జిల్లాల అభివృద్ధిపై సీఎం దృష్టి
ఇన్‌చార్జి మంత్రుల నియామకం
సాక్షి, ముంబై: ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ శుక్రవారం జిల్లా ఇన్‌చార్జీ మంత్రుల జాబితా విడుదల చేశారు. దేవేంద్ర ఫడ్నవిస్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం ఏర్పాటుచేసి దాదాపు రెండునెలలు కావస్తోంది. కేబినెట్, సహాయ మంత్రులకు శాఖలను కేటాయించినప్పటికీ ఇంతవరకు జిల్లా ఇన్‌చార్జీ మంత్రులను నియమించ లేదు. ఎట్టకేలకు శుక్రవారం పేర్లు ప్రకటించారు.
ఇందులో శివసేనకు చెందిన సుభాష్ దేశాయ్‌కి ముంబై నగరం, విద్యాశాఖ మంత్రి వినోద్ తావ్డేకు ఉప ముంబై నగరం జిల్లా ఇన్‌చార్జీ మంత్రిగా నియమించారు. ఇందులో అత్యధిక శాతం మంత్రులను వారివారి నియోజక వర్గాలున్న జిల్లాలకే ఇన్‌చార్జీలుగా నియమించడం గమనార్హం. వారి జిల్లాల్లో అభివృద్థి పనులు ఎలా సాగుతున్నాయో ఇతరులకంటే వారికే ఎక్కువ అనుభవం ఉంటుందనే ఉద్దేశంతోనే ఫడ్నవీస్ వారికి ఆయా బాధ్యతలు అప్పగించి ఉంటారని పరిశీలకులు భావిస్తున్నారు.
జిల్లా ఇన్‌చార్జీ మంత్రుల వివరాలివే...
ముంబై నగరం-సుభాష్ దేశాయ్, ముంబై ఉప నగరం-వినోద్ తావ్డే, ఠాణే-ఏక్‌నాథ్ షిండే, పాల్ఘార్-విష్ణు సావరా, రాయ్‌గడ్-రవీంద్ర వైకర్, సింధుదుర్గ్-దీపక్ కసర్కర్, సాంగ్లీ, కొల్హాపూర్-చంద్రకాంత్ పాటిల్, జల్గావ్, బుల్డాణ-ఏక్‌నాథ్ ఖడ్సే, పుణే-గిరీష్ బాపట్, అహ్మద్‌నగర్-రామ్ షిండే, ధుళే-దాదా భుసే, అకోలా, వాషిం- రంజిత్ పాటిల్, నాసిక్, నందుర్బార్-గిరీష్ మహాజన్, సాతారా-విజయ్ శివ్‌తరే, షోలాపూర్-విజయ్ దేశ్‌ముఖ్, అమరావతి-ప్రవీణ్ పోటే, వర్ధా-సుధీర్ మునగంటివార్, గోందియా-రాజ్‌కుమార్ బడోలే, యవత్మాల్-సంజయ్ రాఠోడ్, నాగపూర్-చంద్రశేఖర్ బావన్‌కుళే. భండార, ఉస్మానాబాద్- దీపక్ సావంత్, గడ్చిరోలి- అంబరీష్ ఆత్రం.