ఎన్సీపీ(ఎస్పీ) చీఫ్ శరద్‌పవార్ ఆరోపణలు
పుణె: ఇటీవల ముగిసిన మహరాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సమరంలో గతంలో ఎన్నడూలేనంతటి స్థాయిలో అధికార, నగదు దుర్వినియోగ పర్వం ఆవిష్కృతమయిందని నేషనలిస్ట్ కాంగ్రెస్ పారీ్ట(ఎన్సీపీ–ఎస్పీ) చీఫ్ శరద్‌పవార్ ఆరోపించారు. ఇంతటి దుర్వినియోగం గతంలో ఏ పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల్లోనూ జరగలేదని ఆయన వ్యాఖ్యానించారు.
ఎన్నికల్లో ఈవీఎంల దుర్వినియో గం జరిగిందంటూ కురువృద్ధుడు, 95 ఏళ్ల సామాజిక కార్యకర్త డాక్టర్ బాబా అధవ్ చేపట్టిన నిరసన కార్యక్రమ వేదికను సందర్శించి మద్దతు ప్రకటించిన సందర్భంగా శనివారం శరద్ పవార్ మాట్లాడారు. సంఘ సంస్కర్త జ్యోతిరావ్ ఫూలే నివాసమైన ఫూలేవాడలో అధవ్ ఈ నిరసన దీక్ష చేపట్టారు.
‘‘స్థానిక ఎన్నికల్లో అధికార దుర్వినియోగం, నగదు పంపిణీ చూస్తుంటాం. కానీ ఈసారి శాసనసభ ఎన్నికల్లో జరిగిన దుర్వినియోగం మరే పార్లమెంట్ ఎన్నికల్లోనూ కనిపించలేదు. ఇవి చూసి ప్రజల్లో అసహనం పెరిగిపోయింది. అందుకే ఇలా బాబా అధవ్ మాదిరిగా జనం నిరసనలకు దిగారు. సామాజిక సిద్ధాంతకర్త జయప్రకాశ్ నారాయణ్ గతంలో పిలుపు ఇచి్చనట్లు ప్రజలంతా నేడు ఐక్యంగా పోరాడాలి. సామాజిక ఉద్యమం ఉధృతంగా కొనసాగించాల్సిన తరుణమిది. పార్లమెంటరీ ప్రజాస్వామ్య పునాదులను పెకలించివేస్తున్న పెడపోకడలను అడ్డుకుందాం’’అని అన్నారు.
ఈవీఎంలపై దేశమంతటా చర్చ
‘‘దేశంలో ఈవీఎంల దుర్వినియోగంపై చర్చ జరుగుతోంది. ఈ అంశాన్ని పార్లమెంట్‌లో విపక్షాలు ప్రస్తావించాలనుకున్న ప్రతిసారీ ప్రభుత్వం వీళ్లకు మాట్లాడే అవకాశం ఇవ్వట్లేదు. పార్లమెంట్ ఉభయసభలు వారంలో ఆరు రోజులు జరిగితే కనీసం ఒక్కరోజు కూడా విపక్షనేతలకు మాట్లాడే అవకాశం దక్కట్లేదు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంపై మోదీ సర్కార్ ఎలా దాడిచేస్తోందో ఇక్కడే తెలుస్తోంది. ఈవీఎంలలో అదనంగా ఓట్లను ఎలా జతచేస్తారో కొందరు నాకు ఒక ప్రజెంటేషన్ ద్వారా చూపించారు. కానీ వీటిని నిరూపించే బలమైన సాక్ష్యాలు మన దగ్గర లేవు. అయితే మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలను చూశాక వీటిని నమ్మక తప్పని పరిస్థితి ఏర్పడింది.
ఓడిన నేతల్లో ఏకంగా 22 మంది రీకౌంటింగ్ అడుగుతున్నారంటే ఈవీఎంలలో ఏదో తప్పు జరుగుతోందని అర్థమవుతోంది. బాలాసాహెబ్ థోరట్‌లాంటి కాంగ్రెస్ నేతలు ఆరోపించినట్లుగా చివరి రెండు గంటల్లో ఏకంగా 7 శాతం పోలింగ్ జరిగిందంటే నమ్మశక్యంగా లేదు. థోరట్ ఒక్కరేకాదు చాలా మంది ఇలాంటి ఎన్నో ఉదాహరణలను చూపిస్తున్నారు. ఈ అంశంపై కాంగ్రెస్ ఒక సమావేశాన్ని సైతం ఏర్పాటుచేసింది. దీనిపై విపక్షాల ఇండియా కూటమి ఒక ఉమ్మడి నిర్ణయం తీసుకోవడంపై చర్చ జరిగింది. సోమవారం దీనిపై కొన్ని ఉమ్మడి నిర్ణయాలు వెలువడే అవకాశం ఉంది. దాదాపు 15 శాతం ఓట్లను ముందే ఈవీఎంలలో సెట్ చేసి ఉంచుతారని కొందరు చెబితే నేను నమ్మలేదు. కానీ తాజా ఫలితాలను చూశాక ఈ ఆరోపణల్లో ఎంతోకొంత నిజం ఉందని గత ఐదు రోజులుగా నాక్కూడా అనిపిస్తోంది’’అని శరద్‌పవార్ అన్నారు.
వీవీప్యాట్‌లను లెక్కించాలి: ఉద్ధవ్‌ఠాక్రే
అధవ్‌కు మంచినీళ్లు ఇచ్చి దీక్షను విరమింపజేసిన సందర్భంగా శివసేన(యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే మాట్లాడారు. ‘‘బూత్‌లో ఓటు పోలయిందని అందరికీ తెలుసు. కానీ ఈవీఎంలో ఏ పార్టీ తరఫున అది రిజిస్టర్ అయిందో ఎలా తెలియాలి?. అందుకే ఎన్నికల్లో అన్ని వీవీప్యాట్ రశీదులను లెక్కించాల్సిందే. పోలింగ్ రోజు చివరి గంటలో ఏకంగా 76 లక్షల ఓట్లు పోలయ్యాయని చెబుతున్నారు. ఈ లెక్కన ప్రతి పోలింగ్‌కేంద్రంలో ఆఖర్లో ఏకంగా వేయి మంది ఓటేశారని అర్థం. మరి చివరిగంటలో ప్రతిపోలింగ్‌కేంద్రం బయట అంతమంది క్యూ వరసల్లో లేరు’’అని ఉద్ధవ్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment