ఢిల్లీ: యూపీఏ హయాంలో బ్యాంకులను ఏటీఎంలా వాడుకున్నారని ఆరోపించారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. కాంగ్రెస్ ప్రభుత్వ హయంలో తాము చెప్పిన వారికే రుణాలు ఇవ్వాలని బ్యాంకు సిబ్బందికి ఫోన్లు చేసి వేధించే వారు అంటూ సంచలన కామెంట్స్ చేశారు.
లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ.. కేంద్రంపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రభుత్వ రంగ బ్యాంకులను కేంద్ర ప్రభుత్వం తమ మోసపూరిత మిత్రులకు అపరిమిత వనరుగా ఉపయోగిస్తోందని రాహుల్ ఆరోపించారు. ఈ క్రమంలో రాహుల్ వ్యాఖ్యలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కౌంటరిచ్చారు.
ఈ క్రమంలో కేంద్ర మంత్రి నిర్మల మాట్లాడుతూ..‘రాహుల్ గాంధీ వాస్తవాలు మాట్లాడాలి. బ్యాంకుల్లో కష్టపడి పనిచేసే ఉద్యోగులపై అసత్య ప్రచారం చేయడం మానుకోవాలి. ముందుగా ఆయన బ్యాంకింగ్ సెక్టార్‌పై అవగాహన పెంచుకోవాలి. యూపీఏ హయాంలోనే బ్యాంకులను ఏటీఎంలా వాడుకున్నారు. ప్రభుత్వ రంగ బ్యాంకులను యూపీఏ హయాంలో తమ బంధుమిత్రులు, చీకటి వ్యాపారుల కోసం ఏటీఎంలా ఉపయోగించుకున్నారు. అలాగే, కాంగ్రెస్ నేతలు చెప్పిన వారికే రుణాలు ఇవ్వాలని బ్యాంకుల సిబ్బందికి ఫోన్లు చేసి మరీ వేధించేవారు. రుణాల ఇవ్వని పక్షంలో వారిని టార్గెట్ చేసేవారు’ అంటూ కామెంట్స్ చేశారు.
ఇదే సమయంలో.. ప్రధాని నరేంద్ర మోదీ హయాంలో బ్యాంకులు, ప్రత్యేకంగా ప్రభుత్వ రంగ బ్యాంకులు గణనీయమైన పురోగతి సాధించాయన్నారు. పలు సంస్కరణలు అమలు చేస్తున్నట్టు తెలిపారు. రూ.3.26 లక్షల కోట్ల రీక్యాపిటలైజేషన్‌తో ప్రభుత్వరంగ బ్యాంకులను బలోపేతం చేసినట్టు చెప్పుకొచ్చారు. అలాగే, కేంద్రంలో బీజేపీ హాయంలోనే 54 కోట్ల జన్‌ధన్ యోజన ఖాతాలు, పీఎం ముద్ర రుణాలు, స్టాండ్-అప్ ఇండియా, పీఎంస్వానిధి వంటి స్కీమ్స్ తీసుకువచ్చినట్టు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment