందు మరోసారి పార్టీని, పార్టీ కార్యకర్తలు, పదాధికారుల్లో నూతన ఉత్సాహం నింపేందుకు రాజ్‌ఠాక్రేతోపాటు పార్టీ సీనియర్ నాయకులు ప్రయత్నిస్తున్నారు. పార్టీని మరింత బలోపేతం చేసేందుకు రాజ్‌ఠాక్రే ఇప్పటికే రాష్ర్టవ్యాప్తంగా పర్యటనలు చేస్తున్నారు.