సాక్షి, ఢిల్లీ: దేశంలో జమిలి(One Nation One Election) ఎన్నికలపై నేడు జేపీసీ(Joint Parliamentary Committee) తొలి సమావేశం జరగనుంది. ఈ సందర్భంగా జమిలి ఎన్నికల బిల్లుపై జేపీసీ సభ్యులు చర్చించనున్నారు. ఇక, వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి(Vijaya Sai Reddy).. జేపీసీగా సభ్యుడిగా ఉన్నారు.
కేంద్రంలోని బీజేపీ సర్కార్ జమిలి ఎన్నికల బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టింది. పార్లమెంట్ శీతాకాల సమావేశాల సందర్భంగా 129వ రాజ్యాంగ సవరణ బిల్లు, కేంద్రపాలిత ప్రాంతాల చట్టాల (సవరణ) బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ తీర్మానికి లోక్ సభ ఆమోదం తెలిపింది. జమిలి బిల్లును ప్రతిపక్ష పార్టీలు వ్యతిరేకించడంతో బిల్లును ప్రభుత్వం జేపీసీకి పంపించింది. వివిధ రాజకీయ పార్టీలు, సంఘాలతో చర్చలు జరిపి జేపీసీ సూచనలు చేయనుంది.
ఈ నేపథ్యంలో జమిలి ఎన్నికలపై నేడు జేపీసీ తొలి సమావేశం జరగనుంది. జమిలి ఎన్నికల బిల్లుపై జేపీసీ సభ్యులు చర్చించనున్నారు. ఈ భేటీలో ప్రతిపాదిత చట్టాల నిబంధనలను జేపీసీ సభ్యులకు న్యాయ మంత్రిత్వ శాఖ వివరించనున్నట్టు సన్నిహిత వర్గాలు తెలిపాయి. అంతేగాక పలువురి అభిప్రాయాలను కూడా తీసుకోనున్నట్టు సమాచారం. జేపీసీ తన నివేదికను వచ్చే పార్లమెంట్ సెషన్లో మొదటి వారం చివరి రోజున లోక్సభలో సమర్పించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే దీనిపై చర్చ చేపట్టేందుకు చర్యలు వేగవంతం చేసినట్టు తెలుస్తోంది.
ఇదిలా ఉండగా.. 39 మంది సభ్యులతో కూడిన కమిటీకి బీజేపీ ఎంపీ పీపీ చౌదరి నేతృత్వం వహిస్తున్నారు. కాగా, జేపీసీలో వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డితో సహా కాంగ్రెస్కు నుంచి ప్రియాంక గాంధీ, జేడీయూకి చెందిన సంజయ్ ఝా, శివసేనకు చెందిన శ్రీకాంత్ షిండే, ఆప్ ఎంపీ సంజయ్ సింగ్తో పాటు తదితరులు సభ్యులుగా ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment