ఎర్రబుగ్గ నేనెందుకు తొలగిస్తా?: సీఎం
దేశంలో వీఐపీ సంస్కృతికి చరమగీతం పాడుతూ ప్రముఖుల వాహనాలపై ఎర్రబుగ్గలను తొలగించాలని ప్రధాని నరేంద్రమోదీ ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఆదేశానికి మద్దతు పలుకుతూ చాలామంది ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులు మీడియా ముందు హడావిడిగా తమ వాహనాలపై ఎర్రబుగ్గలను తొలగించారు.
కానీ, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య మాత్రం ఎర్రబుగ్గను తొలగించలేదు. ఇదే విషయాన్ని మీడియా అడిగితే.. ‘నేనెందుకు తొలగించాలి? మే 1 నుంచి కదా ఈ ఆదేశాలు అమలు అయ్యేది’ అంటూ ఆయన ఎదురు ప్రశ్నించారు. ఆయన లెక్క ప్రకారం మే 1కి ముందు ఒక్క క్షణం కూడా ఎర్రబుగ్గను తొలగించకూడదు. కానీ, తన తీరుపై విమర్శలు వస్తాయని అనుకున్నారేమో ఆయన వెనుకకు తగ్గారు. ఆయన వాహనంపై ఎర్రబుగ్గ మాయమైంది.
దీనిపై కర్ణాటక సీఎంవో వివరణ ఇస్తూ.. వాహనాలపై ఎర్రబుగ్గులు తొలగించాలన్న కేంద్రం నిర్ణయాన్ని రాష్ట్రానికి తెలియజేయలేదని, అయినా, ప్రధాని మోదీ అభీష్టం మేరకు సీఎం సిద్దరామయ్య తన వాహనం నుంచి దానిని తొలగించారని తెలిపింది. మొత్తానికి దేశంలో ‘వీఐపీ సంస్కృతి’కి నిలుటద్దంలా నిలిచిన వాహనాలపై ఎర్రబుగ్గను తొలగించడంలో నేతలు మహా ఉత్సాహం చూపుతున్నారు. కాంగ్రెస్‌కే చెందిన పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ సైతం తన వాహనంపై ‘లాల్ బత్తీ’ని తొలగించారు. ఈ విషయంలో విమర్శలకు జడిసి సిద్దరామయ్య కూడా తొలగించి ఉంటారని తెలుస్తోంది.