ముంబై/న్యూఢిల్లీ: బీజేపీతో స్నేహ బంధాన్ని తెంచుకున్న శివసేన, తన పూర్వ మిత్రునికి గుణపాఠం నేర్పాలని నిర్ణయించుకుంది. హిందూత్వ ఎజెండా విషయంలో బీజేపీని ఒంటరిని చేసేందుకు శివసేన మహారాష్ట్ర వెలుపల కూడా విస్తరించాలని నిర్ణయం తీసుకుంది. ఈ కార్యక్రమాన్ని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నుంచే ప్రారంభించాలని భావిస్తున్నామని శివసేన ఎమ్మెల్సీ దివాకర్ రావుతే చెప్పారు. దేశంలోని ప్రతి రాష్ట్రానికి తమ పార్టీని విస్తరించాలని నిర్ణయించామని, తమ ప్రణాళిక ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నుంచే ప్రారంభమవుతుందని ఆయన అన్నారు.
‘‘హిందూత్వ లక్ష్యాన్ని సాధించేందుకు కలిసే ఉందాం అని ఉద్ధవ్‌జీ (శివసేన అధ్యక్షుడు) కోరితే వారు (బీజేపీ) మొండిగా వ్యవహరించారు’’ అని రావుతే పేర్కొన్నారు. దేశంలోని మూలమూలకూ విస్తరించేందుకు, పార్టీని మరింత పటిష్టం చేసేందుకు ఎన్నికలను ఒక మాధ్యమంగా వాడుకుంటామని చెప్పారు. ఢిల్లీ రాజకీయాల్లో తమ పాత్ర నామమాత్రమేనని, ఎన్ని సీట్లలో పోటీ చేయాలని, అభ్యర్థులెవరు అన్న విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని అన్నారు. ఢిల్లీ ఎన్నికల్లో గెలుస్తామన్న నమ్మకం శివసేనకు లేకపోయినప్పటికీ, బీజేపీ అవకాశాలను దెబ్బతీయాలన్నదే ఆ పార్టీ లక్ష్యంగా కనిపిస్తోందని రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు.
ఢిల్లీలోని మైనారిటీల అభివృద్ధికి అవకాశాలు కల్పించడంలో కాంగ్రెస్ వైఫల్యం చెందినందునే ప్రాంతీయ పార్టీలు అక్కడ విస్తరిస్తున్నాయని రావుతే అభిప్రాయపడ్డారు. ఇంతకాలం కాంగ్రెస్‌కు అండగా ఉన్న ముస్లిమ్‌లు ఇప్పుడు ఆ పార్టీకి దూరమవుతున్నారని అన్నారు. దీనిని ఎంఐఎం అవకాశంగా తీసుకుని ఇతర రాష్ట్రాలకు విస్తరిస్తోందని చెప్పారు. హైదరాబాద్‌లోనే పట్టున్న మజ్లిస్ పార్టీ ఇటీవలి మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో రెండు సీట్లు గెలుపొందింది. ఇటువంటి పార్టీలు విస్తరించకుండా అడ్డుకుంటామని రావుతే చెప్పారు. భవిష్యత్తులో దేశంలో జరిగే ప్రతి ఎన్నికల్లో తాము పోటీ చేస్తామని తెలిపారు.
ఢిల్లీలోనూ కాలు మోపుతాం: శివసేన
Published Thu, Nov 20 2014 10:54 PM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM
Advertisement
Advertisement