సాక్షి ముంబైః మహారాష్ట్ర రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి. సీట్ల పంపకాలలో విభేదాలతో ప్రధాన కూటములైన ప్రజాసామ్య కూటమి, మహాకూటములు ముక్కలు కావడంతో ప్రధాన పార్టీలన్నీ ఒంటరిగానే బరిలోకి దిగనున్నాయి. దీంతో ఈసారి దాదాపు అన్ని నియోజకవర్గాల్లో బహుముఖ పోటీ జరగనుంది. కొన్ని నియోజకవర్గాల్లో శివసేన, బీజేపీల మధ్య ప్రధాన పోటీ జరగనుండగా మరి కొన్ని స్థానాల్లో కాంగ్రెస్, ఎన్సీపీలు హోరాహోరీ తలపడనున్నాయి.
బహుముఖ పోరు నేపథ్యంలో అనేక నియోజకవర్గాల్లో విజేతలు స్వల్ప మెజారిటీతోనే గట్టెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదివరకు జరిగిన ఎన్నికలను పరిశీలిస్తే ప్రధాన కూటములైన శివసేన-బీజేపీ, కాంగ్రెస్-ఎన్సీపీల మధ్య ప్రధానపోటీ జరిగింది. అయితే కొన్ని నియోజకవర్గాల్లో మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎమ్మెన్నెస్), ఇతర పార్టీల కారణంగా త్రిముఖ పోటీ జరిగింది. కానీ ఈసారి అన్ని పార్టీలు ఒంటరిగా బరిలోకి దిగుతుండడంతో ఈసారి ఎన్నికలు రసవత్తరంగా మారాయి.
ఎమ్మెన్నెస్ ప్రభావం....
మహరాష్ట్ర నవనిర్మాణ సేన (ఎమ్మెన్నెస్) గత ఎన్నికలలో శివసేన-బీజేపీల కూటమిపై తీవ్ర ప్రభావం చూపింది. ఎమ్మెన్నెస్ కారణంగా ముంబైతో పాటు పలు నియోజకవర్గాలలో శివసేన-బీజేపీ అభ్యర్థులు పరాజయం పాలయ్యారు. ముంబై, ఠాణే, పుణే, నాసిక్ తదితర ప్రాంతాల్లో గట్టి పట్టున్న ఎమ్మెన్నెస్ ఏ మేరకు ప్రభావం చూపుతుందో వేచి చూడాల్సిందే.
కొత్త సమీకరణాలకు అవకాశం...
రాష్ట్రంలో ప్రధాన కూటములు విడిపోవడంతో రాష్ట్ర రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు అవకాశాలు ఏర్పడ్డాయి. ఎమ్మెన్నెస్‌తో బీజేపీ జతకడ్తుందని ఒకవైపు, శివసేనతో ఎమ్మెన్నెస్ కలిసే అవకాశాలున్నాయన్న వార్తలు మరోవైపు గుప్పుమంటున్నాయి. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో అలాంటి అవకాశాలు లేవని చెప్పాలి. శనివారంతో నామినేషన్ల పర్వం ముగియనుంది. దీంతో పొత్తులు కుదరకపోయిన స్నేహపూర్వక పోటీ, రహస్య ఒప్పం దాలు కుదిరే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఇది ఇలా ఉండగా మహాకూటమిలోని ఆర్‌పీఐ, స్వాభిమాని షేట్కారీ సంఘటన, శివసంగ్రామ్, జనస్వరాజ్య్ తదితర పార్టీలు ఎవరితో కలిసి పోటీ చేయనున్నాయనే విషయంపై కూడా ఇంకా స్పష్టత రాలేదు.
బలాబలాలు...
రాష్ట్రంలో బలాబలాను పరిశీలిస్తె నగరాలు, పట్టణ ప్రాంతాలలో శివసేనకు పట్టుండగా పశ్చిమ మహారాష్ట్ర, ఖాందేశ్‌లలో ఎన్సీపీ, కాంగ్రెస్‌లు బలంగా ఉన్నాయి. విదర్భలో బీజేపీ-శివసేనలు పటిష్టంగా ఉన్నాయి. మరాఠ్వాడాలో బీజేపీ-శివసేనలతో పాటు కాంగ్రెస్-ఎన్సీపీలకు కూడా పట్టుంది. అయితే ఈసారి అందరు ఒంటరిగా బరిలోకి దిగుతున్న నేపథ్యంలో ఓటర్లు ఎవరికి పట్టం కట్టనున్నారనే విషయంపై ఉత్కంఠత చోటు చేసుకుంది.
2009 ఎన్నికలను పరిశీలిస్తే కాంగ్రెస్ 169 స్థానాల్లో పోటీ చేయగా ఎన్సీపీ 114 స్థానాలు, శివసేన 160, బీజేపీ 119 స్థానాల్లో పోటీ చేశాయి. అయితే కాంగ్రెస్ 82, ఎన్సీపీ 62 స్థానాల్లో విజయం సాధించగా శివసేన 44, బీజేపీ 46 స్థానాల్లో గెలుపొందాయి. మరోవైపు మొదటిసారిగా పోటీ చేసిన ఎమ్మెన్నెస్ 13 స్థానాలలో గెలుపొందింది. అంతకుముందు 2004లో జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్-75, ఎన్సీపీ-71, బీజేపీ-54, శివసేన-56, ఇతరులు-32 స్థానాల్లో గెలుపొందారు.
బహుముఖ పోటీ
Published Fri, Sep 26 2014 11:04 PM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM
Advertisement
Advertisement