అధికార దుర్వినియోగానికి పాల్పడ్డ దిగ్విజయ్
హైదరాబాద్: ఆయన కేంద్ర మంత్రి కాదు. రాష్ట్రమంత్రి అంత కంటే కాదు. కనీసం ఓ ఉన్నత ప్రభు్తవ ఉద్యోగి కూడా కాదు. చివరికి ఓ ప్రజాప్రతినిధి కూడా కాదు. అయినా ఆయన దర్జాగా ఎర్రబుగ్గ కారులో ఎక్కి ఊరేగారు. రెండు రోజులు క్రితమే దేశ అత్యున్నత న్యాయస్థానం ఎవరు పడితే వారు- ఎర్ర, నీలం బుగ్గ కార్లు ఉపయోగించరాదని స్పష్టం చేసింది. కానీ అవేవీ ఆయన పట్టించుకోలేదు.
ఎలాంటి అధికార, రాజ్యాంగ పదవుల్లో లేనప్పటికీ ఎర్ర బుగ్గ కారులో దర్జాగా ప్రయాణించారు. ఆయనెవరో కాదు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ దిగ్విజయ్ సింగ్. నేడు హైదరాబాద్కు వచ్చిన దిగ్గీ రాజా ఎర్రబుగ్గ కారులో తిరుగుతూ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. రాజ్యాంగబద్ధమైన పోస్టుల్లో ఉన్నవారు మాత్రమే బుగ్గు కార్లు వినియోగించాలని సాక్షాత్తు సర్వోన్నత న్యాయస్థానం తేల్చిచెప్పినా ఆయనగారికి పట్టలేదు. కనీసం కాంగ్రెస్ నాయకులు గాని, అధికారులు కూడా అడ్డుచెప్పలేదు.
దిగ్విజయ్ సింగ్ ఎర్రబుగ్గ కారులో ప్రయాణించడంపై విమర్శలు వస్తున్నాయి. పార్టీ పదవిలో ఉన్న దిగ్విజయ్ బుగ్గకారులో ఎలా ప్రయాణిస్తున్నారని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. ఇటువంటివి పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నాయి.