'శివసేన ఎప్పటికీ మిత్రపక్షమే'
ముంబై: ఎన్నికలు పెట్టిన చిచ్చు నేపథ్యంలో మహారాష్ట్రలో శివసేనతో దాదాపుగా తెగదెంపులు చేసుకున్న బీజేపీ మళ్లీ ఆ పార్టీతో చెలిమికి సిద్ధమవుతున్నట్టుగా కన్పిస్తోంది. ప్రస్తుత పరిణామాలను చూస్తే బీజేపీ-శివసేన చెలిమి మళ్లీ చిగురించే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. తాజాగా మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ చేసిన వ్యాఖ్యలు ఇందుకు మరింత బలాన్ని చేకూర్చాయి. శివసేన తో తమకు శత్రుత్వం లేదని ఆయన తెలిపారు. 'మేము ఎప్పటికీ స్నేహితులమే. భవిష్యత్తుల్లో కూడా మిత్రులుగా కొనసాగే అవకాశం ఉంది' అని ఫడ్నవీస్ పేర్కొన్నారు.
అంతకుముందు కేంద్ర మంత్రి రాజీవ్ ప్రతాప్ రూఢీ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. తమ మాజీ భాగస్వామి శివసేనతో చర్చల విషయంలో తాము సున్నితంగానే వ్యవహరిస్తామని అన్నారు. ఇరు పార్టీల మధ్య చర్చల్లో సత్ఫలితాలొస్తాయని ఆశాభావం వ్యక్యం చేశారు. ‘శివసేనతో ఎట్టిపరిస్థితుల్లోనూ చర్చలు జరుపుతాం. మంచి ఫలితాలు వస్తాయనే విశ్వాసం మాకు ఉంది. శివసేనతో సంబంధాల విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరమేమీ లేదు’అని అన్నారు. రాష్ట్రస్థాయిలో కొన్ని అంశాల విషయంలో విభేదాలు ఉన్నమాట నిజమేనంటూ అంగీకరించిన ఆయన.. కేంద్ర ప్రభుత్వంలో తామిరువురం కలిసే పనిచేస్తున్నామని ధీమా వ్యక్తం చేశారు.