‘మహా’ వ్యాఖ్యలు... మర్మమేమిటో?! | Coalition politics Starts in Maharashtra | Sakshi
Sakshi News home page

‘మహా’ వ్యాఖ్యలు... మర్మమేమిటో?!

Published Mon, Jan 6 2025 5:39 AM | Last Updated on Mon, Jan 6 2025 5:39 AM

Coalition politics Starts in Maharashtra

మహారాష్ట్రలో ఆసక్తికర పరిణామాలు 

ముఖ్యమంత్రి ఫడ్నవీస్‌పై ఉద్ధవ్, శరద్‌ పవార్‌ వర్గాల ప్రశంసలు 

వారిద్దరూ ఎన్డీయే వైపు చూస్తున్నారంటూ వార్తలు 

మహారాష్ట్రలో రాజకీయ పునరేకీకరణకు రంగం సిద్ధమవుతోందా? కొద్ది రోజులుగా రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న అనూహ్య పరిణామాల నేపథ్యంలో ఈ దిశగా చర్చ జోరందుకుంటోంది. బీజేపీ సారథ్యంలోని అధికార మహాయుతి కూటమికి చేరువయ్యేందుకు విపక్ష శివసేన (ఉద్ధవ్‌), ఎన్సీపీ (శరద్‌ పవార్‌) ప్రయత్నం చేస్తున్నాయన్న వార్తలు సర్వత్రా ఆసక్తి కలిగిస్తున్నాయి. ఆ పార్టీల నేతల తాజా వ్యాఖ్యలు ఈ దిశగా సంకేతాలేనన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. 

గత నవంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ నేతృత్వంలోని విపక్ష మహా వికాస్‌ అఘాడీ (ఎంవీఏ)కి మహాయుతి ఘోర ఓటమి రుచి చూపించడం తెలిసిందే. శివసేనను కొన్నేళ్ల క్రితం నిలువునా చీల్చిన ఏక్‌నాథ్‌ షిండే వర్గం, నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ (ఎన్సీపీ) నుంచి విడిపోయిన అజిత్‌ పవార్‌ వర్గం మహాయుతి భాగస్వాములుగా బీజేపీతో అధికారం పంచుకుంటున్నాయి. తామే అసలైన పార్టీలమంటూ ఇప్పటికే గుర్తింపు కూడా దక్కించుకున్నాయి. 

బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్‌ ముఖ్యమంత్రి పదవి చేపట్టగా షిండే, అజిత్‌ ఆయనకు డిప్యూటీలుగా కొనసాగుతున్నారు. కాంగ్రెస్‌తో కలిసి ఎంవీఏ కూటమిగా ఎన్నికల్లో పోటీ చేసిన ఉద్ధవ్‌ సేన, శరద్‌ పవార్‌ సారథ్యంలోని ఎన్సీపీ భారీ ఓటమితో కుదేలయ్యాయి. ఒకరకంగా ఉనికి కోసం పోరాడాల్సిన పరిస్థితికి చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో రెండు పార్టీల అభిమానులు, కార్యకర్తల నుంచి వస్తున్న విజ్ఞప్తులు ఆసక్తి కలిగిస్తున్నాయి. 

విడిపోయిన  పార్టీలు మళ్లీ కలిసి పోవాలంటూ కొద్ది రోజులుగా వారు గట్టిగా కోరుతున్నారు! ఈ నేపథ్యంలో శివసేన (ఉద్ధవ్‌) అధికారిక పత్రిక ‘సామ్నా’ తమ ప్రత్యర్థి అయిన ఫడ్నవీస్‌ను ప్రశంసల్లో ముంచెత్తడం ప్రాధాన్యం సంతరించుకుంది. గడ్చిరోలీ జిల్లాలో నక్సలిజం అంతానికి ఆయన బాగా కృషి చేస్తున్నారని సామ్నా తాజా సంచిక సంపాదకీయంలో పేర్కొంది. ‘‘గడ్చిరోలీలో పలు అభివృద్ధి పనులకు సీఎం ఫడ్నవీస్‌ శ్రీకారం చుట్టారు. 

గిరిజనుల జీవితాల్లో వెలుగులు నింపడానికి ఎంతో కృషి చేస్తున్నారు. గడ్చిరోలీకి నూతన గుర్తింపును ఇవ్వాలని ఫడ్నవీస్‌ భావిస్తే స్వాగతిస్తాం’’ అని చెప్పుకొచ్చింది. ‘‘నక్సల్స్‌ ప్రభావిత జిల్లాలో నూతన అభివృద్ధి శకానికి శ్రీకారం చుట్టిన ఫడ్నవీస్‌ నిజంగా ప్రశంసలకు అర్హుడు’’ అని పేర్కొంది! మరోవైపు పార్టీని చీల్చి ప్రస్తుత దుస్థితికి కారకుడైన షిండేపై సంపాదకీయం విమర్శలు గుప్పించింది. ఆయన గతంలో ఇన్‌చార్జి మంత్రి హోదాలో గడ్చిరోలీలో మైనింగ్‌ లాబీల ప్రయోజనాల పరిరక్షణకే పని చేశారని ఆరోపించింది. 

లోగుట్టు ఏమిటో?! 
ఉద్ధవ్‌ సేన ఉన్నట్టుండి బీజేపీ అనుకూల వైఖరి ప్రదర్శిస్తుండటం ఆసక్తికరంగా మారింది. గత నెల 17న అసెంబ్లీ సమావేశాల సందర్భంగా సీఎం ఫడ్నవీస్‌ను పార్టీ అధినేత ఉద్ధవ్‌ ఠాక్రే ప్రత్యేకంగా కలుసుకున్నారు కూడా! ఎన్సీపీ (శరద్‌ పవార్‌) ఎంపీ సుప్రియా సూలే సైతం ఫడ్నవీస్‌ను అభినందించారు. రాష్ట్ర ప్రగతి కోసం ఆయన మిషన్‌ మోడ్‌లో పని చేస్తున్నారంటూ ప్రస్తుతించారు. ప్రధాన రాజకీయ ప్రత్యర్థులు బీజేపీ సీఎంను ఇలా ఆకాశానికెత్తుతుండటం యాదృచ్ఛికమేమీ కాదన్న అభిప్రాయాలు రాజకీయ వర్గాల నుంచి వినిపిస్తున్నాయి. అవి ఎన్డీఏ వైపు చూస్తున్నాయనేందుకు బహుశా ఇది సంకేతమని విశ్లేషకులు అంటున్నారు. 

హిందూత్వవాదమే మూల సిద్ధాంతంగా పుట్టుకొచ్చిన శివసేన రాష్ట్రంలో అధికారం కోసం ఐదేళ్ల కింద అనూహ్యంగా తన బద్ధ విరోధి కాంగ్రెస్‌తో జట్టుకట్టడం తెలిసిందే. అప్పటినుంచే పార్టీ పతనం ప్రారంభమైందన్నది పరిశీలకుల మాట. ఈ నేపథ్యంలో ఉనికిని కాపాడుకోవడానికి హిందూత్వవాది అయిన బీజేపీతో స్నేహం తప్పు కాదని ఉద్ధవ్‌ వర్గం నేతల్లో కొందరంటున్నారు. కానీ అది ఆత్మహత్యా సదృశమే కాగలదని, పార్టీ ఎదుగుదల అవకాశాలు శాశ్వతంగా మూసుకుపోతాయని మరికొందరు వాదిస్తున్నారు. పైగా ఎన్డీఏలో చేర్చుకుని ఉద్ధవ్‌ సేనకు చేజేతులారా కొత్త ఊపిరి పోసే పని బీజేపీ ఎందుకు చేస్తుందని ప్రశి్నస్తున్నారు.
 

మాది మనసున్న పార్టీ: రౌత్‌ 
సామ్నా సంపాదకీయాన్ని పత్రిక ఎగ్జిక్యూటివ్‌ ఎడిటర్, శివసేన (ఉద్ధవ్‌) నేత సంజయ్‌ రౌత్‌ సమ రి్థంచుకున్నారు. తాము విపక్షంలో ఉన్నప్పటికీ గడ్చిరోలీ జిల్లాకు సీఎం మంచి పనులు చేస్తున్నారు గనుక ప్రశంసిస్తున్నామని చెప్పుకొచ్చారు. ‘‘మాది చాలా పెద్ద మనసున్న పార్టీ. ప్రజలకు మంచి చేస్తే మా ప్రత్యర్థులనైనా ప్రశంసిస్తాం’’ అన్నారు.

ఎన్సీపీల విలీనం! 
ఎన్సీపీలో చీలిక నేపథ్యంలో కొన్నేళ్లుగా ఉప్పూ నిప్పుగా ఉంటున్న బాబాయి శరద్‌ పవార్, అబ్బాయి అజిత్‌ దగ్గరవుతున్న సంకేతాలు కొద్ది రోజులుగా ప్రస్ఫుటమవుతున్నాయి. విభేదాలకు స్వస్తి పలికి ఇద్దరూ కలిసిపోవాలని అజిత్‌ తల్లి ఇటీవలే పిలుపునివ్వడం తెలిసిందే. వారిద్దరూ కలిసి పని చేయాలని కోరుకుంటున్నట్లు ఆమె చెప్పారు. 

అందుకు తగ్గట్టే డిసెంబర్‌ 12న శరద్‌ జన్మదినం సందర్భంగా అజిత్‌ ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. దాంతో రెండు ఎన్సీపీలు కలిసిపోతాయంటూ ఊహాగానాలు మొదలయ్యాయి. అది అతి త్వరలోనే జరగవచ్చని పవార్‌ కుటుంబ అభిమానులు చెప్పుకుంటున్నారు. శరద్‌ తమకు దేవుడని, పవార్‌ కుటుంబం ఒక్కటైతే చాలా సంతోషిస్తామని అజిత్‌ వర్గం ఎంపీ ప్రఫుల్‌ పటేల్‌ అన్నారు. శరద్‌ తన వర్గాన్ని అజిత్‌ పార్టీలోనే కలిపేసి ఎన్డీయే గూటికి చేరినా ఆశ్చర్యం లేదని మరికొందరు అంచనా వేస్తున్నారు. ఫడ్నవీస్‌కు శరద్‌ కూతురు సుప్రియ ప్రశంసలు అందులో భాగమేనని వారంటుండగా మరికొందరు ఈ వాదనను కొట్టిపారేస్తున్నారు.

– సాక్షి, నేషనల్‌ డెస్క్‌  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement