Banking sector
-
మార్కెట్ ఆధారిత సంస్కరణలు అవసరం
భారత బ్యాంకింగ్ రంగంలో మార్కెట్ ఆధారిత సంస్కరణలు అవసరమని ప్రముఖ ఆర్థికవేత్త, ఎన్‌వైయూ స్టెర్న్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న విరాల్.వి.ఆచార్య అన్నారు. భారత బ్యాంకింగ్ విధానాలను రూపొందించడంలో ఆర్థిక అవసరాలు, రాజకీయ అంశాలపై పరస్పర చర్చ జరగాలని చెప్పారు. ఐఐఎం బెంగళూరులో జరిగిన ఐఎంఆర్ డాక్టోరల్ కాన్ఫరెన్స్ 2025లో ఆయన్ పాల్గొని మాట్లాడారు.‘దేశంలో బ్యాంకింగ్ వ్యవస్థ కేవలం ఆర్థిక కారకాల ద్వారా మాత్రమే కాకుండా రాజకీయ వ్యవస్థ ద్వారా కూడా ప్రభావితమవుతోంది. కొన్నేళ్ల కొందట జరిగిన బ్యాంకుల జాతీయకరణ కేవలం ఆర్థిక సమ్మిళితం కోసమే కాకుండా రాజకీయ లక్ష్యాలను కూడా నెరవేర్చింది. జనాకర్షక వ్యయాలను సాధించడానికి ఇప్పటికీ బ్యాంకింగ్ వ్యవస్థను వాడుకుంటున్నారు. ఈ విధానం వల్ల మార్కెట్ ఆధారిత సంస్కరణలు లేకుండా పోయాయి. ఇప్పటికైనా వ్యవస్థలు తేరుకుని సంస్కరణల దిశగా అడుగులు వేయాలి. డిజిటల్ ఫైనాన్స్ పెరుగుదల, బ్యాంకింగేతర రుణదాతల నుంచి నెలకొన్న పోటీ బ్యాంకింగ్ రంగాన్ని ప్రభావితం చేస్తోంది. డిజిటల్ ఫైనాన్స్‌లో ఇండియా చెప్పుకోదగిన పురోగతి సాధించినప్పటికీ, ముఖ్యంగా కోవిడ్ అనంతరం కార్పొరేట్ సంస్థల లాభాలపై ఆందోళనలు పెరుగుతున్నాయి. ఇది ఆర్థిక ప్రయోజనాలు తగ్గడానికి దారితీసింది’ అన్నారు.ఇదీ చదవండి: రెండు దశల్లో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలునిర్మాణాత్మక సంస్కరణలు..దీర్ఘకాలిక వృద్ధికి ప్రాధాన్యమిచ్చే నిర్మాణాత్మక సంస్కరణల ప్రాముఖ్యతను ప్రొఫెసర్ ఆచార్య నొక్కి చెప్పారు. మొత్తం ఆర్థిక వ్యవస్థలో ప్రస్తుత పరిస్థితులకు అవసరమైన సంస్కరణలు రావాలన్నారు. సంస్థలకు అనుకూలంగా ఉండే స్నేహపూర్వక సంస్కరణలకు బదులుగా మార్కెట్‌కు అనుకూలంగా ఉండే విధానాల రూపకల్పనపై దృష్టి పెట్టాలని సూచించారు. -
ఎస్బీఐ ఎండీగా రామ మోహన్ రావు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: బ్యాంకింగ్ రంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) ఎండీగా తెలుగువారైన రామ మోహన్ రావు అమరను నియమిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. మూడేళ్లు లేదా తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఆయన ఈ పదవిలో ఉంటారు. కేంద్ర ఆర్థిక శాఖ బుధవారం ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రస్తుతం ఎస్బీఐ డిప్యూటీ ఎండీగా ఆయన విధులు నిర్వర్తిస్తున్నారు. ఎస్బీఐ బోర్డులో ఒక చైర్మన్, నలుగురు ఎండీలు ఉంటారు. రామ మోహన్ రావు బాధ్యతలు స్వీకరిస్తే ఎండీల సంఖ్య నాలుగుకు చేరుకుంటుంది. సంస్థ చైర్మన్ సి.ఎస్.శెట్టి కూడా తెలుగు వారు కావడం విశేషం. ఎస్బీఐ చరిత్రలో ఒకేసారి రెండు కీలక పదవులను తెలుగువారు దక్కించుకోవడం ఇదే తొలిసారి. కాగా, ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఆర్థిక సంస్థలకు డైరెక్టర్ల పేర్లను సిఫార్సు చేసే ఫైనాన్షియల్ సరీ్వసెస్ ఇన్స్టిట్యూషన్స్ బ్యూరో (ఎఫ్ఎస్ఐబీ) ఈ ఏడాది సెప్టెంబర్‌లో రామ మోహన్ రావును ఎస్బీఐ ఎండీగా ప్రతిపాదించింది. ఎస్బీఐ ఎండీ పోస్టుకు ఎఫ్ఎస్ఐబీ తొమ్మిది మందిని ఇంటర్వ్యూ చేసింది. ఎఫ్ఎస్ఐబీ ప్రతిపాదనలపై ప్రధాన మంత్రి నేతృత్వంలోని కేబినెట్ అపాయింట్మెంట్స్ కమిటీ తుది నిర్ణయం తీసుకుంటుంది. ఎస్బీఐ కార్డ్ ఎండీ, సీఈవోగా కూడా రామ మోహన్ రావు పనిచేశారు. బ్యాంకింగ్ రంగంలో మూడు దశాబ్దాల అనుభవం ఆయన సొంతం. -
బ్యాంకులను ఏటీఎంలా వాడుకున్నారు.. రాహుల్‌పై నిర్మల ఫైర్
ఢిల్లీ: యూపీఏ హయాంలో బ్యాంకులను ఏటీఎంలా వాడుకున్నారని ఆరోపించారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. కాంగ్రెస్ ప్రభుత్వ హయంలో తాము చెప్పిన వారికే రుణాలు ఇవ్వాలని బ్యాంకు సిబ్బందికి ఫోన్లు చేసి వేధించే వారు అంటూ సంచలన కామెంట్స్ చేశారు.లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ.. కేంద్రంపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రభుత్వ రంగ బ్యాంకులను కేంద్ర ప్రభుత్వం తమ మోసపూరిత మిత్రులకు అపరిమిత వనరుగా ఉపయోగిస్తోందని రాహుల్ ఆరోపించారు. ఈ క్రమంలో రాహుల్ వ్యాఖ్యలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కౌంటరిచ్చారు.ఈ క్రమంలో కేంద్ర మంత్రి నిర్మల మాట్లాడుతూ..‘రాహుల్ గాంధీ వాస్తవాలు మాట్లాడాలి. బ్యాంకుల్లో కష్టపడి పనిచేసే ఉద్యోగులపై అసత్య ప్రచారం చేయడం మానుకోవాలి. ముందుగా ఆయన బ్యాంకింగ్ సెక్టార్‌పై అవగాహన పెంచుకోవాలి. యూపీఏ హయాంలోనే బ్యాంకులను ఏటీఎంలా వాడుకున్నారు. ప్రభుత్వ రంగ బ్యాంకులను యూపీఏ హయాంలో తమ బంధుమిత్రులు, చీకటి వ్యాపారుల కోసం ఏటీఎంలా ఉపయోగించుకున్నారు. అలాగే, కాంగ్రెస్ నేతలు చెప్పిన వారికే రుణాలు ఇవ్వాలని బ్యాంకుల సిబ్బందికి ఫోన్లు చేసి మరీ వేధించేవారు. రుణాల ఇవ్వని పక్షంలో వారిని టార్గెట్ చేసేవారు’ అంటూ కామెంట్స్ చేశారు.ఇదే సమయంలో.. ప్రధాని నరేంద్ర మోదీ హయాంలో బ్యాంకులు, ప్రత్యేకంగా ప్రభుత్వ రంగ బ్యాంకులు గణనీయమైన పురోగతి సాధించాయన్నారు. పలు సంస్కరణలు అమలు చేస్తున్నట్టు తెలిపారు. రూ.3.26 లక్షల కోట్ల రీక్యాపిటలైజేషన్‌తో ప్రభుత్వరంగ బ్యాంకులను బలోపేతం చేసినట్టు చెప్పుకొచ్చారు. అలాగే, కేంద్రంలో బీజేపీ హాయంలోనే 54 కోట్ల జన్‌ధన్ యోజన ఖాతాలు, పీఎం ముద్ర రుణాలు, స్టాండ్-అప్ ఇండియా, పీఎంస్వానిధి వంటి స్కీమ్స్ తీసుకువచ్చినట్టు తెలిపారు. -
సాఫ్ట్వేర్ సంస్థల ఎగుమతులు పెంపు
దేశీయ సాఫ్ట్వేర్ కంపెనీల ఎగుమతులు పెరుగుతున్నాయి. 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ.17.2 లక్షల కోట్ల విలువైన సాఫ్ట్వేర్ సేవలను ఇతర దేశాలకు ఎగుమతి చేశారు. దేశీయ కంపెనీలు విదేశాల్లోని వాటి అనుబంధ సంస్థలతో కలిసి ఈ ఘనత సాధించాయి. ఈమేరకు భారతీయ రిజర్వ్ బ్యాంకు వివరాలు వెల్లడించింది.ఆర్బీఐ తెలిపిన వివరాల ప్రకారం..2022-23 ఆర్థిక సంవత్సరంలో దేశీయ సాఫ్ట్వేర్ కంపెనీల సేవల ఎగుమతులు రూ.200.6 బిలియన్ డాలర్లు(రూ.16.8 లక్షల కోట్లు)గా ఉన్నాయి. 2023-24లో అది రూ.17.2 లక్షల కోట్లుకు పెరిగింది. దేశీయ కంపెనీలు విదేశాల్లోని తమ అనుబంధ సంస్థలతో కలిసి ఈ ఘనత సాధించాయి. రూ.17.2 లక్షల కోట్ల నుంచి విదేశీ అనుబంధ సంస్థల సేవలను మినహాయిస్తే కేవలం దేశీయ కంపెనీలే రూ.16 లక్షల కోట్ల విలువైన సేవలను ఎగుమతి చేశాయి. ఇది గతేడాదితో పోలిస్తే 2.8 శాతం ఎక్కువ. భారత కంపెనీలు అధికంగా అమెరికాకు ఈ సేవలను ఎగుమతి చేస్తున్నాయి. మొత్తం భారత కంపెనీల ఎగుమతుల్లో అమెరికా వాటా 53 శాతం కాగా, యూరప్ వాటా 31 శాతంగా ఉంది.ఇదీ చదవండి: రెండేళ్లలో రూ.5 లక్షల కోట్ల ఆదాయంఅంతర్జాతీయ అనిశ్చితులు, భౌగోళిక అస్థిరతలు పెరగడం వల్ల యుద్ధ భయాలు నెలకొంటున్నాయి. దాంతో బ్యాంకింగ్ రంగ సంస్థలతోపాటు ఇతర కంపెనీలు సాఫ్ట్వేర్ సేవలను అప్డేట్ చేయడంలో కొంత వెనుకంజ వేస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఇటీవల కాలంలో ప్రపంచవ్యాప్తంగా పెరిగిన ద్రవ్యోల్బణం రేటు కొంత స్థిరంగా కదలాడుతోంది. దాంతో సెంట్రల్ బ్యాంకులు కీలక వడ్డీరేట్లను తగ్గిస్తున్నాయి. ఫలితంగా లోన్లు పెరిగి బ్యాంకింగ్ రంగ సంస్థలు తమ సాఫ్ట్వేర్ కేటాయింపులకు నిధులు పెంచే అవకాశం ఉంటుంది. దాంతో రానున్న రోజుల్లో సాఫ్ట్వేర్ ఎగమతులు మరింత పెరుగుతాయని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. -
తెలుగు అధికారికి ఎస్బీఐ పగ్గాలు!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: బ్యాంకింగ్ రంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) నూతన చైర్మన్‌గా సీనియర్ మేనేజింగ్ డైరెక్టర్ చల్లా శ్రీనివాసులు శెట్టిని ఫైనాన్షియల్ సరీ్వసెస్ ఇన్స్టిట్యూషన్స్ బ్యూరో (ఎఫ్ఎస్ఐబీ) శనివారం ఎంపిక చేసింది. ప్రస్తుతం ఆయన ఎస్బీఐ మేనేజింగ్ డైరెక్టర్ హోదాలో అంతర్జాతీయ బ్యాంకింగ్, గ్లోబల్ మార్కెట్స్, టెక్నాలజీ విభాగాలను పర్యవేక్షిస్తున్నారు. ఆగస్టు 28న పదవీ విరమణ చేయనున్న దినేష్ కుమార్ ఖరా స్థానంలో బాధ్యతలు స్వీకరిస్తారు. శ్రీనివాసులు తెలుగువారు కావడం విశేషం. తెలంగాణలోని జోగులాంబ గద్వాల జిల్లా పెద్దపోతులపాడు ఆయన స్వస్థలం. ఎస్బీఐలో ప్రొబేషనరీ అధికారిగా 1988లో కెరీర్ ప్రారంభించారు. ప్రభుత్వ యాజమాన్యంలోని బ్యాంకులు, ఆర్థిక సంస్థల డైరెక్టర్లను ఎంపిక చేసే ఎఫ్ఎస్ఐబీ.. ఎస్బీఐ కొత్త చైర్మన్ కోసం జూన్ 29న ముగ్గురు అభ్యర్థులను ఇంటర్వ్యూ చేసి శ్రీనివాసులు పేరును ఖరారు చేసింది. ఎఫ్ఎస్ఐబీ సిఫార్సుపై ప్రధాని మోదీ నేతృత్వంలోని కేబినెట్ నియామకాల కమిటీ తుది నిర్ణయం తీసుకోనుంది. -
సదా అప్రమత్తంగా ఉండండి
ముంబై: బ్యాంకింగ్ రంగంలో ఎల్లప్పుడూ అన్ని అంశాలపై అప్రమత్తతతో ఉండాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంతదాస్ సూచించారు. ఉదాసీనతకు చోటులేకుండా సవాళ్ల పట్ల జాగరూకత వహించాలన్నారు. పటిష్ట బ్యాంకింగ్‌కు సంబంధించి నిరంతర పరస్పర చర్యల్లో భాగంగా గవర్నర్ కొన్ని ప్రభుత్వ, ప్రైవేటు రంగ ఎండీ, సీఈఓలతో సమావేశమయ్యారు. ఫైనాన్షియల్ విధుల నిర్వహణలో భారత్ బ్యాంకింగ్ చక్కటి పురోగతి సాధించిందని ఈ సందర్భంగా అన్నారు. అయితే చక్కటి బ్యాలెన్స్ సీట్స్ నిర్వహణ, వ్యక్తిగత రుణాలపై పర్యవేక్షణ, సహ–రుణ మార్గదర్శకాలను పాటించడం, ఎన్బీఎఫ్సీ రంగానికి నిధుల అందజేత, ద్రవ్య లభ్యత సవాళ్లు, ఐటీ– సైబర్ సెక్యూరిటీ, పాలనా వ్యవహారాల పటిష్ట నిర్వహణ, డిజిటల్ మోసాల నివారణ వంటి అంశాలపై అన్ని సమయాల్లో అప్రమత్తత పాటించాలని పేర్కొన్నారు. ముఖ్యంగా ఖాతాదారుల ప్రయోజనాల పరిరక్షణకు ప్రాముఖ్యత ఇవ్వాలని పేర్కొంటూ... ఫైనాన్షియల్ వ్యవస్థ రక్షణ, స్థిరత్వలో ఇది కీలకమని అన్నారు. ఆర్బీఐ ఫిన్‌టెక్ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనడానికి, డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్లకు మరింత ప్రోత్సాహాన్ని అందించడానికి బ్యాంకులకు తగిన ప్రోత్సాహం ఉంటుందన్నారు. ఈ సమావేశాలకు డిప్యూటీ గవర్నర్లు ఎం రాజేశ్వర్‌రావు, స్వామినాథన్సహా నియంత్రణ, పర్యవేక్షణ కార్యక్రమాల ఇన్ఛార్జ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు కూడా హాజరయ్యారు. -
ఒకటే రీజన్.. 3500 మంది ఉద్యోగులు బయటకు..!
