అంతశ్శత్రువుతోనే అధిక ప్రమాదం
అవసరం కొద్దీ ప్రభుత్వంలో చేరిన శివసేనను తన అదుపులో పెట్టుకోవడానికి బదులుగా మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ ఆ పార్టీకి తన ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తించే స్వేచ్ఛను కట్టబెట్టేశారు. ఫలితం ప్రభుత్వ పక్షంలో ఉండాల్సిన శివసేన తన సహజతత్వంతో ప్రతి సమస్యనూ వీధుల్లోకి లాగుతోంది.
పనిచేసే నిర్ణయాత్మకమైన ప్రభుత్వాన్ని అందిస్తామని భారతీయ జనతా పార్టీ వాగ్దానం చేసిన తర్వాత, పది నెలలుగా మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వం రాజ్యమేలుతోంది. ఆ పార్టీ తన వాగ్దానాన్ని అమలు చేస్తుందని విశ్వసించి ఓటర్లు దానికి అధికారాన్ని కట్టబెట్టారు. కాని ప్రస్తుతం విరోధిగా మారిన ఒకనాటి తన మిత్రపక్షం శివసేనతో బీజేపీ శాంతి కుదుర్చుకుని సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్ప ర్చింది. బీజేపీకి ఇంతకుమించి గత్యంతరం లేకపోయిం ది. శివసేన మొదట్లో అతిగా నిరసన తెలిపినప్పటికీ తర్వాత ప్రభుత్వంలో చేరటంతో రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌కి కాస్త బలం చేకూరింది.
సంఖ్యా బలం కోసం రాజీ పడవలసిన అవసరం బీజేపీకి ఎంత ఉందో శివసేనకు కూడా ప్రభుత్వంలో చేరవలసిన అవసరం అంతే స్థాయిలో ఉంది. ఈ నేప థ్యంలో పూర్తి స్థాయి అధికారం చేపట్టి శివసేనను తన అదుపులో పెట్టుకోవడానికి బదులుగా, ఫడ్నవిస్, అల్లరి బాలుడి అవతారమెత్తిన శివసేన పూర్తి స్థాయిలో చెలరేగి పోవడానికి అనుమతించేశారు. రాష్ట్ర ప్రభుత్వంతోపాటు కొన్ని నగర పాలక సంస్థలు మాంస విక్రయాలపై నిషేధం విధించినప్పుడు, శివసేన వీధి స్థాయిలో కూడా పై చేయి సాధించేంత వరకు ఫడ్నవిస్ ఆ పార్టీకి స్వేచ్ఛ ఇచ్చేశారు. అధికార పంపిణీలో భాగంగా తనకు కేటాయించిన మంత్రిత్వ శాఖలను వాస్తవానికి శివసేన స్వయం ప్రతి పత్తితో నిర్వహించుకునేందుకు అనుమతించడం ద్వారా ఫడ్నవిస్ మొదట్లో తనకు లభించిన అనుకూలతను కోల్పోయారు. తాము భాగస్తులుగా ఉన్న ప్రభుత్వం పైనే విరుచుకుపడేలా వారికి స్వేచ్ఛ ఇచ్చేశారు. వారిని అదుపులో ఉంచుకోవడానికి తిరస్కరించడం వల్ల శివసేన ప్రభుత్వానికి సంబంధించినంతవరకు ఇంటి శత్రువులా తయారయింది. పైగా తన రాజకీయాలను వీధుల్లోకి కూడా తీసుకెళ్లింది.
ఇది మరాఠీ మాట్లాడే హిందూ దిగువ, మధ్యతరగతి ప్రజల్లో తన పట్టును మళ్లీ సంపాదించేంత అవకాశాన్ని దానికి కల్పించింది. జైనులు కోరుకున్న రోజుల్లో మాంస విక్రయాలపై విధించిన నిషేధం ఇప్పటికే అమలవుతోంది. ముంబై, మీరా-భయాండర్, నవీ ముంబై వంటి చోట్ల ఈ నిషేధాన్ని రెండు నుంచి ఎనిమిది రోజుల వరకు పొడి గించినప్పుడు శివసేన వీధుల్లోకి వచ్చేసింది. ఈ నిషేధ చట్టాన్ని అది బహిరంగంగానే ధిక్కరించి, వీధుల్లోనే మాంస విక్రయాలను జరిపింది. శివసేన చర్యకు వ్యతిరే కించటం మాట అటుంచి రాష్ట్రప్రభుత్వం కనీసంగానైనా నోరెత్తలేకపోయింది. బీజేపీని అవమానించడంలో శివ సేన సాధించిన ఈ వ్యూహాత్మక విజయం సాధార ణమైనది కాదు.
శివసేన మద్దతుదారులు ఉన్నత వర్గాల డ్రాయింగ్ రూమ్‌లలో కాకుండా వీధుల్లోనే కనిపిస్తారు కనుక, అది సమస్యను సులభంగా వీధుల్లోకి తీసుకుపోగలదు. ఒక విధాన నిర్ణయం కానీ, దాని అమలుకు సంబంధించిన చిక్కుముడులు కానీ దానికి పట్టవు. 1995లో మనోహర్ జోషీ పార్టీ తరపున ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేప ట్టిన కొద్దిరోజులకే బాల్‌థాక్రే సూచించినట్లుగా శివసేన మద్దతుదారులు మొరటు పద్ధతులనే కోరుకుం టారు. దేశంలో దాగి ఉన్న బంగ్లా దేశీయులను వెదికి పట్టుకుని వారిని పంపించి వేయండి లేదా శివసేనే ఆ పని చేస్తుం ది అనేది వీరి నినాదం. తమ ప్రభుత్వమే అధికారంలో ఉన్నప్పుడు పాటించాల్సిన రాజ్యాంగ బద్ధత వారికి ఏమాత్రం పట్టదు మరి.
రాష్ట్ర ముఖ్యమంత్రి మరీ జావకారిపోయిన మరొక ఘటన ఇటీవలే జరిగింది. ఇతర కేసులను పూర్తిగా విస్మ రించి ఇంద్రాణి ముఖర్జియా - షీనాబోరా కేసుపై ముంబై పోలీసు కమిషనర్ రాకేష్ మారియా తీవ్ర ఆసక్తిని ప్రదర్శించడానికి వ్యతిరేకంగా ఫడ్నవిస్ మాట్లా డారు. కొద్ది రోజుల తర్వాత మారియాను కీలకమైన పోస్టుకు కాకుండా హోంగార్డుల నిర్వహణ వంటి అప్రా ధాన్య పోస్టుకు ప్రమోషన్ ఇచ్చి మరీ పంపడం ద్వారా అందరినీ ఆశ్చర్యపరిచారు.
షీనాబోరా హత్యకు మీడియా ఎంత ప్రాధాన్యతని చ్చిందో ఆ కేసును విచారిస్తున్న మారియా కూడా అంతే స్థాయిలో వార్తల్లోకి వచ్చారు. ఈ కేసును ఆయన తీవ్ర స్థాయిలో విచారించడం, కొద్ది రోజులకే ఆ బాధ్యతల నుంచి తనను తప్పించడంతో ప్రశ్నల వర్షం మొదలైంది. ఈ కేసు చిక్కుముడి విప్పగలిగితే నగర పోలీసులకు పేరు ప్రతిష్టలు రానున్న సమయంలో ఉన్న ట్లుండి విచా రణ మధ్యలోనే మారియాను తప్పించడం ఎందుకు? ఈ కేసు వెనుక నగదు లావాదేవీలపై నగర పోలీసులు ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్ సహాయం కోరిన వెను వెంటనే మారియాపై గొడ్డలివేటు పడటం యాధృచ్ఛికం కాదు. దీంతో ఈ వ్యవహారంలో ఎవరిని కాపాడు తున్నారనే ప్రశ్నను ప్రతిపక్షం వెంటనే అందుకుంది. కచ్చితంగా ఇది సానుకూల ప్రతిపక్ష వ్యూహమే అనడం లో సందేహం లేదు. కానీ ఫడ్నవిస్ దీంట్లో సాధించేమీ లేదు. ఆ వెంటనే మరో తడబాటు సంభవించింది. మారియా ఇప్పుడు నగర పోలీసు కమిషనర్ కాకపోయి నప్పటికీ షీనా బోరా హత్య కేసుపై ఆయనే విచారణ కొనసాగిస్తారని రాష్ట్ర హోంశాఖ ఉన్నట్లుండి ప్రకటిం చింది. ఇది నూతన పోలీసు కమిషనర్‌కు ఏమాత్రం ఆత్మవిశ్వాసాన్ని కలిగించే ప్రకటన కాదు. కినుక వహిం చిన రాకేష్ మారియా ఆగ్రహంతో తన కార్యాలయం నుంచి వెళ్లిపోయారు. కానీ తర్వాత ఆ కేసుపై తానే విచారణ కొనసాగించినట్లయితే, ముంబై పోలీసు శాఖలో రెండు అధికార కేంద్రాలు ఏర్పడే ప్రమాదముం దని మారియా రాష్ట్ర ప్రభుత్వానికి తెలిపారు.
ఈ మొత్తం వ్యవహారంలో చోటుచేసుకున్న కామెడీ పరమ మోటుతనంతో కూడుకుంది. మీడియా ఒత్తిడి వల్లే ఈ కేసు విచారణను తిరిగి మారియాకే కట్టబెట్టినట్లు హోంశాఖ అంగీకరించినట్లయింది. అంటే పోలీసు కమిషనర్ పదవి నుంచి హోంగార్డుల శాఖకు మారియాను ప్రమోషన్‌తో సాగనంపిన వ్యవహారం ఆలోచనా రహితంగా చేశారని అర్థం. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి ఇంతకు మించిన పరమోదాహరణ మరొకటి ఉండబోదు. పదే పదే ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చ డానికి తెరవెనుక ఇంకా ఎంతమంది ఉన్నారన్నదే ప్రశ్న. దేవేంద్ర ఫడ్నవిస్ తీవ్రమైన ఆశాభంగంతో ఉన్నారన్నది స్పష్టం. (వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు
ఈమెయిల్: mvijapurkar@gmail.com)
- మహేష్ విజాపుర్కార్