'ఎర్రబుగ్గ' తీసేశా: స్మృతి ఇరానీ
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి అనుగుణంగా పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు తమ వాహనాలపై ఎర్రబుగ్గలను తొలగిస్తున్నారు. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ తన వాహనంపై ఎర్రబుగ్గను తీసివేశారు. తన కారుపై ఎర్రబుగ్గను తొలగించినట్టు కేంద్ర మంత్రి స్మతి ఇరానీ తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్టు తెలిపారు. ప్రతి భారతీయుడూ ప్రత్యేకమేనన్న తమ నమ్మకాన్ని పునరుద్ఘాటించామని పేర్కొన్నారు.
వీవీఐపీ సంస్కృతిని పక్కనపెడుతూ.. రాష్ట్రపతి, ప్రధాన మంత్రి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు సహా ఇతరుల వాహనాలపై ఎర్రబుగ్గలను తొలగించాలని కేంద్ర ప్రభుత్వం బుధవారం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో తన వాహనంపై ఎర్రబుగ్గను తక్షణమే తొలగిస్తున్నట్లు మహారాష్ట్ర సీఎం ఫడ్నవిస్ స్పష్టం చేశారు. గుజరాత్‌లోనూ వీఐపీ సంస్కృతికి చరమగీతం పాడినట్లు ఆ రాష్ట్ర సీఎం విజయ్ రూపానీ తెలిపారు. త్వరలోనే గుజరాత్ అంతటా దీన్ని అమలుచేస్తామన్నారు. గోవా సీఎం మనోహర్ పరీకర్, రాజస్తాన్ సీఎం వసుంధర రాజే, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ కూడా తక్షణమే ఎర్రబుగ్గను తొలగించాలని ఆదేశాలు జారీచేశారు.