
బెంగళూరు: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని, మరో ఐదేళ్లపాటు తానే సీఎం పదవిలో కొనసాగుతానని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ కార్య కర్తలను హామీ కమిటీ చైర్మన్లు, సభ్యులుగా నియమించడం ద్వారా ప్రభుత్వం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను అవమానించిందని బీజేపీ ఆరోపించింది. ఇలాంటి నిర్ణయాలతో కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుడు సంకేతాలిస్తోందని ప్రతిపక్షనేత ఆర్.అశోక ఆరోపించారు. ఆయన వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వెంటనే స్పందించారు. ‘మేం ఎక్కడికీ పోం. మేం మళ్లీ గెలుస్తాం’ అని ధీమా వ్యక్తం చేశారు.
ఇక, ఇటీవల అసెంబ్లీ ఉప ఎన్నికలు జరిగిన చన్నపట్న, షిగ్గావ్, సండూర్‌లలో బీజేపీ ఓటమిని సీఎం గుర్తు చేశారు. ఎన్నికలకు ముందు దమ్ముందా అంటూ తమకు సవాల్ విసిరారని, ఆ తరువాత ఫలితాలనూ చూశారని ఎద్దేవా చేశారు. మళ్లీ తాము అధికారంలోకి వస్తామని, తదుపరి ముఖ్యమంత్రిగా తానే ఉంటానని ఆయన స్పష్టం చేశారు. ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, తనకు మధ్య జరుగుతున్న ఆధిపత్యపోరు నేపథ్యంలో సిద్ధరామయ్య వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.
కాగా, ప్రభుత్వ హామీల అమలు కోసం ప్రభుత్వం అన్ని జిల్లాల్లో కమిటీలను ఏర్పాటు చేసింది. ఈ కమిటీలకు చైర్మన్లు, సభ్యులుగా కాంగ్రెస్ తమ పార్టీ వారిని నియమించింది. దీనిపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ఈ కమిటీలను రద్దు చేయాలని కోరుతూ గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్‌ను బుధవారం కలిసి బీజేపీ.. వినతిపత్రం సమర్పించింది. ఇది శాసనసభ్యుల హక్కుల ఉల్లంఘనని బీజేపీ ఆందోళనకు దిగింది. అసెంబ్లీలో రెండో రోజు నిరసనను కొనసాగించింది. దీంతో మధ్యాహ్న భోజనం తరువాత అసెంబ్లీలో గందరగోళం ఏర్పడింది.
అయితే ఎమ్మెల్యేలను అగౌరవ పరిచే పనిని తాను చేయబోనని సిద్ధరామయ్య స్పష్టం చేశారు. ప్రభుత్వ పాలనలో పార్టీ కార్యకర్తల భాగస్వామ్యం ముందు నుంచి ఉన్నదేనని, గతంలో బీజేపీ కూడా ఇలాగే చేసిందని చెప్పారు. బోర్డులు, కార్పొరేషన్లకు చైర్మన్లుగా పార్టీ కార్యకర్తలను చేయడం దుర్వినియోగం కాదా అని ప్రశ్నించారు. మహారాష్ట్రలో ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలను మంత్రుల వ్యక్తిగత సహాయకులుగా చేశారని గుర్తు చేశారు. దీంతో బీజేపీ ఎమ్మెల్యేల నినాదాలతో సభా కార్యకలాపాలు మరింత గందరగోళంగా మారాయి. అయితే కాంగ్రెస్ కార్యకర్తలను కమిటీ చైర్మన్లను చేయడానికి తాము వ్యతిరేకం కాదని, వారికి కార్యాలయం ఇవ్వడం, నెలకు రూ.18 వేల నుంచి రూ.20 వేల వరకు ఖర్చు చేయడంపైనే తమ అభ్యంతరమని ప్రతిపక్ష నేత అశోక తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment