
న్యూఢిల్లీ: పండుగల సీజన్‌ను పురస్కరించుకుని వినియోగాన్ని పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం రుణ మేళాలు నిర్వహించాలని ప్రభుత్వరంగ బ్యాంకులను ఆదేశించిన నేపథ్యంలో... 3వ తేదీ నుంచి తొలి దశలో 250 జిల్లాల్లో రుణ మేళాలు ఆరంభం కాబోతున్నాయి. ఎన్‌బీఎఫ్‌సీ సంస్థలతో కలసి బ్యాంకులు వీటిని నిర్వహించనున్నాయి. రిటైల్ కస్టమర్లు, సూక్ష్మ, చిన్న, మధ్య స్థాయి సంస్థలకు (ఎంఎస్‌ఎంఈ).. వ్యవసాయ, వాహన, గృహ, విద్యా, వ్యక్తిగత రుణాలను ఈ మేళాల్లో భాగంగా ఆఫర్ చేయనున్నాయి.
రెండో దశలో 150 జిల్లాల్లో ఈ నెల 21 నుంచి 25వ తేదీల మధ్య రుణ మేళాలు జరగనున్నాయి. దేశవ్యాప్తంగా మొత్తం 400 జిల్లాల్లో కస్టమర్లకు చేరువకానున్నాయి. బ్యాంకు సేవలను కస్టమర్లకు చేరువగా తీసుకెళ్లడంతోపాటు మార్కెట్లో రుణ లభ్యత పెంచడమే ఈ చర్యల వెనుకనున్న ఉద్దేశ్యం. దీనివల్ల వ్యవస్థలో వినియోగం పెరిగి దేశ వృద్ధి పుంజుకుంటుందని భావించిన కేంద్ర ఆర్థిక శాఖ రెండు వారాల క్రితం ప్రభుత్వరంగ బ్యాంకులకు ఈ దిశగా సూచనలు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment