
సాక్షి, బెంగళూరు: తనపై అవినీతి ఆరోపణలు చేసిన ప్రధానమంత్రి నరేంద్రమోదీపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య తీవ్రంగా మండిపడ్డారు. నరేంద్రమోదీ ప్రధానమంత్రి స్థాయికి తగ్గట్టుగా మాట్లాడటం లేదని మండిపడ్డారు. రాష్ట్రానికి సంబంధించి, దేశానికి సంబంధించి ఎన్నో సమస్యలు ఉన్నా.. ప్రధాని మోదీ వాటి గురించి నోరు మెదపడంలేదని విమర్శించారు. ఆయన రాజకీయ ప్రేరేపిత వ్యాఖ్యలు చేస్తున్నారని, బాధ్యతారాహిత్యమైన ప్రకటనలు గుప్పిస్తున్నారని అన్నారు. మోదీ ప్రధానమంత్రిగా కొనసాగడానికి అనర్హులని పేర్కొన్నారు.
కాంగ్రెస్ హయాంలో కర్ణాటక అవినీతిమయమైందని, రాష్ట్రంలో రోజుకో కుంభకోణం బయటపడుతోందని ప్రధాని మోదీ సోమవారం మైసూరు సభలో విమర్శించిన సంగతి తెలిసిందే. తాను ఇటీవల బెంగళూరు సభలో సిద్దరామయ్య సర్కారును పదిశాతం కమీషన్ల ప్రభుత్వమని విమర్శించానని, అయితే అది అంతకంటే ఎక్కువని తనకు తర్వాతే తెలిసిందన్నారు. కర్ణాటక సంపదను, ప్రజాధనాన్ని దోచుకుంటూ రాష్ట్రానికి దరిద్రం పట్టించిన కాంగ్రెస్ ప్రభుత్వానికి రాష్ట్ర ప్రజలు చరమగీతం పాడాలని ప్రధాని మోదీ ఈ సభలో పిలుపునిచ్చారు. రాష్ట్రాభివృద్ధికి బీజేపీనే గెలిపించాలని కోరారు. ఈ వ్యాఖ్యలపై సీఎం సిద్దరామయ్య తీవ్రంగా స్పందించారు.
Comments
Please login to add a commentAdd a comment