Lal Batti
-
ఎర్రబుగ్గ నేనెందుకు తొలగిస్తా?: సీఎం
దేశంలో వీఐపీ సంస్కృతికి చరమగీతం పాడుతూ ప్రముఖుల వాహనాలపై ఎర్రబుగ్గలను తొలగించాలని ప్రధాని నరేంద్రమోదీ ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఆదేశానికి మద్దతు పలుకుతూ చాలామంది ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులు మీడియా ముందు హడావిడిగా తమ వాహనాలపై ఎర్రబుగ్గలను తొలగించారు. కానీ, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య మాత్రం ఎర్రబుగ్గను తొలగించలేదు. ఇదే విషయాన్ని మీడియా అడిగితే.. ‘నేనెందుకు తొలగించాలి? మే 1 నుంచి కదా ఈ ఆదేశాలు అమలు అయ్యేది’ అంటూ ఆయన ఎదురు ప్రశ్నించారు. ఆయన లెక్క ప్రకారం మే 1కి ముందు ఒక్క క్షణం కూడా ఎర్రబుగ్గను తొలగించకూడదు. కానీ, తన తీరుపై విమర్శలు వస్తాయని అనుకున్నారేమో ఆయన వెనుకకు తగ్గారు. ఆయన వాహనంపై ఎర్రబుగ్గ మాయమైంది. దీనిపై కర్ణాటక సీఎంవో వివరణ ఇస్తూ.. వాహనాలపై ఎర్రబుగ్గులు తొలగించాలన్న కేంద్రం నిర్ణయాన్ని రాష్ట్రానికి తెలియజేయలేదని, అయినా, ప్రధాని మోదీ అభీష్టం మేరకు సీఎం సిద్దరామయ్య తన వాహనం నుంచి దానిని తొలగించారని తెలిపింది. మొత్తానికి దేశంలో ‘వీఐపీ సంస్కృతి’కి నిలుటద్దంలా నిలిచిన వాహనాలపై ఎర్రబుగ్గను తొలగించడంలో నేతలు మహా ఉత్సాహం చూపుతున్నారు. కాంగ్రెస్‌కే చెందిన పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ సైతం తన వాహనంపై ‘లాల్ బత్తీ’ని తొలగించారు. ఈ విషయంలో విమర్శలకు జడిసి సిద్దరామయ్య కూడా తొలగించి ఉంటారని తెలుస్తోంది. -
'ఎర్రబుగ్గ' తీసేశా: స్మృతి ఇరానీ
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు తమ వాహనాలపై ఎర్రబుగ్గలను తొలగిస్తున్నారు. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ తన వాహనంపై ఎర్రబుగ్గను తీసివేశారు. తన కారుపై ఎర్రబుగ్గను తొలగించినట్టు కేంద్ర మంత్రి స్మతి ఇరానీ తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్టు తెలిపారు. ప్రతి భారతీయుడూ ప్రత్యేకమేనన్న తమ నమ్మకాన్ని పునరుద్ఘాటించామని పేర్కొన్నారు. వీవీఐపీ సంస్కృతిని పక్కనపెడుతూ.. రాష్ట్రపతి, ప్రధాన మంత్రి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు సహా ఇతరుల వాహనాలపై ఎర్రబుగ్గలను తొలగించాలని కేంద్ర ప్రభుత్వం బుధవారం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో తన వాహనంపై ఎర్రబుగ్గను తక్షణమే తొలగిస్తున్నట్లు మహారాష్ట్ర సీఎం ఫడ్నవిస్ స్పష్టం చేశారు. గుజరాత్‌లోనూ వీఐపీ సంస్కృతికి చరమగీతం పాడినట్లు ఆ రాష్ట్ర సీఎం విజయ్ రూపానీ తెలిపారు. త్వరలోనే గుజరాత్ అంతటా దీన్ని అమలుచేస్తామన్నారు. గోవా సీఎం మనోహర్ పరీకర్, రాజస్తాన్ సీఎం వసుంధర రాజే, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ కూడా తక్షణమే ఎర్రబుగ్గను తొలగించాలని ఆదేశాలు జారీచేశారు.