
23 అర్ధరాత్రి నుంచి రెండు రోజుల పాటు సమ్మె
డిమాండ్‌ల సాధనే లక్ష్యంగా ఆందోళనలు
బ్యాంకు సంఘాల ఐక్య సమాఖ్య పిలుపు
న్యూఢిల్లీ: బ్యాంకింగ్ రంగంలో సమ్మె సైరన్ మోగింది. తమ డిమాండ్‌ల సాధనే లక్ష్యంగా బ్యాంక్ సంఘాల ఐక్య సమాఖ్య (యూఎఫ్‌బీయూ) సారథ్యంలో ఈ నెల 23 అర్ధరాత్రి నుంచి 25 అర్ధరాత్రి వరకు రెండు రోజుల పాటు సమ్మె చేయనున్నట్లు యూనియన్లు ప్రకటించాయి. ప్రభుత్వ రంగ బ్యాంకులతో పాటు ప్రైవేటు బ్యాంకులు, విదేశీ బ్యాంకులు, కో–ఆపరేటివ్ బ్యాంకులు, రీజినల్ రూరల్ బ్యాంకులకు సంబంధించిన 9 బ్యాంకు యూనియన్లకు యూఎఫ్‌బీయూ ప్రాతినిధ్యం వహిస్తోంది. మొత్తం 8 లక్షల మందికి పైగా ఉద్యోగులు, అధికారులు ఈ సమ్మెలో పాల్గొననున్నారు. కాగా, సమ్మె సందర్భంగా రెండు రోజుల పాటు ఆందోళన కార్యక్రమాలు కొనసాగుతాయని యూనియన్ వర్గాలు పేర్కొన్నాయి. దీనివల్ల బ్యాంకు సేవలకు తీవ్ర విఘాతం కలిగి అవకాశం ఉంది.
నియామకాలు పెంచాలి...
పెరుగుతున్న ఖాతాదారులకు అనుగుణంగా బ్యాంకుల్లో తగినంత మంది సిబ్బందిని నియమించాలని యూనియన్లు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాయి. గడిచిన దశాబ్దకాలానికి పైగా నియామకాలు సరిగ్గా జరగకపోవడంతో సిబ్బంది కొరత తీవ్రంగా ఉందని అంటున్నాయి. దీంతో ప్రస్తుత ఉద్యోగులపై తీవ్ర పనిభారం పడుతోందని, కస్టమర్లకు సరిగ్గా సేవలు అందించలేకపోతున్నామనేది యూనియన్ల వాదన.
అనేక సర్కారీ పథకాలను అమలు చేస్తున్న ప్రభుత్వ రంగ బ్యాంకు(పీఎస్‌బీ)లకు ఇప్పుడున్న అరకొర సిబ్బంది ఏమాత్రం సరిపోరని, అన్ని క్యాడర్లలో నియామకాలు చేపట్టాలని బ్యాంకు సంఘాలు స్పష్టం చేశాయి. 2013లో 3,98,801 మంది క్లర్కులు ఉండగా.. 2024 నాటికి వారి సంఖ్య 2,46,965 మందికి పడిపోయిందని, అంటే ఏకంగా 1,51,836 మంది తగ్గిపోయారని వారు లెక్కలతో సహా చెబుతున్నారు. ఇక మొత్తం సిబ్బంది సంఖ్య 2013లో 8,86,490 మంది ఉంటే, 2024 నాటికి 7,46,679 మందికి (1,39,811 తగ్గుదల) చేరిందని యూఎఫ్‌బీయూ పేర్కొంది.
ఇతర ప్రధాన డిమాండ్‌లు ఇవీ...
→ బ్యాంకింగ్ పరిశ్రమ అంతటికీ వారానికి 5 రోజుల పని దినాల డిమాండ్‌కు ఏడాది క్రితం బ్యాంకు యాజమాన్యాలు అంగీకరించి, ప్రభుత్వానికి సిఫార్సు చేసినప్పటికీ అమలుకు మాత్రం నోచుకోలేదు, ఇక ఏమాత్రం జాప్యం లేకుండా దీన్ని అమలు చేయాలి.
→ సిబ్బంది పనితీరుకు సంబంధించి నెలవారీ సమీక్ష విషయంలో ప్రభుత్వ ఆదేశాలను, పనితీరు ఆధారిత ప్రోత్సాహకాల్లో మార్పులను తక్షణం ఉపసంహరించుకోవాలి.
→ బ్యాంకు అధికారులు/సిబ్బందిపై దాడులను అరికట్టేలా తగిన రక్షణ కల్పించాలి.
→ గ్రాట్యుటీ పరిమితిని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అనుగుణంగా రూ.25 లక్షలకు పెంచడంతో పాటు ఆదాయ పన్ను మినహాయింపు ఇచ్చేలా గ్రాట్యుటీ చట్టాన్ని సవరించాలి.
→ తాత్కాలిక సిబ్బందిని పర్మనెంట్ చేయడంతో పాటు పర్మనెంట్ ఉద్యోగాలకు అవుట్‌సోర్సింగ్‌ను నిలిపివేయాలి.
→ ఐడీబీఐ బ్యాంకులో ప్రభుత్వం కనీసం 51% వాటాను కొనసాగించాలి.
Comments
Please login to add a commentAdd a comment