ఇక్కడ మోదీ ఆటలు సాగవు..
► జేడీఎస్ తప్పిదాలతోనే బీజేపీ బలోపేతం
► అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపునకు కసరత్తులు
► హస్తినలో సీఎం సిద్ధరామయ్య
సాక్షి, బెంగళూరు: దేశంలోని పలు రాష్ట్రాల్లో తన మాటల గారడీతో ప్రజలను మోసం చేస్తున్న ప్రధాని నరేంద్రమోదీ కుయుక్తులు కర్ణాటకలో మాత్రం సాగవంటూ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అన్నారు. వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికల సమయానికి పార్టీలో మార్పులు, చేర్పుల గురించి కాంగ్రెస్ అధిష్టానంతో చర్చించడానికి ఢిల్లీ చేరుకున్న సిద్ధరామయ్య ఆదివారం అక్కడ మీడియాతో మాట్లాడారు. గతంలో జేడీఎస్ వ్యూహాత్మక తప్పిదాల వల్ల కర్ణాటకలో బీజేపీ బలపడింది, కానీ బీజేపీ మళ్లీ పాతాళానికి పడిపోయినట్లు ఇటీవలి ఉప ఎన్నికల ఫలితాలు రుజువు చేశాయన్నారు.
వచ్చే ఏడాది ఎన్నికల నాటికి కాంగ్రెస్ మరింత బలోపేతం చేసి సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించడానికి ఇప్పటి నుంచి కసరత్తులు ప్రారంభించామన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో రైతుల రుణమాఫీ సాధ్యం కాదంటూ స్పష్టం చేసిన ఆయన రుణమాఫీపై కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇచ్చి రుణమాఫీకి సహకరించినట్లయితే తాము కూడా సిద్ధమన్నారు. పంటనష్ట పరిహారాన్ని విడుదల చేయించండంలో కేద్రంపై ఒత్తిడి తీసుకురావడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న రాష్ట్ర బీజేపీ నాయకులు రైతుల రుణ మాఫీ చేయట్లేందటూ తమ ప్రభుత్వంపై నిందలు మోపడం సరికాదంటూ విమర్శించారు.
మహదాయి పరిష్కారంలోనూ నిర్లక్ష్యం
మహదాయి నదీ జలాల పంపిణీలో గోవా, మహారాష్ట్ర ప్రభుత్వాలతో చర్చించి సమస్యను పరిష్కరించి రాష్ట్రానికి తాగునీటిని అందించడంలో ప్రధాని నరేంద్రమోదీ నిర్లక్ష్యం వహిస్తున్నారని సీఎం విమర్శించారు. నదీ జలాల పంపిణీలో కేంద్రంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నా కూడా చేష్టలుడిగిన రాష్ట్ర బీజేపీ నాయకులకు రైతుల సంక్షేమం కోసం పాటు పడుతున్న తమ ప్రభుత్వాన్ని నిందించే నైతిక హక్కు లేదంటూ దుయ్యబట్టారు.
గుండ్లుపేట ఉప ఎన్నికలో విజయం సాధించిన కాంగ్రెస్ ఎమ్మెల్యే గీతా మహదేవ ప్రసాద్‌పై అనుచిత, అవహేళనకర వ్యాఖ్యలు చేయడం ద్వారా మైసూరు ఎంపీ ప్రతాప సింహా రాజకీయ అవివేకత్వాన్ని బయటపెట్టుకున్నాడని విమర్శించారు. క్షేత్రస్థాయి కార్యకర్తల నుంచి సీనియర్ నేతల వరకు అందరితో ఎప్పటికప్పుడు సమీక్షల ద్వారా వారి సమస్యలను పరిష్కరించి వచ్చే ఏడాది ఎన్నికల్లో గెలుపునకు కసరత్తులు ప్రారంభించామన్నారు.