జర్మనీలో అతిపెద్ద లెండర్ 'డ్యుయిష్ బ్యాంక్' తాజాగా 3500 మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు ప్రకటించింది. 2023లో బ్యాంక్ లాభాలు భారీగా తగ్గిపోవడం వల్ల సంస్థ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 2022 కంటే కూడా 2023లో సంస్థ లాభాలు 16 శాతం తగ్గడం మాత్రమే కాకుండా, ఖర్చులు పెరగడం వల్ల డ్యుయిష్ బ్యాంక్ 3500 మందిని తొలగించడానికి సన్నద్ధమవుతోంది. ఐరోపా సెంట్రల్ బ్యాంక్ అధిక వడ్డీ రేట్ల కారణంగా ఆదాయం సంవత్సరానికి ఆరు శాతం పెరిగి 28.9 బిలియన్ యూరోలకు చేరుకుందని, అనిశ్చితి వాతావరణంలో కూడా బ్యాంక్ పనితీరు అద్భుతంగా ఉందని చీఫ్ ఎగ్జిక్యూటివ్ 'క్రిస్టియన్ సివింగ్' ప్రశంసించారు. కానీ బ్యాంక్ మరింత లాభాలను పొందే క్రమంలో ఉద్యోగుల తొలగింపు తప్పదని వెల్లడించారు. ఇదీ చదవండి: విప్రో కీలక నిర్ణయం - వందలాది మంది ఉద్యోగులపై వేటు! 2022 నాటికి ప్రపంచ వ్యాప్తంగా డ్యుయిష్ బ్యాంక్ 85000 మంది ఉద్యోగులను కలిగి ఉంది. అయితే 2025 నాటికి కొత్త లక్ష్యాలను చేరుకోవడానికి ప్రయత్నంలో ఖర్చులను తగ్గించుకుని, అనుకున్న లక్ష్యాలను చేరుకోవడానికి లేఆప్స్ చేస్తున్నట్లు సమాచారం. -
ఆప్కాబ్‌కు 60 ఏళ్లు
సాక్షి, అమరావతి: సహకార బ్యాంకింగ్ రంగంలో దేశంలోనే అగ్రగామిగా గుర్తింపు పొందిన ఆంధ్రప్రదేశ్ సహకార బ్యాంక్ (ఆప్కాబ్) 60 ఏళ్లు పూర్తి చేసుకుని వజ్రోత్సవ వేడుకలకు ముస్తాబైంది. డీసీసీబీ, పీఏసీఎస్‌ల ద్వారా రాష్ట్రంలోని చిన్న, సన్నకారు రైతుల అభ్యున్నతి కోసం ఆప్కాబ్ కృషి చేస్తోంది. పీఏసీఎస్‌లు స్వయం సమృద్ధి సాధించేందుకు ఆర్థిక చేయూత అందిస్తోంది. ఈ నెల 4వ తేదీన జరగనున్న వజ్రోత్సవ వేడుకలకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరు కానున్నారు. రూ.లక్ష కోట్ల వ్యాపారం 1963 ఆగస్టు 4న ఏర్పడిన ఆప్కాబ్ 1966లో భారతీయ రిజర్వ్ బ్యాంక్ నుంచి షెడ్యూల్డ్ బ్యాంకుగా గుర్తింపు పొందింది. దీని పరిధిలో 18 శాఖలు ఉండగా.. ఆప్కాబ్ పర్యవేక్షణలోని 13 జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ (డీసీసీబీ)ల పరిధిలో 425 బ్రాంచ్‌లు, 1,995 ప్రాధమిక వ్యవసాయ పరపతి సంఘాలు (పీఏసీఎస్) పనిచేస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ తోడ్పాటుతో ఆప్కాబ్ ఆధునిక సాంకేతికతను సంతరించుకుంది. డీసీసీబీలు, పీఏసీఎస్‌లను కూడా కోర్ బ్యాంకింగ్ నెట్వర్క్ పరిధిలోకి తీసుకొచ్చే దిశగా అడుగులు వేస్తోంది. 2018–19 నాటికి రూ.13,322 కోట్ల వార్షిక టర్నోవర్‌తో ఉన్న ఆప్కాబ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహంతో నాలుగేళ్లలో ఏకంగా రూ.36,732 కోట్ల వ్యాపార మైలురాయిని అధిగమించింది. రూ.251 కోట్ల లాభాలను ఆర్జించింది. సహకార వ్యవస్థ ద్వారా దేశంలోనే తొలిసారి రూ.లక్ష కోట్ల వ్యాపారంతో గ్రామీణ సహకార వ్యవస్థలో స్వర్ణయుగానికి నాంది పలికింది. నాలుగేళ్లలో వరుసగా రెండు సార్లు నాఫ్స్కాబ్ ద్వారా జాతీయ స్థాయిలో నంబర్–1 సహకార బ్యాంక్‌గా గుర్తింపు పొందింది. బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగంలో ఇండియాలోనే బెస్ట్ కో–ఆపరేటివ్ బ్యాంక్‌గా ఆప్కాబ్ బీఎఫ్ఎస్ఐ ద్వారా అవార్డు అందుకుంది. వజ్రోత్సవ వేడుకల సందర్భంగా బ్యాంక్ నూతన లోగో, పోస్టల్ స్టాంప్‌తో పాటు విజన్ డాక్యుమెంట్‌ను ఆవిష్కరించనుంది. రైతు సేవలో 60 ఏళ్లు ఆప్కాబ్ రైతుల సేవలో 60 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా బ్యాంక్ సిబ్బంది, పాలకవర్గ సభ్యులకు అభినందనలు. నష్టాల ఊబిలో కూరుకుపోయిన సహకార రంగం సీఏం వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకొచ్చిన సంస్కరణలతో బలోపేతమైంది. రికార్డుస్థాయి వ్యాపారంతో నష్టాల నుంచి గట్టెక్కి లాభాలను ఆర్జిస్తోంది. – కాకాణి గోవర్ధన్‌రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి -
RBI Annual Report 2022-23: కట్టలు తెంచుకున్న కరెన్సీ!
ముంబై: చెలామణిలో ఉన్న బ్యాంకు నోట్ల విలువ అలాగే పరిమాణం రెండూ మార్చితో ముగిసిన 2022–23 ఆర్థిక సంవత్సరంలో (2021–22 ఆర్థిక సంవత్సరంతో పోల్చి) వరుసగా 7.8 శాతం, 4.4 శాతం పెరిగాయి. అయితే 2021–22లో ఈ పెరుగుదల (2020–21తో పోల్చి) వరుసగా 9.9 శాతం, 5 శాతంగా ఉన్నాయి. మొత్తంగా పరిస్థితి చూస్తే, డిజిటలైజేషన్ మార్గంలో ఎన్ని చర్యలు తీసుకున్నా వ్యవస్థలో బ్యాంకు నోట్ల విలువ, పరిమాణం పెరగడం గమనార్హం. అయితే పెరుగుదల శాతాల్లో తగ్గడమే ‘చెప్పుకోవడానికి’ కొంత ఊరటనిచ్చే అంశం. ఆర్బీఐ ఈ మేరకు విడుదల చేసిన వార్షిక నివేదికలో కొన్ని ముఖ్యాంశాలు... ♦ విలువ పరంగా చూస్తే, రూ. 500, రూ. 2,000 నోట్ల వాటా 31 మార్చి 2023 నాటికి చెలామణిలో ఉన్న మొత్తం నోట్ల విలువలో 87.9 శాతం. 31 మార్చి 2022లో ఇది 87.1 శాతం. ♦ రూ. 500 డినామినేషన్ అత్యధికంగా 37.9% వాటాను కలిగి ఉంది. తరువాతి స్థానంలో రూ. 10 డినామినేషన్ బ్యాంక్ నోటు ఉంది. ఈ నోట్లు 2023 మార్చి 31 నాటికి చెలామణిలో ఉన్న మొత్తం బ్యాంక్ నోట్లలో రూ.10 నోట్ల పరిమాణం 19.2%గా ఉన్నాయి. ♦ 2023 మార్చి చివరి నాటికి రూ. 25,81,690 కోట్ల విలువ కలిగిన మొత్తం రూ. 500 డినామినేషన్ నోట్లు 5,16,338 లక్షలు. 2022 మార్చి చివరి నాటికి రూ. 500 నోట్ల సంఖ్య 4,55,468 లక్షలు. అంటే వ్యవస్థలో రూ.500 నోట్లు వార్షికంగా పెరిగాయన్నమాట. ♦ ప్రస్తుతం చెలామణిలో ఉన్న నోట్లలో రూ.2, రూ.5, రూ.10, రూ.20, రూ.50, రూ.100, రూ.200, రూ.500, రూ.2,000 డినామినేషన్లు ఉన్నాయి. చెలామణిలో ఉన్న నాణేలు 50 పైసలు, రూ. 1, రూ. 2, రూ. 5, రూ. 10, రూ. 20 డినామినేషన్లను కలిగి ఉంటాయి. ♦ 2022–23 మధ్యకాలంలో ఆర్బీఐ లైవ్–పైలట్ ప్రాతిపదికన ఈ–రూపాయిని కూడా ప్రారంభించింది. 2023 మార్చి 31 నాటికి చెలామణిలో ఉన్న ఈ–రూపాయి–హోల్‌సేల్ అలాగే ఈ–రూపాయి–రిటైల్ విలువలు వరుసగా రూ. 10.69 కోట్లు రూ. 5.70 కోట్లుగా ఉన్నాయి. ♦ 2022–23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బ్యాంకు నోట్ల ఇండెంట్, సరఫరాలు రెండూ గత సంవత్సరంతో (2021–22) పోలిస్తే 1.6 శాతం స్వల్పంగా పెరిగాయి. రూ.2000 నోట్ల ప్రింటింగ్‌కు ఇండెంట్ లేదు. రూ.2000 నోట్ల సంగతి ఇదీ... ఆర్బీఐ నివేదిక ప్రకారం రూ.2,000 నోట్ల అంశాన్ని పరిశీలిస్తే, 2023 మార్చి చివరి నాటికి రూ.3,62,220 కోట్ల విలువ చేసే 4,55,468 లక్షల నోట్లు వ్యవస్థలో ఉన్నాయి. పరిమాణం పరంగా చెలామణిలో ఉన్న రూ. 2,000 నోట్లు 2023 మార్చి చివరినాటికి చెలామణిలో ఉన్న మొత్తం కరెన్సీలో 1.3 శాతానికి తగ్గాయి. 2022 మార్చి నాటికి ఈ నోట్లు 1.6 శాతంగా ఉన్నాయి. విలువ పరంగా కూడా నోట్లు 2022 మార్చిలో మొత్తం నోట్లలో 13.8 శాతం ఉంటే, 2023 మార్చి నాటికి 10.8 శాతానికి పడిపోయింది. తగ్గుతున్న మోసాల ‘విలువ’..: 2022–23లో బ్యాంకింగ్ రంగంలో మోసాల సంఖ్య 13,530కి చేరుకుంది. అయితే విలువ మాత్రం దాదాపు సగానికి తగ్గి రూ. 30,252 కోట్లుగా ఉంది. కార్డ్, ఇంటర్నెట్ డిజిటల్ పేమెంట్లలోనే మోసాలు ఎక్కువగా చోటుచేసుకున్నాయి. -
జలకళ తీసుకువచ్చింది
బ్యాంకింగ్ రంగంలో క్షణం తీరిక లేని పనుల్లో ఉండేది వేదిక భండార్కర్. ఆ ఊపిరి సలపని పనుల్లో ఆమెకు కాస్త ఉపశమనం సామాజికసేవ. బ్యాంకింగ్ రంగాన్ని వదిలి సామాజికసేవా రంగం దారిని ఎంచుకున్న వేదిక... ‘సామాజిక సేవ మనకు వినయాన్ని నేర్పుతుంది. మనుసులో నుంచి మానవత్వ భావన పోకుండా కాపాడుతుంది. మరిన్ని మంచి పనులు చేయాలనే ఉత్సాహాన్ని ఎప్పుడూ ఇస్తుంది’ అంటోంది... ‘సామాజిక సేవారంగంలో పనిచేస్తానని కలలో కూడా అనుకోలేదు’ అంటుంది ముంబైకి చెందిన వేదిక భండార్కర్. ‘స్టార్ బ్యాంకర్’గా పేరు తెచ్చుకున్న వేదిక జేపీ మోర్గాన్‌లో ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ హెడ్‌గా పనిచేసింది. ఆ తరువాత మరో కంపెనీలో వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ హోదాలో పనిచేసింది. తన వృత్తిపనుల్లో తలమునకలయ్యే వేదిక తొలిసారిగా ముంబైలోని ‘జై వకీల్ ఫౌండేషన్’తో కలిసి పనిచేసింది. ఆ తరువాత ‘దస్రా’ అనే స్వచ్ఛందసంస్థతో కలిసి జార్ఖండ్, బిహార్ గ్రామీణ ప్రాంతాలలో మహిళలు, బాలికల విద్య, ఆరోగ్యానికి సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొంది. ‘అపుడప్పుడు’ అన్నట్లుగా ఉండే ఆమె సామాజికసేవలు ఆతరువాత నిత్యకృత్యం అయ్యాయి. అలాంటి సమయంలోనే తమ సంస్థకు ఇండియాలో సారథ్యం వహించమని ‘వాటర్.ఆర్గ్’ నుంచి పిలుపు వచ్చింది. మిస్సోరీ (యూఎస్) కేంద్రంగా పనిచేసే స్వచ్ఛందసంస్థ ‘వాటర్.ఆర్గ్’ సురక్షిత నీరు, జలసంరక్షణ, పారిశుద్ధ్యంకు సంబంధించి ఎన్నో దేశాల్లో పనిచేస్తోంది. ఆ సంస్థ నుంచి ఆహ్వానం అందినప్పుడు నిరాకరించడానికి వేదికకు ఏ కారణం కనిపించలేదు. ఒప్పుకోవడానికి మాత్రం చాలా కారణాలు కనిపించాయి. అందులో ప్రధానమైనది... ‘పేదప్రజలకు సేవ చేసే అవకాశం దొరుకుతుంది’ ‘వాటర్.ఆర్గ్’ సారథ్య బాధ్యతలు చేపట్టే ముందు నీటి సంక్షోభం గురించి లోతుగా అధ్యయనం చేసింది వేదిక. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూ హెచ్ వో) గణాంకాల ప్రకారం సురక్షితమైన నీటి సౌకర్యానికి నోచుకోని ప్రజలు కోట్లలో ఉన్నారు. నీటి కోసం అష్టకష్టాలు పడుతున్నారు మహిళలు. నీటి కోసం గంటల కొద్దీ సమయాన్ని వెచ్చించక తప్పని పరిస్థితుల వల్ల ఆ సమయాన్ని ఇతర ప్రయోజనకర పనులకోసం కేటాయించలేకపోతున్నారు. ‘మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రధానంగా దృష్టి పెడతాను’ అంటున్న వేదిక ఆ సమస్యల పరిష్కారానికి తనవంతుగా కృషి చేస్తోంది. మరుగుదొడ్లు నిర్మించుకోవడం నుంచి వాటర్ కనెక్షన్లు ఏర్పాటు చేసుకోవడం వరకు ‘వాటర్.ఆర్గ్’ ద్వారా సహాయపడుతోంది. ఒకసారి క్షేత్రపర్యటనలో భాగంగా కర్ణాటకలోని ఒక గ్రామానికి వెళ్లింది వేదిక. ఒక మహిళ తన పదకొండు సంవత్సరాల కూతురు గురించి చెప్పింది. ఆ అమ్మాయి చదువుకోడానికి వేరే ఊళ్లో బంధువుల ఇంట్లో ఉంటుంది. అయితే బడికి సెలవులు వచ్చినా ఆ అమ్మాయి ఇంటికి రావడానికి మాత్రం ఇష్టపడడం లేదు. దీనికి కారణం వారి ఇంట్లో టాయిలెట్ సౌకర్యం లేకపోవడం. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఆ మహిళ టాయిలెట్ నిర్మించుకోవడానికి సహకరించింది వేదిక. ఆ గృహిణి కళ్లలో కనిపించిన మెరుపును దగ్గర నుంచి చూసింది. ‘బ్యాంకర్‌గా క్లయింట్స్ ఆదాయం ఒక స్థాయి నుంచి మరో స్థాయి పెరగడానికి కృషి చేశాను. ఇప్పుడు...తమకున్న వనరులతోనే సౌకర్యవంతమైన జీవితం ఎలా గడపవచ్చు అనే విషయంలో సామాన్య ప్రజలతో కలిసి పనిచేస్తున్నాను’ అంటుంది వేదిక. ఒకప్పుడు ‘స్టార్ బ్యాంకర్’గా బ్యాంకింగ్ రంగంలో ఎన్నో విజయాలు సాధించిన వేదిక భండార్కర్ ఇప్పుడు ‘నీటిని మించిన అత్యున్నత పెట్టుబడి ఏదీ లేదు’ అంటూ జలసంరక్షణపై ఊరూరా ప్రచారం చేస్తోంది. -
షార్ట్ కవరింగ్ లాభాలు
ముంబై: దేశీయ స్టాక్ సూచీలు మార్చి సిరీస్‌కు లాభాలతో వీడ్కోలు పలికాయి. ఎఫ్అండ్ఓ డెరివేటివ్స్ కాంట్రాక్టుల గడువు ముగింపు నేపథ్యంలో షార్ట్ కవరింగ్ కొనుగోళ్ల జరగడంతో బుధవారం సూచీలు అరశాతానికి పైగా లాభపడ్డాయి. బ్యాంకింగ్ రంగంలో నెలకొన్న సంక్షోభ పరిస్థితులు కొలిక్కి వస్తుండంతో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలో సానుకూల సంకేతాలు నెలకొన్నాయి. ఉదయం మార్కెట్ ప్రారంభమైన తర్వాత మిడ్ సెషన్ వరకు సూచీలు స్థిరంగా కదలాడాయి. ఆ తర్వాత కాస్త నెమ్మదించినా.., చివరి గంటలో కీలక రంగాల్లో కొనుగోళ్ల జోరు పెరగడంతో లాభాలు పెరిగాయి. ఉదయం సెన్సెక్స్ 41 పాయింట్ల స్వల్ప నష్టంతో 57,613 మొదలైంది. ఇంట్రాడేలో 57,524 వద్ద కనిష్టాన్ని, 58,124 వద్ద గరిష్టాన్ని నమోదు చేసింది. ఆఖరికి 346 పాయింట్లు ఎగసి 57,960 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 25 పాయింట్లు పతనమై 16,952 వద్ద మొదలైంది. రోజంతా 16,941 – 17,126 శ్రేణిలో ట్రేడైంది. చివరికి 129 పాయింట్ల లాభంతో 17,081 వద్ద నిలిచింది. అన్ని రంగాల షేర్లకు డిమాండ్ నెలకొంది. బ్యాంకింగ్, ఫైనాన్స్, ఐటీ రంగాలకు చెందిన చిన్న, మధ్య తరహా షేర్లను కొనేందుకు ఇన్వెస్టర్లు అధికాస్తకి చూపారు. ఫలితంగా బీఎస్ఈ మిడ్, స్మాల్‌క్యాప్ సూచీలు ఒకటిన్నర శాతానికి పైగా ర్యాలీ చేశాయి. ఎఫ్‌పీఐలు రూ.1,245 కోట్ల షేర్లను, సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.823 కోట్ల షేర్లను కొన్నారు. డాలర్ మారకంలో రూపాయి విలువ 15 పైసలు క్షీణించి 82.31 స్థాయి వద్ద స్థిరపడింది. శ్రీరామ నవమి సందర్భంగా నేడు మార్కెట్లకు సెలవు కావడంతో ఎక్సే్చంజీలు తిరిగి శుక్రవారం ప్రారంభమవుతాయి. సూచీలు అరశాతానికి పైగా ర్యాలీ చేయడంతో బీఎస్ఈలో రూ.3.12 లక్షల కోట్ల సంపద సృష్టి జరిగింది. ఆసియా మార్కెట్లు ఒకశాతం, యూరప్ మార్కెట్లు ఒకటిన్నర శాతం పెరిగాయి. యూఎస్ స్టాక్ సూచీలు ఒకశాతం లాభాల్లో ట్రేడవుతున్నాయి. ‘‘ఫెడ్ రిజర్వ్ వడ్డీరేట్లను యథాతథంగా ఉంచుతుందనే స్పష్టం వచ్చేంత వరకు, బ్యాంకింగ్ రంగంలో అనిశ్చితులు సంపూర్ణంగా సద్దుమణిగే దాకా ఒడిదుడుకులు తప్పవు. సాంకేతికంగా నిఫ్టీ గత 5 రోజుల్లో గరిష్ట స్థాయి వద్ద ముగిసింది. ఎగువన 17,207–17,255 శ్రేణిలో నిరోధాన్ని, దిగువ స్థాయిలో 16,985 వద్ద తక్షణ మద్దతు ఏర్పాటు చేసుకుంది’’ అని జియోజిత్ ఫైనాన్సియల్ సర్వీసెస్ హెడ్ వినోద్ నాయర్ తెలిపారు. మార్కెట్లో మరిన్ని సంగతులు ♦కెన్ తన నివేదికలో నిరాధారమైన, సత్యదూరమైన ఆరోపణలు చేసిందంటూ అదానీ గ్రూప్ వివరణతో ఈ కంపెనీల షేర్లు ర్యాలీ చేశాయి. అదానీ ఎంటర్ప్రైజెస్ తొమ్మిది శాతం, అదానీ పోర్ట్స్ ఏడుశాతం లాభపడ్డాయి. అదానీ పవర్, అదానీ విల్మార్, ఎన్డీటీవీ షేర్లు ఐదుశాతం ఎగసి అప్పర్ సర్క్యూట్ వద్ద లాకయ్యాయి. ♦ ఇండస్ఇండ్ బ్యాంకుతో వివాదాలను పరిష్కరించుకున్నామని జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ తెలపడంతో జీ మీడియా షేరు మూడున్నర శాతం లాభపడి రూ.216 వద్ద స్థిరపడింది. ఇండస్ ఇండ్ బ్యాంక్ 2% బలపడి రూ.1,056 వద్ద నిలిచింది. ♦ బైబ్యాక్ ఇష్యూలో పాల్గొనేందుకు అర్హత తేదీ ముగియడంతో సింఫనీ షేరు ఆరు శాతం పతనమైన రూ.1023 వద్ద ముగిసింది. -
సూచీలకు పన్ను పోటు
ముంబై: ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్ కాంట్రాక్టులపై కేంద్రం సెక్యూరిటీ లావాదేవీల పన్ను 25 శాతం(0.05% నుంచి 0.0625 శాతానికి)పెంపుతో స్టాక్ సూచీలు మూడోరోజూ అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. అంతర్జాతీయ బ్యాంకింగ్ రంగంలో భయాలు దావానలంలా వ్యాప్తి చెందుతుండటం సెంటిమెంట్‌పై మరింత ఒత్తిడిని పెంచింది. అలాగే డాలర్ రికవరీతో రూపాయి క్షీణత, విదేశీ ఇన్వెస్టర్ల వరుస అమ్మకాలు ప్రతికూల ప్రభావాన్ని చూపాయి. అన్ని రంగాల షేర్లలో విక్రయాలు వెల్లువెత్తడంతో సెన్సెక్స్ 398 పాయింట్లు నష్టపోయి 57,527 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 132 పాయింట్లు క్షీణించి 17 వేల దిగువన 16,945 వద్ద నిలిచింది. ఉదయం సెషన్లో లాభాలతో కదలాడిన సూచీలు మిడ్ సెషన్ ముందు బలహీనపడ్డాయి. సెన్సెక్స్ ఇంట్రాడేలో 57,423 – 58,066 పరిధిలో కదలాడింది. నిఫ్టీ 16,917–17,109 రేంజ్లో ట్రేడైంది. ఆ తర్వాత కొద్దిసేపు లాభనష్టాల మధ్య ట్రేడైన సూచీలు ఆఖర్లో అమ్మకాలు పోటెత్తడంతో వారాంతాన్ని నష్టాలతో ముగించాయి. బీఎస్ఈ మిడ్, స్మాల్‌క్యాప్ సూచీలు ఒకటిన్నర శాతం నష్టపోయాయి. ముఖ్యంగా ప్రభుత్వరంగ బ్యాంక్స్, మెటల్, మీడియా, రియల్టీ రంగాలకు చెందిన చిన్న, మధ్య తరహా షేర్లు తీవ్ర అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ఫలితంగా బీఎస్ఈ మిడ్, స్మాల్ క్యాప్ సూచీలు ఒకటిన్నర శాతం నష్టపోయాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.1720 కోట్ల షేర్లను అమ్మేశారు. సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.2556 కోట్ల షేర్లను కొన్నారు. డాలర్ మారకంలో రూపాయి విలువ 20 పైసలు క్షీణించి 82.40 వద్ద స్థిరపడింది. బ్యాంకింగ్ రంగ సంక్షోభంతో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు బలహీనంగా ట్రేడవుతున్నాయి. ఏఎంసీ షేర్ల పతనం.. తాజా ఫైనాన్స్ బిల్లుతో అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ(ఏఎంసీ)ల ఈక్విటీ పెట్టుబడులపై స్వల్పకాలిక పెట్టుబడి లాభాల పన్ను వర్తించనుండటంతో ఇన్వెస్టర్లు ఆందోళనలకు లోనయ్యారు. ప్రధానంగా యూటీఐ 4.7 శాతం, ఆదిత్య బిర్లా 4.4 శాతం, హెచ్డీఎఫ్సీ ఏఎంసీ 4.2 శాతం చొప్పున పతనమయ్యాయి. ఈ బాటలో ఇతర ఏఎంసీలు శ్రీరామ్ 3.2 శాతం, నిప్పన్ లైఫ్ ఇండియా 1.3 శాతం చొప్పున క్షీణించాయి. -
బ్యాంకింగ్ సంక్షోభం నేర్పే పాఠాలు
ప్రధానంగా అమెరికా కేంద్రంగా పనిచేసే కొన్ని బ్యాంకుల సంక్షోభం పత్రికల పతాక శీర్షికలకు ఎక్కింది. దీంతో జరగాల్సిన నష్టమంతా జరిగిపోయిందా? ఇలా కుప్పకూలిపోయే బ్యాంకులు మరిన్ని ఉన్నాయా? అన్న ప్రశ్నలు తలెత్తాయి. ఆ బ్యాంకుల సంక్షోభానికి దారితీసిన పరిస్థితులు దేనికవే వేర్వేరు కావడం గమనార్హం. ఇలాంటి సంక్షోభాలను ఎదుర్కొనేందుకు భారతీయ బ్యాంకింగ్ వ్యవస్థలో తగినన్ని ఏర్పాట్లు ఉన్నా రిస్క్ మేనేజ్మెంట్, ట్రెజరీ ప్రాక్టీసుల విషయంలో సమీక్ష జరగాల్సిన అవసరం ఉంది. కేవలం పెట్టుబడులపై మాత్రమే కాకుండా, అప్పులపై కూడా దృష్టి పెట్టాలన్నది ఈ సంక్షోభం చెబుతున్న ఒక పాఠం. పెట్టుబడుల జాబితా మరీ కొండవీటి చాంతాడంత ఉండటమూ సరికాదన్నది మరో పాఠం. సిల్వర్‌గేట్ బ్యాంక్, సిలికాన్ వ్యాలీ బ్యాంక్, సిగ్నేచర్ బ్యాంక్, క్రెడిట్ స్వీస్... ఇటీవలి కాలంలో పత్రికల పతాక శీర్షికలకు ఎక్కిన బ్యాంకుల పేర్లు. భారత్‌లో క్రెడిట్ స్వీస్ గురించి చాలామందికి తెలుసు కానీ... మిగిలిన మూడింటితో పరిచయం అంతంత మాత్రమే. ఎందుకంటే ఇవి ప్రధానంగా అమెరికాలో పనిచేసే బ్యాంకులు. అయినాసరే, వీటి గురించి బోలె డన్ని కథనాలు వరుసగా వస్తూండటం కొంత అసౌకర్యంగా అనిపించే విషయమే. ఇప్పుడు తలెత్తిన ప్రశ్న ఏమిటంటే, మన బ్యాంకింగ వ్యవస్థఎంత సురక్షితం? అన్నది. అమెరికాకు చెందిన లేహ్మ¯Œ బ్రదర్స్ దివాళా సంక్షోభం తరువాత ‘బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్స్’ మూలధనానికి సంబంధించిన విధానాలను మరింత కఠినం చేసింది. బేసెల్ కమిటీ మార్గదర్శకాలు ఇందుకు కారణమయ్యాయి. అయినా ప్రస్తుత సంక్షోభాన్ని అది నివారించలేక పోయింది. ఇప్పుడు ఇంకో ప్రశ్న తలెత్తుతోంది. జరగాల్సిన నష్టమంతా జరిగిపోయిందా? లేక ఇలా కుప్పకూలిపోయే బ్యాంకులు మరిన్ని ఉన్నాయా? అయితే, ఈ బ్యాంకుల మూసివేతకు దారితీసిన పరిస్థితులు దేనికవే వేర్వేరు కావడం ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం. దేని కారణాలు దానివే! ఈ మూడు బ్యాంకుల మూసివేతకూ, భారతీయ బ్యాంకులకూ నేరుగా సంబంధం లేకపోవచ్చు. సిల్వర్‌గేట్ బ్యాంకు క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్‌లో ఉంది. ఇప్పుడు క్రిప్టో కరెన్సీకి అంత ఆదరణ లేదు. ఇంకొన్నేళ్లు పోతే అసలు క్రిప్టో అన్న పదం కూడా వినిపించకపోవచ్చు. అదంత సుస్థిరమైంది కాదని ఇప్పటికే అందరికీ అర్థమైపోయింది. సిలికాన్ వ్యాలీ బ్యాంకు కేవలం స్టార్టప్‌లపైనే ఎక్కువగా కేంద్రీ కరించింది. అందిన డిపాజిట్లు అత్యధికం స్టార్టప్‌ల నుంచి వచ్చినవే. కొంతమేరకు అప్పులూ ఇచ్చారు కానీ ఎక్కువ మొత్తం ప్రభుత్వాలకు అప్పు ఇచ్చింది. (మన బ్యాంకుల మాదిరిగానే ప్రభుత్వ బాండ్లు, ట్రెజరీ బిల్లుల్లో ఎక్కువ పెట్టుబడులు పెట్టారన్నమాట.) ఇక సిగ్నేచర్ బ్యాంకు గురించి: ఇది అటు క్రిప్టో, ఇటు స్టార్టప్‌లు రెండు రంగాల్లోనూ పనిచేస్తోంది. ప్రస్తుతం దీన్ని ఆదుకునేందుకు న్యూయార్క్ కమ్యూనిటీ బ్యా¯Œ కార్ప్ ఒక