misuse of power
-
‘మహా’ ఎన్నికల్లో అధికార దుర్వినియోగం
పుణె: ఇటీవల ముగిసిన మహరాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సమరంలో గతంలో ఎన్నడూలేనంతటి స్థాయిలో అధికార, నగదు దుర్వినియోగ పర్వం ఆవిష్కృతమయిందని నేషనలిస్ట్ కాంగ్రెస్ పారీ్ట(ఎన్సీపీ–ఎస్పీ) చీఫ్ శరద్‌పవార్ ఆరోపించారు. ఇంతటి దుర్వినియోగం గతంలో ఏ పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల్లోనూ జరగలేదని ఆయన వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో ఈవీఎంల దుర్వినియో గం జరిగిందంటూ కురువృద్ధుడు, 95 ఏళ్ల సామాజిక కార్యకర్త డాక్టర్ బాబా అధవ్ చేపట్టిన నిరసన కార్యక్రమ వేదికను సందర్శించి మద్దతు ప్రకటించిన సందర్భంగా శనివారం శరద్ పవార్ మాట్లాడారు. సంఘ సంస్కర్త జ్యోతిరావ్ ఫూలే నివాసమైన ఫూలేవాడలో అధవ్ ఈ నిరసన దీక్ష చేపట్టారు. ‘‘స్థానిక ఎన్నికల్లో అధికార దుర్వినియోగం, నగదు పంపిణీ చూస్తుంటాం. కానీ ఈసారి శాసనసభ ఎన్నికల్లో జరిగిన దుర్వినియోగం మరే పార్లమెంట్ ఎన్నికల్లోనూ కనిపించలేదు. ఇవి చూసి ప్రజల్లో అసహనం పెరిగిపోయింది. అందుకే ఇలా బాబా అధవ్ మాదిరిగా జనం నిరసనలకు దిగారు. సామాజిక సిద్ధాంతకర్త జయప్రకాశ్ నారాయణ్ గతంలో పిలుపు ఇచి్చనట్లు ప్రజలంతా నేడు ఐక్యంగా పోరాడాలి. సామాజిక ఉద్యమం ఉధృతంగా కొనసాగించాల్సిన తరుణమిది. పార్లమెంటరీ ప్రజాస్వామ్య పునాదులను పెకలించివేస్తున్న పెడపోకడలను అడ్డుకుందాం’’అని అన్నారు. ఈవీఎంలపై దేశమంతటా చర్చ ‘‘దేశంలో ఈవీఎంల దుర్వినియోగంపై చర్చ జరుగుతోంది. ఈ అంశాన్ని పార్లమెంట్లో విపక్షాలు ప్రస్తావించాలనుకున్న ప్రతిసారీ ప్రభుత్వం వీళ్లకు మాట్లాడే అవకాశం ఇవ్వట్లేదు. పార్లమెంట్ ఉభయసభలు వారంలో ఆరు రోజులు జరిగితే కనీసం ఒక్కరోజు కూడా విపక్షనేతలకు మాట్లాడే అవకాశం దక్కట్లేదు. పార్లమెంటరీ ప్రజాస్వామ్యంపై మోదీ సర్కార్ ఎలా దాడిచేస్తోందో ఇక్కడే తెలుస్తోంది. ఈవీఎంలలో అదనంగా ఓట్లను ఎలా జతచేస్తారో కొందరు నాకు ఒక ప్రజెంటేషన్ ద్వారా చూపించారు. కానీ వీటిని నిరూపించే బలమైన సాక్ష్యాలు మన దగ్గర లేవు. అయితే మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలను చూశాక వీటిని నమ్మక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఓడిన నేతల్లో ఏకంగా 22 మంది రీకౌంటింగ్ అడుగుతున్నారంటే ఈవీఎంలలో ఏదో తప్పు జరుగుతోందని అర్థమవుతోంది. బాలాసాహెబ్ థోరట్లాంటి కాంగ్రెస్ నేతలు ఆరోపించినట్లుగా చివరి రెండు గంటల్లో ఏకంగా 7 శాతం పోలింగ్ జరిగిందంటే నమ్మశక్యంగా లేదు. థోరట్ ఒక్కరేకాదు చాలా మంది ఇలాంటి ఎన్నో ఉదాహరణలను చూపిస్తున్నారు. ఈ అంశంపై కాంగ్రెస్ ఒక సమావేశాన్ని సైతం ఏర్పాటుచేసింది. దీనిపై విపక్షాల ఇండియా కూటమి ఒక ఉమ్మడి నిర్ణయం తీసుకోవడంపై చర్చ జరిగింది. సోమవారం దీనిపై కొన్ని ఉమ్మడి నిర్ణయాలు వెలువడే అవకాశం ఉంది. దాదాపు 15 శాతం ఓట్లను ముందే ఈవీఎంలలో సెట్ చేసి ఉంచుతారని కొందరు చెబితే నేను నమ్మలేదు. కానీ తాజా ఫలితాలను చూశాక ఈ ఆరోపణల్లో ఎంతోకొంత నిజం ఉందని గత ఐదు రోజులుగా నాక్కూడా అనిపిస్తోంది’’అని శరద్‌పవార్ అన్నారు. వీవీప్యాట్లను లెక్కించాలి: ఉద్ధవ్‌ఠాక్రే అధవ్‌కు మంచినీళ్లు ఇచ్చి దీక్షను విరమింపజేసిన సందర్భంగా శివసేన(యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే మాట్లాడారు. ‘‘బూత్‌లో ఓటు పోలయిందని అందరికీ తెలుసు. కానీ ఈవీఎంలో ఏ పార్టీ తరఫున అది రిజిస్టర్ అయిందో ఎలా తెలియాలి?. అందుకే ఎన్నికల్లో అన్ని వీవీప్యాట్ రశీదులను లెక్కించాల్సిందే. పోలింగ్ రోజు చివరి గంటలో ఏకంగా 76 లక్షల ఓట్లు పోలయ్యాయని చెబుతున్నారు. ఈ లెక్కన ప్రతి పోలింగ్‌కేంద్రంలో ఆఖర్లో ఏకంగా వేయి మంది ఓటేశారని అర్థం. మరి చివరిగంటలో ప్రతిపోలింగ్కేంద్రం బయట అంతమంది క్యూ వరసల్లో లేరు’’అని ఉద్ధవ్ అన్నారు. -
Pune Porsche car crash: మైనర్ నిందితునికి బెయిలు.. జడ్జిల తొలగింపు
పుణే: పోర్షే కారు దుర్ఘటనలో మైనర్ నిందితుడికి బెయిల్ మంజూరు చేసిన కేసులో జువెనైల్ జస్టిస్ బోర్డు (జేజేబీ)కి చెందిన ఇద్దరు జడ్జిలను మహారాష్ట్ర ప్రభుత్వం తొలగించింది. విధానపరమైన లోపాలు, దుష్ప్రవర్తన, నిబంధనలు పాటించకపోవ డంవంటి ఆరోపణలపై ఎల్.ఎన్.దన్వాడే, కవితా థోరట్లపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ (డబ్ల్యూసీ డీ) దర్యాప్తు కమిటీ సిఫారసు చేసింది. ఈ మేరకు జువెనైల్ జస్టిస్ యాక్ట్ కింద కల్పించిన అధికారాలను దుర్వినియోగం చేసిన ట్లు తేలడంతో రాష్ట్ర ప్రభుత్వం ఇద్దరి ని యామకాన్ని రద్దు చేసింది. పుణేలోని కళ్యా ణి నగర్ ప్రాంతంలో ఓ బిల్డర్ కుమారుడైన 17 ఏళ్ల బాలుడు మద్యం మత్తులో పోర్షే కారు నడిపి మోటార్ సైకిల్‌ను ఢీకొట్టాడు. ఈ దుర్ఘటనలో ఇద్దరు ఐటీ నిపుణులు మృతి చెందారు. అప్పటి జేజేబీ జడ్జిలు నిందితుడికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేశారు. ఆ షరతులలో రోడ్డు భద్రతపై 300 పదాల వ్యాసం రాయాలని ఉంది. ఇది జాతీయ స్థాయిలో దుమారం రేపిన సంగతి తెలిసిందే. -
వారి స్వార్థానికి.. వీరు బలి
అదేమీ రహదారి కాదు.... మున్సిపల్ అధికారులు చేపడుతున్న రహదారుల విస్తరణ కూడా కానే కాదు.... ఒక్క మాటలో చెప్పాలంటే మున్సిపాలిటీకి ఆ స్థలాలతో సంబంధం లేదు... ఎవరు చెప్పారో... ? ఎవరి మెప్పుకోరారో...? తెలియదు కానీ.... ట్రస్ట్ సభ్యులు రోడ్డెక్కే పని లేకుండా ... వారి చేతులకు మట్టి అంటకుండా పని కానిచ్చేశారు. వందలాది మంది పేదల జీవితాలను రోడ్డు పాల్జేశారు. ఏళ్ల తరబడి ఆ ప్రాంతాల్లో ఉపాధి పొందుతున్న వారి పొట్టలు కొట్టారు. ఇదంతా జరిగింది ఎక్కడో కాదు... విజయగనరం జిల్లా కేంద్రం నడిబొడ్డున గల విజయనగరం మహా రాజుల కోట పరిసరాల్లోనే.... ఆ భూములు ఎవరివో కాదు... స్వయానా మాజీ కేంద్రమంత్రి, ఎంపీ పూసపాటి అశోక్‌గజపతిరాజు ట్రస్టీగా వ్యవహరిస్తున్న మాన్సాస్‌కు చెందిన భూములే. ఈ విషయంలో మున్సిపల్ యంత్రాంగం పెత్తనం చేలాయించిన తీరు రెండేళ్లయిౖనా కళ్లకు కట్టినట్లుగా కనిపిస్తోంది. విజయనగరం మున్సిపాలిటీ: టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత చారిత్రాత్మక నేపథ్యం కలిగిన విజయనగరం మహారాజా కోట పరిసరాలను పర్యాటక శాఖ ఆధ్వర్యంలో అభివృద్ధి చేశారు. ఇందులో భాగంగా కోటకు పడమర దిక్కులో పార్కు తరహాలో 2016 నుంచి పనులు ప్రారంభించారు. అదే తరహాలో కోట చుట్టూ అభివృద్ధి చేపట్టాలని నిర్ణయించారు. ఇంతవరకు బాగానే ఉన్నా దశాబ్దాల కిందటి నుంచి కోట పరిసరాల్లో చిన్నపాటి వృత్తులు, వ్యాపారాలు చేసుకుంటూ జీవిస్తున్న వారిని ఒక్కసారిగా ఖాళీ చేయించడంపై భిన్న వాదనలు వ్యక్తమవుతున్నాయి. 2017 ఫిబ్రవరిలో మున్సిపల్ టౌన్‌ప్లానింగ్ యంత్రాంగం ఆధ్వర్యంలో ఈ ప్రాంతంలో ఉన్న వందలాది దుకాణాలను ఖాళీ చేయించేశారు. వాస్తవానికైతే ఇలా ఖాళీ చేయించే బాధ్యతను రెవెన్యూ యంత్రాంగానికి అప్పగించాలి. ఇందుకోసం ముందస్తుగా ట్రస్ట్ నుంచి నోటీసులు జారీ చేయాలి. అయితే ఇదంతా అన్యాయమని ప్రశ్నించే వారి గొంతులను పోలీసు బలగాలను ప్రదర్శించి నొక్కేశారు. తాము మాన్సాస్ ట్రస్టుకు పన్నులు చెల్లిస్తే మున్సిపల్ యంత్రాంగం ఆ స్థలాల నుంచి ఖాళీ చేయించడం ఎంత వరకు సమంజసమని వ్యాపారులు ప్రశ్నించారు. ఈ నేపథ్యంలోనే మున్సిపల్ యంత్రాంగానికి ఆ అధికారం ఎవరిచ్చారన్న ప్రశ్న తలెత్తినప్పటికీ అప్పటికే మాన్సాస్ ట్రస్ట్ డైరెక్టర్‌గా ఉన్న అదితి గజపతిరాజు తన తండ్రి అశోక్ గజపతిరాజు అధికారంతో ప్రశ్నించే వారిని అధికారులతో బెదిరించారు. దీంతో ఏళ్ల తరబడి ఉపాధి పొందిన వారంతా సామాన్య కుటుంబాలకు చెందిన వారే కావడంతో మిన్నకుండిపోయారు. ఈ ప్రక్రియపై ఒకానొక దశంలో రాజవంశానికి చెందిన పలువురు పెద్దలు అదితి గజపతిరాజు స్వలాభం కోసం వెంపర్లాడుతున్న తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎక్కడా లేని అభివృద్ధి ఇక్కడే ఎందుకు..? విజయనగరం మున్సిపాలిటీలో ఎక్కడా లేని అభివృద్ధి కోట చుట్టూ మాత్రమే జరిగింది. కోట పరిసరాల్లో రెండు కిలోమీటర్ల మేర మాత్రమే అభివృద్ధి పనులు చేపట్టడంపై సర్వత్రా విమర్శలు వినిపించాయి. వాస్తవానికి విజయనగరం పట్టణంలో సుమారు 15 మార్గాల్లో గడిచిన ఐదేళ్లలో అభివృద్ధి పనులు చేపట్టేందుకు మున్సిపాలిటీ శ్రీకారం చుట్టగా... అందులో కోట పరిసరాల్లో పనులు మాత్రమే నెలల వ్యవధిలో పనులు పూర్తి చేశారు. మిగిలిన ప్రాంతాల్లో పరిస్థితులు పరిశీలిస్తే ఇప్పటికీ ఆయా ప్రాంతాల్లో రహదారి విస్తరణ పనులతో పాటు అభివృద్ధి పనులు పూర్తికాలేదు. కానరాని ప్రత్యామ్నాయం కోట పరిసరాల్లో ఆక్రమణల పేరిట తొలగించిన వారికి ప్రత్యామ్నాయం చూపించడంలో ఏ ఒక్కరికీ సంబంధం లేకుండా పోయింది. స్థలం మాన్సాస్ ట్రస్ట్‌కు చెందగా.. ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయించింది మున్సిపల్ అధికారులు. ఆక్రమణలు తొలగించాలంటూ ఉపాధి పొందుతున్న వారిని హెచ్చరించిన సమయంలోనే వారంతా ఎదురు ప్రశ్నించినా ఉన్నతాధికారులు ఆదేశాలంటూ అధికార దర్పాన్ని ప్రదర్శించారు. బలవతంగా పోలీసుల సమక్షంలో భారీ యంత్రాలతో వారి దుకాణాలను నేలమట్టం చేశారు. ప్రస్తుతం తమకు ప్రత్యామ్నాయం చూపించాలని ఎవరిని అడగాలో తెలియని అయోమయ పరిస్థితిలో బాధితులున్నారు. అదితి పోటీతో హడల్.. విజయనగరం నియోజకవర్గంలో వంశపారంపర్య రాచరిక పాలనపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రధానంగా మాన్సాస్ ట్రస్ట్ డైరెక్టర్‌గా ఉన్న సమయంలోనే పూసపాటి అదితి గజపతిరాజు తన తండ్రి అశోక్ గజపతిరాజు అధికారాన్ని ఉపయోగించుకుని వారి సొంత ఆస్తుల పరిరక్షణకు ఇచ్చిన ప్రాధాన్యతను పట్టణ ప్రజలు కళ్లారా చూశారు. ప్రస్తుతం ఆమె ఎమ్మెల్యే బరిలో ఉండడంతో పట్టణ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మా బతుకులు కూల్చేశారు కోటను అందంగా మారుస్తామంటూ మా బతుకులు కూల్చేశారు. మాన్సాస్‌కు చెందిన స్థలంలో ఏళ్ల తరబడి టీ దుకాణం పెట్టుకుని జీవనం సాగిస్తున్నాను. స్థలంలో ఉంటున్నందుకు పన్ను కూడా చెల్లిస్తున్నాం. అయితే ట్రస్ట్ నుంచి ఎటువంటి నోటీసులు, సమాచారం లేకుండా మున్సిపల్ అధికారులు వచ్చి ఆక్రమణలంటూ దుకాణాన్ని పడగొట్టారు. కనీసం ప్రత్యామ్నాయం కూడా చూపించలేదు. – అప్పలరాజు, బాధితుడు, విజయనగరం. -
అధికార దుర్వినియోగానికి పాల్పడ్డ దిగ్విజయ్
హైదరాబాద్: ఆయన కేంద్ర మంత్రి కాదు. రాష్ట్రమంత్రి అంత కంటే కాదు. కనీసం ఓ ఉన్నత ప్రభు్తవ ఉద్యోగి కూడా కాదు. చివరికి ఓ ప్రజాప్రతినిధి కూడా కాదు. అయినా ఆయన దర్జాగా ఎర్రబుగ్గ కారులో ఎక్కి ఊరేగారు. రెండు రోజులు క్రితమే దేశ అత్యున్నత న్యాయస్థానం ఎవరు పడితే వారు- ఎర్ర, నీలం బుగ్గ కార్లు ఉపయోగించరాదని స్పష్టం చేసింది. కానీ అవేవీ ఆయన పట్టించుకోలేదు. ఎలాంటి అధికార, రాజ్యాంగ పదవుల్లో లేనప్పటికీ ఎర్ర బుగ్గ కారులో దర్జాగా ప్రయాణించారు. ఆయనెవరో కాదు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దిగ్విజయ్ సింగ్. నేడు హైదరాబాద్‌కు వచ్చిన దిగ్గీ రాజా ఎర్రబుగ్గ కారులో తిరుగుతూ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. రాజ్యాంగబద్ధమైన పోస్టుల్లో ఉన్నవారు మాత్రమే బుగ్గు కార్లు వినియోగించాలని సాక్షాత్తు సర్వోన్నత న్యాయస్థానం తేల్చిచెప్పినా ఆయనగారికి పట్టలేదు. కనీసం కాంగ్రెస్ నాయకులు గాని, అధికారులు కూడా అడ్డుచెప్పలేదు. దిగ్విజయ్ సింగ్ ఎర్రబుగ్గ కారులో ప్రయాణించడంపై విమర్శలు వస్తున్నాయి. పార్టీ పదవిలో ఉన్న దిగ్విజయ్ బుగ్గకారులో ఎలా ప్రయాణిస్తున్నారని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. ఇటువంటివి పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నాయి.