Red Beacon
-
నిషేధించినా ఎర్రబుగ్గతో మంత్రి హల్చల్!
-
నిషేధించినా ఎర్రబుగ్గతో మంత్రి హల్చల్!
సిలిగురి: వీఐపీ సంస్కృతికి చరమగీతం పాడేందుకు ప్రముఖులు సహా, కేంద్ర, రాష్ట్ర మంత్రుల వాహనాలకు ఎర్రబుగ్గలను తొలగించాలని కేంద్రప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఈ నెల ఒకటో తేదీ నుంచి ఈ ఆదేశాలు అమల్లోకి వచ్చాయి. అయినా పశ్చిమ బెంగాల్ మంత్రులు మాత్రం ఈ ఆదేశాలను అసలు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. తాజాగా సోమవారం బెంగాల్ పీడబ్ల్యూడీ మంత్రి అరూప్ బిశ్వాస్ తన వాహనానికి ఎర్రబుగ్గతో మీడియా కంటపడ్డారు. దీని గురించి మీడియా ప్రశ్నించగా.. ‘ఎర్రబుగ్గలను మా ప్రభుత్వం ఇంకా రద్దు చేయలేదు. ఇతర ఆదేశాలను కట్టుబడాల్సిన అవసరం మాకు లేదు’ అని ఆయన పేర్కొన్నారు. అత్యవసర వాహనాలైన అంబులెన్స్, అగ్నిమాపక సిబ్బంది వాహనాలకు మినహాయించి ఇతర ఏ వాహనాలు కూడా ఎర్రబుగ్గలు, ఇతర రంగు బుగ్గలను వాడవద్దంటూ కేంద్రం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. దేశంలోని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలన్నింటిలోనూ ఈ ఆదేశాలు వర్తిస్తాయి. కానీ బెంగాల్ నేతలు మాత్రం తమకు కేంద్రం ఆదేశాలతో లెక్కలేదంటున్నారు. బెంగాల్‌లోని సిలిగురి జల్పైగురి అభివృద్ధి సంస్థ చైర్మన్ సైతం తన వాహనానికి ఎర్రబుగ్గతో సోమవారం కనిపించడం గమనార్హం. -
ఎర్రబుగ్గ నేనెందుకు తొలగిస్తా?: సీఎం
దేశంలో వీఐపీ సంస్కృతికి చరమగీతం పాడుతూ ప్రముఖుల వాహనాలపై ఎర్రబుగ్గలను తొలగించాలని ప్రధాని నరేంద్రమోదీ ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఆదేశానికి మద్దతు పలుకుతూ చాలామంది ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులు మీడియా ముందు హడావిడిగా తమ వాహనాలపై ఎర్రబుగ్గలను తొలగించారు. కానీ, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య మాత్రం ఎర్రబుగ్గను తొలగించలేదు. ఇదే విషయాన్ని మీడియా అడిగితే.. ‘నేనెందుకు తొలగించాలి? మే 1 నుంచి కదా ఈ ఆదేశాలు అమలు అయ్యేది’ అంటూ ఆయన ఎదురు ప్రశ్నించారు. ఆయన లెక్క ప్రకారం మే 1కి ముందు ఒక్క క్షణం కూడా ఎర్రబుగ్గను తొలగించకూడదు. కానీ, తన తీరుపై విమర్శలు వస్తాయని అనుకున్నారేమో ఆయన వెనుకకు తగ్గారు. ఆయన వాహనంపై ఎర్రబుగ్గ మాయమైంది. దీనిపై కర్ణాటక సీఎంవో వివరణ ఇస్తూ.. వాహనాలపై ఎర్రబుగ్గులు తొలగించాలన్న కేంద్రం నిర్ణయాన్ని రాష్ట్రానికి తెలియజేయలేదని, అయినా, ప్రధాని మోదీ అభీష్టం మేరకు సీఎం సిద్దరామయ్య తన వాహనం నుంచి దానిని తొలగించారని తెలిపింది. మొత్తానికి దేశంలో ‘వీఐపీ సంస్కృతి’కి నిలుటద్దంలా నిలిచిన వాహనాలపై ఎర్రబుగ్గను తొలగించడంలో నేతలు మహా ఉత్సాహం చూపుతున్నారు. కాంగ్రెస్‌కే చెందిన పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ సైతం తన వాహనంపై ‘లాల్ బత్తీ’ని తొలగించారు. ఈ విషయంలో విమర్శలకు జడిసి సిద్దరామయ్య కూడా తొలగించి ఉంటారని తెలుస్తోంది. -
'ఎర్రబుగ్గ' తీసేశా: స్మృతి ఇరానీ
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు తమ వాహనాలపై ఎర్రబుగ్గలను తొలగిస్తున్నారు. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ తన వాహనంపై ఎర్రబుగ్గను తీసివేశారు. తన కారుపై ఎర్రబుగ్గను తొలగించినట్టు కేంద్ర మంత్రి స్మతి ఇరానీ తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్టు తెలిపారు. ప్రతి భారతీయుడూ ప్రత్యేకమేనన్న తమ నమ్మకాన్ని పునరుద్ఘాటించామని పేర్కొన్నారు. వీవీఐపీ సంస్కృతిని పక్కనపెడుతూ.. రాష్ట్రపతి, ప్రధాన మంత్రి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు సహా ఇతరుల వాహనాలపై ఎర్రబుగ్గలను తొలగించాలని కేంద్ర ప్రభుత్వం బుధవారం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో తన వాహనంపై ఎర్రబుగ్గను తక్షణమే తొలగిస్తున్నట్లు మహారాష్ట్ర సీఎం ఫడ్నవిస్ స్పష్టం చేశారు. గుజరాత్‌లోనూ వీఐపీ సంస్కృతికి చరమగీతం పాడినట్లు ఆ రాష్ట్ర సీఎం విజయ్ రూపానీ తెలిపారు. త్వరలోనే గుజరాత్ అంతటా దీన్ని అమలుచేస్తామన్నారు. గోవా సీఎం మనోహర్ పరీకర్, రాజస్తాన్ సీఎం వసుంధర రాజే, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ కూడా తక్షణమే ఎర్రబుగ్గను తొలగించాలని ఆదేశాలు జారీచేశారు. -
అయ్యో.. పన్నీర్ సెల్వం!
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోయిన పన్నీర్ సెల్వంకు అధికార లాంఛనాలు దూరమవుతున్నాయి. నూతన ముఖ్యమంత్రిగా పళనిస్వామి ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే సెల్వం కారుకు ఉన్న ఎర్ర బుగ్గను అధికారులు తొలగించారు. పన్నీర్ సెల్వం నివాసం వద్ద భద్రతను పోలీసులు తగ్గించారు. సోమవారం ఆయన ప్రభుత్వ నివాస గృహాన్ని ఖాళీ చేయనున్నారు. ఈ నెల 5న పన్నీర్ సెల్వం ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆయన స్థానంలో ఎంకే శశికళను అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు తమ నాయకురాలిగా ఎన్నుకున్నారు. రెండు రోజుల తర్వాత (ఫిబ్రవరి 7న) రోజు శశికళపై తిరుగుబాటు చేశారు. గవర్నర్ శశికళతో ప్రమాణ స్వీకారం చేయించకపోవడంతో దాదాపు రోజుల పాటు సంక్షోభం కొనసాగింది. సీఎం కుర్చీ చివరకు శశికళ, పన్నీర్ సెల్వం దక్కలేదు. అనూహ్యంగా పళనిస్వామి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించారు. ఈ నెల 18న శాసనసభలో పళనిస్వామి బలం నిరూపించుకోనున్నారు. -
కారుపై ఎర్రబుగ్గను తొలగించే ప్రసక్తే లేదు!
ముంబై: తన అధికారిక వాహనంపై ఉన్న ఎర్రబుగ్గ (రెడ్ బీకాన్)ను తొలగించేది లేదంటూ ముంబై నగర్ మేయర్ స్నేహాల్ అంబేకర్ తేల్చిచెప్పారు. ఆమె కొత్తగా మేయర్ గా ఎన్నికైన అనంతరం తన అధికారిక వాహనంపై ఎర్రబుగ్గను కల్గి ఉండటంతో వివాదం చెలరేగింది. దీంతో స్పందించిన ఆమె.. ముఖ్యమంత్రి వాహనంపై ఎర్రబుగ్గకు అనుమతి ఇచ్చి.. మేయర్ కారుపై తొలగించాలని పేర్కొనడాన్ని ఆమె తప్పుబట్టారు. అంతేకాకుండా మేయర్ పదవి అనేది సీఎం పదవితో సమానం అంటూ ఎద్దేవా చేశారు. 'మేయర్ స్థానం సీఎం స్థానంతో సమానం. సీఎం వాహనంపై రెడ్ బీకాన్ ఉంటుంది. మరి నాకు ఇబ్బంది ఏంటి' అంటూ ఆమె ఘాటుగా స్పందించారు. ఒకవేళ నా అభిప్రాయాన్ని అడిగితే ఇది సమాధానం చెబుతానని ఆమె మొండికేశారు. సీఎం అధికారిక వాహనంపై ఎర్రబుగ్గను వాడగా అభ్యంతరం లేనిది.. తన వరకూ వచ్చేసరికి ఏమిటిని ప్రశ్నించారు. దీనిపై మహారాష్ట్ర సీఎం పృథ్వీరాజ్ చవాన్ మాట్లాడుతూ.. ప్రతీ ఒక్కరూ నిబంధనలు కచ్చితంగా పాటించాలని హితవు పలికారు. ' ఇది ప్రజాస్వామ్యం. ఇక్కడ నియమాలు కూడా ఉంటాయ్' అని స్పష్టం చేశారు. తాజా ప్రభుత్వ నియమావళిలో మేయర్ వాహనంపై రెడ్ బీకాన్ ఉండకూడదని ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ వైఖరిని మాజీ మేయర్ సునీల్ ప్రభూ కూడా ఖండించారు. మేయర్ తన అధికారి కారుపై ఎర్రబుగ్గను వాడటం ఒక సాంప్రదాయంగా వస్తుందని అభిప్రాయపడ్డారు. -
బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో దిగ్విజయ్ సింగ్‌పై ఫిర్యాదు
ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి దిగ్విజయ్ సింగ్‌పై హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సుప్రీం కోర్టు తీర్పును విరుద్ధంగా దిగ్విజయ్ ఎర్ర బుగ్గ కారులో ప్రయాణించినందుకు తెలుగు యువత నాయకులు ఆయనపై ఫిర్యాదు చేశారు. నగర పర్యటనకు వచ్చిన దిగ్విజయ్ ఎర్ర బుగ్గ కారు వాడారని ఆరోపించారు. కాగా దిగ్విజయ్‌పై కేసు నమోదు చేయలేదని, ఈ విషయాన్ని విచారిస్తున్నామని బంజారాహిల్స్ పోలీసులు చెప్పారు. ఈ విషయంపై డిగ్గీరాజా మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అధికారుల్ని అడగాలన్నారు. రాజ్యాంగబద్ధమైన పోస్టుల్లో ఉన్నవారు, అత్యున్నత పదవుల్లో ఉన్నవారు మాత్రమే ఎర్రబుగ్గ కార్లను వాడాలని సుప్రీం కోర్టు ఇటీవల ఆదేశించిన సంగతి తెలిసిందే. ఎలాంటి అధికారు పదవుల్లో లేని దిగ్విజయ్ ఎర్రబుగ్గ కారు వాడటం వివాదాస్పదమైంది. -
అధికార దుర్వినియోగానికి పాల్పడ్డ దిగ్విజయ్
హైదరాబాద్: ఆయన కేంద్ర మంత్రి కాదు. రాష్ట్రమంత్రి అంత కంటే కాదు. కనీసం ఓ ఉన్నత ప్రభు్తవ ఉద్యోగి కూడా కాదు. చివరికి ఓ ప్రజాప్రతినిధి కూడా కాదు. అయినా ఆయన దర్జాగా ఎర్రబుగ్గ కారులో ఎక్కి ఊరేగారు. రెండు రోజులు క్రితమే దేశ అత్యున్నత న్యాయస్థానం ఎవరు పడితే వారు- ఎర్ర, నీలం బుగ్గ కార్లు ఉపయోగించరాదని స్పష్టం చేసింది. కానీ అవేవీ ఆయన పట్టించుకోలేదు. ఎలాంటి అధికార, రాజ్యాంగ పదవుల్లో లేనప్పటికీ ఎర్ర బుగ్గ కారులో దర్జాగా ప్రయాణించారు. ఆయనెవరో కాదు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దిగ్విజయ్ సింగ్. నేడు హైదరాబాద్‌కు వచ్చిన దిగ్గీ రాజా ఎర్రబుగ్గ కారులో తిరుగుతూ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. రాజ్యాంగబద్ధమైన పోస్టుల్లో ఉన్నవారు మాత్రమే బుగ్గు కార్లు వినియోగించాలని సాక్షాత్తు సర్వోన్నత న్యాయస్థానం తేల్చిచెప్పినా ఆయనగారికి పట్టలేదు. కనీసం కాంగ్రెస్ నాయకులు గాని, అధికారులు కూడా అడ్డుచెప్పలేదు. దిగ్విజయ్ సింగ్ ఎర్రబుగ్గ కారులో ప్రయాణించడంపై విమర్శలు వస్తున్నాయి. పార్టీ పదవిలో ఉన్న దిగ్విజయ్ బుగ్గకారులో ఎలా ప్రయాణిస్తున్నారని విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. ఇటువంటివి పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నాయి. -
ఎర్రబుగ్గను ఆర్పేయాల్సిందే!
ఇటీవల కాలంలో నగరాల్లో ఎమ్మెల్యే, ఎంపీల స్టిక్కర్లు, ఎర్రబుగ్గ ఉన్న కార్లను వినియోగించడం సర్వసాదారణమైంది. ఎంపీ, ఎమ్మెల్యేల స్టిక్కర్ల పక్కన పడితే..చివరికి జీహెచ్ఎంసీ, ఆర్మీ, ప్రెస్ స్టిక్కర్లే కాకుండా ఏది పడితే ఆ స్టిక్కర్తతో వాహనాలను రోడ్లపై పరిగెత్తిస్తున్నారు. అనధికారికంగా స్టిక్కర్ల వాడకంతో ట్రాఫిక్ నిబంధనల్ని కూడా ఉల్లంఘించడం మనం చూస్తూనే ఉంటాం. అధికారికంగా హోదాను మించి.. స్టిక్కర్ల దుర్వినియోగం జరుగుతోందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ ఓ సందర్భంలో ఆందోళన వ్యక్తం చేశారు. అంతేకాక స్టిక్కర్ల దుర్వినియోగానికి చెక్ పెట్టేలా ప్రత్యేకమైన హోలోగ్రామ్ తో స్టిక్కర్లను తయారు చేయించారు. ఇక స్టికర్ల గొడవ కాస్త పక్కన పడితే.. మంత్రి పదవి హోదాను అనుభవిస్తూ దర్జాగా ఎర్రబుగ్గ కారులో తిరుగాలనే కోరిక ప్రతి రాజకీయ నాయకుడిలో ఉండటం సహజం. ఎర్రబుగ్గ కారులో తిరగడం ప్రస్తుత రాజకీయాల్లో నాయకులకు ఫ్యాషన్ గా మారింది. అధికారికంగా ఎర్రబుగ్గ కారులో ఒక్కసారైన హోదాను అనుభవించాల్సిందేనని వెంపర్లాడే నాయకులు ఎంతమందో కనిపిస్తారు. అయితే వీటన్నింటికి భిన్నంగా గ్యాలియర్ యువరాజు జ్యోతిరాధిత్య సింధియా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ప్రజలకు, నాయకులకు మధ్య ఎర్రబుగ్గ కారు దూరాన్ని పెంచుతుందని సింధియా అన్నారు. దేశ రాజధానిలో కాని, మరే ఇతర ప్రాంతాల్లో ఎర్రబుగ్గ ఉన్న వాహనాన్ని ఉపయోగించనని మీడియాతో అన్నారు. ఎర్రబుగ్గ కారు తన దృష్టిలో చిన్నది..కాని ముఖ్యమైందేనని ఆయన అన్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఒకవేళ మధ్య ప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రభుత్వం ఎర్పడితే..వాహనాలపై ఎర్రబుగ్గ వాడకుండా పార్టీ చర్యలు తీసుకుంటుందని జ్యోతిరాధిత్య సింధియా అన్నారు. మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే జ్యోతిరాధిత్య సింధియా ముఖ్యమంత్రి అవుతారని కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. భవిష్యత్ లో ముఖ్యమంత్రి అవుతారో లేదో కాని.. ఎర్రబుగ్గ వాహనంతో రోడ్లపై జనాల్ని ఇబ్బంది కలిగించే రాజకీయ నాయకులను ప్రజల వద్దకు తీసుకు రావడానికి సింధియా చేసిన సూచనలపై హర్షం ప్రకటిస్తున్నారు.