ప్రయత్నం చేస్తోంది. చివరగా క్రెడిట్ స్వీస్: ఇది స్విట్జర్లాండ్ బ్యాంక్. ఎవరికి రుణా లిచ్చారన్న విషయంలో ఈ బ్యాంకు కొన్ని సవాళ్లను ఎదుర్కొంటోంది. అయితే రకరకాల వ్యాపార వ్యవహారాల కారణంగా నష్టాలు ఎదు ర్కొంది. ఆ దేశ కేంద్ర బ్యాంకు దీనికి బెయిల్ అవుట్ ఇస్తోంది. అలాగే యూబీఎస్ దీన్ని స్వాధీనం చేసుకుని కష్టాల నుంచి బయట పడేసే ప్రయత్నం చేస్తోంది. ఈ నాలుగు ఘటనలు వేటికవే ప్రత్యేకం కానీ చరిత్ర పుటల్లో నిలిచిపోయేవి. లేహ్మన్ బ్రదర్స్ సంక్షోభం కంటే ప్రస్తుత సంక్షోభం భిన్నమైంది. ఎలాగంటే... ఇప్పుడు అన్ని నియంత్రణ సంస్థలు రంగంలోకి దిగాయి. ఆర్బీఐ కూడా భారతీయ బ్యాంకింగ్ వ్యవస్థ దృఢంగా ఉందన్న భరోసా ఇచ్చింది. యూరప్‌లోనూ కేంద్ర బ్యాంకులు క్రెడిట్ స్వీస్ సంక్షోభం ప్రభావాన్ని మదిస్తున్నాయి. మరి ఈ సంక్షోభం ప్రభావం భారత్‌పై ఏమిటి? మనం నేర్చుకోవాల్సిన గుణపాఠా లేమిటి? అప్పుల గురించి కూడా యోచించాలి. సిలికాన్ వ్యాలీ బ్యాంక్ కుప్పకూలిపోవడం నేర్పించే మొదటి పాఠం... కేవలం పెట్టుబడులపై మాత్రమే కాకుండా, అప్పులపై కూడా దృష్టి పెట్టాలని! రుణాలు ఇచ్చే విషయంలో బ్యాంకులకు స్పష్టమైన మార్గదర్శకాలు ఉన్నాయి. ముప్పు ఒక్క దగ్గర పోగు పడకుండా చూడటం వీటి ఉద్దేశం. అయితే డిపాజిట్లు పోగుపడటం వల్ల కూడా ముప్పు ఉంటుందన్నది వినూత్నమైన విషయం. డిపా జిట్లు ఎక్కువగా స్టార్టప్‌ల నుంచి రావడం వల్ల సంక్షోభం మరింత ముదిరింది. ఎందుకంటే డిపాజిట్లు చేసిన వారందరూ అకస్మాత్తుగా వాటిని ఉపసంహరించుకునే ప్రయత్నం చేశారు. భారతీయ బ్యాంకులు ఈ విషయమై ఆలోచన చేయాలి. చిన్న బ్యాంకులు మరీ ముఖ్యంగా. ఇక రెండో గుణపాఠం: పెట్టుబడుల జాబితా మరీ కొండవీటి చాంతాడంత ఉండటమూ సరికాదని చెబుతోంది. యూఎస్ ట్రెజరీ బాండ్లు కలిగి ఉండటం వాస్తవానికి చాలా సురక్షితం. కానీ వడ్డీ రేట్లు పెరిగిపోవడం వల్ల ఈ పెట్టుబడుల విలువల్లో తేడాలొస్తాయి. ఈ విషయాన్ని బ్యాంకులు గుర్తించాలి. రిస్క్ మేనేజ్మెంట్, ట్రెజరీ ప్రాక్టీసెస్‌లను సమీక్షించుకోవాలి. ముచ్చటగా మూడో పాఠం: వాణిజ్య బ్యాంకింగ్‌లో నైపుణ్యం సాధించాలని బ్యాంకులకు తరచూ చెబుతూంటారు. ఇతర కార్య కలాపాలను అనుబంధ కంపెనీల ద్వారా నడపాలనీ, వాటి మూల ధన నిర్మాణం కూడా వేరుగా ఉండాలనీ అంటారు. క్రెడిట్ స్వీస్ విషయంలో ఈ రెండు లోపాలు కొట్టొచ్చినట్లు కనిపించాయి. ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్‌లో వచ్చిన నష్టాలు, వెల్త్ మేనేజ్మెంట్ విభాగపు నిధులను విత్‌డ్రా చేయడం కాస్తా వాణిజ్య బ్యాంకింగ్ బ్యాలెన్స్ షీట్‌పై ప్రభావం చూపింది. భారత్‌లో ఈ బలహీనతను చాలాకాలం కిందటే గుర్తించారు. అందుకే ఇన్వెస్ట్మెంట్, మర్చెంట్ బ్యాంకింగ్, ఇన్సూరె¯Œ ్స, మ్యూచు వల్ ఫండ్స్ తదితరాలను అనుబంధ సంస్థల ద్వారా నడుపుతున్నారు. దీనివల్ల ముప్పు కొంచెం తక్కువవుతుంది. క్రిప్టో కరెన్సీని ఎలాగూ భారత్ గుర్తించలేదు. కాబట్టి రెండు బ్యాంకులు కుప్పకూలడం తాలూకూ ప్రభావం మనపై ఉండదు. వాస్తవానికి తాజా సంక్షోభం తరువాత ప్రపంచవ్యాప్తంగా క్రిప్టో కరెన్సీ వ్యవహారాలను బ్యాంకింగ్‌కు దూరంగా ఉంచాలన్న అభి ప్రాయం బలపడటం గుర్తించాలి. ప్రత్యక్ష ప్రభావం లేదు అమెరికన్ బ్యాంకులు, క్రెడిట్ స్వీస్ సంక్షోభం తాలూకూ ప్రత్యక్ష ప్రభావం భారతీయ బ్యాంకింగ్ వ్యవస్థపై ఏమీ కనపడటం లేదు. కాకపోతే ఒక్కసారి పరిస్థితిని సమీక్షించుకునేందుకు అవకాశం కల్పిస్తోంది. బ్యాలెన్స్ షీట్లను ఒక్కసారి పరిశీలించుకుని డిపాజిట్లు, అప్పులు ఎలా విభజితమై ఉన్నాయో చూసుకోవడం మేలు. ట్రెజరీ డిపార్ట్మెంట్ కూడా రిస్క్ టీమ్స్‌తో కలిసి పెట్టుబడుల తీరు తెన్నులను మదింపు చేయాలి. అంతేకాకుండా... డెట్(రుణ) సర్వీస్ కవరేజి నిష్పత్తికి సంబంధించి ఏవైనా లోటుపాట్లు ఉన్నాయా? అన్నది పరిశీలించాలి. ఇది నిరంతర ప్రక్రియలా సాగాలి. ఆర్బీఐ కూడా డిపాజిట్లపై ప్రస్తుతం జారీ చేస్తున్న ఇన్సూరెన్స్‌ను సమీక్షించాల్సిన అవసరముంది. ప్రస్తుతం డిపాజిట్లపై ఉన్న ఐదు లక్షల గరిష్ఠ ఇన్సూరెన్స్ పరిమితిని పది లక్షల రూపాయలకు పెంచాలి. ముప్పు తీవ్రత ఆధారంగా బ్యాంకులను వర్గీకరించే అంశాన్నీ పరిశీలించాలి. అంతర్జాతీయ స్థాయిలో ఇలాంటి ప్రత్యేక పరిస్థితులను ఎదు ర్కొనేందుకు ఎలాంటి ఏర్పాట్లు చేయాలన్న అంశంపై త్వరలోనే చర్చ మొదలు కావచ్చు. ‘బేసిల్–4’ (సంస్కరణల కోసం) వంటివి ఏర్పడే అవకాశమూ లేకపోలేదు. ఇది బ్యాంకులకు అవసరమైన మూలధనం మరింత పెరిగేందుకు దారితీసే అవకాశముంది. అంతేకాకుండా... మార్కెట్, క్రెడిట్ రిస్క్‌లను అంచనా వేసేందుకు మరిన్ని పరీక్షల్లాంటివి చేయాల్సిన అవసరం ఏర్పడవచ్చు. మదన్ సబ్నవీస్, వ్యాసకర్త బ్యాంక్ ఆఫ్ బరోడా చీఫ్ ఎకానమిస్ట్, (‘ద బిజినెస్ లైన్’ సౌజన్యంతో). -
ఐటీకి బ్యాంకింగ్ షాక్!
రెండు వారాలుగా అమెరికా, యూరప్ ప్రాంతాల బ్యాంకింగ్ రంగంలో ఒకేసారి సంక్షోభ పరిస్థితులు తలెత్తాయి. పలు బ్యాంకులు మూత పడుతున్నాయి. దీంతో దేశీ ఐటీ రంగానికి సమస్యలు ఎదురుకావచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. పరిశ్రమ ఆదాయంలో అత్యధిక వాటాకు ప్రాతినిధ్యం వహించే బీఎఫ్ఎస్ఐ విభాగం ఇందుకు కారణం కానున్నట్లు అంచనా. సాక్షి, బిజినెస్ డెస్క్: కొద్దిరోజులుగా అటు అమెరికా, ఇటు యూరప్ బ్యాంకింగ్ రంగాలలో ప్రకంపనలు పుడుతున్నాయి. అమెరికాలో ఉన్నట్టుండి సిల్వర్‌గేట్ క్యాపిటల్ మూతపడగా.. వైఫల్యాల బాటలో ఉన్న సిలికాన్ వ్యాలీ బ్యాంక్‌ను ఫెడరల్ డిపాజిట్ ఇన్సూరెన్స్ కార్ప్(ఎఫ్‌డీఐసీ) టేకోవర్ చేసింది. ఈ బాటలో సిగ్నేచర్ బ్యాంక్ సైతం దివాలాకు చేరగా.. న్యూయార్క్ కమ్యూనిటీ బ్యాంక్ ఆదుకుంది. అనుబంధ సంస్థ ఫ్లాగ్‌స్టార్ బ్యాంక్ ద్వారా ఆస్తుల కొనుగోలుకి అంగీకరించింది. ఇక మరోపక్క యూరోపియన్ బ్లూచిప్ క్రెడిట్ సూసీ దివాలా స్థితికి చేరడంతో స్విస్ కేంద్ర బ్యాంకు కల్పించుకుని ఫైనాన్షియల్ రంగ దిగ్గజం యూబీఎస్‌ను రంగంలోకి దించాల్సి వచ్చింది. ఇక తాజాగా ఫస్ట్ రిపబ్లిక్ బ్యాంకును ఆదుకోవాలని జేపీ మోర్గాన్ ఇతర దిగ్గజాలతో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా 2008 తదుపరి మరోసారి ఫైనాన్షియల్ రంగంలో సంక్షోభ పరిస్థితులు నెలకొన్నట్లు బ్యాంకింగ్ వర్గాలు పేర్కొంటున్నాయి. కాగా.. ఈ ప్రభావం దేశీ సాఫ్ట్వేర్ సేవల రంగాన్ని దెబ్బ తీసే వీలున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. కోలుకుంటున్న వేళ కోవిడ్–19 సవాళ్లలో ఊపందుకున్న సాఫ్ట్వేర్ రంగం ఇటీవల రష్యా– ఉక్రెయిన్ యుద్ధం, ద్రవ్యోల్బణం, అధిక వడ్డీ రేట్లతో కొంత అనిశ్చిత వాతావరణాన్ని చవిచూస్తోంది. దీంతో కొద్ది రోజులుగా ఉద్యోగ నియామకాలు మందగించగా.. వచ్చే ఏడాదిపై ఆశావహ దృక్పథాన్ని ప్రదర్శిస్తున్నాయి. అయితే ఇంతలోనే బ్యాంకింగ్ రంగ సంక్షోభం ద్వారా మరో షాక్ తగలనున్నట్లు పరిశ్రమ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఫలితంగా ప్రపంచ బ్యాంకింగ్ రంగంలో కుదుపుల కారణంగా దేశీ ఐటీ దిగ్గజాలకు వచ్చే ఆర్థిక సంవత్సరం(2023–24)లో మరోసారి ప్రతికూల పరిస్థితులు ఎదురుకానున్నట్లు చెబుతున్నారు. బీఎఫ్ఎస్ఐ దెబ్బ దేశీ ఐటీ సేవల రంగంలో బ్యాంకింగ్, ఫైనాన్షియల్, ఇన్సూరెన్స్(బీఎఫ్ఎస్ఐ) విభాగం ప్రధాన పాత్ర పోషిస్తుంటుంది. సాఫ్ట్వేర్ రంగ సమాఖ్య నాస్కామ్ గణాంకాల ప్రకారం మొత్తం ఆదాయంలో 20–40 శాతం వాటాను ఆక్రమిస్తుంటుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23)లో ఈ వాటా 41 శాతాన్ని తాకనున్నట్లు అంచనా. ఇటీవల సవాళ్లు ఎదుర్కొంటున్న బ్యాంకులకు ప్రధానంగా దేశీ దిగ్గజాలు టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, ఎల్‌టీఐమైండ్‌ట్రీ, ఎంఫసిస్ సేవలు అందిస్తున్నాయి. ఉదాహరణకు సిలికాన్ వ్యాలీ బ్యాంక్, క్రెడిట్ సూసీ, యూబీఎస్లకు టీసీఎస్ ఐటీసర్వీసులు సమకూర్చుతోంది. ఇన్ఫోసిస్, ఎల్టీఐఎం సైతం సేవలు అందిస్తున్నాయి. దీంతో ప్రస్తుత ఏడాది క్యూ4(జనవరి–మార్చి)లోనే ఈ కంపెనీలు ప్రొవిజన్లు చేపట్టే వీలున్నట్లు నిపుణులు భావిస్తున్నారు. అయితే 2008లో లేమన్ బ్రదర్స్ దివాలా తదుపరి బ్యాంకులు వ్యయాల తగ్గింపు, బిజినెస్ పెంపు ప్రాజెక్టులపై దృష్టి సారించడంతో దీర్ఘకాలంలో ఐటీ రంగం బలపడిన విషయాన్ని నిపుణులు ప్రస్తావిస్తున్నారు. స్వల్ప కాలం నుంచి మధ్యకాలానికి డీల్స్ తగ్గనుండగా.. కాంట్రాక్ట్ ధరలపై సైతం ఒత్తిడి తలెత్తవచ్చని అంచనా. దేశీ ఐటీ దిగ్గజాల ఆదాయాల్లో ఉత్తర అమెరికా, యూరోపియన్ ప్రాంతాలు ప్రధాన పాత్ర పోషించే సంగతి తెలిసిందే. వెరసి ఈ ఏడాది క్యూ4పై పెద్దగా ప్రభావం పడనప్పటికీ వచ్చే ఏడాది ప్రతికూలతలు కనిపించవచ్చని నిపుణులు తెలియజేశారు. మందగమనం అంతర్జాతీయంగా బ్యాంకింగ్ రంగం సంక్షోభ పరిస్థితుల్లో చిక్కుకోవడంతో కొత్త డీల్స్ మందగించవచ్చని యాక్సిస్ సెక్యూరిటీస్ నిపుణులు పేర్కొంటున్నారు. ఆధునిక ఆటోమేషన్ ప్రాసెస్, ట్రాన్స్ఫార్మేషన్ ప్రణాళికలు తదితరాలకు తాత్కాలికంగా బ్రేక్ పడే వీలున్నట్లు తెలియజేశారు. ఇది ఐటీ కాంట్రాక్టులు ఆలస్యమయ్యేందుకు కారణంకావచ్చని విశ్లేషించారు. తాజా ఐటీ వ్యయ ప్రణాళికలు వాయిదా పడవచ్చని, కొత్త ఆర్డర్లకు విఘాతం కలగవచ్చని రిలయన్స్ సెక్యూరిటీస్ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. బీఎఫ్ఎస్ఐ అతిపెద్ద విభాగమని దీంతో దేశీ సాఫ్ట్వేర్ సేవలకు దెబ్బ తగలవచ్చని పేర్కొన్నారు. -
ఇది డిజిటల్ చెల్లింపుల విప్లవం
డిజిటల్ చెల్లింపుల ఆవిష్కరణ భారత ఆర్థిక వ్యవస్థలో సమూల మార్పును తీసుకొచ్చింది. పెద్దనోట్ల రద్దు తర్వాత ఆర్థిక లావాదేవీలన్నింటినీ పరివర్తన చెందించిన గొప్ప విప్లవ ఆవిష్కరణే ఈ డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ. దేశీయంగా మొదలైన ఈ సరికొత్త సాంకేతిక వ్యవస్థ కోట్లాదిమందిని సాంప్రదాయిక ఆర్థిక వ్యవస్థ చట్రం నుంచి బయటకు లాగడమే కాదు... దేశీయ వాణిజ్యాన్ని పునర్నిర్మించింది. మన ఆర్థిక వ్యవస్థకు సంబంధించి ఇది ఒక గేమ్ ఛేంజర్‌లా పనిచేసింది. ప్రజా జీవితంలో,బ్యాంకింగ్ రంగంలో, నగదు లావాదేవీల్లో సరికొత్త మార్పును తీసుకొచ్చిన భారతీయ డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలందుకుంటోంది. ఆధునిక ఆర్థిక వ్యవస్థకు భారతదేశం అందించిన అధునాతన సాంకేతిక విప్లవం– డిజిటల్ పేమెంట్ సిస్టమ్. భారత్ రూపొందించిన దేశీయ తక్షణ చెల్లింపుల వ్యవస్థ వాణిజ్య కార్యకలాపాలను పునర్ని ర్మించడమే కాదు, కోట్లాదిమంది ప్రజలను సాంప్రదాయిక ఆర్థిక వ్యవస్థ నుంచి బయటపడేసింది. కేంద్ర ప్రభుత్వం దృఢమైన ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంలో దీన్ని రూపొందించింది. ఇది రోజువారీ జీవితాన్ని సౌకర్యవంతం చేసింది. రుణాలు, పొదుపులు వంటి బ్యాంకింగ్ సేవలను మరింతగా విస్తరింపజేసింది. కోట్లాది మంది భారతీయులకు ప్రభుత్వ కార్యక్రమాలను మరింతగా అందు బాటులోకి తీసుకొచ్చింది. పన్నుల సేకరణను కూడా సులభతరం చేసింది. ప్రధాని నరేంద్రమోదీ జీ20 ఆర్థిక మంత్రులతో ముచ్చటిస్తూ, డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ పాలనను మౌలికంగానే మార్చివేసిందని చెప్పారు. డిజిటల్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్‌ను అతి తక్కువ ఖర్చుతో ఏర్పర్చిన సాంకేతిక ఆవిష్కరణగా చూడవచ్చు. దీంతో మునుపెన్నడూ కనీవినీ ఎరగని స్థాయిలో అభివృద్ధి చెందిన దేశాలను సైతం ఎలా ప్రభావితం చేయవచ్చో భారత్ నిరూపించింది. భౌతిక మౌలిక వసతుల వ్యవస్థ వెనుకంజ వేస్తున్న పరిస్థితుల్లో కూడా ఇది ఆర్థిక పురోగతికి దోహదం చేస్తుంది. ప్రపంచంలోకెల్లా నిరుపేద దేశాలను కూడా పైకి లేపేటటు వంటి ఆలోచనల ఇంక్యుబేటర్‌గా భారత్ ఎగుమతి చేయాలనుకుంటున్న పబ్లిక్–ప్రైవేట్ మోడల్ ఇది. భారత్ ప్రారంభించిన ఈ గొప్ప ఆవిష్కరణ కేంద్ర భాగంలో ‘జేఏఎమ్’ త్రయం ఉన్నాయి. అవి: జన్ ధన్ ఖాతాలు, ఆధార్, మొబైల్. ఈ మూడు మూలస్తంభాలూ భారత ఆర్థిక పర్యావరణ వ్యవస్థను సమూలంగా విప్లవీకరించాయి. మొదటి స్తంభమైన ప్రధాన్ మంత్రి జన్ ధన్ యోజన ప్రతి వయోజన భారతీయుడికి ఒక బ్యాంక్ ఖాతాను గ్యారంటీగా అందించే ఆర్థిక కార్యక్రమం. 2022 నాటికి, ఈ పథకం కింద 46.25 కోట్ల బ్యాంక్ ఖాతాలను తెరిచారు. వీటిలో 56 శాతం మహిళల ఖాతాలు కాగా, 67 శాతం ఖాతాలు గ్రామీణ, అర్ధ పట్టణ ప్రాంతాల్లో తెరిచారు. ఈ ఖాతాల్లో రూ. 1,73,954 కోట్లు జమ అయ్యాయి. ఇక రెండో మూలస్తంభం: ఆధార్ పరివర్తిత ఐడెంటిటీ సేవలు. ఆధార్ ఐడీని రెండు అంశాల ప్రామాణీకరణ లేదా బయోమెట్రిక్ ద్వారా ఉపయోగించవచ్చు. ఆధార్ ప్రామాణీకరణ బ్యాంకులు, టెల్కో వంటి సంస్థలకు మూలాధారంగా మారింది. ఈరోజు దేశంలోని 99 శాతం వయోజనులు బయోమెట్రిక్ గుర్తింపు నంబర్‌ను కలిగి ఉన్నారు. ఇంతవరకు 1.3 బిలియన్ ఐడీలు జారీ అయ్యాయి. ఈ ఐడీలు బ్యాంక్ ఖాతాల రూపకల్పనను సరళతరం చేసి సత్వర చెల్లింపుల వ్యవస్థకు పునాదిగా మారాయి. ఇక మూడో మూలస్తంభం: మొబైల్. ఇది భారతీయ టెలికామ్ రంగంలో కీలకమైన డిజిటల్ ఆవిష్కరణ. 2016లో రిలయెన్స్ జియో టెలికామ్ రంగంలోకి దూసుకొచ్చిన తర్వాత డేటా ఖర్చు 95 శాతం వరకు పడిపోయింది. ప్రతి భారతీయుడికి ఇంటర్నెట్ను అతి తక్కువ ఖర్చుతో అందుబాటులోకి తెచ్చింది. ఈ–కామర్స్, ఫుడ్ డెలివరీ, ఓటీటీ కంటెంట్ వంటి సమాంతర వ్యవస్థలకు జీవం పోసింది. ఇంకా ముఖ్యమైనది ఏమిటంటే, అత్యంత మారుమూల ప్రాంతాల్లోని చిట్ట చివరి వ్యక్తికి కూడా డిజిటల్ చెల్లింపుల వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇంటర్నెట్ అందుబాటు, స్మార్ట్ ఫోన్ల వ్యాప్తిని టెలిఫోన్ కంపె నీలు వేగవంతం చేయడం; ఆధార్ ప్రామాణీకృత జన్ ధన్ ద్వారా భారతీయ చెల్లింపుల పర్యావరణ వ్యవస్థ సమూల మార్పునకు గురైంది. ఈ సమూల మార్పు బ్యాంక్ ఖాతాకు నగదు రహిత చెల్లింపులను అనుసంధానించే ‘ఏకీకృత చెల్లింపుల మధ్యవర్తి’ (యూపీఐ) భావనకు దారితీసింది. యూపీఐ ఒక ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్య (పీపీపీ) వ్యవస్థ. ఇది నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) నేతృత్వంలో పనిచేసే వేదిక. ఈ వేదిక వందలాది బ్యాంకులు, డజన్లకొద్దీ మొబైల్ పేమెంట్ యాప్స్ నుంచి సేవలను అందిస్తుంది. దీనికి ఎలాంటి ట్రాన్సాక్షన్ ఫీజులు ఉండవు. ఫిన్ టెక్, బ్యాంకులు, టెల్కోలు ఈ వేదికను స్వీకరించాయి. పైగా ‘మర్చంట్ పాయింట్ ఆఫ్ సేల్స్’ (పీఓఎస్) వద్ద క్యూఆర్ కోడ్ ప్లేస్మెంట్ల వల్ల యుపీఐ భావన మరింత పురోగమించింది. ఎన్పీసీఐ మేనేజింగ్ డైరెక్టర్ దిలీప్ అస్బె ప్రకారం – ఈ యేడాది జనవరిలో రెండు లక్షల కోట్ల రూపాయల విలువైన 800 కోట్ల లావాదేవీలు యూపీఐ ద్వారా జరిగాయి. ఈరోజు అన్ని రకాల చెల్లింపుల్లో 40 శాతం డిజిటల్‌గా జరుగుతున్నాయి. గత సంవత్సరం భారత్‌లో జరిగిన తక్షణ డిజిటల్ లావాదేవీల విలువ అమెరికా, బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్ దేశాల మొత్తం డిజిటల్ లావాదేవీల కంటే ఎక్కువని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఈ జనవరిలో వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో తెలిపారు. దేశంలోని 30 కోట్లమంది వ్యక్తులు, 5 కోట్లమంది వర్తకులు యూపీఐని ఉపయోగిస్తున్నారని దిలీప్ అస్బె తెలిపారు. అత్యంత చిన్న లావాదేవీలను కూడా డిజిటల్ చెల్లింపుల ద్వారా చేస్తున్నారు. 10 రూపాయల విలువ చేసే కప్పు పాలు లేదా రూ.200 విలువ చేసే సంచీడు తాజా కూరగాయలు వంటి లావాదేవీలు కూడా డిజిటల్ ద్వారానే జరుగుతున్నాయి. సుదీర్ఘకాలంగా నగదు చెల్లింపులు సాగు తున్న ఆర్థికవ్యవస్థలో ఇది గణనీయమైన మార్పు. నల్లధనం నిర్మూ లనకు తీసుకొచ్చిన పెద్ద నోట్ల రద్దు, కోవిడ్ మహమ్మారి కాలంలో సామాజిక దూరం పాటించడం వంటివి కూడా డిజిటల్ పేమెంట్ వ్యవస్థను మరింతగా ముందుకు నెట్టాయి. భారత ప్రభుత్వం గోప్యత, సృజనాత్మక ఆవిష్కరణ మధ్య సరైన సమతూకాన్ని తీసుకొచ్చిందని జీ20 షేర్పా అమితాబ్ కాంత్ వ్యాఖ్యా నించారు. డిజిటల్ చెల్లింపులను ఇంకా అమలు పర్చని రంగాల్లో కూడా, ఉదాహరణకు కేరళలోని మత్స్య పరిశ్రమలో ఐడెంటిటీ సంఖ్య, బ్యాంక్ ఖాతాలు, మొబైల్ ఫోన్ యాప్‌ల వంటి డిజిటల్ ప్రాథమిక పునాదులు సేవల సులభ పంపిణీకి వీలు కల్పిస్తున్నాయి. డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ విజయం డిజిటల్ పేమెంట్ మౌలిక వసతుల దృఢత్వంపై మాత్రమే ఆధారపడలేదు... అది నగదు నుంచి డిజిటల్‌కు మారడానికి ప్రజల్లో తెచ్చిన ప్రవర్తనాపరమైన ప్రోత్సాహంపై కూడా ఆధారపడి ఉంది. టీ స్టాల్స్ వంటి వాటి వద్ద అమర్చిన పేమెంట్ యాప్స్ ద్వారా అందించిన చిన్న వాయిస్ బాక్సుల వంటి ఆసక్తికరమైన ఆవిష్క రణల్లో కూడా వీటి విజయం దాగి ఉంది. వీటి ద్వారా ప్రతి చిన్న లావాదేవీ తర్వాత అమ్మకందారులు ఫోన్ మెసేజ్‌లు తనిఖీ చేస్తూ బిజీగా ఉంటున్నారు. క్యూఆర్ కోడ్ ద్వారా ప్రతి పేమెంట్‌తో తక్షణం అందుకునే డబ్బు ఎంతో సిరి వంటి వాయిస్ ప్రకటిస్తుంది. నగదు లావాదేవీలను దీర్ఘకాలంగా ఉపయోగిస్తున్న వర్తకులలో ఏర్పడే అవిశ్వాసాన్ని తొలగించడంలో ఇది సాయపడుతుంది. ‘కౌంటర్‌పాయింట్’ ప్రకారం, భారత్‌లో 120 డాలర్ల సబ్ ఫోన్లకు మార్కెట్ వాటా రెండేళ్లకు ముందు 41 శాతం ఉండగా, 2022లో అది 26 శాతం పడిపోయింది. ఇదే కాలానికి 30 వేల రూపాయల (360 డాలర్లు) పైబడిన ధర కలిగిన ప్రీమియం ఫోన్ల వాటా రెట్టింపై 11 శాతానికి చేరుకుంది. ఫోన్లకోసం రుణాలు వంటి ఫైనాన్స్ ప్రొడక్ట్ ఆవిష్కరణలు ప్రీమియం ఫోన్లను చిన్న చిన్న పట్టణాలలోని సామాన్య ప్రజానీకానికి అందుబాటులోకి తీసుకొచ్చాయి. ఆధార్ ప్రామాణికత, మొబైల్ ఇంటర్నెట్ ఉపయోగంపై ఆధారపడిన సమీ కృత ఆర్థిక వ్యవస్థ కారణంగా ఇది సాధ్యమైంది. ఇవన్నీ దేశంలో వ్యాపారాన్ని, ఆంట్రప్రెన్యూర్షిప్ని, వినియోగ నమూనాలను విప్లవీకరించి భారతీయ డిజిటల్ చెల్లింపుల వ్యవస్థను గేమ్ ఛేంజర్‌గా చేయడమే కాకుండా, ప్రపంచానికే స్ఫూర్తిగా నిలిపాయి. – బీఎన్/‘పీఐబీ’ రీసెర్చ్ వింగ్ -
కొనడం కష్టమేనా : రాకెట్ వేగంతో దూసుకుపోతున్న బంగారం ధరలు!
బంగారం ధరలు చుక్కలు తాకుతున్నాయి. ఓ వైపు ఆర్ధిక మాద్యం..మరోవైపు బ్యాంకుల దివాళా వెరసీ అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధర సోమవారం రోజు 1శాతం పెరిగింది. గత ఏడాది మార్చి తర్వాత ఈ స్థాయిలో పెరగడం గమనార్హం. ప్రపంచ ప్రఖ్యాతి చెందిన బ్యాంకుల్లో ఆర్ధిక అవకతవకలు జరిగి మూతపడుతున్నాయి. ఇప్పటికే సిలికాన్ వ్యాలీ బ్యాంక్, సిగ్నేచర్ బ్యాంక్‌లు దివాళా తీయగా.. అదే దారిలో మరికొన్ని బ్యాంకులు పయనిస్తున్నాయంటూ ఆర్ధిక వేత్తల అంచనాలు బంగారం ధరల పెరుగుదలకు కారణమని తెలుస్తోంది. ఇక దేశీయ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఒకే రోజు రూ.1400 పెరిగి రూ.61,100కు చేరింది. వెండి ధర సైతం రూ.1860 పెరిగి రూ.69,340కి చేరింది. ఇటీవల బ్యాంకింగ్ రంగంలో చోటుచేసుకుంటున్న వరుస పరిణామాలు బంగారం ధరకు రెక్కలు రావడానికి కారణమయ్యాయి. అనూహ్యంగా పది రోజుల వ్యవధిలోనే పసిడి ధర రూ.56వేల స్థాయి నుంచి రూ.60వేల స్థాయికి చేరింది. ఇక అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ 1 శాతం పెరిగి ఔన్స్ బంగారం 2,007.30 డాలర్లకు చేరింది. అంతకుముందు సెషన్లో 1శాతానికి పడిపోయింది. యూఎస్ మార్కెట్లో 2శాతం పెరిగి 2,012.50డాలర్లకు చేరింది. బ్యాంకులు షట్‌డౌన్ అవుతాయోమోనన్న భయాలతో మదుపర్లు..బ్యాంకుల్లో దాచిన డిపాజిట్లను తిరిగి వెనక్కి తీసుకుంటున్నారు.లాభాదాయకమైన బంగారంపై పెట్టుబడులు పెడుతున్నారు. దీంతో బంగారం ధరలు రాకెట్ వేగంతో దూసుకెళ్తున్నాయి. చదవండి👉 చుక్కలు చూపిస్తున్న బంగారం ధరలు..ఇప్పుడే ఇలా ఉంటే, మరి రాబోయే రోజుల్లో ఎలా? -
Credit Suisse: అంతర్జాతీయ బ్యాంకింగ్ సంక్షోభం!
సాక్షి, బిజినెస్ డెస్క్: దాదాపు పదిహేనేళ్ల క్రితం తరహాలో అంతర్జాతీయంగా మరో బ్యాంకింగ్ సంక్షోభం ముప్పు ముంచుకు రాబోతోందా? అమెరికా, యూరప్‌వ్యాప్తంగా బ్యాంకుల పరిస్థితి చూస్తే అలాగే కనిపిస్తోందంటున్నారు విశ్లేషకులు. ఇప్పటికే వారం రోజుల వ్యవధిలో అమెరికాలో రెండు బ్యాంకులు మూతబడగా తాజాగా స్విట్జర్లాండ్‌కి చెందిన క్రెడిట్ సూసీ భవిష్యత్తుపై కూడా నీలినీడలు కమ్ముకుంటున్నాయి. బ్యాంకులో మరింతగా ఇన్వెస్ట్ చేసేది లేదంటూ కీలక ఇన్వెస్టరు ప్రకటించడంతో క్రెడిట్ సూసీ షేర్లు బుధవారం 27 శాతం పతనమయ్యాయి. గత రెండేళ్లలో బ్యాంకు షేరు సుమారు 85 శాతం క్షీణించింది. డిఫాల్ట్ అయ్యే అవకాశాలు 40 శాతం మేర ఉన్నాయని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. ఈ పరిణామాలన్నీ కూడా అంతర్జాతీయ బ్యాంకింగ్ రంగం పరిస్థితులపై ఆందోళనలు రేకెత్తిస్తున్నాయి. సమస్యలతో సతమతం.. వాస్తవానికి క్రెడిట్ సూసీ గత కొన్నాళ్లుగా సమస్యలతో సతమతమవుతూనే ఉంది. 2019లో సంస్థ సీవోవో పియరీ ఆలివర్ కొందరు ఉన్నత స్థాయి ఉద్యోగులపై నిఘా పెట్టేందుకు ప్రైవేట్ డిటెక్టివ్‌ను నియమించుకున్నారు. అయితే సదరు డిటెక్టివ్ అనుమానాస్పద రీతిలో మరణించిన తర్వాత ఆలివర్ను క్రెడిట్ సూసీ తొలగించింది. ఇదంతా బ్యాంకు వ్యవహారంపై సందేహాలు రేకెత్తించింది. అటుపైన 2021లో ఆర్చిగోస్ క్యాపిటల్ అనే అమెరికన్ హెడ్జ్ ఫండ్ సంస్థ మూతబడటంతో దాదాపు 5 బిలియన్ డాలర్ల భారీ నష్టం మూటకట్టుకుంది. ఆ కంపెనీకి క్రెడిట్ సూసీ బ్రోకరేజి సర్వీసులు అందించేది. అటు పైన గ్రీన్‌సిల్ క్యాపిటల్ అనే మరో సంస్థ మూతబడటంతో.. దాని ప్రభావాల కారణంగా ఇన్వెస్టర్లు 3 బిలియన్ డాలర్ల దాకా నష్టపోయారు. గతేడాది ఫిబ్రవరిలో దాదాపు 100 బిలియన్ డాలర్ల పైగా డిపాజిట్లు ఉన్న 30,000 మంది పైచిలుకు ఖాతాదారులపై మనీలాండరింగ్, అవినీతి తదితర ఆరోపణలు రావడంతో సంస్థ ప్రతిష్ట మరింత మసకబారింది. దీంతో క్రమంగా డిపాజిట్ల విత్‌డ్రాయల్స్ మొదలయ్యాయి. 2019 నుంచి టాప్ లీడర్షిప్ ఇప్పటికి అనేక సార్లు మారింది. గతేడాది క్రెడిట్ సూసీ పెట్టుబడుల కోసం అన్వేషిస్తుండగా.. సౌదీ నేషనల్ బ్యాంక్ 1.5 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేసింది. సంస్థలో మరింతగా ఇన్వెస్ట్ చేసే యోచన లేదని సౌదీ నేషనల్ బ్యాంక్ చైర్మన్ అమ్మార్ అల్ ఖుదైరీ ప్రకటించడం తాజాగా క్రెడిట్ సూజీ షేర్ల పతనానికి దారి తీసింది. 2018లో 16 స్విస్ ఫ్రాంకులుగా ఉన్న షేరు ప్రస్తుతం 1.70 ఫ్రాంకులకు (ఒక స్విస్ ఫ్రాంక్ విలువ సుమారు రూ. 89). పడిపోయింది. మార్కెట్లలో ప్రకంపనలు.. ఇప్పటికే అమెరికాలో సిలికాన్ వ్యాలీ బ్యాంక్ (ఎస్వీబీ) మూతబడటం, తాజాగా క్రెడిట్ సూసీ పరిణామాలతో ఇతరత్రా బ్యాంకులపైనా ప్రభావం పడింది. బుధవారం పలు యూరోపియన్ బ్యాంకుల షేర్లు రెండంకెల స్థాయిలో క్షీణించాయి. ఫ్రాన్స్‌కు చెందిన సొసైటీ జనరల్ 12 శాతం, బీఎన్పీ పారిబా 10 శాతం, జర్మనీకి చెందిన డాయిష్ బ్యాంక్.. బ్రిటన్ సంస్థ బార్క్లేస్ బ్యాంక్ మొదలైనవి సుమారు 8 శాతం పడిపోయాయి. రెండు ఫ్రెంచ్ బ్యాంకుల్లోనూ కొంత సమయం పాటు ట్రేడింగ్‌ను నిలిపివేశారు. అటు అమెరికాలో బ్యాంకులూ అదే బాటలో పయనించాయి. ప్రధానంగా డిపాజిటర్లు ఎకాయెకిన డిపాజిట్లను వెనక్కి తీసుకునే రిస్కులు ఉన్న చిన్న, మధ్య రకం బ్యాంకుల షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. ఫస్ట్ రిపబ్లిక్ బ్యాంక్ 17 శాతం, ఫిఫ్త్ థర్డ్ బ్యాంకార్ప్ 6 శాతం, జేపీమోర్గాన్ చేజ్ 4 శాతం పతనమయ్యాయి. -
డిపాజిట్ల సమీకరణ బ్యాంకులకు సవాలే
ముంబై: మార్జిన్లపై ఒత్తిడి పడకుండా డిపాజిట్లను సమీకరించుకోవడం బ్యాంకులకు సవాలేనని ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ సంస్థ అభిప్రాయపడింది. రుణాలకు నిధుల కేటాయింపుల్లో కొత్త నమూనాకు మారుతుండడం కూడా వాటికి సవాలేనని పేర్కొంది. ఆర్థిక వ్యవస్థకు ఎంతో ముఖ్యమైన బ్యాంకింగ్ రంగంపై వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2023–24) న్యూట్రల్ రేటింగ్ కొనసాగిస్తున్నట్టు తెలిపింది. బ్యాలన్స్ షీట్లు బలంగా ఉండడంతోపాటు రుణాలకు వ్యవస్థలో అధిక డిమాండ్, వడ్డీ రేట్లలో స్థిరత్వంతో.. 2023–24లో బ్యాంకుల ఆర్థిక కొలమానాలు మెరుగుపడతాయని అంచనా వేసింది. డిపాజిట్లలో వృద్ధి వచ్చే ఆర్థిక సంవత్సరంలో 9–11 శాతం మధ్య ఉంటుందని పేర్కొంది. పోటీ వాతావరణంలో డిపాజిట్ల రేట్లను సవరించడం కొనసాగుతూనే ఉంటుందని, 2022 మార్చి నుంచి బ్యాంకులు రూ.5 లక్షల కోట్ల నగదు లభ్య తను సాధించాయని తెలిపింది. 2022 డిసెంబర్ నాటికి బ్యాంకింగ్ రంగంలో రుణాల వృద్ధి 18.8 శాతంగా ఉందని, కానీ, డిపాజిట్లలో వృద్ధి 11.8 శాతంగానే ఉండడం.. నిధుల అవసరాలను తెలియజేస్తోందని పేర్కొంది. రుణాల వృద్ధి కంటే, డిపాజిట్ల రాక తక్కువగా ఉండడంతో, ఇది రేట్ల పెరుగుదలకు దారితీస్తుందని అంచనా వేసింది. ఆర్బీఐ రేట్ల సవరణతో.. అటు డిపాజిట్లు, ఇటు రు ణాలపైనా 2 శాతం మేరకు బ్యాంకులు పెంపును అమలు చేసినట్టు తెలిపింది. గతేడాది మే నుంచి ఆర్బీఐ రెపో రేటును 2.5 శాతం మేర పెంచడం తెలిసిందే. బ్యాంకులు తమ రుణ వితరణ డిమాండ్‌ను చేరుకునేందుకు అవి హోల్‌సేల్ డిపాజిట్లు, బల్క్ డిపాజిట్లపై ఆధారపడుతున్నట్టు వెల్లడించింది. సూక్ష్మ రుణ సంస్థలకు రెండు సవాళ్లు... సూక్ష్మ రుణ సంస్థలు (ఎంఎఫ్ఐ) కరోనా సమయంలో తగిలిన గట్టి ఎదురుదెబ్బ నుంచి బయటకు వచ్చాయని, ఇండియా రేటింగ్స్ మరో నివేదికలో పేర్కొంది. అయి తే రానున్న 12–18 నెలల కాలంలో సూక్ష్మ రుణ పరిశ్రమ ముందు రెండు కీలక రిస్క్‌లు ఉన్నట్టు ఇండియా రేటింగ్స్ నివేదిక తెలిపింది. ఇందులో ఒకటి ద్రవ్యోల్బణంకాగా, రెండవది ఎన్నికలకు సంబంధించి పరిణామాలని తెలిపింది. హెచ్ఎఫ్సీల రుణాల వృద్ధి మోస్తరుగా.. హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలకు గడ్డు కాలం ఎదురైంది. పెరుగుతున్న వడ్డీ రేట్లు, ప్రాపర్టీ ధరలు గృహాల అందుబాటుపై ప్రభావం చూపిస్తోంది. దీంతో వచ్చే ఆర్థిక సంవత్సరంలో హెచ్ఎఫ్సీల రుణాల వృద్ధి కొంత తగ్గి 12.3 శాతానికి పరిమితం అవుతుందని ఇండియా రేటింగ్స్ తెలిపింది. ఇందుకు సంబంధించి ఓ నివేదికను విడుదల చేసింది. ఈ అంశాలకు తోడు పెరుగుతున్న ద్రవ్యోల్బణం సైతం రుణ గ్రహీతల నగదు ప్రవాహం (మిగులు)పై ప్రభావం చూపిస్తున్నట్టు పేర్కొంది. ఇది హెచ్ఎఫ్సీల రుణ ఆస్తుల నాణ్యతను కూడా దెబ్బతీయవచ్చని అంచనా వేసింది. సమస్యాత్మక రుణ ఖాతాలలో ఇప్పటికే స్వల్ప పెరుగుదల ఉన్నట్టు పేర్కొంది. 2022–23 ఆరంభం నుంచి ఇది స్పష్టంగా కనిపిస్తోందని తెలిపింది. ‘‘12 హెచ్ఎఫ్సీల నిరర్థక ఆస్తులు (వసూలు కాని రుణాలు) మొత్తం రుణాల్లో 2021 మార్చి నాటికి 2.9 శాతంగా ఉంటే, 2022 మార్చి నాటికి 2.8 శాతానికి తగ్గాయి. మొత్తం మీద రుణ ఎగవేతలు, పునరుద్ధరించిన రుణాలు కలిపి 2022 మార్చి నాటికి 4 శాతంగా ఉన్నాయి. స్థూల ఎన్పీఏలు 2023 మార్చి నాటికి 2.5 శాతానికి తగ్గుతాయి. మళ్లీ 2024 మార్చి నాటికి 2.67 శాతానికి పెరగొచ్చు. రుణ వ్యయాలు అతి స్వల్పంగా పెరిగినప్పటికీ ప్రస్తుత స్థాయిలోనే కొనసాగొచ్చు’’అని ఇండియా రేటింగ్స్ నివేదిక వివరించింది. అందుబాటు గృహ రుణాల జోరు హెచ్ఎఫ్సీలు 2022–23లో 12.6 శాతం మేర వృద్ధిని చూసే అవకాశం ఉంటే, 2023–24లో 12.3 శాతంగానే ఉంటుందని ఇండియా రేటింగ్స్ తెలిపింది. ఇక 2021–22లో పరిశ్రమలో నమోదైన రుణాల వృద్ధి 10.4 శాతంగా ఉంది. పరిశ్రమలో అందుబాటు ఇళ్లకు సంబంధించి రుణాలు వృద్ధికి మద్దతుగా నిలుస్తాయని అంచనా వేసింది. మార్కె ట్లో పోటీ వాతావరణం హెచ్‌ఎఫ్‌సీలపై చూపిస్తోందని పేర్కొంది. దీంతో సంస్థలు నాన్ హౌసింగ్ రుణాలపై దృష్టి సారించడం ద్వారా ఈ పోటీపరమైన సవాళ్లను అధిగమించొచ్చని పేర్కొంది. -
నేటి నుంచి ఈ బ్యాంక్ కనిపించదు..ఖాతాదారులు గుర్తించుకోవాల్సిన అంశాలివే!
భారత్‌లో ప్రముఖ బ్యాంకింగ్ దిగ్గజం సిటీ గ్రూప్ సేవలకు గుడ్‌బై చెప్పింది. తన బ్యాంక్‌ను యాక్సిస్ బ్యాంక్‌లో విలీనం చేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో 120 ఏళ్లుగా బ్యాంకింగ్ సేవలందిస్తున్న సిటీ బ్యాంక్ ఇక పాత జ్ఞాపకంగా మిగిలి పోనుంది. తాజా నెలకొన్న ప్రపంచ పరిస్థితులతో పాటు ఇతర కారణాల వల్ల బ్యాంక్ సేవల్ని నిలిపివేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ ప్రకటనతో సిటీ బ్యాంక్ అకౌంట్ల కార్యకలాపాలు యాక్సిస్ బ్యాంక్‌లో కొనసాగనున్నాయి. భారత్‌లో నమ్మకం నుంచే మొదలయ్యే బ్యాంకింగ్ బిజినెస్‌లో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు అనేక దేశీ, విదేశీ బ్యాంకులు పోటీ పడ్డాయి. వాటిలో అమెరికాకు చెందిన ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజం సిటీ గ్రూప్‌కు చెందిన సిటీ బ్యాంక్ ఒకటి. సిటీ బ్యాంక్ సేవల్ని అందించేందుకు 1902లో కోల్ కతాలోని కనక్ బిల్డింగ్ ఆఫీస్‌లో తన మొదటి బ్యాంక్‌ను ఏర్పాటు చేసింది. అప్పటి నుంచి నిర్విరామంగా కార్యకలాపాలు కొనసాగిస్తూనే ఉంది. అలా 120 ఏళ్లగా సేవలందిస్తున్న సిటీ బ్యాంక్ గత ఏడాది భారత్‌లోని బ్యాంకింగ్, నాన్ బ్యాంకింగ్ సేవల నుంచి వైదొలగినట్లు అధికారిక ప్రటకన చేసింది. సిటీ బ్యాంక్‌ను యాక్సిస్ బ్యాంక్‌కు అమ్ముతున్నట్లు తెలిపింది. బ్యాంకింగ్ వ్యవస్థలో వస్తున్న మార్పులు, అవసరమైన భారీ పెట్టుబడుల విషయంలో.. విలీనానికి సిద్ధపడినట్లు సమాచారం. తాజాగా యాక్సిస్ బ్యాంక్‌తో కుదురిన ఒప్పందంలో భాగంగా భారత్‌లో తన కార్యకలాపాలను సిటీ బ్యాంక్ పూర్తిగా ఆపేసింది. బిజినెస్ టుడే రిపోర్ట్ ప్రకారం..రూ. 11,603 కోట్లకు యాక్సిస్ బ్యాంక్ కొనుగోలు చేసింది. మార్చి 1(నేటి నుంచి) ఇండియాలో బ్యాంక్ సేవల నుంచి తప్పుకుంది. ఆందోళనలో సిటీ బ్యాంక్ కస్టమర్లు ఇక సిటీ బ్యాంక్‌ను..యాక్సిస్ బ్యాంక్‌లో విలీనం చేయడంతో కస్టమర్లు అందోళన వ్యక్తం చేశారు. దీంతో వినియోగదారులకు ఇబ్బంది కలగకుండా ఉండేలా సిటీ బ్యాంక్ యాజమాన్యం తన వెబ్ సైట్లో కస్టమర్లకు పలు సూచనలు చేసింది. వినియోగదారులు ప్రస్తుతం ఉన్న అన్ని శాఖలు, ఏటీఎంలు, ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ యాప్‌ను ఉపయోగించడం కొనసాగించవచ్చని స్పష్టత ఇచ్చింది. సిటీ బ్యాంక్ శాఖలన్నీ యాక్సిస్ బ్యాంక్‌గా రీబ్రాండ్ చేస్తున్నట్లు తెలిపింది. వీటితో పాటు ఏటీఎం, ఆన్లైన్ ట్రాన్స్క్షన్లతో పాటు ఇతర అంశాల గురించి చర్చించింది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. సిటీ బ్యాంక్ కస్టమర్లు గుర్తుంచుకోవాల్సిన కొన్ని అంశాలు: ► సిటీ బ్యాంక్ మొబైల్ యాప్, ఆన్లైన్ బ్యాంకింగ్ ఇప్పటికీ వినియోగదారులు ఉపయోగించుకోవచ్చు. ► అన్ని సిటీ బ్రాంచ్‌లు యాక్సిస్ బ్యాంక్ బ్రాంచ్‌లుగా రీబ్రాండ్ చేయబడతాయి. అప్పటి వరకు వినియోగించుకునే అవకాశాన్ని కల్పించింది. ► బ్యాంక్ అకౌంట్లు ఐఎఫ్ఎస్ఈ కోడ్, ఎంఐసీఆర్ కోడ్లలో ఎటువంటి మార్పు ఉండదు. ► సిటీ వినియోగదారులు తమ డెబిట్ ఏటీఎం కార్డ్,క్రెడిట్ కార్డ్‌లు, చెక్ బుక్‌లను యధావిధిగా ఉపయోగించుకోవచ్చు. ► క్రెడిట్, డెబిట్ కార్డ్‌లు రెండింటిలో రివార్డ్ పాయింట్లు పొందవచ్చు. ► క్రెడిట్ కార్డ్‌ల ఫీజులు, ఛార్జీలు, బిల్లింగ్ సైకిల్, చెల్లింపు గడువు తేదీ, బిల్లు చెల్లింపు పద్ధతుల్లో ఎలాంటి మార్పు ఉండదు. ► లోన్ చెల్లింపులు, బిల్లు చెల్లింపులు లేదా ఏదైనా ఇతర అకౌంట్లకు ట్రాన్స్ఫర్ సంబంధించి అన్ని కార్యకలాపాలు యథావిధిగా కొనసాగుతాయి. ► సిటీ బ్యాంక్ వినియోగదారుల పెట్టుబడి పోర్ట్‌ఫోలియోలలో కూడా ఎలాంటి మార్పు లేకుండా కొనసాగుతాయి. ► సిటీ బ్యాంక్ డీమ్యాట్ అకౌంట్ కోసం అకౌంట్ నెంబర్‌తో పాటు డీపీ ఐడీ (Depository Participant Identification) అలాగే ఉండనుంది. లావాదేవీల కోసం జారీ చేసిన డీఐ స్లిప్‌లు (Delivery Instruction) చెల్లుబాటులో ఉంటాయి. ► సిటీ బ్యాంక్‌లో తీసుకున్న ఇన్సూరెన్స్ పాలసీల కోసం, పాలసీ నెంబర్, ప్రయోజనాలు, రెన్యువల్ తేదీల్లో ఎటువంటి మార్పు లేకుండా కొనసాగుతాయి. ► రుణాల కోసం, బ్యాంక్ అకౌంట్ నెంబర్, ఫీజులు, ఛార్జీలు, రీపేమెంట్స్ యధావిధిగా కొనసాగుతాయని సిటీ బ్యాంక్ తన కస్టమర్లకు స్పష్టత ఇచ్చింది. -
మొండి బకాయిల కట్టడి చర్యలు ఫలితాలిస్తున్నాయ్!
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకుల మొండి బకాయిల (ఎన్పీఏ) కట్టడికి కేంద్రం తీసుకున్న చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నట్లు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాసికంలో (2022–23 జూలై–సెప్టెంబర్) 12 ప్రభుత్వ రంగ బ్యాంకుల ఏకీకృత నికల లాభం (2021–22 ఇదే కాలంతో పోల్చి) ఇదే 50 శాతం పెరిగి రూ.25,685 కోట్లుగా నమోదయినట్లు ఆమె పేర్కొన్నారు. తొలి త్రైమాసికం (ఏప్రిల్–జూన్)లో మొత్తం 12 ప్రభుత్వ రంగ బ్యాంకుల బ్యాంకింగ్ రంగం లాభాలు గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంతో పోల్చితే 9.2 శాతం పెరిగాయి. ఈ మొత్తం రూ.15,306 కోట్లుగా నమోదయ్యింది. వెరసి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల కాలంలో (ఏప్రిల్–సెప్టెంబర్) ప్రభుత్వ రంగ బ్యాంకుల నికర లాభం 32 శాతం పెరిగి రూ.40,991 కోట్లుగా నమోదయ్యింది. ఆయా అంశాల నేపథ్యంలో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఒక ట్వీట్ చేశారు. ఇందుకు సంబంధించిన అంశాలను పరిశీలిస్తే.. ► రెండవ త్రైమాసికంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)నికర లాభం భారీగా 74 శాతం ఎగసి రూ.13,265 కోట్లుగా నమోదయ్యింది. ► కెనరా బ్యాంక్ లాభం 89 శాతం వృద్ధితో రూ.2,525 కోట్లుగా నమోదయ్యింది. ► కోల్‌కతా కేంద్రంగా పనిచేస్తున్న యుకో బ్యాంక్ లాభం 145% పెరిగి రూ.504 కోట్లుగా ఉంది. ► బ్యాంక్ ఆఫ్ బరోడా విషయంలో లాభం 59 శాతం పెరిగి రూ.3,312.42 కోట్లుగా ఉంది. ► కాగా పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ), బ్యాంక్ ఆఫ్ ఇండియా (బీఓఐ) లాభాల్లో ఉన్నా, ఇవి 9–63 శాతం శ్రేణిలో క్షీణించాయి. అయితే మొండిబకాయిలకు అధిక కేటాయింపులు (ప్రొవిజినింగ్) దీనికి నేపథ్యం. పీఎన్బీ ప్రొవిజనింగ్స్ భారీగా రూ.2,693 కోట్ల నుంచి రూ.3,556 కోట్లకు చేరాయి. ఇక బీఓఐ విషయంలో ఈ కేటాయింపులు రూ.894 కోట్ల నుంచి రూ.1,912 కోట్లకు ఎగశాయి. ► ప్రభుత్వ రంగ బ్యాంకుల లాభాలు 13 నుంచి 145 శాతం శ్రేణిలో ఉన్నాయి. యుకో బ్యాంక్ అత్యధికంగా 145 శాతం పెరిగితే, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర లాభం 103 శాతం పెరిగింది. ఏప్రిల్–జూన్ త్రైమాసికం ఇలా... స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ), పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ), బ్యాంక్ ఆఫ్ ఇండియా (బీఓఐ) వంటి బ్యాంకింగ్ దిగ్గజాలు బలహీన పనితీరు కనబరిచినప్పటికీ, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022–23) తొలి త్రైమాసికం (ఏప్రిల్–జూన్)లో మొత్తం 12 ప్రభుత్వ రంగ బ్యాంకుల బ్యాంకింగ్ రంగం లాభాలు గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంతో పోల్చితే 9.2 శాతం పెరిగాయి. ఈ మొత్తం రూ.15,306 కోట్లుగా నమోదయ్యింది. 2022 ఇదే కాలంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల మొత్తం లాభం రూ.14,013 కోట్లు. మొత్తం 12 బ్యాంకుల్లో ఎస్బీఐ, పీఎన్బీ, బీఓఐ లాభాలు 7–70 శాతంమేర క్షీణించాయి. పైన పేర్కొన్న మూడు బ్యాంకులను మినహాయిస్తే, మిగిలిన తొమ్మిది బ్యాంకుల లాభాలు 3 నుంచి 117 శాతం వరకూ మొదటి త్రైమాసికంలో పెరిగాయి. మొదటి త్రైమాసికంలో కూడా పుణేకు చెందిన బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర అత్యధిక శాతం వృద్ధిని నమోదు చేసింది. ఈ బ్యాంక్ అంతకుముందు సంవత్సరం ఇదే త్రైమాసికంలో రూ. 208 కోట్ల లాభాన్ని నమోదుచేస్తే, సమీక్షా కాలంలో (2022 ఏప్రిల్–జూలై) రూ. 452 కోట్ల లాభాన్ని ఆర్జించింది. తరువాత 79 శాతం పెరిగిన లాభాలతో బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ) నిలిచింది. బీఓబీ లాభాలు రూ.1,209 కోట్ల నుంచి రూ.2,168 కోట్లకు ఎగశాయి. లాభంలో పడిపోయినప్పటికీ, బ్యాంకుల ఉమ్మడి లాభంలో ఎస్బీఐ రూ. 6,068 కోట్లతో అత్యధిక స్థాయిలో నిలిచింది. మొత్తం లాభంలో 40 శాతం వాటాను ఎస్బీఐ మాత్రమే అందించింది. ఆ తర్వాత రూ.2,168 కోట్లతో బ్యాంక్ ఆఫ్ బరోడా నిలిచింది. 2021–22లో ఇలా... 2021–22 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల మొత్తం లాభం రూ.66,539 కోట్లు. 2020–21 ఆర్థిక సంవత్సరంతో పోల్చితే (రూ.31,816 కోట్లు) ఈ పరిమాణం రెట్టింపునకుపైగా పెరిగింది. 2020–21లో కేవలం రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులు (సెంట్రల్ బ్యాంక్, పంజాబ్ అండ్ సింద్ బ్యాంక్) భారీ నష్టాలను నమోదుచేసుకున్నాయి. దీనితో మొత్తం ఉమ్మడి లాభం తక్కువగా నమోదయ్యింది. పలు ప్రభుత్వరంగ బ్యాంకులు గత ఆర్థిక సంవత్సరంలో డివిడెండ్‌ను కూడా ప్రకటించాయి. ఎస్బీఐ సహా తొమ్మిది బ్యాంకులు వాటాదారులకు 7,867 కోట్ల రూపాయల డివిడెండ్లను ప్రకటించాయి. 2020–21 యూటర్న్! నిజానికి బ్యాంకింగ్‌కు 2020–21 చక్కటి యూ టర్న్ అనే భావించాలి. 2015–16 నుంచి 2019–20 వరకూ వరుసగా ఐదు సంవత్సరాలలో బ్యాంకింగ్ మొత్తంగా నష్టాలను నమోదుచేసుకుంది. 2017–18లో అత్యధికంగా రూ.85,370 కోట్ల నష్టం చోటుచేసుకుంది. తరువాతి స్థానాల్లోకి వెళితే, 2018–19లో రూ.66,636 కోట్లు, 2019–20లో రూ.25,941 కోట్లు, 2015–16లో రూ.17,993 కోట్లు, 2016–17లో రూ.11,389 కోట్లు బ్యాంకింగ్ నష్టాల బాట నడిచింది. -
దివాలా అంచున స్విస్ బ్యాంక్?
2008లో ప్రపంచాన్ని కుదిపేసిన ఆర్థిక సంక్షోభానికి ముసలం బ్యాంకింగ్ రంగంలోనే మొదలైన సంగతి గుర్తుండే ఉంటుంది. అమెరికా ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ లేమాన్ బ్రదర్స్ దివాలా తీయడంతో స్టాక్ మార్కెట్లు పేక మేడల్లా కుప్పకూలాయి. ఇప్పుడు సరిగ్గా మళ్లీ అంతర్జాతీయ బ్యాంకింగ్ రంగానికి అలాంటి షాక్ తగలబోతోందనే ఊహాగానాలు జోరందుకున్నాయి. అనేక సమస్యలతో సతమతమవుతున్న స్విట్జర్లాండ్ బ్యాంకింగ్ దిగ్గజం క్రెడిట్ స్విస్... క్లిష్ట పరిస్థితుల్లో ఉందంటూ స్వయంగా దాని సీఈఓ వెల్లడించడంతో దివాలా తీయొచ్చంటూ గగ్గోలు మొదలైంది. న్యూయార్క్: గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ దిగ్గజం క్రెడిట్ స్వీస్ ప్రస్తుతం క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నట్లు సంస్థ సీఈవో ఉల్రిచ్ కోర్నర్ పేర్కొన్నారు. దీంతో తాజా పునర్వ్యస్థీకరణ చర్యలకు తెరతీయనున్నట్లు సిబ్బందికి రాసిన లేఖలో వెల్లడించారు. తద్వారా తగిన చర్యలు చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. అయితే బ్యాంక్ పటిష్టంగానే ఉన్నట్లు స్పష్టం చేశారు. బ్యాంకు షేరు పతనాన్ని చూసి కలత చెందొద్దని కూడా సిబ్బందికి సూచించారు. పటిష్ట స్థాయిలో మూలధన బేస్‌తోపాటు లిక్విడిటీ కూడా బాగానే ఉందని సీఈవో వివరించారు. అయితే, ఒకపక్క బ్యాంకు షేరు రోజుకో ఆల్‌టైమ్ కనిష్టాన్ని తాకుతుండటం... దివాలా వదంతుల నేపథ్యంలో ఉల్రిచ్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఈ నెల (అక్టోబర్) 27న బ్యాంక్ చేపట్టనున్న వ్యూహాత్మక సమీక్ష ఫలితాలు వెలువడేవరకూ సిబ్బందికి ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని అందించేందుకు నిర్ణయించుకున్నట్లు సీఈవో లేఖలో పేర్కొన్నట్లు తెలుస్తోంది. మీడియాలో ఊహాగానాలకు స్పందించకుండా క్లయింట్లకు సేవలందించడంపై దృష్టిపెట్టాలని కూడా తమ సిబ్బందికి ఉల్రిచ్ సూచించినట్లు సమాచారం. కాగా, బ్యాంకు ఈ నెల 27న మూడో త్రైమాసిక ఫలితాలు విడుదల చేయనుంది. మూడు ముక్కలు... మూడేళ్లుగా వెలుగుచూస్తున్న రకరకాల స్కామ్‌లు... క్రెడిట్ స్విస్‌ను అతలాకుతం చేశాయి. మరోపక్క, యూరప్‌లో నెలకొన్న యుద్ధ వాతావరణం, ద్రవ్యోల్బణం సెగలు, వడ్డీరేట్ల పెంపు ప్రభావం కూడా బ్యాంకులపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో క్రెడిట్ స్విస్ గ్రూపును మూడు సంస్థలుగా విడదీసేందుకు బోర్డు ప్రణాళికలు సిద్ధం చేసింది. లాభదాయకంగా ఉన్న యూనిట్లను విక్రయించాలనేది బ్యాంకు యోచన. ప్రతిపాదనల ప్రకారం అడ్వయిజరీ బిజినెస్, అధిక ఒత్తిడిలోగల ఆస్తుల (హైరిస్క్ రుణాల)తో బ్యాడ్ బ్యాంక్‌లను విడదీయనుంది. వీటిని మినహాయించగా మిగిలిన బిజినెస్‌లతో మరో సంస్థ ఏర్పాటు కానుంది. అయితే ఈ అంశాలపై క్రెడిట్ స్వీస్ స్పందించకపోవడం గమనార్హం! ఇదీ నేపథ్యం... స్విట్జర్లాండ్‌లోని రెండో అతిపెద్ద బ్యాంక్ అయిన క్రెడిట్ స్విస్ గత మూడేళ్లలో రహస్య (స్పైయింగ్) కార్పొరేట్ కుంభకోణం, ఇన్వెస్ట్మెంట్ ఫండ్ల మూసివేత, రికార్డ్ ట్రేడింగ్ నష్టాలు, న్యాయపరమైన వ్యాజ్యాల పరంపర వంటి పలు సవాళ్లను ఎదుర్కొంటోంది. దీంతో బ్యాంక్ చైర్మన్ యాక్సెల్ లేమన్ వేసవిలో ఉల్రిచ్ కోర్నర్ను సీఈవోగా ఎంపిక చేసి బ్యాంకును గాడిలోపెట్టే బాధ్యతలు అప్పగించారు. బ్యాంక్ నిర్వహణలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టేందుకు అనుమతించారు. కాగా.. ఈ నెల మొదట్లో వ్యయ నియంత్రణ చర్యల్లో భాగంగా 5,000 మంది ఉద్యోగులపై వేటు వేయనున్నట్లు కూడా వార్తలు వెలువడ్డాయి. ఇన్వెస్టర్లలో వణుకు..! గత కొద్ది నెలలుగా క్రెడిట్ స్విస్ ఎదుర్కొంటున్న సవాళ్లతో బ్యాంకు షేరు కుప్పకూలుతూ వస్తోంది. ఈ ఏడాది ఆరంభంలో 9 డాలర్లుగా ఉన్న షేరు ధర తాజాగా సరికొత్త ఆల్‌టైమ్ కనిష్టానికి (3.9 డాలర్లు) దిగజారింది. మార్కెట్ విలువ 10 బిలియన్ డాలర్లకు పడిపోయింది. కాగా, సీఈఓ తాజాగా చేసిన వ్యాఖ్యలతో బ్యాంక్ దివాలా తీయనుందంటూ ట్విటర్లో మారుమోగుతోంది. అమెరికాతో సహా ప్రపంచ వ్యాప్తంగా సెంట్రల్ బ్యాంకులు వడ్డీరేట్లను ఎడాపెడా పెంచడంతో మాంద్యం భయాలు వెంటాడుతున్న తరుణంలో క్రెడిట్ స్విస్ దివాలా వార్తలు ఇన్వెస్టర్లకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇదే జరిగితే మార్కెట్ సెంటిమెంట్ మరింత బలహీనపడొచ్చనేది విశ్లేషకుల అభిప్రాయం. ఈ నేపథ్యంలో స్టాక్ మార్కెట్లు నేడు ఎలా స్పందిస్తాయోన్న ఉత్కంట సర్వత్రా నెలకొంది. -
పటిష్ట బాటన భారత్ ఎకానమీ..!
