Nationalist Congress Party (NCP) leader
-
‘మహా’ వ్యాఖ్యలు... మర్మమేమిటో?!
మహారాష్ట్రలో రాజకీయ పునరేకీకరణకు రంగం సిద్ధమవుతోందా? కొద్ది రోజులుగా రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న అనూహ్య పరిణామాల నేపథ్యంలో ఈ దిశగా చర్చ జోరందుకుంటోంది. బీజేపీ సారథ్యంలోని అధికార మహాయుతి కూటమికి చేరువయ్యేందుకు విపక్ష శివసేన (ఉద్ధవ్), ఎన్సీపీ (శరద్ పవార్) ప్రయత్నం చేస్తున్నాయన్న వార్తలు సర్వత్రా ఆసక్తి కలిగిస్తున్నాయి. ఆ పార్టీల నేతల తాజా వ్యాఖ్యలు ఈ దిశగా సంకేతాలేనన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. గత నవంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని విపక్ష మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ)కి మహాయుతి ఘోర ఓటమి రుచి చూపించడం తెలిసిందే. శివసేనను కొన్నేళ్ల క్రితం నిలువునా చీల్చిన ఏక్నాథ్ షిండే వర్గం, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) నుంచి విడిపోయిన అజిత్ పవార్ వర్గం మహాయుతి భాగస్వాములుగా బీజేపీతో అధికారం పంచుకుంటున్నాయి. తామే అసలైన పార్టీలమంటూ ఇప్పటికే గుర్తింపు కూడా దక్కించుకున్నాయి. బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రి పదవి చేపట్టగా షిండే, అజిత్ ఆయనకు డిప్యూటీలుగా కొనసాగుతున్నారు. కాంగ్రెస్‌తో కలిసి ఎంవీఏ కూటమిగా ఎన్నికల్లో పోటీ చేసిన ఉద్ధవ్ సేన, శరద్ పవార్ సారథ్యంలోని ఎన్సీపీ భారీ ఓటమితో కుదేలయ్యాయి. ఒకరకంగా ఉనికి కోసం పోరాడాల్సిన పరిస్థితికి చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో రెండు పార్టీల అభిమానులు, కార్యకర్తల నుంచి వస్తున్న విజ్ఞప్తులు ఆసక్తి కలిగిస్తున్నాయి. విడిపోయిన పార్టీలు మళ్లీ కలిసి పోవాలంటూ కొద్ది రోజులుగా వారు గట్టిగా కోరుతున్నారు! ఈ నేపథ్యంలో శివసేన (ఉద్ధవ్) అధికారిక పత్రిక ‘సామ్నా’ తమ ప్రత్యర్థి అయిన ఫడ్నవీస్‌ను ప్రశంసల్లో ముంచెత్తడం ప్రాధాన్యం సంతరించుకుంది. గడ్చిరోలీ జిల్లాలో నక్సలిజం అంతానికి ఆయన బాగా కృషి చేస్తున్నారని సామ్నా తాజా సంచిక సంపాదకీయంలో పేర్కొంది. ‘‘గడ్చిరోలీలో పలు అభివృద్ధి పనులకు సీఎం ఫడ్నవీస్ శ్రీకారం చుట్టారు. గిరిజనుల జీవితాల్లో వెలుగులు నింపడానికి ఎంతో కృషి చేస్తున్నారు. గడ్చిరోలీకి నూతన గుర్తింపును ఇవ్వాలని ఫడ్నవీస్ భావిస్తే స్వాగతిస్తాం’’ అని చెప్పుకొచ్చింది. ‘‘నక్సల్స్ ప్రభావిత జిల్లాలో నూతన అభివృద్ధి శకానికి శ్రీకారం చుట్టిన ఫడ్నవీస్ నిజంగా ప్రశంసలకు అర్హుడు’’ అని పేర్కొంది! మరోవైపు పార్టీని చీల్చి ప్రస్తుత దుస్థితికి కారకుడైన షిండేపై సంపాదకీయం విమర్శలు గుప్పించింది. ఆయన గతంలో ఇన్చార్జి మంత్రి హోదాలో గడ్చిరోలీలో మైనింగ్ లాబీల ప్రయోజనాల పరిరక్షణకే పని చేశారని ఆరోపించింది. లోగుట్టు ఏమిటో?! ఉద్ధవ్ సేన ఉన్నట్టుండి బీజేపీ అనుకూల వైఖరి ప్రదర్శిస్తుండటం ఆసక్తికరంగా మారింది. గత నెల 17న అసెంబ్లీ సమావేశాల సందర్భంగా సీఎం ఫడ్నవీస్‌ను పార్టీ అధినేత ఉద్ధవ్ ఠాక్రే ప్రత్యేకంగా కలుసుకున్నారు కూడా! ఎన్సీపీ (శరద్ పవార్) ఎంపీ సుప్రియా సూలే సైతం ఫడ్నవీస్‌ను అభినందించారు. రాష్ట్ర ప్రగతి కోసం ఆయన మిషన్ మోడ్‌లో పని చేస్తున్నారంటూ ప్రస్తుతించారు. ప్రధాన రాజకీయ ప్రత్యర్థులు బీజేపీ సీఎంను ఇలా ఆకాశానికెత్తుతుండటం యాదృచ్ఛికమేమీ కాదన్న అభిప్రాయాలు రాజకీయ వర్గాల నుంచి వినిపిస్తున్నాయి. అవి ఎన్డీఏ వైపు చూస్తున్నాయనేందుకు బహుశా ఇది సంకేతమని విశ్లేషకులు అంటున్నారు. హిందూత్వవాదమే మూల సిద్ధాంతంగా పుట్టుకొచ్చిన శివసేన రాష్ట్రంలో అధికారం కోసం ఐదేళ్ల కింద అనూహ్యంగా తన బద్ధ విరోధి కాంగ్రెస్‌తో జట్టుకట్టడం తెలిసిందే. అప్పటినుంచే పార్టీ పతనం ప్రారంభమైందన్నది పరిశీలకుల మాట. ఈ నేపథ్యంలో ఉనికిని కాపాడుకోవడానికి హిందూత్వవాది అయిన బీజేపీతో స్నేహం తప్పు కాదని ఉద్ధవ్ వర్గం నేతల్లో కొందరంటున్నారు. కానీ అది ఆత్మహత్యా సదృశమే కాగలదని, పార్టీ ఎదుగుదల అవకాశాలు శాశ్వతంగా మూసుకుపోతాయని మరికొందరు వాదిస్తున్నారు. పైగా ఎన్డీఏలో చేర్చుకుని ఉద్ధవ్ సేనకు చేజేతులారా కొత్త ఊపిరి పోసే పని బీజేపీ ఎందుకు చేస్తుందని ప్రశి్నస్తున్నారు. మాది మనసున్న పార్టీ: రౌత్ సామ్నా సంపాదకీయాన్ని పత్రిక ఎగ్జిక్యూటివ్ ఎడిటర్, శివసేన (ఉద్ధవ్) నేత సంజయ్ రౌత్ సమ రి్థంచుకున్నారు. తాము విపక్షంలో ఉన్నప్పటికీ గడ్చిరోలీ జిల్లాకు సీఎం మంచి పనులు చేస్తున్నారు గనుక ప్రశంసిస్తున్నామని చెప్పుకొచ్చారు. ‘‘మాది చాలా పెద్ద మనసున్న పార్టీ. ప్రజలకు మంచి చేస్తే మా ప్రత్యర్థులనైనా ప్రశంసిస్తాం’’ అన్నారు.ఎన్సీపీల విలీనం! ఎన్సీపీలో చీలిక నేపథ్యంలో కొన్నేళ్లుగా ఉప్పూ నిప్పుగా ఉంటున్న బాబాయి శరద్ పవార్, అబ్బాయి అజిత్ దగ్గరవుతున్న సంకేతాలు కొద్ది రోజులుగా ప్రస్ఫుటమవుతున్నాయి. విభేదాలకు స్వస్తి పలికి ఇద్దరూ కలిసిపోవాలని అజిత్ తల్లి ఇటీవలే పిలుపునివ్వడం తెలిసిందే. వారిద్దరూ కలిసి పని చేయాలని కోరుకుంటున్నట్లు ఆమె చెప్పారు. అందుకు తగ్గట్టే డిసెంబర్ 12న శరద్ జన్మదినం సందర్భంగా అజిత్ ఆయనను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. దాంతో రెండు ఎన్సీపీలు కలిసిపోతాయంటూ ఊహాగానాలు మొదలయ్యాయి. అది అతి త్వరలోనే జరగవచ్చని పవార్ కుటుంబ అభిమానులు చెప్పుకుంటున్నారు. శరద్ తమకు దేవుడని, పవార్ కుటుంబం ఒక్కటైతే చాలా సంతోషిస్తామని అజిత్ వర్గం ఎంపీ ప్రఫుల్ పటేల్ అన్నారు. శరద్ తన వర్గాన్ని అజిత్ పార్టీలోనే కలిపేసి ఎన్డీయే గూటికి చేరినా ఆశ్చర్యం లేదని మరికొందరు అంచనా వేస్తున్నారు. ఫడ్నవీస్‌కు శరద్ కూతురు సుప్రియ ప్రశంసలు అందులో భాగమేనని వారంటుండగా మరికొందరు ఈ వాదనను కొట్టిపారేస్తున్నారు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
‘మహా’ ఎన్నికల్లో అధికార దుర్వినియోగం
పుణె: ఇటీవల ముగిసిన మహరాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సమరంలో గతంలో ఎన్నడూలేనంతటి స్థాయిలో అధికార, నగదు దుర్వినియోగ పర్వం ఆవిష్కృతమయిందని నేషనలిస్ట్ కాంగ్రెస్ పారీ్ట(ఎన్సీపీ–ఎస్పీ) చీఫ్ శరద్‌పవార్ ఆరోపించారు. ఇంతటి దుర్వినియోగం గతంలో ఏ పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల్లోనూ జరగలేదని ఆయన వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో ఈవీఎంల దుర్వినియో గం జరిగిందంటూ కురువృద్ధుడు, 95 ఏళ్ల సామాజిక కార్యకర్త డాక్టర్ బాబా అధవ్ చేపట్టిన నిరసన కార్యక్రమ వేదికను సందర్శించి మద్దతు ప్రకటించిన సందర్భంగా శనివారం శరద్ పవార్ మాట్లాడారు. సంఘ సంస్కర్త జ్యోతిరావ్ ఫూలే నివాసమైన ఫూలేవాడలో అధవ్ ఈ నిరసన దీక్ష చేపట్టారు. ‘‘స్థానిక ఎన్నికల్లో అధికార దుర్వినియోగం, నగదు పంపిణీ చూస్తుంటాం. కానీ ఈసారి శాసనసభ ఎన్నికల్లో జరిగిన దుర్వినియోగం మరే పార్లమెంట్ ఎన్నికల్లోనూ కనిపించలేదు. ఇవి చూసి ప్రజల్లో అసహనం పెరిగిపోయింది. అందుకే ఇలా బాబా అధవ్ మాదిరిగా జనం నిరసనలకు దిగారు. సామాజిక సిద్ధాంతకర్త జయప్రకాశ్ నారాయణ్ గతంలో పిలుపు ఇచి్చనట్లు ప్రజలంతా నేడు ఐక్యంగా పోరాడాలి. సామాజిక ఉద్యమం ఉధృతంగా కొనసాగించాల్సిన తరుణమిది. పార్లమెంటరీ ప్రజాస్వామ్య పునాదులను పెకలించివేస్తున్న పెడపోకడలను అడ్డుకుందాం’’అని అన్నారు. ఈవీఎంలపై దేశమంతటా చర్చ ‘‘దేశంలో ఈవీఎంల దుర్వినియోగంపై చర్చ జరుగుతోంది. ఈ అంశాన్ని పార్లమెంట్లో విపక్షాలు ప్రస్తావించాలనుకున్న ప్రతిసారీ ప్రభుత్వం వీళ్లకు మాట్లాడే అవకాశం ఇవ్వట్లేదు. పార్లమెంట్ ఉభయసభలు వారంలో ఆరు రోజులు జరిగితే కనీసం ఒక్కరోజు కూడా విపక్షనేతలకు మాట్లాడే అవకాశం దక్కట్లేదు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంపై మోదీ సర్కార్ ఎలా దాడిచేస్తోందో ఇక్కడే తెలుస్తోంది. ఈవీఎంలలో అదనంగా ఓట్లను ఎలా జతచేస్తారో కొందరు నాకు ఒక ప్రజెంటేషన్ ద్వారా చూపించారు. కానీ వీటిని నిరూపించే బలమైన సాక్ష్యాలు మన దగ్గర లేవు. అయితే మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలను చూశాక వీటిని నమ్మక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఓడిన నేతల్లో ఏకంగా 22 మంది రీకౌంటింగ్ అడుగుతున్నారంటే ఈవీఎంలలో ఏదో తప్పు జరుగుతోందని అర్థమవుతోంది. బాలాసాహెబ్ థోరట్లాంటి కాంగ్రెస్ నేతలు ఆరోపించినట్లుగా చివరి రెండు గంటల్లో ఏకంగా 7 శాతం పోలింగ్ జరిగిందంటే నమ్మశక్యంగా లేదు. థోరట్ ఒక్కరేకాదు చాలా మంది ఇలాంటి ఎన్నో ఉదాహరణలను చూపిస్తున్నారు. ఈ అంశంపై కాంగ్రెస్ ఒక సమావేశాన్ని సైతం ఏర్పాటుచేసింది. దీనిపై విపక్షాల ఇండియా కూటమి ఒక ఉమ్మడి నిర్ణయం తీసుకోవడంపై చర్చ జరిగింది. సోమవారం దీనిపై కొన్ని ఉమ్మడి నిర్ణయాలు వెలువడే అవకాశం ఉంది. దాదాపు 15 శాతం ఓట్లను ముందే ఈవీఎంలలో సెట్ చేసి ఉంచుతారని కొందరు చెబితే నేను నమ్మలేదు. కానీ తాజా ఫలితాలను చూశాక ఈ ఆరోపణల్లో ఎంతోకొంత నిజం ఉందని గత ఐదు రోజులుగా నాక్కూడా అనిపిస్తోంది’’అని శరద్‌పవార్ అన్నారు. వీవీప్యాట్లను లెక్కించాలి: ఉద్ధవ్‌ఠాక్రే అధవ్‌కు మంచినీళ్లు ఇచ్చి దీక్షను విరమింపజేసిన సందర్భంగా శివసేన(యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే మాట్లాడారు. ‘‘బూత్‌లో ఓటు పోలయిందని అందరికీ తెలుసు. కానీ ఈవీఎంలో ఏ పార్టీ తరఫున అది రిజిస్టర్ అయిందో ఎలా తెలియాలి?. అందుకే ఎన్నికల్లో అన్ని వీవీప్యాట్ రశీదులను లెక్కించాల్సిందే. పోలింగ్ రోజు చివరి గంటలో ఏకంగా 76 లక్షల ఓట్లు పోలయ్యాయని చెబుతున్నారు. ఈ లెక్కన ప్రతి పోలింగ్‌కేంద్రంలో ఆఖర్లో ఏకంగా వేయి మంది ఓటేశారని అర్థం. మరి చివరిగంటలో ప్రతిపోలింగ్కేంద్రం బయట అంతమంది క్యూ వరసల్లో లేరు’’అని ఉద్ధవ్ అన్నారు. -
ఈవీఎంకు పూజలు.. చిక్కుల్లో మహిళా కమిషన్ అధ్యక్షురాలు
పుణె: సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా మహారాష్ట్రలోని బారామతి లోక్‌సభ నియోవర్గంలో మంగళవారం పోలింగ్ జరిగింది. చాలా మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే ఎన్సీపీ నాయకురాలు, మహారాష్ట్ర మహిళా కమిషన్ అధ్యక్షురాలు రూపాలి చకంకర్ ఈవీఎం పూజలు చేసి వివాదంలో చిక్కుకున్నారు. సింహగఢ్ రోడ్, పుణె సిటీ పోలీస్స్టేషన్లలో ఆమెపై కేసు నమోదైంది.ఓటింగ్ సందర్భంగా ఖడక్వాస్లా ప్రాంతంలోని పోలింగ్ కేంద్రానికి రూపాలి చకంకర్ ప్లేటు, దీపంతో వచ్చారు. ఈవీఎం మెషిన్ వద్ద పూజలు చేశారు. స్థానికి ఎన్నికల అధికారులు ఉన్నతాధికారలకు ఫిర్యాదు చేశారు. అనంతరం ఆమెపై సింహగఢ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.కాగా మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ సతీమణి సునేత్రా పవార్‌కు మహాయుతి కూటమి బారామతి లోక్‌సభ అభ్యర్థిత్వాన్ని ప్రకటించినప్పటి నుంచి ఆమె కోసం చురుగ్గా ప్రచారం చేస్తున్న రూపాలి చకంకర్ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారారు. -
ఎన్సీపీ అధినేత ఎవరవుతారో?
ముంబై: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) తదుపరి జాతీయ అధ్యక్షుడు ఎవరన్నది శుక్రవారం తేలిపోనుంది. పార్టీ అధినేతగా తన వారసుడిని ఎంపిక చేసేందుకు శరద్ పవార్ ఒక కమిటీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ కమిటీ శుక్రవారం సమావేశం కానుందని ఎన్సీపీ సీనియర్ నేత ఒకరు చెప్పారు. దక్షిణ ముంబైలోని పార్టీ కార్యాలయంలో ఉదయం 11 గంటలకు భేటీ జరుగుతుందని వెల్లడించారు. శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలే, సోదరుడి కుమారుడు అజిత్ పవార్, ప్రఫుల్ పటేల్, ఛగన్ భుజ్‌బల్ తదితరులు ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. 1999లో ఏర్పాటైన ఎన్సీపీ అధ్యక్ష బాధ్యతల నుంచి తాను తప్పుకుంటున్నట్లు శరద్ పవార్ మంగళవారం హఠాత్తుగా ప్రకటించి, అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. తదుపరి అధినేతగా పవార్ కుటుంబం నుంచే ఎవరో ఒకరు ఎంపికవుతారని ప్రచారం సాగుతోంది. సుప్రియా సూలే లేదా అజిత్ పవార్ ఎన్సీపీ అధినేతగా పగ్గాలు చేపట్టే అవకాశం ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. ఎన్సీపీ భవిష్యత్తు కోసమే తాను అధ్యక్ష పదవి నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నానని శరద్ పవార్ గురువారం ప్రకటించారు. -
మనీలాండరింగ్ కేసు.. మాజీ మంత్రికి చుక్కెదురు
ముంబై: ఎన్సీపీ నేత, మహారాష్ట్ర మాజీ మంత్రి నవాబ్ మాలిక్‌కు ప్రత్యేక కోర్టులో చుక్కెదురైంది. మనీలాండరింగ్ కేసులో ఆయన అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. అయితే.. బెయిల్ కోసం ఆయన దాఖలు చేసిన అభ్యర్థను బుధవారం తిరస్కరించింది. మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం, అతని అనుచరులతో సంబంధాల అభియోగాలు.. ఆపై లావాదేవీల కారణంగా మనీలాండరింగ్ కేసు ఈ మహారాష్ట్ర మాజీ మంత్రిపై దాఖలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బెయిల్ కోసం ఆయన ప్రత్యేక న్యాయస్థానాన్ని ఆశ్రయించగా.. ప్రత్యేక న్యాయమూర్తి ఆర్ఎన్ రోకడే అభ్యర్థనను తిరస్కరించారు. మనీలాండరింగ్ కేసులో తనను విచారించేందుకు ఎలాంటి కారణాలు లేవని, కాబట్టి బెయిల్ మంజూరు చేయాలని ఆయన కోర్టును అభ్యర్థించారు. అయితే.. దర్యాప్తు సంస్థ మాత్రం ఈ కేసులో ఎన్ఐఏ దర్యాప్తు అనే కారణం ఒక్కటి చాలని, ఆయనకు బెయిల్ ఇవ్వొద్దని కోర్టుకు నివేదించింది. ఈ బెయిల్ పిటిషన్‌పై నవంబర్ 14వ తేదీన వాదనలు పూర్తికాగా.. ఆదేశాలను రిజర్వ్ చేశారు న్యాయమూర్తి. తాజాగా.. ఇవాళ బెయిల్ తిరస్కరిస్తున్నట్లు తీర్పు వెలువరించారు. నవాబ్ మాలిక్‌ను.. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈ ఫిబ్రవరిలో అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం జ్యూడీషియల్ కస్టడీలో ఉన్న ఆయన.. నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. -
ఎన్సీపీకి తారిఖ్ అన్వర్ రాజీనామా
కటిహార్/న్యూఢిల్లీ: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) జాతీయ ప్రధాన కార్యదర్శి, కేంద్ర మాజీ మంత్రి తారిఖ్ అన్వర్ సంచలన ప్రకటన చేశారు. రాఫెల్ ఒప్పందంపై ఎన్సీపీ అధినేత శరద్‌పవార్ ప్రధాని మోదీకి మద్దతు తెలిపినందుకు నిరసనగా ఆ పార్టీకి, లోక్‌సభ సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు ప్రకటించారు. కటిహార్‌లో శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ రాఫెల్ ఒప్పందం విషయంలో పవార్ వెలిబుచ్చిన అభిప్రాయం తనకు బాధ కలిగించిందన్నారు. అందుకే పార్లమెంట్ సభ్యత్వం, పార్టీ వ్యవస్థాపక సభ్యత్వంతోపాటు అన్ని పదవుల నుంచి వైదొలిగినట్లు స్పష్టం చేశారు. మద్దతు దారులతో చర్చించిన అనంతరం తదుపరి కార్యాచరణ ఖరారు చేస్తానన్నారు. -
పవార్ వాహానంలో భారీగా నగదు పట్టివేత
ముంబై: మహారాష్ట్రలో శాసనసభకు ఎన్నికల గడువు సమీపిస్తున్న నేపథ్యంలో వాహానాల తనిఖీలను పోలీసులు ముమ్మరం చేశారు. అందులోభాగంగా బుధవారం... మహారాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి, ఎన్సీపీ సీనియర్ నేత, శరద్ పవార్ సోదరుడు అజిత్ పవార్‌కు చెందిన కారు నుంచి రూ. 4.85 లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు పర్బినీ జిల్లా ఎస్పీ అనంత్ రొక్డే వెల్లడించారు. మరో రెండు బ్యాగ్‌లలో విజిటింగ్ కార్డ్స్‌తోపాటు భారీగా చీరలను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ఆ కారు డ్రైవర్ కృష్ణ హజారేను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా... కారు అజిత్ పవార్దని వెల్లడించారన్నారు. పర్బనీ నుంచి లాతురు వెళ్తుండగా కారును పట్టుకున్నట్లు వివరించారు. దీనిపై ఇంకా కేసు నమోదు చేయలేదని... ఎన్నికల సంఘానికి సమాచారం అందించామని అనంత్ తెలిపారు. అయితే ఈ విషయంపై స్పందించేందుకు ఆ పార్టీ నేతలు ఎవరు అందుబాటులో లేని చెప్పారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ఈ నెల 15వ తేదీన జరగనున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్బంగా ఓటర్లకు పంచేందుకు తరలిస్తున్న రూ. 5 కోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.