
సోనియా గాంధీ వ్యాఖ్యలపై చివరి రోజు బీజేపీ నిరసన
క్షమాపణ చెప్పాలని డిమాండ్
సోనియా వ్యాఖ్యలు దురదృష్టకరమన్న ఓం బిర్లా
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ముగిశాయి. ఈ ఏడాది జనవరి 31వ తేదీన ప్రారంభమైన బడ్జెట్ సమావేశాలు శుక్రవారం నిరవధికంగా వాయిదా పడ్డాయి. వక్ఫ్(సవరణ) బిల్లును ఉద్దేశించి కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత సోనియా గాంధీ చేసిన వ్యాఖ్యలపై లోక్‌సభలో శుక్రవారం దుమారం రేగింది. ఈ బిల్లు ముమ్మాటికీ రాజ్యాంగంపై దాడేనని, బిల్లును లోక్‌సభలో బుల్డోజ్ చేశారు అంటూ సోనియా చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీలు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. సోనియా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
దీనిపై స్పీకర్ ఓం బిర్లా స్పందిస్తూ... సోనియా గాంధీ వ్యాఖ్యలు దురదృష్ట్టకరం, సభ గౌరవానికి విరుద్ధం అని పేర్కొన్నారు. దీంతో విపక్ష సభ్యులు ఆందోళనకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అమెరికా టారిఫ్‌లపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని అన్నారు. సభలో గందరగోళం నెలకొనడంతో స్పీకర్ ఓంబిర్లా మధ్యాహ్నం 12 గంటల వరకు సభను వాయిదా వేశారు.
సభ పునఃప్రారంభమైన తర్వాత స్పీకర్ తన ముగింపు వ్యాఖ్యలను చదివారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చలో 173 మంది, కేంద్ర బడ్జెట్‌పై జరిగిన చర్చలో 169 మంది సభ్యులు పాల్గొన్నారని తెలిపారు. ఈ బడ్జెట్ సమావేశాల్లో మొత్తం 16 బిల్లులు ఆమోదించినట్లు, సభ ఉత్పాదకత 118 శాతానికి పెరిగినట్లు ప్రకటించారు. సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు వెల్లడించారు.
రాజ్యసభలో రెండో సుదీర్ఘ భేటీ
ఈ సెషన్‌లో రాజ్యసభ మొత్తంగా 119 గంటలపాటు పని చేసిందని, ఉత్పాదకత 119 శాతానికి పెరిగిందని ఎగువ సభ ఛైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ చెప్పారు. సభలో రికార్డు స్థాయిలో 49 మంది సభ్యులు ప్రైవేటు మెంబర్ బిల్లులు ప్రవేశపెట్టారని వివరించారు. వక్ఫ్(సవరణ) బిల్లుపై చర్చ సందర్భంగా రాజ్యసభ గురువారం ఉదయం 11 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 4.02 గంటల వరకు విరామం లేకుండా సుదీర్ఘంగా సమావేశమైందని, ఇదొక రికార్డు అని అన్నారు. పార్లమెంటరీ రికార్డుల ప్రకారం.. రాజ్యసభలో ఇది రెండో సుదీర్ఘ భేటీ. మొదటి సుదీర్ఘ భేటీ 1981 సెప్టెంబర్ 18న జరిగింది.
అప్పట్లోసభ మరుసటి రోజు తెల్లవారుజామున 4.43 గంటల వరకు కొనసాగింది. అత్యవసర సేవల నిర్వహణ బిల్లు–1981పై రాజ్యసభలో సుదీర్ఘంగా చర్చించారు. ఇదిలా ఉండగా, మణిపూర్‌లో రాష్ట్రపతి పాలనను ధ్రువీకరిస్తూ రాజ్యసభలో ఒక తీర్మానాన్ని శుక్రవారం ఆమోదించారు. పార్టీలకు అతీతంగా సభ్యులంతా ఈ తీర్మానానికి ఆమోదం తెలిపారు. మణిపూర్‌లో ఘర్షణకు తెరదించడమే లక్ష్యంగా రెండు ముఖ్యమైన తెగల మధ్య సమావేశం త్వరలో జరగబోతోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజ్యసభలో వెల్లడించారు. ఢిల్లీలో ఈ భేటీ జరుగుతుందన్నారు.