వైరల్ వీడియో: హిజాబ్ విషయంలో ఇస్లాం దేశాలు ఎంత కఠినంగా వ్యవహరిస్తుంటాయో తరచూ మనం చూస్తున్నాం. చాలావరకు దేశాలు కఠిన చట్టాలు..శిక్షలు సైతం అమలు చేస్తున్నాయి కూడా. అయితే.. ఇరాన్‌లో మోరల్ పోలీసింగ్ పేరిట అక్కడి ప్రభుత్వమే దగ్గరుండి మరీ జరిపించే దారుణాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.
అందుకే అక్కడ మహిళల పోరాటాలు తరచూ చర్చనీయాంశంగా మారుతుంటాయి. తాజాగా.. ఇంటర్నెట్‌లో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. హిజాబ్ ధరించమని ఓ మతపెద్ద ఒకావిడను ఒత్తిడి చేశాడు. అంతే.. చిర్రెత్తుకొచ్చిన ఆమె ఆయన వెంటపడింది. ఆయన తలపై ఉన్న పాగాను లాగిపడేసి.. దానినే తలపై కప్పేసుకుంది.
‘‘ఇప్పుడు మీ గౌరవం ఏమైంది?. నా భర్తను మీరేం చేశారు?’’ అంటూ గట్టిగా అరుస్తూ కనిపించింది. కచ్చితంగా ఎప్పుడు జరిగిందో తెలియదుగానీ రాజధాని టెహ్రాన్‌లోని మెహ్రాబాద్(Mehrabad) ఎయిర్‌పోర్టులో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది.
మసిహ్ అలినెజద్ అనే మహిళా జర్నలిస్ట్ ఈ వీడియోను పోస్ట్ చేసింది. ‘‘ఆ తలపాగాలు పవిత్రమైనవి, అవే తమ గౌరవమని, ఇతరులెవరూ వాటిని ముట్టుకోకూడదని ఆ మత పెద్దలు చెబుతుంటారు. కానీ, తన నిరసనతో ఈమె వాళ్లకు సరైన పాఠం చెప్పింది. లింగవివక్ష పోరాటంలో అలసిపోయిన ఇరాన్ మహిళలు.. ఇప్పుడు ఆగ్రహంతో ఎంతకైనా తెగించడానికి సిద్ధంగా ఉన్నారన్నడానికి ఇదే ఉదాహరణ’’ అని పోస్ట్ చేశారామె.
A brave woman at Tehran’s Mehrabad Airport confronted a cleric harassing her for not wearing a hijab. In a bold act of defiance, she removed his turban and wore it like a scarf, turning oppression into resistance.
For years, clerics have claimed their turbans and robes are… pic.twitter.com/Mdj1c0b3Vo— Masih Alinejad 🏳️ (@AlinejadMasih) January 6, 2025
ఇదిలా ఉంటే.. ఈ ఘటనపై అధికార ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్‌స్(IRGC)కి చెందిన మీడియా సంస్థ ‘మష్‌రెగ్’మాత్రం ఘటనపై మరోలా కథనం ఇచ్చింది. ఆ మహిళ మతిస్థిమితం లేనిదని, ఆమెను అదుపులోకి తీసుకుని వదిలేసిట్లు ఓ వార్త ప్రచురించింది. అయితే..
నెటిజన్లు మాత్రం ఆ మహిళకు మద్దతుగా నిలిచారు. తమ హక్కుల కోసం అనేకమంది మహిళలకు ఆమె ప్రతినిధిగా కనిపించారని వ్యాఖ్యానిస్తున్నారు. ఇదిలా ఉంటే.. గతేడాది నవంబర్‌లో టెహ్రాన్ ఆజాద్ యూనివర్సిటీలో హిజాబ్ నిరసనల్లో భాగంగా ఓ యువతి ఏకంగా దుస్తులు విప్పేసి ప్రభుత్వంపై నిరసన తెలిపింది. అయితే ఇరాన్ ప్రభుత్వం మహిళల వరుస నిరసనలను వాళ్ల ఆవేశంలో తెలివితక్కువతనంతో చేస్తున్న పనులుగా పేర్కొంటూ అణచివేస్తోంది.
1979లో ఇస్లామిక్ విప్లవం నుంచి ఇరాన్‌లో బహిరంగ ప్రదేశాల్లో మహిళలు హిజాబ్‌ను ధరించడాన్ని తప్పనిసరిగా అమలుచేస్తున్నారు. ఇది సరిగ్గా అమలయ్యేలా 2005 నుంచి నైతిక పోలీసు విభాగం పర్యవేక్షిస్తోంది. అయితే. 2022లో హిజాబ్ సరిగా ధరించలేదని మాసా అమీని అనే యువతిపై నైతిక పోలీసులు దాడి చేయగా.. ఆమె ప్రాణాలు కోల్పోయింది. ఈ నేపథ్యంలో రెండు నెలలకుపైగా హిజాబ్ వ్యతిరేక ఆందోళనలతో ఇరాన్ అట్టుడుకింది. చివరికి మోరల్ పోలీసింగ్‌ను ఇరాన్ రద్దు చేయాల్సి వచ్చింది. అయితే కిందటి ఏడాదిలో ఆ వ్యవస్థ మళ్లీ అమల్లోకి వచ్చింది. దీంతో మహిళల నిరసనలు మళ్లీ యధావిధిగా కొనసాగుతున్నాయి. అయితే.. ఈ నిరసనలపై ఇరాన్ సుప్రీం అలీ ఖమేనీ ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు. తన పాలనకు వ్యతిరేకంగా మహిళలు చేస్తున్న నిరసనలు తమ శత్రువులు చేయిస్తున్నారని ఖమేనీ ఆరోపణలు చేశారు. ఈ క్రమంలో.. ‘స్త్రీ ఒక సున్నితమైన పుష్పం.. ఇంట్లో పనిమనిషి కాదు. స్త్రీని పువ్వులా చూసుకుంటూ.. దాని తాజాదనం, సువాసన, దానినుంచి కలిగే ప్రయోజనాలను పొందాలి’ అని ఓ కవిత్వం సైతం రాసుకొచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment