మీడియా సమావేశంలో సీఎం సిద్ధరామయ్య (ఇన్ సెట్‌లో మోదీ-ఫైల్ ఫోటో)
సాక్షి, బెంగళూరు : ప్రధాని నరేంద్ర మోదీపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య విరుచుకుపడ్డారు. తన ప్రభుత్వంపై చేసిన అవినీతి ఆరోపణలను నిరూపించాలని ప్రధానికి రామయ్య సవాల్ విసిరారు. పరివర్తన యాత్ర ముగింపు సభలో ర్యాలీలో ప్రధాని మోదీ.. సిద్ధరామయ్య ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం మీడియా సమావేశం నిర్వహించిన సిద్ధరామయ్య ప్రధానిపై మండిపడ్డారు. మోదీ బాధ్యతారాహిత్యమైన ప్రకటనలు చేశారని రామయ్య పేర్కొన్నారు.
అవినీతి ప్రస్తావన ఎక్కడిది?
‘‘మేం అధికారంలోకి వచ్చినప్పుడు రాష్ట్రం పెట్టుబడుల విషయంలో కర్ణాటక దేశంలో 11వ స్థానంలో ఉంది. గత రెండేళ్లుగా ఆ జాబితాలో మేం మొదటి స్థానంలో కొనసాగుతున్నాం. ఇది మేం చెబుతున్నది కాదు. కేంద్ర ప్రభుత్వ గణాంకాలే చెబుతున్నాయి. అలాంటప్పుడు అవినీతి ఆరోపణల ప్రస్తావన ఎందుకు వస్తుంది? అని ఆయన ప్రశ్నించారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో లోకాయుక్తను నియమించకపోవటంతోనే అవినీతిపై మోదీ పోరాటం ఏపాటిదో స్పష్టమైపోతోందని ఆయన ఎద్దేవా చేశారు. ఇక యాడ్యూరప్ప లాంటి వారిని పక్కన పెట్టుకుని మాపై ప్రధాని అవినీతి ఆరోపణలు చేయటం హాస్యాస్పదమని చెప్పారు.
హత్యా రాజకీయాల కామెంట్లపై...
‘మా ప్రభుత్వంపై ఆరోపణలు చేసే ముందు వారి గురించి కూడా కాస్త ఆలోచించుకోండి. గోద్రా ఘటనలో ఎంత మంది ప్రాణాలు కోల్పోయారు? సుమారు 2000 మందికి పైగా కదా! ఇప్పుడు హర్యానాలో శాంతి భద్రతల పరిస్థితి ఎలా ఉంది? బీజేపీ అధికారంలో ఉంటే మైనార్టీలకు రక్షణే ఉండదు. అలాంటి వాళ్లు మాపై విమర్శలు చేస్తున్నారు’ అని సిద్ధరామయ్య తెలిపారు.
మా డబ్బు మాకివ్వటానికేం...
కేంద్ర రాష్ట్రాల నిధుల విషయంలో పక్షపాతం లేకుండా పారదర్శకత్వ పాటిస్తున్నామని.. కర్ణాటక ప్రభుత్వానికి కూడా వేల కోట్లు ఇచ్చామని మోదీ పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ అంశంపై కూడా సిద్ధరామయ్య స్పందించారు. ‘‘అసలు మీకు ఆ ఆదాయం ఎక్కడి నుంచి వస్తోంది. రాష్ట్రాల నుంచి పన్నుల రూపంలో డబ్బులు సేకరించి వసూలు చేస్తున్నదే కదా. తిరిగి వాటిని రాష్ట్రాలకు పంచుతున్నారు. అంటే మా డబ్బును మాకే ఇస్తున్నారు. అందులో గొప్పేముంది. బీజేపీ ఇక్కడ అధికారంలో ఉన్న సమయంలో 73వేల కోట్ల రూపాయల ఆదాయాన్ని పన్నుల రూపంలో కేంద్రానికి జమ చేసింది. ఇప్పుడు మా(కాంగ్రెస్) ప్రభుత్వం 2 లక్షల కోట్ల రూ. ఆదాయానిస్తోంది. మరి ఆ సొమ్మును మీరు ఎవరికి పంచుతున్నారు’’ అని ఆయన రామయ్య ప్రధానిని సూటిగా ప్రశ్నించారు.
షా, యెడ్డీపై కూడా...
ఇక బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాపై కూడా రామయ్య విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. ఓ హత్య కేసులో షా పేరు కూడా ఉంది. నోరు తెరిస్తే ఆయన పచ్చి అబద్ధాలే మాట్లాడతారు. ఆయన మా ప్రభుత్వాన్ని కూలదోస్తాడంట అంటూ పేర్కొన్నారు. మరోవైపు బీజేపీ కర్ణాటక అధ్యక్షుడు, ముఖ్యమంత్రి అభ్యర్థి బీఎస్ యెడ్యూరప్పపై కూడా సెటైర్లు వేశారు. జైలుకు వెళ్లొచ్చిన వ్యక్తి ముఖ్యమంత్రి అభ్యర్థి, పైగా ఆయన ఇప్పుడు అవినీతి పోరాటం చేస్తారంట! అంటూ ఛలోక్తులు పేల్చారు. చివర్లో మోదీపై కాంగ్రెస్ నేత దివ్య స్పందన చేసిన ట్వీట్‌పై సిద్ధరామయ్య స్పందిస్తూ.. వ్యక్తిగత విమర్శల వ్యవహారంలో తాను జోక్యం చేసుకోబోనని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment