గురువారం సాయంత్రం ముంబై ఎయిర్‌పోర్టు వద్ద అమిత్ షాకు ఘనస్వాగతం
ముంబై: భారత రాజకీయాలపై తనదైన ముద్రవేసిన భారతీయ జనతా పార్టీ(బీజేపీ) నేడు 38వ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకొంటున్నది. 1980, ఏప్రిల్ 6న ముంబైలో జరిగిన వేడుకలో అటల్ బిహారీ వాజపేయి(తొలి జాతీయ అధ్యక్షుడు) పార్టీ ఏర్పాటు ప్రకటన చేశారు. ఇప్పుడు అదే ముంబై వేదికగా ప్రస్తుత బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా నేతృత్వంలో 38వ ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరుపుతున్నారు. ఇందుకోసం బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌ను సర్వాంగ సుందరంగా ముస్తాబుచేశారు. శుక్రవారం ఉదయం 11 గంటల తర్వాత పార్టీ శ్రేణులను ఉద్దేశించి అమిత్ షా ప్రసంగిస్తారు.
జనం తిప్పలు: ఆవిర్భావ వేడుకలో పాల్గొనేందుకుగానూ గురువారమే ముంబైకి చేరుకున్న అమిత్ షాకు ఘనస్వాగతం లభించింది. అధ్యక్షుడు వెంటరాగా వేల మంది కార్యకర్తలు ఎయిర్‌పోర్టు నుంచి బంద్రా కుర్లా కాంప్లెక్స్ దాకా భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీకి సంబంధించి ఎలాంటి ముందస్తు సమాచారం వెల్లడించకపోవడంతో లక్షల మంది జనం తీవ్ర ఇబ్బందికి గురయ్యారు. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ ఎక్కడికక్కడే నిలిచిపోయింది. ఊహిచనిరీతిలో ఎదురైన కష్టాలను వివరిస్తూ పలువురు నెటిజన్లు సీఎం ఫడ్నవిస్‌పై అసంతృప్తి వ్యక్తంచేశారు.
కమలం వికసిస్తుంది (వైరల్ వీడియో):
పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మాజీ పీఎం, బీజేపీ తొలి జాతీయ అధ్యక్షుడు అటల్ బిహారీ వాజపేయి ప్రసంగం వీడియో ఒకటి సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అవుతోంది. 38 ఏళ్ల కిందట సరిగ్గా ఇదేరోజు(ఏప్రిల్ 6న) ముంబైలో ఆయన బీజేపీ ఏర్పాటును ప్రకటించారు. చీకటి నిండిన హాలులో ప్రసంగిస్తూ.. ‘చీకట్లు చీలిపోతాయి.. భానుడు ఉదయిస్తాడు.. మన కమలం వికసిస్తుంది..’ అని అటల్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment