
ముంబై: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) తదుపరి జాతీయ అధ్యక్షుడు ఎవరన్నది శుక్రవారం తేలిపోనుంది. పార్టీ అధినేతగా తన వారసుడిని ఎంపిక చేసేందుకు శరద్ పవార్ ఒక కమిటీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ కమిటీ శుక్రవారం సమావేశం కానుందని ఎన్సీపీ సీనియర్ నేత ఒకరు చెప్పారు. దక్షిణ ముంబైలోని పార్టీ కార్యాలయంలో ఉదయం 11 గంటలకు భేటీ జరుగుతుందని వెల్లడించారు. శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలే, సోదరుడి కుమారుడు అజిత్ పవార్, ప్రఫుల్ పటేల్, ఛగన్ భుజ్‌బల్ తదితరులు ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు.
1999లో ఏర్పాటైన ఎన్సీపీ అధ్యక్ష బాధ్యతల నుంచి తాను తప్పుకుంటున్నట్లు శరద్ పవార్ మంగళవారం హఠాత్తుగా ప్రకటించి, అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. తదుపరి అధినేతగా పవార్ కుటుంబం నుంచే ఎవరో ఒకరు ఎంపికవుతారని ప్రచారం సాగుతోంది. సుప్రియా సూలే లేదా అజిత్ పవార్ ఎన్సీపీ అధినేతగా పగ్గాలు చేపట్టే అవకాశం ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. ఎన్సీపీ భవిష్యత్తు కోసమే తాను అధ్యక్ష పదవి నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నానని శరద్ పవార్ గురువారం ప్రకటించారు.