ముంబై: బ్యాంకింగ్ రుణ వృద్ధి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో (ఏప్రిల్–జూన్) 14.2 శాతం నమోదయినట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గణాంకాలు వెల్లడించాయి. 2021 ఇదే కాలంలో బ్యాంకింగ్ రుణ వృద్ధి 6 శాతం. గడచిన త్రైమాసికం (2022 జనవరి–మార్చి)లో ఈ రేటు 10.8 శాతంగా ఉంది. ఎకానమీ పురోగమన బాటలో ఉందనడానికి తాజా గణాంకాలు నిదర్శనమని నిపుణులు భావిస్తున్నారు. ద్రవ్యోల్బణం భయాల నేపథ్యంలో బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు రెపోను ఆర్బీఐ మే నెల నుంచి ఆగస్టు వరకూ 1.40 (ప్రస్తుతం 5.40 శాతం) పెంచింది. ఇందులో జూన్ వరకూ పెరిగిందే 90 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒకశాతం). ఈ పరిస్థితుల్లో బ్యాంకింగ్‌సైతం రుణ రేట్లను పెంచడం ప్రారంభించింది. అయినప్పటికీ పటిష్ట స్థాయిలో రుణ వృద్ధి రేటు నమోదుకావడాన్ని చూస్తే, వ్యవస్థలో డిమాండ్ పరిస్థితులు బాగున్నాయని స్పష్టమవుతున్నట్లు నిపుణులు విశ్లేషిస్తున్నారు. ‘జూన్ త్రైమాసిక రుణ, డిపాజిట్ వృద్ధి 2022’ శీర్షికన ఆర్బీఐ విడుదల చేసిన గణాంకాలకు సంబంధించి కొన్ని ముఖ్యాంశాలను పరిశీలిస్తే... ► ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు, పేమెంట్స్ బ్యాంకులుసహా అన్ని షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకుల నుంచి సమీకరించిన సమాచారం ఆధారంగా తాజా గణాంకాలు రూపొందాయి. ► దేశ వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో విస్తృత ప్రాతిపదికన రుణ వృద్ధి నమోదయ్యింది. ► గడచిన ఐదు త్రైమాసికాల్లో డిపాజిట్ వృద్ధి రేటు 9.5 శాతం నుంచి 10.2 శాతం శ్రేణిలో ఉంది. ► జూన్ త్రైమాసికంలోని దేశ వ్యాప్తంగా మొత్తం డిపాజిట్లలో కరెంట్, సేవింగ్స అకౌంట్ (సీఏఎస్ఏ) నిష్పత్తి 73.5 శాతం. గత ఏడాది ఇదే సమయంలో ఈ నిష్పత్తి 70.5 శాతం. ఒక్క మొట్రోపాలిటన్ బ్రాంచీల్లో ఈ నిష్పత్తి వార్షికంగా చూస్తే 84.3 శాతం నుంచి 86.2 శాతానికి పెరిగింది. లిస్టెడ్ ప్రైవేటు కంపెనీల అమ్మకాలు 41 శాతం అప్ కాగా లిస్టెడ్ నాన్–ఫైనాన్స్ ప్రైవేటు కంపెనీల అమ్మకాలు జూన్ త్రైమాసికంలో 41 శాతం పెరిగి రూ.14.11 కోట్లుగా నమోదయినట్లు ఆర్బీఐ గణాంకాలు వెల్లడించాయి. 2021 ఇదే కాలంలో ఈ అమ్మకాల్లో 60.6 శాతం వృద్ధి నమోదుకాగా, 2022 జనవరి–మార్చిలో ఈ రేటు 22.3 శాతంగా ఉంది. -
ఆయన ఐదు వేలు అప్పిచ్చి పదిసార్లు తిరుగుతుండు! అదే ఓ వంద కోట్లు తీసుకుంటే...
ఆయన ఐదు వేలు అప్పిచ్చి పదిసార్లు తిరుగుతుండు! అదే ఓ వంద కోట్లు తీసుకుంటే మాఫీ చేస్తారట మావా! -
భారత ఆర్థిక వ్యవస్థపై మూడీస్ ఆసక్తికర వ్యాఖ్యలు..!
న్యూఢిల్లీ: భారత్ బ్యాంకింగ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో (2022–23) పటిష్ట లాభాల బాటన పయనించనుందని మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ నివేదిక ఒకటి తెలిపింది. మొండి బకాయిలు (ఎన్పీఏ) తగ్గడం, ప్రీ–పొవిజినింగ్ ఆదాయాల్లో (నష్టాన్ని భర్తీ చేసే విధంగా నికర వడ్డీ, వడ్డీయేతర ఆదాయాలు, తక్కువ వ్యయాలు నెలకొన్న పరిస్థితి) వృద్ధి దీనికి కారణంగా పేర్కొంది. నివేదికలో కొన్ని ముఖ్యాంశాలను పరిశీలిస్తే.. మెరుగైన లాభదాయకత, రుణ వృద్ధిలో మంచి రికవరీ కారణంగా కేంద్ర మూలధన కల్పన అవసరం తగ్గుతుంది. ఇది అంతిమంగా బ్యాంకింగ్ వ్యవస్థ మొత్తంలో తగిన మూలధన నిర్వహణ కొనసాగడానికి దోహదపడుతుంది. ప్రభుత్వ రంగ బ్యాంకుల (పీఎస్బీ) వద్ద మూలధన నిష్పత్తులు గత సంవత్సరంలో గణనీయంగా మెరుగయ్యాయి. కేంద్రం నుంచి సకాలంలో తగిన మద్దతు దీనికి కారణం. ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు లాభదాయకతను సద్వినియోగం చేసుకుంటూ, ఈక్విటీ క్యాపిటల్ మార్కెట్ నుండి మూలధనాన్ని సమీకరించడానికి చురుగ్గా ప్రయత్నించాయి. రేటెడ్ ప్రైవేట్ రంగ బ్యాంకులు అసెట్–వెయిటెడ్ సగటు సాధారణ ఈక్విటీ టైర్ 1 (సీఈటీ1) రేషియో 2021 చివరి నాటికి 15.8 శాతం. మెరుగుపడిన ఆర్థిక పరిస్థితుల్లో రుణ వృద్ధిని పెంచుకోడానికి దీనిని ప్రైవేటు బ్యాంకింగ్ వినియోగించుకుంది. ప్రభుత్వ రంగ బ్యాంకుల ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడ్డం– మార్కెట్ నుండి ఈక్విటీ మూలధనాన్ని సమీకరించడంలో సహాయపడుతుంది. ప్రభుత్వం నుండి మూలధన మద్దతుపై ఆధారపడటం తగ్గుతుంది. దేశీయ వడ్డీ రేట్లు క్రమంగా పెరగడం వల్ల నికర వడ్డీ మార్జిన్లు పెరుగుతాయి. అయితే డిపాజిట్లపై వడ్డీలూ పెరగడం వల్ల సమీకరణ వ్యయాలూ కొంచెం పెరగవచ్చు. స్థిరమైన రుణ నాణ్యత, మొండి బకాయిల సవాళ్లను ఎదుర్కొనడానికి అమలు చేస్తున్న నిబంధనలు బ్యాంకుల ప్రొవిజనింగ్స్ (ఎన్పీఏలకు కేటాయింపులు) అవసరాలను తగ్గిస్తాయి. రుణాలపై ఆదాయాలు రేటెడ్ ప్రభుత్వ రంగ బ్యాంకుల విషయంలో 2021 డిసెంబర్ ముగిసే నాటికి 0.6 శాతం. ప్రైవేటు రంగ బ్యాంకుల విషయంలో 1.5 శాతం. 2018 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో ఇవి వరుసగా 0.4 శాతం క్షీణత, 0.7 శాతాలుగా ఉన్నాయి. మొండి బకాయిల (ఎన్పీఎల్) రేషియోలు తగ్గుతాయి. రైటాఫ్‌ల నుంచి వసూళ్లు, ఆర్థిక పరిస్థితుల మెరుగుదల నేపథ్యంలో కొత్త ఎన్‌పీఎల్‌ల స్థిరత్వం వంటి అంశాలు దీనికి కారణం. కార్పొరేట్ ఆదాయాల్లో పెరుగుదల, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీల్లో నిధుల సమీకరణ ఇబ్బందులు తగ్గడం రుణ వృద్ధికి దారితీసే అంశం. 2020–21లో రుణ వృద్ధి రేటు 5 శాతం అయితే 2022–23లో ఈ రేటు 12 నుంచి 13 శాతం వరకూ పెరగవచ్చు. 2021–22లో వృద్ధి 9.3 % మూడీస్ నివేదిక ప్రకారం, వచ్చే 12 నుంచి 18 నెలల్లో భారత్ ఆర్థిక వ్యవస్థ గణనీయమైన రికవరీని సాధిస్తుంది. 2022 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 9.3 శాతంగా నమోదవుతుంది. 2023 ఆర్థిక సంవత్సరంలో ఈ రేటు 8.4 శాతంగా ఉంటుంది. వినియోగ, వ్యాపార విశ్వాసాలు మెరుగుపరచడంతోపాటు దేశీయ డిమాండ్ పునరుద్ధరణ జరుగుతుంది. ఆయా అంశాలు ఆర్థిక పురోగతికి, రుణ వృద్ధికి దోహదపడతాయి. అయితే ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ఎకానమీకి తీవ్ర సవాళ్లను తెచ్చిపెడుతోంది. ముఖ్యంగా క్రూడ్ ధరలు, రూపాయి విలువ వంటి అంశాలపై ఈ ప్రభావం పడవచ్చు. ఇది సెంట్రల్ బ్యాంక్ వడ్డీరేట్ల పెంపునకూ దారితీయవచ్చు. చదవండి: రష్యా-ఉక్రెయిన్ వార్ ఎఫెక్ట్..లాభాలు డౌన్...నిర్మాణ రంగంపై పెను ప్రభావం..! -
వైఎస్సార్ జిల్లా రికార్డు.. ప్రతి బ్యాంకు ఖాతాదారుడు...
సాక్షి, అమరావతి: రాష్ట్ర బ్యాంకింగ్ రంగంలో పూర్తిస్థాయి తొలి డిజిటల్ జిల్లాగా వైఎస్సార్ రికార్డు సృష్టించింది. వైఎస్సార్ జిల్లాలోని ప్రతి బ్యాంకు ఖాతాదారుడు అందుబాటులో ఉన్న డిజిటల్ లావాదేవీల్లో కనీసం ఏదో ఒకదాన్ని వినియోగించడం ద్వారా ఈ రికార్డు నమోదైంది. దేశంలో నగదు లావాదేవీలు తగ్గించడంలో భాగంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) దశలవారీగా ఎంపిక చేసిన జిల్లాల్లో డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహిస్తోంది. ఇందులో భాగంగా మన రాష్ట్రంలో తొలి దశలో వైఎస్సార్ జిల్లా ఎంపికైంది. ఈ కార్యక్రమం కింద ఆ జిల్లాలో ఉన్న ప్రతి బ్యాంకు ఖాతాదారుడిని కనీసం ఏటీఎం కార్డు లేదా నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్‌ల్లో ఏదో ఒకదాన్ని వినియోగించేలా ప్రోత్సహించారు. వైఎస్సార్ జిల్లాలో మొత్తం 377 బ్యాంకు శాఖలు ఉండగా.. అందులో 26,09,254 ఖాతాలు ఉన్నాయి. డిజిటల్ జిల్లాలో భాగంగా 88.39 శాతం మందికి రూపే/డెబిట్ కార్డు మంజూరు చేశామని రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ కన్వీనర్ బ్రహ్మానందరెడ్డి ‘సాక్షి’కి వివరించారు. అలాగే 24.19 శాతం మంది నెట్ బ్యాంకింగ్ వినియోగిస్తున్నారన్నారు. 38.39 శాతం మందిని మొబైల్, యూపీఐ లావాదేవీలు చేసేలా ప్రోత్సహించినట్లు తెలిపారు. వచ్చే ఏడాది మార్చి 31 నాటికి గుంటూరు, శ్రీకాకుళం జిల్లాలు రెండో దశలో శ్రీకాకుళం, గుంటూరు జిల్లాలను పూర్తి స్థాయి డిజిటల్ జిల్లాలుగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నామని బ్రహ్మానందరెడ్డి చెప్పారు. శ్రీకాకుళం జిల్లాలో 333 బ్యాంకు శాఖలు ఉండగా 38.14 లక్షల ఖాతాలు, గుంటూరు జిల్లాలో 854 బ్యాంకు శాఖలు ఉండగా 102.46 లక్షల ఖాతాలున్నాయి. వచ్చే ఆర్థిక సంవత్సరం ముగింపులోగా ఈ ఖాతాదారులందరూ ఏదో ఒక డిజిటల్ బ్యాంకింగ్ సౌకర్యం వినియోగించేలా పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలన్నారు. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని ఇప్పటికే అన్ని బ్యాంకులకు ఆదేశాలు జారీ చేశామని తెలిపారు. ప్రతి నెలా లక్ష్యాలను నిర్దేశించి సమీక్షించుకోవడం ద్వారా వచ్చే ఏడాది మార్చి 31 నాటికి ఈ రెండు జిల్లాలను డిజిటల్ జిల్లాలుగా మారుస్తామన్నారు. ప్రతి ఒక్కరికి బ్యాంకింగ్ సేవలు కాగా, రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి బ్యాంకింగ్ సేవలను అందుబాటులోకి తీసుకురావాలన్న ఆర్బీఐ ఆదేశాలకు అనుగుణంగా రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ తన కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసుకుంది. ఈ మేరకు రాష్ట్రంలో తక్కువగా బ్యాంకింగ్ సేవలను వినియోగిస్తున్న మూడు జిల్లాలను ఎంపిక చేసింది. అక్కడ బ్యాంకింగ్ కార్యకలాపాలను విస్తరించడంపై దృష్టిసారించింది. ఇందులో భాగంగా తొలి దశలో విజయనగరం, వైఎస్సార్, విశాఖ జిల్లాలను ఎంపిక చేసినట్లు బ్రహ్మానందరెడ్డి తెలిపారు. రాష్ట్రంలో అతి తక్కువగా విజయనగరం జిల్లాలో 294 బ్యాంకు శాఖలు మాత్రమే ఉన్నాయి. వైఎస్సార్ జిల్లాలో 377 శాఖలు, విశాఖపట్నం జిల్లాలో 778 బ్యాంకు శాఖలు ఉన్నాయి. అయితే చాలా గ్రామాలు గిరిజన ప్రాంతాలు కావడంతో ఇంటర్నెట్తో అనుసంధానం వంటివి లేక స్థానిక ప్రజలకు బ్యాంకింగ్ సదుపాయం అందుబాటులో లేకుండా పోయింది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని బ్యాంకు శాఖలు, ఇండియన్ పోస్ట్ లేదా బ్యాంకింగ్ కరస్పాండెంట్ల ద్వారా ప్రతి ఒక్కరికి బ్యాంకింగ్ సేవలు అందుబాటులోకి తీసుకురావడానికి కృషి చేస్తున్నారు. ఏప్రిల్ నుంచి కొత్త జిల్లాలు రానుండటంతో మౌలిక వసతులు మెరుగుపడి ఇంటర్నెట్తో అనుసంధానం పెరుగుతుందన్న ఆశాభావాన్ని బ్యాంకర్లు వ్యక్తం చేస్తున్నారు.