రాహుల్‌ రాజకీయం మారింది.. స్మృతి ప్రశంస | BJP Smriti Irani Praises On Rahul Gandhi Politics | Sakshi
Sakshi News home page

రాహుల్‌పై స్మృతి పొగడ్త... బీజేపీ నేతలు షాక్‌!

Published Thu, Aug 29 2024 12:14 PM | Last Updated on Thu, Aug 29 2024 3:06 PM

BJP Smriti Irani Praises On Rahul Gandhi Politics

లోక్‌సభలో ప్రతిపక్ష నేత హోదాలో రాహుల్‌ గాంధీ అదరగొడుతున్నారు. పార్లమెంట్‌లో ఇప్పటికే పలు అంశాలపై ఎన్డీయే కూటమి సర్కార్‌కు రాహుల్‌ చుక్కలు చూపించారు. ప్రస్తుతం రాజకీయంగా ప్రతీ విషయంలోనూ యాక్టివ్‌గా ఉంటూ ప్రజల్లోకి దూసుకెళ్తున్నారు. దీంతో, రాజకీయ విమర్శకులు, ప్రత్యర్థుల నుంచి కూడా రాహుల్‌ ఎన్నో ప్రశంసలు అందుకుంటున్నారు. ఇక, ఆ జాబితాలోకి మాజీ కేంద్రమంత్రి స్మృతీ ఇరానీ కూడా చేరిపోయారు.

తాజాగా రాహుల్‌ గాంధీపై స్మృతి ఇరానీ ప్రశంసలు కురిపించారు. ఓ ఇంటర్వ్యూలో రాహుల్‌ గురించి స్మృతి ఇరానీ ప్రస్తావిస్తూ..‘రాజకీయంగా రాహుల్‌ గాంధీ ప్రవర్తనలో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. తన గెలుపును రాహుల్‌ ఎంజాయ్‌ చేస్తున్నాడు. ఆయన ఎక్కడికి వెళ్లినా ఎంతో పరిపక్వతతో మాట్లాడుతున్నాడు. రాజకీయాల్లో అలా మాట్లాడటం ఎంతో కీలకం. పార్లమెంట్‌లోకి తెల్ల టీషర్ట్ వేసుకుని హాజరు కావడం ద్వారా యువతకు ఓ సందేశం ఇచ్చేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారు. ఇదంతా మనకు నచ్చినా నచ్చకపోయినా భిన్నమైన రాజకీయం చేస్తున్నట్లు మాత్రం అనిపిస్తోంది అంటూ పాజిటివ్‌ కామెంట్స్‌ చేశారు. ఇక, ఆమె వ్యాఖ్యలకు బీజేపీ నేతలు షాక్‌లోకి వెళ్లిపోయారు.

 

రాహుల్‌ వ్యాఖ్యలే కారణమా?
పార్లమెంట్‌ ఎన్నికల్లో అమేథీ నుంచి పోటీ చేసి స్మృతి ఇరానీ ఓటమిని చవిచూశారు. రాహుల్‌ గాంధీ ఆఫీసులో పనిచేస్తున్న కిషోరీ లాల్ శర్మ చేతిలో ఆమె ఓటమి పాలయ్యారు. అనంతరం, కాంగ్రెస్‌ కార్యకర్తలు సోషల్‌ మీడియా వేదికగా స్మృతి ఇరానీని టార్గెట్‌ చేశారు. ఈ సమయంలో రాహుల్‌ గాంధీ.. స్మృతి ఇరానీకి మద్దతుగా నిలిచారు. జీవితంలో గెలుపోటములు సహజం. ఈ విషయంలో స్మృతీ ఇరానీతోపాటు ఇతర నేతలను కించపరిచే విధంగా మాట్లాడొద్దు. దురుసుగా ప్రవర్తించడం మానుకోవాలి. ఇతరులను కించపరచడం, అవమానించడం బలహీనతకు సంకేతం అంటూ రాహుల్‌ చెప్పుకొచ్చారు. అందుకే రాహుల్‌ విషయంలో ప్రస్తుతం స్మృతి ఇరానీ ఇలా మాట్లాడారని పలువురు కామెంట్స్‌ చేస్తున్నారు.

 

 

నాడు విమర్శలు..
అయితే, రాహుల్‌ గాంధీకి రాజకీయ ప్రత్యర్థి అయిన స్మృతి ఇరానీ అంతకుముందు ఆయనపై తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే. అమేథీలో పోటీ చేసేందుకు రాహుల్‌ భయపడుతున్నారని పలు సందర్భాల్లో సెటైర్లు వేశారు. తనను చూసి రాహుల్‌ వయనాడ్‌ పారిపోయారని కూడా ఎద్దేవా చేశారు. ఇక, పార్లమెంట్‌ సమావేశాల సందర్భంగా కూడా సభలో రాహుల్‌పై స్మృతి ఇరానీ విరుచుకుపడ్డారు. రాహుల్‌ అసలు భారతీయుడే కాదంటూ మండిపడ్డారు. అంతేకాకుండా.. ఎన్నికల సమయంలో ప్రధాని మోదీతో డిబేట్‌ చేసే స్థాయి రాహల్‌ గాంధీకి ఉందా?. రాహల్‌ గాంధీ ఏమైనా విపక్ష కూటమికి ప్రధాని అభ్యర్థినా? అంటూ కూడా కామెంట్స్‌ చేశారు.

 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement