ఆయనో మాజీ మంత్రి తనయుడు. అతన్ని ఎవరో కిడ్నాప్ చేశారంటూ ఓ ఆగంతకుడు పోలీసులకు సమాచారం అందించాడు. అతని తండ్రి అధికార పార్టీకి చెందిన నేత కావడంతో పోలీసులే స్వయంగా కిడ్నాప్ చేసి నమోదు చేసి రంగంలోకి దిగారు. ఆపై ఆ మాజీ మంత్రి సీన్‌లోకి రావడంతో అధికార యంత్రాగమే దిగి వచ్చింది. పాపం.. ఆ బాబుగారి సీక్రెట్ బ్యాంకాక్ ప్లాన్ ‘గాల్లో ఉండగానే’ బెడిసి కొట్టింది.
ముంబై: శివసేన(షిండే వర్గం) నేత, మహారాష్ట్ర మాజీ మంత్రి తానాజీ సావంత్ కుమారుడు రిషిరాజ్ సావంత్ కిడ్నాప్‌నకు గురయ్యారనే వ్యవహారం సోమవారం రాత్రి మహారాష్ట్రలో కలం రేపింది. పోలీసుల ద్వారా సమాచారం అందుకున్న తానాజీ.. హుటాహుటిన కమిషనర్ ఆఫీస్‌కు చేరుకుని పరిస్థితి సమీక్షించారు. ఎంక్వైరీ చేసిన పోలీసులు అతనొక ప్రైవేట్ ఛార్ట్‌లో అండమాన్ వైపు వెళ్తున్నాడనే సమాచారం తెలుసుకున్నారు. ఎవరో ఇద్దరు బలవంతంగా తన కొడుకును ఎత్తుకెళ్తున్నారని ఆయన మీడియా ముందు వాపోయారు.
ఆ వెంటనే డీజీసీఏకు ఈ కేసు గురించి సమాచారం అందించారు. బ్యాంకాక్ వైపు వెళ్తున్న ఆ ప్రైవేటు విమానం.. పుణెకు తీసుకురావాలని పైలట్లకు ఆదేశాలు జారీ అయ్యాయి. తొలుత పైలట్లు అదొక తప్పుడు సమాచారం అనుకున్నారట. సాధారణంగా మెడికల్ ఎమర్జెన్సీ లేదంటే సాంకేతిక సమస్యలు తలెత్తినప్పుడు మాత్రమే అలా వెనక్కి రావడానికి పైలట్లకు అవకాశం ఉంటుంది. అయినప్పటికీ ఎందుకైనా మంచిదని ఎయిర్‌పోర్ట్ అధికారుల నుంచి ధృవీకరణ చేసుకుని వెనక్కి తిప్పారు. అలా.. అండమాన్ దాకా వెళ్లిన విమానం అలాగే వెనక్కి వచ్చేసింది.
పుణే ఎయిర్‌పోర్టులో విమానం ల్యాండ్ కాగానే విమానంలో ఉన్న ముగ్గురు షాక్ తిన్నారు. తమకు తెలియకుండానే తిరిగి రావడంతో రిషిరాజ్, అతడి స్నేహితులు.. పైలట్లపై మండిపడ్డారు. అయితే తాము కేవలం ఆదేశాలు మాత్రమే పాటిస్తామని పైలట్లు చెప్పడంతో ఏం చేయలేకపోయారు. ఆ వెంటనే సీఐఎస్‌ఎఫ్ సిబ్బంది విమానంలోకి వెళ్లి వాళ్లను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు.
తన కుటుంబానికి తెలియకుండా రిషిరాజ్ ఇద్దరు స్నేహితులతో ‘బిజినెస్ ట్రిప్’ ప్లాన్ చేశాడట. విషయం తెలిసి పోలీసులు, ఆ మాజీ మంత్రి ఊపిరి పీల్చుకున్నారు. విషయం తెలుసుకోకుండా తన కొడుకును బలవంతంగా వెనక్కి రప్పించారంటూ అధికారులపై ఆ మాజీ మంత్రి అగ్గి మీద గుగ్గిలం అయ్యారు. మరోవైపు మరోవైపు పోలీసుల అత్యుత్సాహం, తానాజీ అధికార దుర్వినియోగంపై ఉద్దవ్ శివసేన మండిపడింది. ఎక్కడైతే రిషిరాజ్ కిడ్నాప్‌నకు గురయ్యారని హడావిడి జరిగిందో.. అదే సింగాద్ రోడ్ పీఎస్‌లో ఈ వ్యవహారంపై యూబీటీ శివసేన ఫిర్యాదు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment