మాజీ కాగ్‌పై రాజా సంచలన ఆరోపణలు
సాక్షి, న్యూఢిల్లీ : డీఎంకే నేత, కేంద్ర మాజీ మంత్రి ఏ రాజా సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ కాగ్ వినోద్ రాయ్ యూపీఏ ప్రభుత్వాన్ని నాశనం చేసేందుకు యత్నించాడంటూ రాజా ఆరోపించారు. శనివారం ‘2జీ సెగ అన్ఫోల్డ్స్’ అనే పుసక్త ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న రాజా ఈ విమర్శలు చేశారు.
‘‘కొన్ని దుష్టశక్తులు యూపీఏ(2) ప్రభుత్వాన్ని నాశనం చేసేందుకు యత్నించాయి. అందుకోసం వినోద్ రాయ్‌ను కాంట్రాక్ట్ కిల్లర్‌లా నియమించుకున్నాయి. ఆయనను ఓ ఆయుధంగా వాడుకుని కక్ష్య సాధింపు చర్యలకు దిగాయి. ఉన్నత పదవిని అడ్డుపెట్టుకుని వినోద్ రాయ్ కూడా అధికార దుర్వినియోగానికి పాల్పడ్డాడు. దేశాన్ని, ప్రజలను దారుణంగా మోసం చేశాడు’’ అంటూ రాజా వ్యాఖ్యలు చేశారు. అదే సమయంలో కొన్ని మీడియా సంస్థలపై రాజా ఆగ్రహం వ్యక్తం చేశారు. కొన్ని ఛానెళ్లు అదే పనిగా తనపై అసత్య ప్రచారాలను చేశాయని.. కానీ, సీబీఐ ముందు తానిచ్చిన వాంగ్మూలం గురించి మాత్రం అవి మాట వరుసకు కథనాలు ప్రసారాలు చెయ్యలేదని రాజా ఆక్షేపించారు.
2010లో వినోద్ రాయ్ కాగ్‌గా ఉన్న సమయంలోనే లక్షా 76వేల కోట్ల రూపాయల 2జీ స్కామ్‌ను వెలుగులోకి వచ్చింది. రాజా టెలికామ్ మంత్రిగా(2008) ఉన్న సమయంలో ఈ అవినీతి చోటు చేసుకుందని కాగ్ నివేదిక వెలువరించగా.. కేసు నమోదు అయ్యింది. ఈ కేసులో చీటింగ్, పోర్జరీ, కుట్ర తదిర అభియోగాల కింద రాజాను 2011లో అరెస్టు చేశారు. ఏడాది జైలు తర్వాత బెయిలుపై ఆయన విడుదలయ్యారు.
అయితే, సరైన సాక్ష్యాలు సీబీఐ సమర్పించకపోవటంతో 2జీ కుంభకోణంలో రాజా, కనిమొళి(కరుణానిధి కూతురు)తో సహా 17 మందిని నిర్దోషులుగా పేర్కొంటూ గత నెలలో సీబీఐ ప్రత్యేక కోర్టు తీర్పు వెలువరించిన విషయం విదితమే.