ముంబై: రాష్ట్రవ్యాప్తంగా ఇటీవల కురిసిన వర్షాల వల్ల పంటలు కోల్పోయిన రైతులకు మెరుగైన సహాయం అందించాలని శివసేన నాయకులు గవర్నర్ కె.శంకర్ నారాయణన్‌ను కలిసి కోరారు. రైతులకు ఇచ్చిన రుణవసూలును వెంటనే నిలిపివేయాలని అభ్యర్థించారు. పార్టీ సీనియర్ నాయకుడు దివాకర్ రౌతే నేతృత్వంలోని బృందం సభ్యులు రాజ్‌భవన్‌లో గవర్నర్ కె.శంకర్ నారాయణన్‌ను గురువారం కలిశారు. ఇటీవల కురిసిన అకాలవర్షాలకు ధ్వంసమైన పంటలకు ఎకరాకు రూ.15 వేల నుంచి రూ.25 వేల వరకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.
బాధిత రైతుల పంట రుణాల వసూలును నిలిపివేయాలన్నారు. పంటలు ధ్వంసమైన ప్రాంతాల్లో పర్యటించాలని కోరారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్‌తో చర్చిస్తానని గవర్నర్ హామీ ఇచ్చారు. అలాగే ప్రముఖ సంఘసంస్కర్త అప్పాసాహెబ్ ధర్మాధికారి సేవలకుగానూ ముంబై వర్సిటీ నుంచి డాక్టరేట్ ఇప్పించాలని ప్రతిపాదించారు. గవర్నర్‌ను కలిసిన వారిలో రాజ్యసభ సభ్యుడు అనిల్ దేశాయ్, అనిల్ పరబ్, నీలమ్ గోరేలు ఉన్నారు.
నాసిక్‌లో భారీవర్షం
నాసిక్: జిల్లాలో గురువారం రాత్రి ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురవడంతో పంటలు, కూరగాయల తోటలు ధ్వంసమయ్యాయి. ద్రాక్ష, ఉల్లిగడ్డ, గోధుమ, ధానిమ్మ, టమాటాతో పాటు వివిధ పంటలు నాశనమయ్యాయి. నాసిక్, కల్వా, చంద్వాడ్, దేవ్లా, మాలేగావ్, సిన్నార్, నిపాడ్ తాలూకా పట్టణాల్లో భారీగా వర్షాలు కురిశాయని అధికారులు తెలిపారు. ఉత్తర మహారాష్ట్రలో వర్షాల వల్ల ఇప్పటివరకు పది మంది మృతి చెందారని వివరించారు. పశువులు కూడా చనిపోయాయన్నారు. అనేక ఇళ్లు ధ్వంసమయ్యాయని తెలిపారు. ఇప్పటికే పొరుగునే ఉన్న ధులే జిల్లాలో పంట నష్టం అంచనా వేసేందుకు కేంద్ర బృందం పర్యటిస్తోందని చెప్పారు.
రైతులకు నష్టపరిహారం ఇప్పించండి
Published Fri, Mar 14 2014 10:18 PM | Last Updated on Sat, Sep 2 2017 4:42 AM
Advertisement