శివసేన(ఉద్ధవ్) నేత సంజయ్ రౌత్ సంచలన ప్రకటన
ఎంవీఏలోని కాంగ్రెస్ సహకరించడం లేదని ఆరోపణలు
కూటమిలో తమ కార్యకర్తలకు అవకాశాలు దక్కడం లేదని వెల్లడి
ఎంవీఏలో ముదిరిన విభేదాలకు గట్టి సంకేతమంటున్న విశ్లేషకులు
నాగ్‌పూర్: మహారాష్ట్రలోని ప్రతిపక్ష కూటమి మహా వికాస్ అఘాడీ(ఎంవీఏ)లో లుకలుకలు మరోసారి ప్రస్ఫుటమయ్యాయి. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయంపై కూటమి నేతలు పరస్పరం దుమ్మెత్తి పోసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఎంవీఏలోని కీలక భాగస్వామ్య పార్టీ శివసేన(ఉద్ధవ్) సంచలన ప్రకటన చేసింది. రాష్ట్రంలో మరికొద్ది నెలల్లో జరిగే స్థానిక ఎన్నికల్లో తాము ఒంటరిగానే పోటీ చేస్తామని ఆ పార్టీ నేత సంజయ్ రౌత్ స్పష్టం చేశారు.
ఉమ్మడిగా ఉండి పోటీ చేస్తే కూటమి భాగస్వామ్య పక్షాల కార్యకర్తలకు అవకాశాలు రావడం లేదని వ్యాఖ్యానించారు. ఈ పరిస్థితుల్లో సంస్థాగతంగా బలోపేతం అవ్వాల్సిన విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఒంటరిగా బరిలోకి దిగాలని నిర్ణయించామన్నారు. ముంబై, థానె, నాగ్‌పూర్ తదితర మున్సిపల్ కార్పొరేషన్లతోపాటు జిల్లా పరిషత్, పంచాయతీ ఎన్నికల్లో సైతం సొంతంగానే బరిలోకి దిగాలనే నిర్ణయానికి తమ పార్టీ అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే సానుకూలంగా ఉన్నట్లు రౌత్ వివరించారు. ప్రతిపక్ష ఇండియా కూటమి, మహా వికాస్ అఘాడీ(ఎంవీఏ) రూపంలోని మైత్రి లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలకు మాత్రమే పరిమితమని రౌత్ స్పష్టం చేశారు.
కాంగ్రెస్ తీరు సరికాదు
ఎంవీఏ, ఇండియా కూటమిలోనీ ముఖ్య భాగస్వామ్య పక్షమైన కాంగ్రెస్ పార్టీ సభ్య పార్టిలకు ఏమాత్రం సహకరించడం లేదని రౌత్ ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయంపై కాంగ్రెస్ పార్టీ నేత విజయ్ వడెట్టివార్ భాగస్వామ్య పక్షాలను నిందిస్తున్నారని తెలిపారు. ఏకాభిప్రాయం, సర్దుకుపోవడం వంటి వాటిపై విశ్వాసం లేని వారికి కూటమిలో కొనసాగే అర్హత లేదని రౌత్ విమర్శించారు. ఇక ఇండియా కూటమి విషయానికొస్తే..లోక్‌సభ ఎన్నికల ఫలితాల తర్వాత ఒక్క దఫా కూడా సమావేశం కాలేకపోయిందన్నారు. ఇండియా కూటమికి కన్వినర్‌ను కూడా నియమించుకోలేకపోవడం మంచి విషయం కాదన్నారు.
ఎవరికీ మంచిది కాదు: ఎన్‌సీపీ(శరద్)
శివసేన (ఉద్ధవ్) పార్టీ నిర్ణయంపై ఎంవీఏ భాగస్వామ్య పక్షమైన ఎన్‌సీపీ(శరద్) స్పందించింది. ‘ఒంటరిగానే ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటే అది శివసేన(ఉద్ధవ్) పార్టీ ఇష్టం. మేం అడ్డుకోబోం. బలవంతంగా ఎవరినీ కలుపుకోం. అసెంబ్లీ ఎన్నికల తర్వాత కూడా మేం కలిసి ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అది సరైన నిర్ణయంగా మేం భావించడం లేదు. కానీ, ఈ నిర్ణయం ప్రభావం ఎంవీఏ కూటమిలోని మూడు భాగస్వామ్య పక్షాల గెలుపు అవకాశాలపైనా పడుతుంది’అని ఆ పార్టీ నేత జితేంద్ర ఔహద్ చెప్పారు.
మేం పట్టించుకోం: సీఎం ఫడ్నవీస్
స్థానిక ఎన్నికల్లో సొంతంగానే పోటీ చేయాలన్న శివసేన(ఉద్ధవ్) నిర్ణయాన్ని బీజేపీకి చెందిన సీఎం ఫడ్నవీస్ తోసిపుచ్చారు. ‘ఎంవీఏ కూటమి పోటీలో ఉన్నా లేకున్నా మేం పట్టించుకునేది లేదు. ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం కట్టుబడి ఉంటాం. వచ్చే అన్ని ఎన్నికల్లోనూ ప్రజలు మాకే మద్దతుగా ఉంటారనే నమ్మకం మాకుంది’అని ఆయన చెప్పారు. ఇటీవలి కాలంలో శివసేన(ఉద్ధవ్) వర్గం బీజేపీ వైపు మొగ్గు చూపుతోందంటూ వస్తున్న వార్తలపై ఆయన స్పందిస్తూ..రాజకీయాల్లో ఏమైనా జరగొచ్చునంటూ వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment