
రాజ్యసభలోనూ గట్టెక్కిన ‘ఉమీద్’
అనుకూలంగా 128, వ్యతిరేకంగా 95 ఓట్లు
రెండు రోజుల పాటు జరిగిన సుదీర్ఘ చర్చ, తీవ్రస్థాయి వాదోపవాదాల అనంతరం వక్ఫ్ (సవరణ) బిల్లు–2025పై పార్లమెంటు ఆమోదముద్ర పడింది. విపక్షాల తీవ్ర అభ్యంతరాల మధ్యే లోక్‌సభ బుధవారం ఈ బిల్లును ఆమోదించడం తెలిసిందే. అది గురువారం రాజ్యసభ ఆమోదం కూడా పొందింది. 13 గంటలకు పైగా జరిగిన చర్చ అనంతరం అర్ధరాత్రి ఒంటి గంట దాటాక ఓటింగ్ ప్రక్రియ సుదీర్ఘంగా జరిగింది.
దాదాపుగా ప్రతి సవరణపైనా ఓటింగ్‌కు విపక్షాలు పట్టుబట్టాయి. వాటి సవరణలన్నీ వీగిపోయాయి. చివరికి బిల్లు ఆమోదం పొందింది. దానికి అనుకూలంగా 128, వ్యతిరేకంగా 95 ఓట్లు పడ్డాయి. వక్ఫ్ బిల్లును కేంద్రం ఇక రాష్ట్రపతి ఆమోదానికి పంపనుంది. రాష్ట్రపతి సంతకం అనంతరం అది చట్టంగా రూపుదాల్చుతుంది. వక్ఫ్ బిల్లును లోక్‌సభ 288–232 ఓట్లతో ఆమోదించడం తెలిసిందే.
సదుద్దేశమే: రిజిజు
న్యూఢిల్లీ: వక్ఫ్ బిల్లుపై గురువారం అర్ధరాత్రి దాకా జరిగిన వాడివేడి చర్చ పెద్దల సభను వేడెక్కించింది. ఉమీద్ (యూనిఫైడ్ వక్ఫ్ మేనేజ్‌మెంట్ ఎంపవర్‌మెంట్, ఎఫీషియన్సీ అండ్ డెవలప్‌మెంట్)గా పేరు మార్చిన వక్ఫ్ (సవరణ) బిల్లు–2025ను పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరెణ్ రిజిజు సభలో ప్రవేశపెట్టారు. బిల్లుకు నిరసనగా పలువురు విపక్ష సభ్యులు నల్లదుస్తులు ధరించి సభకు వచ్చారు. బిల్లు రాజ్యాంగ విరుద్ధమంటూ మండిపడ్డారు.
ముస్లింల భూములను లాక్కోవడమే మోదీ సర్కారు అసలు లక్ష్యమని ఆరోపించారు. విపక్షాల వాదనను రిజిజు ఖండించారు. వాటి అభ్యంతరాలను తోసిపుచ్చారు. ‘‘ముస్లింల హక్కులను ఎవరూ లాక్కోబోవడం లేదు. ఈ విషయమై విపక్షాలు చేస్తున్నదంతా దు్రష్పచారమే’’ అని పేర్కొన్నారు. ‘‘2004లో 4.9 లక్షలుగా ఉన్న వక్ఫ్ ఆస్తులు ఇప్పుడు ఏకంగా 8.72 లక్షలకు పెరిగాయి. తద్వారా దేశంలో వక్ఫ్ అతి పెద్ద ప్రైవేటు భూ యజమానిగా అవతరించింది’’ అని వివరించారు.
‘‘వక్ఫ్ వ్యవహారాల్లో పారదర్శకత, జవాబుదారీతనం తేవడం, వాటి ఆస్తులను మరింత సమర్థంగా నిర్వహించడం, ముస్లిం మహిళలకు సాధికారత కల్పించడం, ముస్లింలలోని అన్ని తెగల హక్కులనూ పరిరక్షించడమే బిల్లు లక్ష్యం. అంతే తప్ప మతంతో ఈ బిల్లుకు ఎలాంటి సంబంధమూ లేదు’’ అని పునరుద్ఘాటించారు. ‘‘అందుకే సున్నీలు, షియాలతో పాటు ముస్లింలలోని ఇతర వెనకబడ్డ వర్గాల వారు కూడా వక్ఫ్ బోర్డుల్లో సభ్యులుగా ఉంటారు. తద్వారా వారి ప్రయోజనాలకూ న్యాయం జరుగుతుంది.
ఇందుకు ఎవరికీ అభ్యంతరం ఉండాల్సిన అవసరం లేదు’’ అన్నారు. ‘‘కేంద్ర వక్ఫ్ మండలి సభ్యుల్లో అధిక సంఖ్యాకులు ముస్లిమేతరులే ఉంటారనడం అవాస్తవం. 22 మందిలో వారి సంఖ్య 4కు మించబోదు. వక్ఫ్ బోర్డులు చట్టపరమైన సంస్థలు. అంతే తప్ప కేవలం ముస్లింలకు ప్రాతినిధ్యం వహించే సంస్థలు కాదు. వక్ఫ్ ట్రిబ్యునళ్ల ముందు 31,999 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. వివాదాస్పద వక్ఫ్ భూముల్లో ఇప్పటికే కోర్టుల్లో పరిష్కారమైన వాటి జోలికి పోబోం. పసలేని ఆరోపణలు మాని బిల్లును ఆమోదించడంలో విపక్షాలు కూడా కలసి రావాలి’’ అని కోరారు.
దురుద్దేశాలు: విపక్షాలు
వక్ఫ్ (సవరణ) బిల్లు వెనక మోదీ సర్కారు దురుద్దేశాలు దాగున్నాయని ఆర్జేడీ సభ్యుడు మనోజ్ ఝా ఆరోపించారు. మోదీ ప్రభుత్వాన్ని ముస్లింలు విశ్వసించడం లేదని సమాజ్‌వాదీ పార్టీ సభ్యుడు రామ్‌గోపాల్ యాదవ్ అన్నారు. ప్రభుత్వం అన్ని మతాలనూ సమానంగా చూడాలన్నారు. బిల్లులో పలు అంశాలు పైకి బాగానే ఉన్నా దీని వెనక మోదీ సర్కారు ఉద్దేశమే అనుమానాలకు తావిస్తోందని బీఆర్‌ఎస్ సభ్యుడు కె.ఆర్.సురేశ్‌రెడ్డి అన్నారు.
బిల్లులోని 75 శాతం అంశాలను బిల్లుతో నిమిత్తం లేకుండానే అమలు చేయొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. తిరుచ్చి శివ (డీఎంకే), వై.వి.సుబ్బారెడ్డి (వైఎస్సార్ కాంగ్రెస్ పారీ్ట), అభిõÙక్ మను సింఘ్వీ, సయీద్ సనీర్ హుసేన్ (కాంగ్రెస్), సుష్మితా దేవి (టీఎంసీ), సంజయ్ రౌత్ (శివసేన–యూబీటీ), సంజయ్‌సింగ్ (ఆప్), ముజీబుల్లా ఖాన్ (బీజేడీ), జాన్ బ్రిటాస్ (సీపీఎం), పి.పి.సునీర్ (సీపీఐ), హరీస్ బీరన్ (ఐయూఎంఎల్), వైగో (ఎండీఎంకే) తదితర సభ్యులు బిల్లును వ్యతిరేకిస్తూ మాట్లాడారు. మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ (జేడీఎస్) బిల్లుకు మద్దతుగా మాట్లాడారు.

వక్ఫ్‌కు ముస్లిమేతరులూ విరాళాలు ఇవ్వొచ్చు: సిబల్
ముస్లిమేతరులకు కూడా వక్ఫ్ విరాళాలిచ్చే హక్కుందని స్వతంత్ర సభ్యుడు కపిల్ సిబల్ అన్నారు. ‘‘నా ఆస్తిని ఫలానా వారికి ఇవ్వొద్దని చట్టం చేయడానికి మీరెవరు? హిందువులు వక్ఫ్ విరాళాలు ఇవ్వడమే కాదు, స్వాతంత్య్రానికి ముందే వక్ఫ్ బోర్డులు కూడా ఏర్పాటు చేశారు. దీన్ని పలు హైకోర్టులూ సమరి్థంచాయి’’ అని చెప్పారు. దేశవ్యాప్తంగా నాలుగు రాష్ట్రాల్లో హిందూ మత సంస్థలకు 10 లక్షల ఎకరాలకు పైగా భూములున్నాయని ఆయన అన్నారు. ‘‘హిందూ మతంలో స్వార్జిత ఆస్తిని కుమారులకు మాత్రమే ఇవ్వగలరు. దాన్ని కూతుళ్లకూ ఇచ్చేందుకు వీలు కల్పిస్తూ చట్టాన్ని మార్చండి’’ అని సూచించారు. చైర్మన్ జగ్‌దీప్ ధన్‌ఖడ్ జోక్యం చేసుకుంటూ కూతుళ్లతో పాటు ఎవరికైనా ఇచ్చేందుకు మన చట్టాలు వీలు కల్పిస్తున్నాయని చెప్పారు.
అయోమయం సృష్టిస్తున్నారు: రిజిజు
సిబల్ తీరును మంత్రి రిజిజు తీవ్రంగా దుయ్యబట్టారు. హిందూ మత సంస్థలకు చెందిన భూమిని వక్ఫ్ భూములతో పోల్చడాన్ని ఖండించారు. ‘‘పలువురు సీనియర్ సభ్యులు ఏ అంశం పడితే అది లేవనెత్తడం ద్వారా అయోమయం సృష్టిస్తున్నారు. కానీ వాటిపై వివరణలు వినే దాకా కూడా సభలో ఉండటం లేదు’’ అంటూ అసహనం వెలిబుచ్చారు.
కార్పొరేట్లకు కట్టబెట్టేందుకే: ఖర్గే వక్ఫ్ బిల్లు రాజ్యాంగ వ్యతిరేకమని విపక్ష నేత మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. దానిపై చర్చలో ఆయన పాల్గొన్నారు. బిల్లు ముసుగులో సమాజంలో విభజన బీజాలు నాటేందుకు, ముస్లింలను వేధించేందుకు, వారి భూమిని లాక్కొని కార్పొరేట్ మిత్రులకు పంచేందుకు మోదీ సర్కారు ప్రయత్నిస్తోందని దుయ్యబట్టారు.
‘‘ఈ బిల్లు ఆమోదం పొందితే ముస్లింల ఆస్తులను లాగేసుకుంటారు. వారి ప్రయోజనాలు తీవ్రంగా దెబ్బ తింటాయి’’ అని ఆరోపించారు. అస్మదీయులను వక్ఫ్ బోర్డుల్లోకి చొప్పించేందుకు వీలుగా సవరణలు చేశారంటూ బిల్లులోని పలు అంశాలపై తీవ్ర అభ్యంతరాలు వెలిబుచ్చారు. ‘‘గత 11 ఏళ్లలో ముస్లింల సంక్షేమానికి కేటాయించిన రూ.18,274 కోట్ల నిధులనే పూర్తిగా వెచ్చించని చెత్త రికార్డు మోదీ సర్కారుది.
అలాంటివాళ్లు పస్మాంద వంటి పేద ముస్లింల సంక్షేమంపై మొసలి కన్నీరు కారుస్తున్నారు’’ అంటూ తూర్పారబట్టారు. వక్ఫ్ బోర్డుల్లో ముస్లిమేతరులు ఉండాలన్న ప్రతిపాదనను ఖర్గే తీవ్రంగా తప్పుబట్టారు. తిరుమల తిరుపతి దేవస్థానం, రామమందిర్ ట్రస్ట్ వంటివాటిల్లో ఒక్కరైనా ముస్లిం ఉన్నారా అని ప్రశ్నించారు. ఆలయ ట్రస్టుల్లో కనీసం దళితులకు కూడా స్థానం కల్పించడం లేదని ఆక్షేపించారు. ‘‘‘దేశంలో శాంతి, సామరస్యాలను దెబ్బ తీయకండి. ప్రతిష్టకు పోకుండా ఈ తప్పులతడక బిల్లును తక్షణం వెనక్కు తీసుకోండి’’ అని కేంద్ర హోం మంత్రి అమిత్ షాను డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ పాపమే: నడ్డా
కాంగ్రెస్ తన దశాబ్దాల పాలనలో ముస్లిం మహిళల అభ్యున్నతికి చేసిందేమీ లేదని రాజ్యసభ నాయకుడు జేపీ నడ్డా ఆక్షేపించారు. వారిని ద్వితీయ శ్రేణి పౌరులుగా మార్చిన పాపం ఆ పారీ్టదేనంటూ దుయ్యబట్టారు. ‘‘ముస్లిం మహిళలను ప్రధాన స్రవంతిలోకి తీసుకొచ్చేందుకు మోదీ ప్రభుత్వం కృషి చేస్తోంది. ట్రిపుల్ తలాక్‌ను నిషేధించడంతో కోట్లాది మంది ముస్లిం మహిళలు గౌరవంగా జీవిస్తున్నారు. వక్ఫ్ బిల్లు జాతి ప్రయోజనాల కోసం ఉద్దేశించింది. వక్ఫ్ ఆస్తులు తీవ్రంగా దురి్వనియోగమవుతున్నాయి.
దానికి పూర్తిగా అడ్డుకట్ట వేసి వక్ఫ్ వ్యవహారాల్లో జవాబుదారీతనం తేవడమే బిల్లు లక్ష్యం. వక్ఫ్ బిల్లులో సవరణలు సూచించేందుకు ఏకంగా 31 మంది సభ్యులతో జేపీసీ వేశాం. యూపీఏ హయాంలో కేవలం 13 మందితో జేపీసీ వేసి మమ అనిపించారు’’ అని నడ్డా ఆరోపించారు. ‘‘వక్ఫ్ ఆస్తులను ప్రభుత్వ నియంత్రణలోకి తెచ్చి ప్రజా సంక్షేమానికి, అభివృద్ధి కార్యకలాపాలకు ఉపయోగించేందుకు వీలుగా సౌదీ అరేబియా, తుర్కియే వంటి ముస్లిం దేశాలు కూడా పలు చట్టాలు చేశాయి. వక్ఫ్ ఆస్తులను డిజిటైజ్ కూడా చేస్తున్నాయి. అదే పని భారత్‌లో చేస్తుంటే అభ్యంతరమెందుకు?’’ అని విపక్షాలను ప్రశ్నించారు.