వేధించిన ముల్లాను ‘హిజాబ్’తో బుద్ధిచెప్పిన ధైర్యశాలి ఇరాన్ మహిళ
టెహ్రాన్ ఎయిర్‌పోర్ట్‌లో ఘటన
టెహ్రాన్: హిజాబ్ ధరించలేదంటూ సూటిపోటి మాటలతో వేధిస్తున్న మతాధికారిని తనదైన శైలితో బుద్ధిచెప్పిన వీర వనిత ఘటన ఇది. మతాచారాలను కఠినంగా అమలుచేసే ఇరాన్‌లో ఇటీవల జరిగిందీ ఘటన. హిజాబ్ ధరించవా ? అంటూ వేధిస్తున్న ఒక ముల్లాను అతని సంప్రదాయ తలపాగాను తొలగించి దానినే హిజాబ్‌గా ధరించి అక్కడి వారంతా అవాక్కయ్యేలా చేసింది.
నవీద్ మొహెబ్బీ అనే ఇరాన్ మహిళా యూజర్ ఒకరు పెట్టిన వీడియో ప్రకారం టెహ్రాన్‌లోని మహ్రాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఒక వివాహిత విమానం కోసం ఎదురుచూస్తుండగా అటుగా వచ్చిన ఒక ముస్లిం మతాధికారి ఆమె దగ్గరికి వచ్చి ‘హిజాబ్ ధరించవా?’అని మొదలెట్టి పలు రకాలుగా వేధించసాగాడు. కొద్దిసేపు ఓపిక పట్టిన ఆ మహిళ తర్వాత వీరావేశంతో ఆ ముల్లాకు తనదైన శైలిలో సమాధానం చెప్పింది.
అతని తలపై ఉన్న తలపాగాను విసురుగా లాక్కొని దానిని వస్త్రంగా విడదీసి హిజాబ్‌గా ధరించింది. ‘‘ఇంతసేపు హిజాబ్ ఉంటేనే మహిళకు గౌరవం అని మాట్లాడావుకదా?. ఇప్పుడు నేను హిజాబ్ ధరించాను. నాకు తగిన గౌరవం ఇవ్వు ఇప్పుడు’’అని గద్దాయించింది.
దీంతో ఏం చేయాలో తెలీక అతను దిక్కులు చూశాడు. తర్వాత ఆమె అక్కడి నుంచి వెళ్లిపోతూ ‘‘మా ఆయన ఇక్కడే ఉండాలికదా!. నేను హిజాబ్ ధరించలేదని నా భర్తను ఏమైనా చేశారా ఏంటి?’’అంటూ తన భర్తను వెతికేందుకు వెళ్లింది. మహిళ చర్యను ఆన్‌లైన్‌లో ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది నెటిజన్లు మెచ్చుకున్నారు. ఛాందసవాద ప్రవర్తనకు వీరవనిత తగిన బుద్ధి చెప్పిందని కొనియాడారు. అయితే ఈ ఘటన వార్త తెలిసి అక్కడే ఉన్న ఇరాన్ నైతిక పోలీసు విభాగం ఆమెను అరెస్ట్‌చేసిందని, తర్వాత ఆమెను విడుదలచేసిందని తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment