
మైసూరు: తానంటే ప్రధాని నరేంద్రమోదీతోపాటు రాష్ట్ర బీజేపీ నాయకులు, జేడీఎస్ నాయకులు భయపడతారని, అందుకే తమపై అవాస్తవాలు, ఆరోపణలు చేస్తారని సీఎం సిద్ధరామయ్య వ్యాఖ్యానించారు. నగరంలోని రామకృష్ణనగర్‌లోనున్న తమ ఇంట్లో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇటీవల గుజరాత్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బెంగళూరుకు తరలించి భోగభాగ్యాలు కల్పించారంటూ ప్రధాని మోదీ చేసిన ఆరోపణలపై స్పందించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనను చూసి అసహనంతోనే ప్రధాని మోదీ ఇటువంటి ఆరోపణలు చేశారన్నారు. వచ్చే ఏడాది ఎన్నికల్లో చాముండేశ్వరి నియోజకవర్గంలో తనను ఓడించడానికి బీజేపీ–జేడీఎస్‌లు శతవిధాలుగా ప్రయత్నిస్తున్నాయని, అయితే అది ఎప్పటికీ సాధ్యం కాదన్నారు. ఎఫ్‌ఐఆర్ నమోదైనందుకే మంత్రి జార్జ్‌ను రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్న బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు యడ్యూరప్ప తనపై పదుల సంఖ్యలో ఎఫ్‌ఐఆర్‌లు నమోదైన విషయాన్ని గుర్తు చేసుకోవాలన్నారు.
ఇటీవల బీజేపీకి రాజీనామా చేసిన విజయశంకర్ కాంగ్రెస్ పార్టీలోకి వస్తానంటే తప్పకుండా స్వాగతం పలుకుతామన్నారు. కాంగ్రెస్ నుంచి 20 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారడానికి సిద్ధంగా ఉన్నారంటూ ఎమ్మెల్యే సీపీ యోగేశ్వర్ చేసిన వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు. సమాజ్‌వాదీ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న యోగేశ్వర్ కాంగ్రెస్‌లో చేరతానంటూ కొన్ని రోజుల క్రితం తమ వద్దకు వచ్చారన్నారు. అయితే అందుకు తాము నిరాకరించడంతో యోగేశ్వర్ ఇటువంటి అసత్యాలను ప్రచారం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం రాత్రి మండ్య జిల్లా మద్దూరులో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తుల కుటుంబాలకు రూ.లక్ష పరిహారం అందించనున్నట్లు ప్రకటించారు. క్షతగాత్రులకు చికిత్సకయ్యే వ్యయాన్ని ప్రభుత్వమే భరిస్తుందన్నారు. అనంతరం జనతాదర్శన్‌లో ప్రజల నుంచి వినతిపత్రాలు స్వీకరించారు.