diwakar raote
-
ట్రాఫిక్ చలానాలు; పస్తులతో ఆత్మహత్యలు!
ముంబై : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మోటారు వాహన సవరణ చట్టం-2019పై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధిక జరిమానాలను విధించే ఈ చట్టం సామాన్యుడి నడ్డి విరిచేలా ఉందంటూ దేశ వ్యాప్తంగా నిరసన వ్యక్తమవుతోంది. ఈ క్రమంలో కొత్త ట్రాఫిక్ జరిమానాలు సగానికి తగ్గిస్తూ గుజరాత్ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం సంచలనంగా మారింది. బీజేపీ పాలిత రాష్ట్రంలోనే కొత్త చట్టంపై ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే తాము మాత్రం ఎందుకు దీనిని అమలు చేయాలని పలువురు నాయకులు ప్రశ్నిస్తున్నారు. సాక్షాత్తూ ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షా సొంత రాష్ట్రమైన గుజరాత్లో జరిమానాలు తగ్గించడంపై రవాణా మంత్రి నితిన్ గడ్కరీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.ఈ నేపథ్యంలో మహారాష్ట్ర రైతు సంఘం ప్యానెల్ చీఫ్ కిశోర్ తివారీ సంచలన వ్యాఖ్యలు చేశారు. కొత్త చట్టం పౌరులను ఆత్మహత్యలకు పురిగొల్పేలా ఉందని వ్యాఖ్యానించారు. ఈ చట్టం కారణంగా దేశ వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని పేర్కొన్నారు. బుధవారం ఓ కార్యక్రమంలో కిశోర్ తివారీ మాట్లాడుతూ...‘ ప్రధాని, హోం మంత్రి సొంత రాష్ట్రమైన గుజరాత్లో ట్రాఫిక్ చలానాలు తగ్గించారు. దీనిని బట్టి కొత్త చట్టానికి బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా వ్యతిరేకంగా ఉన్నాయని అర్థమవుతోంది. కాబట్టి ప్రధాని నరేంద్ర మోదీకి కూడా ఈ చట్టంపై రెండో అభిప్రాయం ఉందని భావించవచ్చు. 10 వేల నుంచి 20 వేల వరకు జరిమానా విధిస్తున్నారు. అద్దెకు వాహనాలు నడుపుకొని జీవనం సాగించే నెల జీతానికి సమానంగా జరిమానాలు ఉండటం దారుణం. అటువంటి బడుగు జీవులకు ఒక్కసారి జరిమానా పడిందంటే వాళ్ల కుటుంబం మొత్తం పస్తులతో ఆత్మహత్య చేసుకోవాల్సి వస్తుంది’ అని వ్యాఖ్యానించారు. కాగా వసంతరావు నాయక్ శెట్టి స్వాలంబన్ మిషన్ చైర్మన్‌గా ఉన్న కిశోర్ తివారీ ప్రస్తుతం మహారాష్ట్ర ప్రభుత్వంలో క్యాబినెట్ మంత్రి హోదా అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా మహారాష్ట్ర రవాణా శాఖా మంత్రి దివాకర్ రౌత్ కూడా కొత్త మోటారు వాహన సవరణ చట్టాన్ని విమర్శించారు. ఈ మేరకు...‘ కొత్త చట్టం సామాన్యుల పాలిట భారంగా మారుతోంది. కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాన్ని మరోసారి సమీక్షించి.. సవరించాల్సిన అవసరం ఉంది అని నితిన్ గడ్కరీకి లేఖ రాశారు. కాగా దివాకర్ శివసేన పార్టీకి చెందిన వారన్న సంగతి తెలిసిందే. పొత్తులో భాగంగా బీజేపీ ప్రభుత్వం ఆయనకు మంత్రి పదవినిచ్చింది. -
మాతృభాష రాకుంటే ఆటో పర్మిట్లు కూడా రావు!
మాతృభాషలో అనర్గళంగా మాట్లాడటం వచ్చా? రాకుంటే వెంటనే '30 రోజుల్లో మాతృభాష' పుస్తకాన్ని కొనుక్కొని నేర్చేసుకోండి. అది కూడా నవంబర్ 1 లోగా. ఎందుకంటే ఆ తర్వాతి నుంచి మాతృభాష రాకుంటే ప్రభుత్వం నుంచి అనుమతులు పొందడం కల్ల. అదృష్టవశాత్తు ఈ నిబంధన విధించింది తెలుగు రాష్ట్రాలు కాదు.. పక్కనున్న మహారాష్ట్రలో! నవంబర్ 1 నుంచి మరాఠీ మాట్లాడగలిగిన ఆటో డ్రైవర్లకు మాత్రమే పర్మిట్లు ఇస్తామని ఆ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి దివాకర్ రౌతే మంగళవారం ఓ ప్రకటన చేశారు. ఇప్పటికే ఉత్తరాది, ఈశాన్య రాష్ట్రాల నుంచి మహారాష్ట్రకు వలస వచ్చినవారిపై మరాఠా అతివాదులు కొందరు దాడులు చేసిన నేపథ్యంలో తాజాగా విధించనున్న మరాఠీ భాషా నియమం ఎన్ని సమస్యలకు దారితీస్తుందో చూడాలి. -
ఢిల్లీలోనూ కాలు మోపుతాం: శివసేన
ముంబై/న్యూఢిల్లీ: బీజేపీతో స్నేహ బంధాన్ని తెంచుకున్న శివసేన, తన పూర్వ మిత్రునికి గుణపాఠం నేర్పాలని నిర్ణయించుకుంది. హిందూత్వ ఎజెండా విషయంలో బీజేపీని ఒంటరిని చేసేందుకు శివసేన మహారాష్ట్ర వెలుపల కూడా విస్తరించాలని నిర్ణయం తీసుకుంది. ఈ కార్యక్రమాన్ని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నుంచే ప్రారంభించాలని భావిస్తున్నామని శివసేన ఎమ్మెల్సీ దివాకర్ రావుతే చెప్పారు. దేశంలోని ప్రతి రాష్ట్రానికి తమ పార్టీని విస్తరించాలని నిర్ణయించామని, తమ ప్రణాళిక ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నుంచే ప్రారంభమవుతుందని ఆయన అన్నారు. ‘‘హిందూత్వ లక్ష్యాన్ని సాధించేందుకు కలిసే ఉందాం అని ఉద్ధవ్జీ (శివసేన అధ్యక్షుడు) కోరితే వారు (బీజేపీ) మొండిగా వ్యవహరించారు’’ అని రావుతే పేర్కొన్నారు. దేశంలోని మూలమూలకూ విస్తరించేందుకు, పార్టీని మరింత పటిష్టం చేసేందుకు ఎన్నికలను ఒక మాధ్యమంగా వాడుకుంటామని చెప్పారు. ఢిల్లీ రాజకీయాల్లో తమ పాత్ర నామమాత్రమేనని, ఎన్ని సీట్లలో పోటీ చేయాలని, అభ్యర్థులెవరు అన్న విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని అన్నారు. ఢిల్లీ ఎన్నికల్లో గెలుస్తామన్న నమ్మకం శివసేనకు లేకపోయినప్పటికీ, బీజేపీ అవకాశాలను దెబ్బతీయాలన్నదే ఆ పార్టీ లక్ష్యంగా కనిపిస్తోందని రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు. ఢిల్లీలోని మైనారిటీల అభివృద్ధికి అవకాశాలు కల్పించడంలో కాంగ్రెస్ వైఫల్యం చెందినందునే ప్రాంతీయ పార్టీలు అక్కడ విస్తరిస్తున్నాయని రావుతే అభిప్రాయపడ్డారు. ఇంతకాలం కాంగ్రెస్‌కు అండగా ఉన్న ముస్లిమ్‌లు ఇప్పుడు ఆ పార్టీకి దూరమవుతున్నారని అన్నారు. దీనిని ఎంఐఎం అవకాశంగా తీసుకుని ఇతర రాష్ట్రాలకు విస్తరిస్తోందని చెప్పారు. హైదరాబాద్‌లోనే పట్టున్న మజ్లిస్ పార్టీ ఇటీవలి మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో రెండు సీట్లు గెలుపొందింది. ఇటువంటి పార్టీలు విస్తరించకుండా అడ్డుకుంటామని రావుతే చెప్పారు. భవిష్యత్తులో దేశంలో జరిగే ప్రతి ఎన్నికల్లో తాము పోటీ చేస్తామని తెలిపారు. -
బెల్గావ్లో శివసేన ఆందోళన
సాక్షి, ముంబై: మహారాష్ర్ట, కర్ణాటక సరిహద్దులోని ‘యెళ్లూర్’ ఘటనలో గాయపడిన వారిని పరామర్శించేందుకు వెళ్లిన శివసేన నాయకుడు దివాకర్ రావుతేను శుక్రవారం కర్ణాటక పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆగ్రహానికి గురైన మహారాష్ట్ర-కర్ణాటక సరిహద్దులో ఉన్న శిణోలి గ్రామంలో కర్ణాటక ప్రభుత్వ దిష్టి బొమ్మకు శవయాత్ర నిర్వహించారు. అంతేగాక కర్ణాటక ప్రభుత్వం వైఖరిని నిరసిస్తూ కొల్హాపూర్‌లో బంద్ పాటించారు. యెళ్లూర్ గ్రామ పొలిమేరలో కొందరు ఇది మహారాష్ట్ర సరిహద్దులోకి వస్తుందని బోర్డు ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై కర్ణాటక ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు గత అదివారం ఆ గ్రామ ప్రజలపై పోలీసులు దాడిచేసి దొరికినవారిని దొరికినట్లే చితక బాదారు. ఇళ్లలో ఉన్న మహిళలు, గర్భిణిలు అని చూడకుండా బయటకు ఈడ్చుకొచ్చి కొట్టారు. ఈ ఘటనలో అనేక మంది అమాయకులు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో వారిని పరామర్శించేందుకు శుక్రవారం ఉదయం రావుతే అక్కడికి వెళ్లారు. సరిహద్దులోని బెల్గావ్లో పంచముఖి హోటల్ వద్ద ఆయన్ని కర్ణాటక పోలీసులు అడ్డుకున్నారు. యెళ్లూర్ వెళ్లేందుకు అనుమతించలేదు. తిరిగి మహారాష్ట్రకు వెళ్లిపోవాలని హెచ్చరించారు. దీంతో రావుత్ అక్కడే విలేకరుల సమావేశం ఏర్పాటు చేసేందుకు యత్నించారు. కాని వాగ్వాదం జరగడంతో పోలీసులు వెంటనే రావుత్పాటు ఎమ్మెల్యే సుజీత్ మించేకర్, కొల్హాపుర్ జిల్లా ప్రముఖుడు విజయ్ దేవణే తదితరులను బలవంతంగా తీసుకువచ్చిమహారాష్ట్ర హద్దులోని శిణోలి గ్రామంలో వదిలేశారు. బెల్గావ్ సరిహద్దులోని గ్రామాల్లో కర్ణాటక పోలీసులు 144 సెక్షన్ విధించారు. దీంతో ఆగ్రహానికి గురైన శివసేన కార్యకర్తలు కర్ణాటక ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ విషయం కొల్హాపూర్ జిల్లా కేంద్రం వరకు పాకింది. స్థానిక ఎమ్మెల్యే రాజేశ్ క్షిర్సాగర్ నేతృత్వంలో సర్కారు శవయాత్ర నిర్వహించారు. పట్టణంలో ఊరేగింపు నిర్వహించి షాపులను, వ్యాపార సంస్థలను మూసివేయించారు. వెంటనే పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. పట్టణంలో ప్రస్తుతం శాంతి, భద్రతలు అదుపులోనే ఉన్నాయని పోలీసులు తెలిపారు. -
రైతులకు నష్టపరిహారం ఇప్పించండి
ముంబై: రాష్ట్రవ్యాప్తంగా ఇటీవల కురిసిన వర్షాల వల్ల పంటలు కోల్పోయిన రైతులకు మెరుగైన సహాయం అందించాలని శివసేన నాయకులు గవర్నర్ కె.శంకర్ నారాయణన్‌ను కలిసి కోరారు. రైతులకు ఇచ్చిన రుణవసూలును వెంటనే నిలిపివేయాలని అభ్యర్థించారు. పార్టీ సీనియర్ నాయకుడు దివాకర్ రౌతే నేతృత్వంలోని బృందం సభ్యులు రాజ్‌భవన్‌లో గవర్నర్ కె.శంకర్ నారాయణన్‌ను గురువారం కలిశారు. ఇటీవల కురిసిన అకాలవర్షాలకు ధ్వంసమైన పంటలకు ఎకరాకు రూ.15 వేల నుంచి రూ.25 వేల వరకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. బాధిత రైతుల పంట రుణాల వసూలును నిలిపివేయాలన్నారు. పంటలు ధ్వంసమైన ప్రాంతాల్లో పర్యటించాలని కోరారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్‌తో చర్చిస్తానని గవర్నర్ హామీ ఇచ్చారు. అలాగే ప్రముఖ సంఘసంస్కర్త అప్పాసాహెబ్ ధర్మాధికారి సేవలకుగానూ ముంబై వర్సిటీ నుంచి డాక్టరేట్ ఇప్పించాలని ప్రతిపాదించారు. గవర్నర్‌ను కలిసిన వారిలో రాజ్యసభ సభ్యుడు అనిల్ దేశాయ్, అనిల్ పరబ్, నీలమ్ గోరేలు ఉన్నారు. నాసిక్‌లో భారీవర్షం నాసిక్: జిల్లాలో గురువారం రాత్రి ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురవడంతో పంటలు, కూరగాయల తోటలు ధ్వంసమయ్యాయి. ద్రాక్ష, ఉల్లిగడ్డ, గోధుమ, ధానిమ్మ, టమాటాతో పాటు వివిధ పంటలు నాశనమయ్యాయి. నాసిక్, కల్వా, చంద్వాడ్, దేవ్లా, మాలేగావ్, సిన్నార్, నిపాడ్ తాలూకా పట్టణాల్లో భారీగా వర్షాలు కురిశాయని అధికారులు తెలిపారు. ఉత్తర మహారాష్ట్రలో వర్షాల వల్ల ఇప్పటివరకు పది మంది మృతి చెందారని వివరించారు. పశువులు కూడా చనిపోయాయన్నారు. అనేక ఇళ్లు ధ్వంసమయ్యాయని తెలిపారు. ఇప్పటికే పొరుగునే ఉన్న ధులే జిల్లాలో పంట నష్టం అంచనా వేసేందుకు కేంద్ర బృందం పర్యటిస్తోందని చెప్పారు.